Sajeeva Vahini
1.48K subscribers
2.48K photos
4 videos
9 files
3.18K links
3000+ telugu christian devotions, sermons and many more. Subscribe today!

The Official Channel of Sajeeva Vahini
Download Telegram
నీ ఆలోచనలు జాగ్రత్త...!


1 పేతురు 5:8 మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.

ఈ రోజులలో ఎక్కువగా వాడే పదం బిజీ. అంత బిజీ పనులు రోజు ఏముంటాయని గమనించినప్పుడు; నాకు కనిపించిన బిజీ పని ఆలోచించడం. డబ్బు కొరకు ఆలోచన, సమస్యల గురించి ఆలోచన, శరీర సంబంధమైన కోరికల కొరకే ఎక్కువగా ఆలోచన. వ్యక్తిగత, కుటుంబ, ఆత్మీయ జీవితం, ఉద్యోగం ఇలా రోజుకు 24గం।।లను ఉపయోగించుకొనకుండా అనవసరమైన, ఉపయోగంలేని ఆలోచనలకే కొంతమంది ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.

మరికొంతమంది బిజీ అనే పదం వాడే సందర్భం ప్రార్థన. ప్రార్థన చేసారా, వాక్యం చదివారా, కుటుంబ ప్రార్థన చేసారా అని అడిగితే, ఎక్కవమంది ఇచ్చే సమాధానం బిజీ వల్ల కుదరడం లేదంటారు.

ఇలా ఎందుకు జరుగుతుందని గమనించినప్పుడు నాకు జ్ఞాపకము వచ్చిన వాక్యం ‘ మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు’. సాతాను చంపుటకు రావడంలేదు మ్రింగుటకు వస్తున్నాడు. మనుష్యులను మ్రింగుటకు కాదు, వాడికున్న సమయం తక్కువ కాబట్టి మనకున్న శ్రేష్టమైన సమయాన్ని మ్రింగుటకు వస్తున్నాడు.

దీని వలన వాడికొచ్చే లాభం ఏమిటని ఆలోచిస్తే; సాతాను, సమయం మ్రింగడంవలన విశ్వాసి ఆలస్యమైతున్నాడు. ఏ విషయంలో ఆలస్యమైతున్నాడు? సిద్ధపడుటలో ఆలస్యమైతున్నాడు.

ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివినప్పుడు వియత్నాం యుద్ధంలో శత్రువును జయించుటకు యుద్ధ భూమిలో 5 రకాల ఉచ్చులను కొన్ని వేల సంఖ్యలో అమర్చారు. ఈ ఉచ్చులలో ఎక్కువ శాతం శత్రువును చంపుటకు కాదు, శత్రువును గాయపరచుటకు ఉపయోగించారు. ఎందుకనగా యుద్ధములో సైనికుడు చనిపోతే అక్కడే వదిలేస్తారు కాని, గాయపడితే సైనికుని ఇద్దరు సైనికులు మోసుకెళ్ళాలి. ఇందువలన యుద్ధములో వారు వెనకబడుట వలన సులువుగా గెలవచ్చు.

ఇదే తరహా ప్రయత్నం సాతాను విశ్వాసుల మీద ప్రయోగిస్తున్నాడు. మానసికంగా గాయపరుస్తున్నాడు. ఆర్ధిక ఇబంద్దులలో, కలహాలు, అనారోగ్యాలు, తొందరపాట్లు ఇలాంటి వాటితో నలిగిపోతున్నప్పుడు ఇటు పనిచేయనియకుండా, అటు దేవుని సన్నిధికి రానీయకుండ అనవసరమైన ఆలోచనలతో సమయమును వృధా అయ్యేవిధముగా ప్రేరేపిస్తున్నాడు.

ప్రియ విశ్వాసి జాగ్రత్త! నీకున్న సమయం తక్కువ. శ్రేష్టమైన సమయాన్ని అనవసరమైన ఆలోచనలతో వృధా చేయకు. ఊరికే ఆలోచించుట వలన ఏమి చేయలేవు, ప్రార్థనలో కనిపెట్టుటవలననే ఏదైన సాధించగలవు.

https://youtu.be/AWPGdvKPpT4
ఊహలన్ని నిజం కావు

Audio: https://youtu.be/pK9gG1A57z0

యోహాను 13:37 అందుకు పేతురు ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీకొరకు నా ప్రాణముపెట్టుదునని ఆయనతో చెప్పెను.

ఊహించుకొనుటలో మనిషి ఆనందపడతాడు. ఊహ అనేది ఎప్పుడు మనిషి సామర్థ్యం మించి ఉంటుంది. ఊహలలో బ్రతకడం ప్రమాదకరం, అది సోమరులనుగాను, నమ్మకద్రోహులనుగా చేస్తుంది. మనం చేయలేనివి ఊహలలో ఊహించుకుంటు బ్రతకడానికి ఇష్టపడతాము.

ఊహలు ఎందుకు ప్రమాదకరమంటే, అవి మనలను ఈ లోకంలో అందరికంటే గొప్పవారమని, బలవంతులమని, జ్ఞనవంతులమని ప్రవర్తించేలాచేస్తుంది. మనలో ఉన్న అసలైన సామర్ధ్యమును చంపేస్తుంది. నోవాహు సమయంలో జలప్రళయం చేత భూమి తుడిచివేయబడుటకు కారణం మనిషిలోని ఊహలే. ఆది 6:5,6 - నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృద యములో నొచ్చుకొనెను.

సాతాను ఈ ఊహలతోనే దేవుని చిత్తమును అపార్ధము చేసుకొనేలా చేసి, పాపమునకు ప్రేరేపిస్తాడు. (మత్తయి 16:13-23) ఒకనాడు యేసు ప్రభువు - మనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడిగినప్పుడు; పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాడు. తరువాత యేసు ప్రభువు - అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని చెప్పినప్పుడు, పేతురు తనకు దేవుని జ్ఞనమున్నదని ఊహించి దేవుని చేత గదించబడినాడు.

యోహాను 13:37లో పేతురు తాను ఏమైనా చేయగలనని అనుకున్నాడు కారణం, ఊహలు తనను మోసం చేసాయి. ఏ దేవుని కొరకు ప్రాణము పెట్టుదునని చెప్పాడో చివరికి ఆయనెవరో నాకు తెలియదని ఒట్టు పెట్టుకున్నాడు.

ప్రియ విశ్వాసి! మనమెప్పుడు ఊహలలో బ్రతుకకూడదు, వాస్తవములో విశ్వాసముతో బ్రతకాలి. నీలో ఉన్న సామర్థ్యం ఊహలలో కాదు మోకాళ్ళ మీద ఉంటేనే తెలుసుకుంటావు. ఎప్పుడైతే ప్రర్థనలో పశ్చాత్తాపం పొందాడో తన తప్పును తెలసుకొని, తనలోనున్న సామర్థ్యం గ్రహించి యేసు నామంలో లోకమును తలక్రిందులు చేసాడు పేతురు. ఇలాంటి పేతురును దేవుడు నీలో చూడాలనుకుంటున్నాడు. నీవు సిద్ధమా...!
స్వతంత్రులు

Audio:https://youtu.be/BF7f0IP9Sw4

2 Cor 3:17 ప్రభువే ఆత్మ ప్రభువుయొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.

దేవుడు మనకిచ్చిన అద్భుతమైన వరం పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ బానిసత్వం ఉండదు. బానిసత్వం నుండి విడిపించబడినప్పుడు వాడే పదాలు స్వాతంత్ర్యము, స్వేచ్ఛ. మనము దేనికి బానిసలుగా ఉన్నామంటే భయం, పాపం. ఈ భయం నుండి, పాపం నుండి మనకు క్రీస్తు ద్వారా స్వాతంత్ర్యం కలిగింది.

బానిస అధికారం చేయలేడు, స్వాతంత్ర్యం పొందినవాడు అధికారం కలిగివుంటాడు. దేవుడు మనకు పిరికిగల ఆత్మను ఇవ్వలేదు. మరలా భయపడుటకు మనము దాస్యపు ఆత్మను పొందలేదు. మనము గెలచుటకే నూతనముగ పుట్టాము. మనలను గెలిపించుటకే యేసయ్య సిలువలో మరణించాడు. ఈ స్వాతంత్ర్యంలో దేవుడు మనకిచ్చిన అద్భుతమైన అధికారం భూమిమీద వేటిని బంధిస్తామో అది పరలోకంలో బంధించబడుతుంది, ఏ బంధకాన్ని విప్పుతామో అది పరలోకంలో విప్పబడుతుంది. ఏది మనకు హాని చేయదు, ఎవరు మనపై అధికారం చెలాయించరు.

అమెరికా దేశంలోని నల్లవారు బానిసత్వము నుండి విడిపించబడిన తరువాత కూడ 100 సంవత్సరములు వారు బానిసలుగానే బ్రతికారు. అందుకు కారణం స్వాతంత్ర్యం అంటే ఏమిటో తెలియక పోవడం. ఇటువంటి స్థితిలో మనం కూడా ఉన్నామని గ్రహించాలి. అయితే, రక్షించబడకముందు వేటికి బానిసలమయ్యామో రక్షింపబడిన తరువాత కూడా మార్పు కనిపించదు. రక్షణకు ముందు మరణమునకు భయపడేవారము, సమస్యలు, అనారోగ్యం, ఆర్ధిక ఇబందులు ఇలా ప్రతిదానికి భయపడుతు, పాపంలో బంధించబడి ఉన్నాము. రక్షణ పొందిన తరువాత వచ్చిన మార్పు ఎంటంటే ప్రార్థన చేస్తు భయపడతాము, ప్రార్థన చేస్తు పాపం చేస్తాము.

నీవు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామని అనుటకు ఒక సూచన ఎంటంటే; ప్రతివిధమైన బంధకము నుండి విడుదల పొందుకుంటావు, ఒకవేళ బలహీనతలలో ఉన్న దాని నుండి బయటపడుటకు ప్రయత్నిస్తావు.

ఈ రోజు నీవు స్వతంత్రునిగా ఉండి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నావా? లేదా ప్రతి దానికి భయపడుతు పాప బానిసత్వంలో ఉన్నావా? పరీక్షించుకోవాలి...!
ఇంకొంత సమయం
Audio: https://youtu.be/p3nDz7hnd10

ఉదయమున లేచామంటే రాత్రి పడుకునే వరకు ఎదో ఒక పనిలో ఒత్తిడి, భారం, బిజీ జీవితం. జీతం సరిపోటల్లేదు, నెల మొదట్లో ఉన్న స్థితి కంటే నెల ఆరికి వచ్చేసరికి చాలీ చాలినంత డబ్బు, ఉద్యోగంలో కొంత ఒత్తిడి తగ్గితే బాగుండు, వ్యాపారంలో ఇంకొంచం లాభం, కనీసం మంచి ఉద్యోగం ఇలా అనుకుంటూ పొతే జీవితకాలం చెప్పుకున్నా ముగింపు లేదు కదా.

అనుదినం మన హృదయాలను పరిపాలించేది హృదయవాంఛలే. ఇవన్నీ తప్పేమీ కాదు గానీ అవి ఉండాల్సిన స్థానంలో ఉంటే చాలు. అదేవిధంగా అవి మన జీవితాలను గుప్పిట్లో పెట్టుకుంటే మన ఆత్మీయ స్థితి శూన్యమే.

రోజులు వారాలు గడిచిపోతున్నాయి. రెప్ప మూసి తెరిచేలోగా క్యాలెండరులో డేటు మారిపోతుంది. గడచిన సమయం తిరిగి రాదని మనందరికీ తెలుసు. అయ్యో దేవునితో నేను ఎక్కువ సమయం గడపలేకపోయానే అని ఎప్పుడో సమస్య వచ్చినప్పుడు అనుకుంటే ఎలా? దేవునికి ఇవ్వాల్సిన సమయం ఆయనకు ఇవ్వాల్సిందే. కాస్త సమయం ఇస్తే లాభమే కాని నష్టము లేదు కదా.

వారమంతా ఎదో పనిలో పడి, ఆయన రాకడ సమీపిస్తుందని మరిచిపోక, అనుదినం ఎత్తబడుటకు సిద్దపాటు కలిగియుందాం; ప్రార్ధనలో, వాక్యంలో ఇంకొంత సమయం గడుపుతూ దేవునికి ప్రధమ స్థానం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అట్టి తీర్మానమును ప్రభువు స్థిరపరచును గాక. ఆమేన్.

యాకోబు 4: 8 దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.
ప్రార్ధనకు జవాబు ఎలా వస్తుంది...?

మత్తయి 7:7 అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును.

అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును.

మత్తయి 5,6,7 అధ్యాయములలో యేసు ప్రభువు విజయవంతమైన క్రైస్తవ జీవితమునకు కావలసిన విలువైన విషయాలు బయలుపరచాడు. ఈ 3 అధ్యాయములలో దాదాపు పరిశుద్ధ గ్రంథములో ఉన్న ముఖ్యమైన అంశాలన్ని కనిపిస్తాయి.

మనం చదివిన భాగంలో దేవుని సన్నిధిలో మనకు లభించే అతిప్రాముఖ్యమైన 3 వాగ్ధానములు ఉన్నాయి. ప్రస్తుతం అతి పెద్ద బాధాకరమైన సమస్య ప్రార్థనకు జవాబు రాకపోవడం. ఎవరైన సమస్యలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకొనమని చెప్తే, చేస్తున్నామనే అంటారు, ప్రార్థనకు జవాబు వచ్చిందనో, వస్తుందనో ధైర్యముగ చెప్పలేరు. మనకున్న సమస్యలకు కారణం మనకు దేవునికి తెలసినంత స్పష్టముగ ఎవరికీ తెలియదు.

అందుకనే దేవుడు అడుగు, వెదకు, తట్టు అని చెప్పాడు. ప్రార్థనకు జవాబు రాకపోవుటకు కారణం అడిగి ఆగిపోవడమే. సమస్యలలో సహాయము కొరకు దేవుని అడిగినప్పుడు ధైర్యము వస్తుంది. వెదకుట వలన మనలో పట్టుదల కనిపిస్తుంది. తట్టుట వలన అద్భుతం చూస్తాము.

మరల చెప్తాను; సహాయము కొరకు దేవుని సన్నిధిలో మోకరించగానే మొదట జరిగే కార్యం మనము ధైర్యముతో నింపబడతాము. చాలామంది ఇక్కడితో జవాబు వచ్చిందని లేచి వెళ్ళిపోతారు, వేరే పనులలో నిమగ్నమైపోతారు. తరువాత దేవుని కార్యం కనిపించకపోయేసరికి దేవుని నిందించడమో లేదా ప్రార్థనకు దూరమైపోవడం జరుగుతుంది. కాని, అడిగిన తరువాత విసిగిపోకుండ వెదకుట వలన మనలో ఉన్న పట్టుదల కనిపిస్తుంది. అంతేకాదు కీర్తన 69:32 దేవుని వెదకువారలారా, మీ ప్రాణము తెప్పరిల్లును గాక. అనగా మూర్చపోయిన వాని మీద నీళ్ళు జల్లితే తెప్పరిల్లి లేచినట్లు, సమస్యలలో నలిగిపోతున్న మనకి వెదకుట వలన నూతన ఉత్సాహం కలుగుతుంది. ఇక్కడితో జవాబు వచ్చినట్ల కాదు తట్టాలి. తట్టుట వలన నీలోని భయం పోయి లూకా 18:18లో ఉన్న విధవరాలి వలే పట్టుదల కలుగుతుంది. అప్పుడే నీ కళ్ళతో దేవుని అద్భుత కార్యమును చూడగలవు.

ప్రార్ధనలో అడుగుట ఒక్కటే కాదు దేవుని చిత్తం కూడా కనిపెట్టాలి. మత్తయి 7:11 పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును. మనము అడిగే వాటిలో అవి మనకు మేలు చేసేవి, మంచివైతేనే దేవుడు ఇస్తాడు.

https://youtu.be/SpVMguZwAXQ
దేవుని పైనే ఆధారం
Audio: https://youtu.be/HTfcuOSADo4

కీర్తనలు 127:1 యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనియెడల దాని కావలికాయువారు మేలుకొని యుండుట వ్యర్థమే.

మనం ఒకటి గ్రహించాలి, మనవద్ద ఉన్నవి మనం పొందేవి అన్ని కేవలం ఒకే చోటునుండి పొందుతున్నాము. అది కేవలం మన దేవుని నుండియే. మన జీవితంలో ప్రతీ విషయంలో ఆయన మీద ఆధారపడాలి మరియు దేవుడే పునాదిగా ఉండాలి ఆ పునాదే లేనట్లయితే మనం పడిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే బలమైన పునాదివేసి ఇల్లు కడతామో అప్పుడే ఆ ఇల్లు దృఢంగా మరియు ఎటువంటి పర్యావర ఉపద్రవాలు వచ్చినా నిలబడుతుంది. అదే విధంగా మన నిజ జీవితంలో కూడా దేవుడు అనే ధృడమైన పునాది వేసుకున్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం పడిపోకుండా ఉంటాము. ఈ విధమైన జీవితాన్ని కట్టుకోవాలి అంటే దేవునితో సత్ సంబంధం కలిగి వుండాలి. దేవుడే మన జీవితంలో మూలరాయి అయి ఉండాలి, ప్రతీ విషయంలో ఆయనమీద ఆధారపడాలి. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడడం తగ్గిపోతుందో ఏ కట్టడమైనా బలహీనంగా ఉంటుంది. ఎప్పుడైతే పూర్తిగా ఆధారపడి జీవిస్తామో వారి ప్రయాస వ్యర్ధం కానేరదు. దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది “మనం ఆయన మీద అధారపడినట్లయితే ఆయన మన హృదయ వాంఛలన్ని తీరుస్తాడు”.

మనం ఆధారపడతాము కాని, ఎప్పుడు ఓపికతో కనిపెట్టుకొని ఉండము. ఓపికతో కనిపెట్టుకొనక మన ఇష్టపూర్వకంగా మన స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటాము. ఎందుకంటే నాకే అన్ని తెలుసు నా అంత గొప్పవాడు ఎవ్వరూ లేరు, జీవితం నాకు చాలా నేర్పింది, నాకున్న జ్ఞానంతో నేను ఏదైనా సాధించగలను అనే కొద్దిపాటి గర్వం అనే లక్షణం తో ముందుకు దూసుకు పోతుంటాము. మనకు ఉండే జ్ఞానంతో దేనినైనా మొదలుపెట్టగలము కాని దానిలో విజయాన్ని మాత్రం పొందలేము. గర్వం అనేది ఒక క్యాన్సర్ వ్యాధి లాంటిది, అది పూర్తిగా నాశనంచేసి తుదకు నిత్య మరణానికి దారితీస్తుంది. నీవు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఉండవచ్చు, నీకు ఎటువంటి సమస్య అయినా ఉండవచ్చు అయితే అన్నింటికీ సమాధానం దేవుడే. ఆయనే ప్రతీ సమస్యలను సరిచేయువాడు, విరిగిన వాటిని మరలా చక్కగా అమర్చువాడు. ఎప్పుడైతే ఆయన మీద ప్రతీ విషయంలో ఆధారపడి ఆయన ఆజ్ఞలను పాటిస్తామో అపుడే ఆయన మనకు సహాయకుడుగా ఉంటాడు. అంతేకాకుండా నిజమైన సంతోషం, సమాధానం, కనికరం తో చక్కటి పరలోక జ్ఞానాన్ని మనలో నింపుతాడు. మన జీవితం చాలా చిన్నది అయితే దేవుడు ఒక్కడే. ఆయనే మన జీవితానికి పునాది అయితే ఆయనద్వారా సమస్తమూ సాధ్యమే.
తట్టుకోలేని బాధ కలిగినప్పుడు, మెలిపెట్టే శ్రమకలిగినప్పుడు ఇలా ఎందుకు జరిగింది? నాకే ఎందుకు జరిగింది? అనే ప్రశ్నలు మనసును ముసురుకుంటాయి. సూర్యరశ్మిని కురవని మేఘం కమ్మేసినట్టు విశ్వాసంపై తెరలాగ కప్పేస్తుంటాయి. దేవుడు మనకు తోడు వున్నాడనే విషయాన్ని మరుపు పొరల్లోకి తోచేస్తుంది. దొర్లుతున్న పడకపై నలుగుతున్న పక్కదుప్పటిలా ఆలోచనలు నలుగుతుంటాయి. ప్రార్థించడమంటే దీనంగా ఈ పరిస్థితినుండి విడిపించమని వేడుకోవడమే అన్పిస్తుంది. ప్రార్థనంటే ఆయనతో సంభాషించడమే కదా! మరెందుకో ఆవిషయమే గుర్తుకు రాదు. ఇలాంటప్పుడు పదేపదే నేను చేప్పే మాటొకటి గుర్తుకొస్తుంది.

ఈ అనుభవాన్ని ఇలా కలిగివుండటంలో ఏదైనా ప్రయోజనం దాగివుందేమో! ఈ ఆలోచన నెమరేస్తూ వుంటే ఊరటకలుగుతుంది. ఎంత కురవని మేఘమైనా సూర్యరశ్మిని అడ్డుకోలేక తప్పుకోక తప్పదు. మెల్లగా ఆయనతో సంభాషణ మొదలౌతుంది. తెరతొలగిన ఆకాశాన్ని ఒకసారి చూడు కొత్తరంగుల శోభను అలంకరించుకుంటుంది. అప్పటివరకు బండసందుల్లో వున్న పావురాలు ఒక్కుమ్మడిగా ఎగరడం చూస్తావు. ఎంత ఆహ్లాదమో కదా దేవుని క్రియలు. ఇక స్తుతి నాలుకపై కదలాడుతుంది.

కీర్తనాకారుడంటాడు.."నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయెను" కీర్తనలు 119:71

క్రీస్తు నావైపుంటే విజయ పరంపర నావెంటే!!

భయపెడ్తున్న శ్రమలు, బాధలు సింహాల్లాగ, నాగు పాముల్లా కన్పిస్తాయి. వాటిని త్రొక్కడానికి, అణగద్రొక్కడానికి బలమిచ్చువాడు ఆయనే.

ఇక,
ఇలా ఎందుకు జరిగింది? నాకే ఎందుకు జరిగింది? అనే ప్రశ్నలు ఎందుకు?
నాతో వుండినవాడు నమ్మదగినవాడు తన రక్షణ వస్త్రాన్ని నాకిచ్చాడు
అంతిమ విజయం నాదే కదా!

SajeevaVahini.com
విధేయతలో మాదిరి
Audio: https://youtu.be/y1RiCnfxnzY

మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినమువరకు దానిని కొనసాగించును. ఫిలిప్పీయులకు 1:4

మనము చూడగలిగినా లేకున్నా దేవుడు మనందరి యెడల తన కార్యములు జరిగించును. ఈ మాటను మీరు నమ్ముతున్నారా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మాట వాస్తవం. దేవుడు నాకేమి చేయలేదు, దేవుని వల్ల నాకేమి లాభం లేదు, అసలు దేవుడే ఉంటె నెందుకు ఇలా జరిగేది అని ఆలోచించే వారిలో మనం కూడా ఉన్నాం. ఏదైనా మ్యాజిక్ జరిగిపోయి అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం అయితే బాగుండు అనే ఆలోచన ఎవరికీ ఉండదు చెప్పండి. అలా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి; ఎప్పుడైతే ఆయనకు మనం విధేయత చూపిస్తామో అప్పుడే అవన్నీ సాధ్యం.

తట్టుకోలేని బాధ కలిగినప్పుడు, మెలిపెట్టే శ్రమకలిగినప్పుడు ఇలా ఎందుకు జరిగింది? నాకే ఎందుకు జరిగింది? అనే ప్రశ్నలు వేసుకోవడం కంటే, ఆ సామస్య నుండి దేవుడు ఎలా తప్పిస్తాడో ఓపికతో వేచి చూస్తె ఆ అనుభవం లో ఉన్న సంతృప్తి మరోలా ఉంటుంది. అలాంటప్పుడే మన ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు బలపడుతాయి; ప్రత్యేకంగా దేవునిపై మన విశ్వాసం రెట్టింపవుతుంది, మన వ్యక్తిత్వం రూపాంతరం చెందుతుందని నేనంటాను.

ఆయన మన వ్యక్తిత్వాన్ని తన కుమారుడైన క్రీస్తు వ్యక్తిత్వం వలె మార్చుడానికి అనుదినం పనిచేయుచున్నాడు. ఆయన తన పని పూర్తయ్యే వరకూ శ్రమిస్తాడు, ఆ విషయములో ఎటువంటి సందేహము లేదు.

ఆరంభించినవాడు, ఆనందంలో నడిపిస్తూ, అంతము వరకు నడిపించేవాడు ఆయనే గనుక ఆయనకు సహకరించుటయే మన యొక్క విధి.

మనం చేయవలసిన అతి సుళువైన పని ఏమిటంటే, విధేయతతో క్రీస్తును అనుసరించి ఆ వెలుగును మన జీవితాల్లో కలిగియుండుటయే.

అందుకే, కీర్తనాకారుడంటాడు.."నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయెను" కీర్తనలు 119:71

దేవుని కృప మీతో మనందరితో ఉండును గాక. ఆమేన్