Devotional Telugu
3.46K subscribers
106 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
లోచూపు
జీవితం దృష్టి ప్రధానమైనది. ప్రతి ప్రాణికి చూపు చాలా అవసరమైనదేగాక విలువైనది కూడా! చూపునిచ్చే అవయవం కన్ను. దృష్టి ప్రాముఖ్యాన్ని గుర్తించిన మన పూర్వులు ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అన్నారు. భౌతికమైన ఈ జగత్తును, అందులోని మార్పులను గమనిస్తూ జీవన గమనం సాగించడం ఒకెత్తు. ఆంతరంగికమైన చూపును కలిగి ఉండటం మరొకెత్తు. అదే ‘లోచూపు’.
ఎవరికి వారు తమంతట తామే ఉన్నత మార్గంలో ప్రయాణించేటట్లు చేసేది ఈ లోచూపు. బాహ్య నేత్రాలు సాధారణ దృష్టినిస్తే, జ్ఞాననేత్రాలు ఆంతరంగిక దృష్టిని అందిస్తాయి. మామూలు చూపు కొన్నిసార్లు ఇంద్రియ లౌల్యానికి దారితీస్తుంది. అధోగతికీ లాక్కెళుతుంది. ‘కన్నుల చూచినందెల్లా కడు ఆసల దగిలి’ అని ఓ సంకీర్తనలో అన్నమయ్య చెప్పినట్లుగా, చూసిన ప్రతి విషయంపై ఆసక్తిని పెంచుకుంటే అది దుఃఖాలపాలు చేస్తుంది. ఆముప్పు దాపురించకూడదంటే జ్ఞాననేత్రాలు విప్పారాలి. ఆ కాంతిలో వ్యక్తిత్వం వికసించాలి. మొక్క సూర్యకాంతిని అందుకొని ఎదిగి మహావృక్షమై ప్రాణవాయువును, పుష్పఫలాలను, కలపను అందించి సమాజానికి ఉపయోగపడుతున్న స్పూర్తిని అందుకొని మనమూ వికసించిన వ్యక్తిత్వంతో సమాజసంక్షేమానికి కృషి చేయాలి.

అన్నమయ్య తన సంకీర్తన భాగవతంలో ‘ఎన్ని మార్లు సేవించిననూ కన్నులూ తనియవు’ అంటూ- భగవత్‌ సౌందర్యాన్ని వీక్షించడం నేత్రాలు చేసుకున్న గొప్ప యోగంగా అభివర్ణిస్తారు! ‘తెర తీయగరాదా నాలోని మచ్చరమను తెరతీయగారాదా తిరుపతి వేంకట రమణా’ అంటూ- నిన్ను దర్శించాలంటే పదివేల కన్నులు కావలెనయ్యా అంటారు త్యాగరాజస్వామి!
బాహ్యంగా చూసినదాన్ని విమర్శించడం మానవ సహజ లక్షణం. దీన్ని అధిగమించి లోచూపుతో నిన్ను నీవు విమర్శించుకో! నిన్ను నీవు సరిదిద్దుకో’ అంటారు విజ్ఞులు. ‘చదివితి తొల్లి, చదివేనింకా కొంత... ఎదిరి నన్నెరగను’ అంటారు అన్నమాచార్యులవారు ఓ సంకీర్తనంలో. ఎంతో కొంత చదివాను, ఇక ముందూ చదువుతాను. కాని నన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను. ‘ఒరుల దూషింతు కాని, ఒక మారైన నా దురితకర్మములను దూషించను’ అంటూ బాహ్యదృష్టితో చూసి అందర్నీ తప్పుపడుతున్నాను కాని, అంతరదృష్టి కలిగి నన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను అంటూ లోతైన జ్ఞానాన్ని బోధించారు. ఆత్మజ్ఞానం అందుకోవడానికి అవసరమైన విజ్ఞానాన్ని అందించారు.
లోచూపు సాధనకు ధ్యానం ఎంతో ఉపయుక్తమైనది. ఏకాగ్రమైన భావనతో మనసును కేంద్రీకరించినపుడు జ్ఞాననేత్రాలు విప్పారుతాయి. ధ్యానప్రక్రియ ఉత్తమ ఉపాసనామార్గం. అభ్యాసపూర్వకమైన ధ్యానం తమను తాము తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. జ్ఞానాజ్ఞాన విచక్షణ ఏర్పడి వివేకదర్శనం కలుగుతుంది. తెలుసుకున్న జ్ఞానాన్ని నిత్యజీవనంలో ఆచరించేటట్లు చేస్తుంది. బుద్ధి ప్రచోదనం జరిగి మనసు నియంత్రితమై జీవితం సార్థకమయ్యేలా ఆశలు, ఆశయాలతో జీవనం సాగిపోతుంది. మంచి పనులు చేసే జ్ఞానాన్ని లోచూపు అందిస్తుంది. మనలోపల చుక్కానిలా ఉండి మనల్ని చక్కని మార్గంలో నడిపించే గురువే లోచూపు!
చల్లని మాట... చక్కని బాట!


‘కొందరు ఇంటికి వస్తే సంతోషంగా ఉంటుంది. కొందరు వెళ్లిపోతే చాలా సంతోషంగా ఉంటుంది’ అని కొంతమంది గృహస్థులు తమ ఇళ్లలో ఓ సందేశాన్ని ఫ్రేమ్‌ కట్టి ఉంచుతారు. చూడ్డానికి తమాషాగా అనిపించినా, అది లోతుగా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే కొందరు వ్యక్తులు ఎవరింటికైనా పలకరింపులకు వెళ్లినప్పుడు, అవతలివారి మానసిక స్థితిని గమనించరు. అడగకపోయినా తమ కష్టాలు, బాధలు ఏకరువు పెడుతుంటారు. సమాజం భ్రష్టుపట్టి పోయిందని అందరినీ తిడుతూ, తమలోని నిరాశా నిస్పృహలను వాళ్లముందు వెళ్లగక్కుతుంటారు. అలాంటప్పుడే వచ్చినవ్యక్తి ఎప్పుడు వెళ్లిపోతాడా అని ఇంట్లోవాళ్లు ఎదురుచూస్తుంటారు. ఈ ధోరణికి విరుద్ధంగా ఉండే వ్యక్తులూ ఉంటారు. వారు ఏ ఇంటికైనా సంతోషాన్ని వెంటబెట్టుకుని వెళ్తారు.
సమాజంలో అనేక సమస్యలు, వివాదాలు ఏర్పడటానికి ముఖ్యకారణం- మనుషుల మధ్య మాటతీరు సరిగ్గా లేకపోవడం, అవగాహనా లోపమని మనకు అర్థమవుతుంది. మాట తీరు ఎలా ఉంటే శ్రేయస్కరమనే అంశాన్ని, ‘మనుస్మృతి’ ఏనాడో సూచించింది. మనుషులు మాట్లాడే ధోరణులను ‘మనుస్మృతి’ నాలుగు విధాలుగా విభజించింది. మొదటిది- పారుష్యం; అంటే కఠినంగా మాట్లాడటం. మన మాటతీరు కటువుగా ఉంటే- మిత్రులు శత్రువులవుతారని హెచ్చరించింది. రెండోది- అనృతం. అంటే అసత్యాలు పలకడం. ఈ ధోరణి ఉన్నవారు డంబాలు పలుకుతారు. దాంతో అవతలి వ్యక్తులకు వీళ్లమీద విశ్వాసం ఏర్పడదు. ఎవరూ మనస్ఫూర్తిగా మాట్లాడరు. మూడోది- పైశూన్యం. అంటే, ఇతరుల మీద చాడీలు చెప్పడం. దీనివల్ల మనుషుల్లో ద్వేషాలు, కలహాలు పెచ్చరిల్లుతాయి. సన్నిహితులు విరోధులవుతారు. నాలుగోది- అసంబద్ధ ప్రలాపం. ఈ లక్షణం ఉన్నవారు అనవసర విషయాలు, విసుగు కలిగించే అంశాలు ఎక్కువగా మాట్లాడుతూ, వినేవారికి చికాకు కలిగిస్తుంటారు.
‘ప్రియంగా మాట్లాడేవాడికి శత్రువు ఉండడు’ అన్నాడు చాణక్యుడు. ‘మంచిగా మాట్లాడేవాడికి ఏం లభిస్తుంది’ అని యక్షుడు ధర్మరాజును అడిగినప్పుడు, ఆయన ‘మైత్రి’ అని సమాధానమిచ్చినట్లుగా మహాభారతం చెబుతోంది.
మంచిగా మాట్లాడేవారు అవతలి వ్యక్తులను ఎంతగా ఆకర్షిస్తారనడానికి రామాయణం కిష్కింధకాండలో హనుమంతుడి భాషణ గొప్ప ఉదాహరణ.
చాలామంది ఆలోచించకుండా మాట్లాడతారు. ఆ మాటల వల్ల అనర్థం జరిగాక అప్పుడు తీరిగ్గా ఆలోచిస్తారు. కానీ ఏం లాభం? ఇతరులు ఆవేశపడి, పరుషంగా మాట్లాడినా, మనం తొందరపడి ఆవేశంగా మాట్లాడకూడదు. ఓర్పుతో ఉండటం నేర్చుకోవాలి. పరుష భాషణం వల్ల వైరం ఇంకా పెరుగుతుంది. హితంగా, మితంగా, ప్రియంగా మాట్లాడటం అందరికీ ఆనందదాయకంగా ఉంటుందని మన శాస్త్రాలు ఉద్బోధిస్తున్నాయి.
‘మనసులో కుటిలత్వం లేకుండా, మధురభావంతో ఉండాలి. మన మాటలు మృదుమధురంగా ఉండాలి. చేసే ప్రతి పనిలో ఆలోచనలో మంచితనమే అంతర్లీనమై ఉండాలి’ అని అధర్వణ వేదం చెబుతోంది. అందువల్ల ఎప్పుడూ చల్లగా, ప్రియంగా మాట్లాడే ధోరణిని అలవరచుకుంటే, మనం ఎవరితో మాట్లాడినా, వాళ్ల హృదయంలో ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకోగలుగుతాం.
సమాజం సజావుగా సాగాలంటే అందుకు ప్రియ భాషణమే చక్కని మార్గమని అందరూ గ్రహించాలి.
తమసోమా జ్యోతిర్గమయ


చతుర్దశి అమావాస్యకు దారితీసినట్లుగానే నరకాసుర సంహారం దీపావళి పర్వదినానికి తోవ చూపిందని పెద్దలమాట. పూర్వం నరకుడు అనే రాక్షసుడు లోక కంటకుడై చెలరేగినప్పుడు, వాడి బాధలను తట్టుకోలేక ఇంద్రాది దేవతలందరూ మహావిష్ణువుకు మొరపెట్టుకున్నారని, అప్పుడు మహావిష్ణువు కృష్ణుడిగా సత్యభామాసమేతుడై వాణ్ని సంహరించి, లోకానికి పట్టిన పీడను వదిలించాడని పురాణగాథ. నరకాసురుణ్ని చంపిన రోజు ఆశ్వీయుజ బహుళ చతుర్దశి కావడం వల్ల ఈ దినాన్ని ‘నరక చతుర్దశి’ అని పిలవడం సంప్రదాయంగా మారింది. దుష్టరాక్షసుడి వధానంతరం మరుసటి రోజైన అమావాస్యనాడు ఆనందోత్సాహాలతో దీపాలు వెలిగించి, పండుగ జరుపుకోవడం పరిపాటిగా మారింది.
నరక చతుర్దశికి, నరకాసురుడికి సంబంధం లేదనే వాదనలు కూడా ఉన్నాయి. అవి ఎలా ఉన్నా, మరొక ధార్మిక విషయం నరక చతుర్దశితో ముడివడి ఉందనేది యథార్థం. మానవులు మరణానంతరం నరకానికి, ఆ తరవాత స్వర్గానికి వెళ్తారని ప్రగాఢ విశ్వాసం. నరకలోకం అంధకారమయంగా ఉండటం వల్ల అక్కడికి వెళ్ళినవారు చీకటిలోనే మగ్గుతుంటారని, దారి చూపడంకోసం భూలోకంలోని వారసులు దీపాలు వెలిగించాలని శాస్త్రం చెబుతోంది. పితృదేవతలకు నరకంలో చీకట్లు తొలగాలంటే, వారి కోసం భూమిపై దీపాలు వెలగాలన్న భావనతో దీపావళినాడు దీపాలను వెలిగిస్తారు. అంతేకాదు- దీపదానాలూ చేస్తారు. యముడి ప్రీతికోసం తర్పణాలు విడుస్తారు. ఇవన్నీ పితృదేవతలకు నరకలోక బాధలు లేకుండా చేయడానికే అనేది ఈ పండుగలోని పరమార్థం. ఆశ్వీయుజ బహుళ చతుర్దశినాడు ఎవరు దీపాలు వెలిగిస్తారో వారి పితరులు (మరణించిన తండ్రులు, తాతలు) నరక లోకాన్ని వీడి స్వర్గలోకం వైపు ప్రయాణిస్తారని ధర్మశాస్త్రం చెబుతోంది.
నరక చతుర్దశినాడు అభ్యంగనస్నానం విశేషమైన అంశం. తిలలు అంటే నువ్వులు. వాటి నుంచి తీసిన ద్రవమే తైలం. ఒంటికి తైలాన్ని మర్దన చేసుకొని తలస్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడంవల్ల శరీరం ఆరోగ్యవంతం కావడమేగాక, మానసికంగానూ ప్రశాంతత లభిస్తుందని పెద్దలమాట. రాబోయేది హేమంత రుతువు. అంటే చలికాలం. చలికాలం రాగానే శరీరం అంతా పగులువారుతుంది.  తైలమర్దనవల్ల శరీరం నిగనిగలాడుతూ తళుకులీనుతుంది.
అమావాస్య లక్ష్మీదేవి జన్మదినమని విశ్వాసం. లక్ష్మీదేవి తాండవించే ఈ శుభదినాన దీపాలు వెలిగించి, సిరిసంపదలు కోరుతూ లక్ష్మీపూజలు చేయడం మానవాళికి అలవాటు. బంగారం, వెండి, రత్నాలు, వజ్రాలు, ముత్యాలు... ఇలా అమూల్యమైన సంపదలన్నీ లక్ష్మీస్వరూపాలే. దీపావళినాటి రాత్రి అమూల్య సంపదలను పూజించి, దినదినాభివృద్ధిని కోరడం కనిపిస్తుంది. వర్తకవాణిజ్య రంగాల వారికి దీపావళి అత్యంత పూజ్యదినం.
మనిషి తన జీవితంలో అనుక్షణం వెలుగుకోసం తపిస్తాడు. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అనే వేదసూక్తి మానవుడి మనోభావానికి అద్దం పడుతుంది. వెలుగులకోసం తపించే మనిషికి వెలుగులు కురిపించే దీపావళి పండుగ అంటే ఎంతో ఇష్టం.
నరకం నుంచి విముక్తి కావడం, తేజోమయ స్వర్గలోకానికి చేరుకోవడం అనే ప్రధాన లక్ష్యాలు- ఈ పండుగను విశ్వమనోహరంగా చేస్తున్నాయి. సూర్యచంద్ర నక్షత్ర కాంతులతో ఆకాశం ఎలా వెలిగిపోతుందో, అలాగే జీవితమంతా పర్వదినాల వెలుగులతో సుఖశాంతులను కురిపించాలని కోరడమే మానవాళి కర్తవ్యం.
భగినీ హస్త భోజనం


సనాతన ధర్మంలోని పండుగలు, పర్వదినాలు సమైక్యతత్వాన్ని, సమష్టి భావాన్ని ఆకాంక్షిస్తాయి. కుటుంబంలోని జీవన మాధుర్యానికి, సంప్రదాయ సౌరభానికి ప్రతీక- యమద్వితీయ. సహోదరుల మధ్య సదవగాహన, సౌమనస్య పూరిత ఆపేక్షల వృద్ధికి యమద్వితీయనాడు నిర్వహించే భగినీ హస్తభోజనం ఉపకరిస్తుంది. కార్తికంలో రెండో రోజైన శుద్ధ విదియను యమద్వితీయగా, సహోదర ద్వితీయగా వ్యవహరిస్తారు. సోదరసోదరీమణుల మధ్య ఉండే అపురూపమైన అనురాగ సరాగాల్ని ప్రకటించే వేడుక- భగినీ హస్తభోజనం.
‘భగిని’ అంటే సోదరి, భాగ్యవంతురాలని అర్థం. ‘భగిని’ చేతివంటను సోదరులు ప్రియమారా ఆరగించే పావన తరుణమే భగినీ హస్తభోజన పర్వదినం. కార్తిక శుద్ధ విదియనాడు సోదరీమణుల సమాదరణం చేయాలని లింగపురాణం  ప్రస్తావించింది. అవ్యాజమైన అభిమానంతో సోదరుల్ని ఇంటికి పిలిచి తోబుట్టువులు వారికి సంతృప్తిగా భోజనాన్ని కొసరి కొసరి వడ్డించాలని, సోదరులు తమ అక్కాచెల్లెళ్లను ఘనంగా సత్కరించాలని భవిష్యపురాణం పేర్కొంది. నరకాసుర వధ అనంతరం, శ్రీకృష్ణుడు తన సోదరి సుభద్ర ఇంటికి వెళ్లాడంటారు. ఆయనకు సుభద్ర విజయ తిలకాన్ని దిద్ది, మంగళహారతి నిచ్చి, మధుర పదార్థాల్ని తినిపించి, రక్ష కట్టిందంటారు. ఆ మహత్తర సందర్భమే భ్రాతృ ద్వితీయగా స్థిరపడిందంటారు.
యమద్వితీయగా ఈ పర్వదినం ప్రశస్తి పొందడానికి ఎంతో నేపథ్యం ఉంది. యమి(యమున) తన అన్న యమధర్మరాజును ఇంటికి ఆతిథ్యానికి రమ్మని ఎన్నోసార్లు ఆహ్వానించింది. అయితే ఆయనకు వీలు చిక్కలేదు. తన అన్న రాకకై యమున ఎదురుచూడసాగింది. అల్పాయుష్కుడైన మార్కండేయుడి ప్రాణాల్ని తన పాశంతో హరించడానికి యముడు వెళ్లాడు. పరమేశ్వరుణ్ని మార్కండేయుడు శరణు వేడాడు. భక్తవశంకరుడైన మహేశుడు త్రిశూలధారియై యముణ్ని వెంటాడాడు. శివాగ్రహానికి భీతిల్లిన యముడు తన సోదరి యమున ఇంటికి పరుగున వచ్చాడు. తన పిలుపు మన్నించి, ఇన్నాళ్లకు తన అన్న వచ్చాడని యమున సంబరపడింది. ఎన్నో మర్యాదలు చేసి, షడ్రసోపేతమైన వంటకాల్ని సిద్ధంచేసి, అన్నగారికి వడ్డించింది. అదే సమయంలో యముణ్ని అన్వేషిస్తూ శివుడు అక్కడికి వచ్చాడు. వంటకాల్ని వడ్డిస్తున్న యమునను, భోజనాన్ని ఆరగిస్తున్న యముణ్ని చూశాడు. వారి అనురాగ బంధాన్ని వీక్షించి ముగ్ధుడై, యముడికి అభయమిచ్చి నీలకంఠుడు నిష్క్రమించాడన్నది పురాణగాథ.
తన సోదరి ఇంట ఆతిథ్యాన్ని అందుకోవడం వల్ల, యముడికి ఈశ్వరుడి ఆగ్రహం బదులు, అనుగ్రహం లభించింది. మహాదేవుడి నుంచి తనను రక్షించినందుకు, మరపురాని వరం కోరుకొమ్మన్నాడు. కార్తిక శుద్ధ విదియనాడు తమ సోదరీమణుల గృహాలకు వెళ్లి, వారి చేత భోజనం స్వీకరించే సోదరులకు సర్వదా అనేక శుభాలు చేకూరాలని, అపమృత్యు దోషాలు తొలగాలని యమున వరం అడిగింది. యముడు తథాస్తు అన్నాడు ఆనందంగా! ‘సమవర్తి అయిన యముడి దశనామాల్ని యమద్వితీయనాడు స్మరిస్తూ, అర్ఘ్య ప్రదానం చేయాలి. దక్షిణ దిశాధిపతియైన యముడి ప్రీతి కోసం, దక్షిణ దిక్కున అరటి ఆకులో ఉప్పును కుప్పగా పోసి దానిపై ఆముదంతో యమదీపాన్ని వెలిగించాలి. పితృదేవతలకు సద్గతులు దక్కాలని ఆకాంక్షించాలి’- ఈ విధివిధానాల్ని భవిష్కపురాణం వివరించింది.
‘తల్లిదండ్రుల తరవాత ఆత్మీయులైనవారు తోబుట్టువులే! వారి మధ్య బంధాలు, ఆప్యాయతలు నిరంతరం గాఢంగా వర్ధిల్లాలి. జీవితాంతం ఒకరికొకరం తోడునీడగా, అండదండలతో సహోదరులు పురోగమించాలి’. ఈ శుభాకాంక్షల పరంపరకు సాకార దర్శనం- భగినీ హస్తభోజన పర్వదినం!
శ్రీ లలితా సహస్ర నామం


శ్రీచక్రంలో శివశక్తి ఉంటుందని విశ్వాసం. ఇదే శ్రీమహాత్రిపురసుందరీ యంత్రం! ఈ శుద్ధ చక్రం మన కోరికలన్నీ తీరుస్తుందని భావిస్తారు. దీన్నే శ్రీయంత్రం పేరుతో దేవాలయాల్లో స్థాపిస్తారు. మంచి శిలపై చెక్కిగాని, రాగిరేకులపై గట్టిగీతలు గీసిగాని శ్రీయంత్రాన్ని సిద్ధంచేసి, పండితులు వేద మంత్రాలు పఠిస్తూ ఉండగా దేవుడి విగ్రహం కిందభాగంలో స్థాపిస్తారు.
మనం అనునిత్యం చూసే యంత్రాలకు, ఆధ్యాత్మిక రంగంలో ఉపయోగించే యంత్రాలకు సంబంధం లేదు. మంత్రం, తంత్రం, యంత్రం అనే మూడు పదాలు ఆధునిక కాలంలో వేరే అర్థాలు సంతరించుకున్నాయి. ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగపడేది మంత్రం. మంత్రాలు వేదకాలం నుంచి ఉన్నాయి. రక్షింపజేసేది, తరింపజేసేదని మంత్రం అనే పదానికి అర్థం. ప్రతి మంత్రంలో కొన్ని బీజాక్షరాలుంటాయి. దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఉపయోగించే కర్మకాండను తంత్రం అంటారు. బీజాక్షరాలతో కూడిన చక్రం యంత్రం. ఇందులో సరళరేఖలు, త్రిభుజాలు, వృత్తాలు, కోణాలు ఉంటాయి. ఇదొక క్లిష్టమైన రేఖాగణితం. ఇందులో దేవతలకు సంబంధించిన బీజాక్షరాలు ఉంటాయి.

త్రిపురసుందరీ పూజాంగ యంత్రమైన శ్రీచక్రానికి ప్రతి ఉదయం సాయంకాలాల్లో షోడశో పచారాలతో పూజలు జరుగుతూ ఉంటాయి. ఇందులో బిందు, త్రికోణాలు, బహుభుజాలు, వృత్తాలు, రేఖల గురించి పరిశోధనలు సాగుతున్నాయి. దీన్ని మానవ శరీరంలోని కుండలినీ వ్యవస్థతో పోలుస్తారు. శ్రీచక్రానికి శుక్రవారం లలితా సహస్ర నామాలతో పూజ చేస్తే సర్వ అభీష్టాలు తీరుతాయని పెద్దలు చెబుతారు.
లలితా సహస్రనామాలకు మూల దేవత లలిత. శ్రీవిద్యో పాసకులకు కల్పతరువైన ఈ నామావళిని హయగ్రీవుడు అగస్త్యుడికి ప్రసాదించాడు. ఈ నామావళిలో అద్వైత జ్ఞానం ఇమిడి ఉంది. ఛాందోగ్యోనిషత్తులో ఉన్న ‘తత్త్వమసి’ అనే మహావాక్యానికి ప్రతి బింబాలలాగా ఈ నామాలు భాసిస్తున్నాయి.
లలితా సహస్ర నామావళిలో ముఖ్యంగా నాలుగు అంశాల ప్రస్తావనలుంటాయి. అవి- లలితాదేవి బాహ్యస్వరూప వర్ణన, భండాసుర వధ, మంత్రశాస్త్ర సాధన, దేవీ సాక్షాత్కారం. ప్రాపంచిక సుఖాల్లో తేలియాడే నరులు మోక్షం పొందలేరు. అమ్మను ఆశ్రయిస్తే ముక్తి సులభం అవుతుంది. అటువంటివారు అమ్మవారి బాహ్య రూపవర్ణన ద్వారా ఆమె స్వరూపాన్ని గ్రహించగలుగుతారు. ఈ దేవి వాంఛితార్థ ప్రదాయిని కాబట్టి ఇది సుసాధ్యం. మన్మథుడి చితాభస్మం నుంచి ఉద్భవించిన వాడు భండాసురుడు. వినాయకుడు ఆ బూడిదను ముద్దగా చేశాడు. అందులోనుంచి పుట్టిన వాణ్ని చూసి బ్రహ్మ ‘భండ భండ’ (బాగు, బాగు) అన్నాడు. శివుడి నేత్రాగ్ని వల్ల పుట్టిన బూడిదనుంచి పుట్టినవాడు కాబట్టి అతడు తమోగుణుడయ్యాడు. మునుల్ని, మహర్షులను, దేవతలను బాధించాడు. అతడి పరివారం మిక్కిలి బలంగలది. దుర్గా, చండి, కాళిక మొదలైన దేవి అంశలు భండాసురుడి సైన్యాన్ని నిర్మూలిస్తారు. చివరకు అమ్మవారి చేతిలో భండాసురుడు అంతమయ్యాడు. మనలో ఉండే తమోగుణ వినాశనమే భండాసురవధ వృత్తాంత విశేషం. దీన్ని పఠించడంద్వారా మనలోని తమో, రజో గుణాలు నశించి సాత్విక ప్రవృత్తి అలవడుతుందంటారు. వేదాంత సౌధానికి నాలుగు మార్గాలున్నాయి. కర్మ, యోగ, భక్తి, జ్ఞానమార్గాల్లో దేన్ని అనుసరించినా శ్రీ లలితాదేవి కృపకు పాత్రులం కావచ్చు!
శ్రీకుమార
మంగళస్తోత్రం

1.యజ్ఞోపవీతీకృతభోగిరాజో గణాధిరాజో గజరాజవక్రః
సురాధిరాజార్చితపాదపద్మః సదా కుమారాయ శుభం కరోతు

2.విధాతృపద్మాక్షమహెూక్షవాహాః సరస్వతీశ్రీగిరిజాసమేతాః
ఆయుః శ్రీయం భూమిమనంతరూపం భద్రం కుమారాయ శుభం దిశంతు

3.మాసాశ్చ పక్షాశ్చ దినాని తారాః రాశిశ్చ యోగాః కరణాని సమ్యక్
గ్రహాశ్చ సర్వేదితిజాస్సమస్తాః శ్రియం కుమారాయ శుభం దిశంతు


4.ఋతుర్వసంతః సురభిః సుధా చ వాయుస్తథా దక్షిణనామధేయః
పుష్పాణి శశ్వత్సురభీణి కామః శ్రియం కుమారాయ శుభం కరోతు

5.భానుస్త్రీలోకీతిలకోమలాత్మా కస్తూరికాలంకృతవామభాగః
పంపాసరశ్చైవ స సాగరశ్చ శ్రియం కుమారాయ శుభం కరోతు

6.భాస్వత్సుధారోచికిరీటభూషా కీర్తాయా సమం శుభ్రసుగాత్రశోభా
సరస్వతీ సర్వజనాభివంద్యా శ్రియం కుమారాయ శుభం కరోతు

7.ఆనందయన్నిందుకలావతంసో ముఖోత్పలం పర్వతరాజపుత్ర్యాః
స్పృసన్ సలీలం కుచకుంభయుగ్మం శ్రియం కుమారాయ శుభం కరోతు


8.వృషస్థితః శూలధరః పినాకీ గిరీంద్రజాలంకృతవామభాగః
సమస్తకల్యాణకరః శ్రితానాం శ్రియం కుమారాయ శుభం కరోతు

9.లోకానశేషానవగాహమానా ప్రాజ్యైః పయోభిః పరివర్ధమానా
భాగీరథీ భాసురవీచిమాలా శ్రియం కుమారాయ శుభం కరోతు


10.శ్రద్ధాం చ మేధాం చ యశశ్చ విద్యాం ప్రజ్ఞాం చ బుద్ధిం బలసంపదౌ చ
ఆయుష్యమారోగ్యమతీవ తేజః సదా కుమారాయ శుభం కరోతు

ఇతి శ్రీకుమారమంగలస్తోత్రం సంపూర్ణం

#Sree #KumaraMangala #Stotram
పౌర్ణమి తిధి నిర్ణయం-సంశయ నివృత్తి

*-పులివర్తి శ్రీనివాస 'సరస్వతి'*

🙏🏻ఈసారి కార్తీక పౌర్ణమి తిధి 29వ తేదీ మధ్యాహ్నం 12.09 నిమిషాల నుండి మరుసటి రోజు మధ్యాహ్నం 2.03 నిమిషాలు వరకు ఉన్నందున భక్తులు కొంత సందేహం వ్యక్తం చేస్తున్నారు... ఏ రోజున కార్తీక పౌర్ణమి జరుపుకోవాలనేది సందేహం....దీనిని మిగులు...తగులు... అని అంటారు

పెద్దగా కంగారు పడవలసిన పని లేదు...

సహజంగా చంద్రునికి సంబంధించిన పండుగలలో వేద నిర్ణయం ప్రకారం...

రాత్రులకు ప్రాధాన్యత ఉంటుంది...

అంటే దీపావళిని ఖచ్చితంగా ఆరోజు రాత్రి సమయంలో అమావాస్య తిధి కలిగి ఉన్న రోజున మాత్రమే జరుపుకొని తీరాలి...

అదేవిధంగా పౌర్ణమి కూడా...
రాత్రిపూట స్థిరంగా ఉండే తిధిని ప్రామాణికంగా తీసుకుని తీరవలసిందే....

ఇక్కడ ప్రత్యేకించి గమనించవలసిన విషయం ఏమిటంటే... ఇతర పండుగలు జరుపుకుంటున్నట్లు, సూర్యోదయంలో ఉన్న తిధికి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాన్ని మనం మరచిపోవాలి...

మరో ముఖ్య విషయం ఏమిటంటే...కృత్తిక నక్షత్రం పౌర్ణమి తిధిలో కలిగి ఉన్న మాసాన్ని కార్తీక మాసం అంటారనే విషయం మీకు తెలుసనుకుంటున్నాను...

ఈ నక్షత్ర గమనం ప్రకారం కూడా... ఆదివారం రాత్రి పౌర్ణమి తిధితో కృత్తిక నక్షత్రం కలిసి ఉంటుంది..

ఆ విధంగా పౌర్ణమి తిధితో... కృత్తిక నక్షత్రం, సోమవారం ఉదయం 6:06 వరకు మాత్రమే జత కూడి ఉంటుంది...

కాబట్టి కార్తీక పౌర్ణమి ఖచ్చితంగా 29వ తేదీన... ఆదివారం మాత్రమే జరుపుకుని తీరాలి...

మరుసటి రోజు అంటే సోమవారం రాత్రికి జరుపుకుంటే రెండవ చంద్రుడు అవుతాడు... కృష్ణపక్షం వచ్చేస్తుంది...

కొంతమేర, సౌలభ్యత కోసం చెప్పుకోవాలంటే....

ఉపవాస నియమం ఉన్న... ఉండాలనుకునే వారు మాత్రం 29వ తేదీ ఉపవాస నియమాలు పాటించి...రాత్రిపూట ఒత్తులు వెలిగించుకొని, చంద్రదర్శనం చేసుకుని భోజనం చేయవచ్చు...

ఉపవాస నియమం లేని వారు...
దీపాలు మాత్రమే వెలిగించాలనుకునేవారు 29వ తేదీ రాత్రి లేదా 30వ తేదీ ఉదయం ఆరు గంటల లోపు అంటే సూర్యోదయం కాకముందే ఒత్తులు వెలిగించు కోవచ్చు...

30వ తేదీ సోమవారం కూడాను....మరో లెక్క ప్రకారం కార్తీక మాసం 15వ రోజు కూడా అవుతుంది... కాబట్టి వత్తులు వెలిగించాలి అనుకునేవారికి మాత్రం 30వ తేదీ మధ్యాహ్నం లోపు నిరాహారంగా ఉండి...ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయవచ్చును...

అదేవిధంగా నోములు, తోరాలు ఉన్నవారు కూడా 30వ తేదీ సోమవారం మధ్యాహ్నం లోపు ఆ కార్యక్రమాన్ని చేపట్టవచ్చు... పౌర్ణమి తిధి ఉంటుంది కాబట్టి...‌

29వ తేదీ ఆదివారం సాయంత్రం కూడా నోములు, వ్రతాలు చేసుకోవచ్చు ఆక్షేపణ లేదు...

పెద్దగా ఇందులో సందేహించాల్సిన పని లేదు...

మనం భగవంతునికి ఆత్మ నివేదన చేసుకోవాలి... తద్వారా చేసినటువంటి ఏ కార్యక్రమం అయినా భగవంతునికి ప్రీతిపాత్రమే...నిరంతర నామస్మరణతో సర్వేశ్వరుడు మన వెన్నంటే ఉంటారు...

సర్వే జనాః సుజనోభవంతు

సర్వే సుజనాః సుఖినోభవంతు

ధన్యవాదములు🙏🏻
నీకంటూ ఒకరు!

ఈ ప్రపంచంలో నీ కష్టాన్ని గురించి శ్రద్ధగా, సానుభూతిగా వినే ఒక్కరైనా లేకపోవడం అన్నింటికన్నా పెద్ద దురదృష్టం. మన సంతోషాన్ని పంచుకునేవారుంటారు. కానీ మన కష్టాన్ని పంచుకోవడానికి, కన్నీళ్లను తుడిచిపోవడానికి ఎవరు ముందుకొస్తారు? మనం నవ్వుల్ని తోటివారితో ప్రకృతితో పంచుకుంటాం. కానీ మన కన్నీటిని ఎవరు పంచుకుంటారు? దాన్ని పంచుకోవాలంటే అవతలి మనిషికి మధుర హృదయం ఉండాలి. మానవీయ కోణం ఉండాలి. తన హృదయపు పొరల పూలరేకులతో అవతలివారి గాయపడిన గుండెను పదిలంగా పొదువుకుని, గాయాల మరకలను తుడిచి మాధుర్యపు మందులను వేసి, చిరునవ్వుల మృదుగాయంతో సేద తీర్చే ఔషధీయ హృదయం ఉండాలి. ఈ వైద్యానికి ఔషధం అవసరం లేదు. ధనం అగత్యం లేదు. మంచి మనసు ఉండాలి. అవతలివారి గాయాన్ని తనదిగా భావించే స్పందించే మనసు ఉండాలి.

అలాంటి ఒకరు మనకుంటే మన కన్నీరు పన్నీరు అవుతుంది. కష్టం కూడా ఇష్టం అవుతుంది. శ్రీకృష్ణుడి స్నేహితులకు కష్టం లేకపోలేదు. కన్నీరు రాకపోలేదు. నిజానికి అవన్నీ వాళ్లకు ఎక్కువ. కానీ అంత ప్రియమైన స్నేహితుడు ఉన్నాక, అంత మృదువుగా కన్నీరు తుడిచే సహచరుడు ఉన్నాక, అంతగా కష్టం పంచుకునే ఆత్మీయుడు మనకంటూ ఉన్నాక- కన్నీరు కాటు వేయగలదా, కష్టం వేటువేయగలదా, కారు మేఘం కూడా మధురమైన నాట్యం చేయదా? స్నేహాన్ని వెన్నలా పంచుకు తిన్న శ్రీకృష్ణుడు, అటుకుల్ని అమృతంలా ఆరగించిన శ్రీకృష్ణుడు స్నేహితులు, సన్నిహితులు, సహచరుల దుఃఖ బాష్పాల్ని ఆనంద బాష్పాలుగా మార్చకుండా వదులుతాడా, వదలగలడా? పెనుతుపానును గోవర్ధనగిరి కింద ఆటవిడుపు విహారంగా మలచకుండా ఉంటాడా? రహస్యం కళ్లలో, కన్నీళ్లలో లేదు. వాటిని తుడిచే ఆ అమృతహస్తంలో ఉంది. కష్టంలో, దాని పరిణామాల్లో లేదు. వాటిని కమనీయంగా మలచే ఆ హృదయపు సొంపులో ఉంది. శిల ఏదైనా శిలే. దాన్ని శిల్పంగా మలచే నేర్పు శిల్పిలో ఉండాలి. పాపాయిగానా, యువతిగానా, రాజుగానా, సర్పంగానా, సర్వేశ్వరుడిగానా... అదంతా శిల్పి నేర్పు, ఓర్పు. మన కన్నీళ్ల్లకు అర్థాన్ని మార్చే నేర్పు వాటిని  తుడిచే వేళ్లకుండాలి. ఏది ఏమైనా కన్నీళ్లకు తుడిచే ఒక అమృతహస్తం కావాలి. నీకు నేనున్నానంటూ ఆ కన్నీళ్లకు అమృత బిందువులుగా మార్చే కమనీయ హృదయం కావాలి.
ఆ హస్తం మనదే అయితే... అలాంటి హృదయం మనకే ఉంటే... మనమే ఆ శ్రీకృష్ణుడైతే? మన ఇంటికప్పు గోవర్ధనగిరిగా మారదా? మారుతుంది! ఎవరికి ఏం సాయం చేయాలన్నా మనకు ధనం అవసరం లేదు. బలం అవసరం లేదు. మనం... ప్రేమించే హృదయం అయిపోవాలి. మన వేళ్లు కన్నీళ్లను తుడిచే తామర రేకులుగా మారాలి. మాటలు మకరందపు బిందువులుగా జాలువారాలి. లోకంలో ఏ ఒకరికైనా నీకు నేనున్నానంటూ నిలబడగలిగితే లోకమే తోడుగా మన పక్కన నిలబడదా? మన వెనక నడిచిరాదా? ఒక్కరు కోటిమందిగా మనకు గొడుగు పట్టరా?
ప్రేమంటే హృదయానికి ప్రణమిల్లని మనిషి ఉండడు. కన్నీరు తుడిచే చేతికి అంత విలువ ఉంది. అంత శక్తి ఉంది. మనమూ ఆ ‘ఒకరం’ అవుదాం. కన్నీరు తుడుద్దాం. కన్నీరు కార్చేవారు లక్షలమంది ఉంటారు. కానీ, ఆ కన్నీళ్లను తుడిచే చేతులు కోటిలో ఒకరికే ఉంటాయి. శ్రీకృష్ణుడు జీవితమంతా కష్టాలు ఎదురుదెబ్బలతో సహవాసం చేసినా ఏ ఒక్కరోజూ ఆ భావంతో బాధపడిన దాఖలాల్లేవు. ఎవరి సహాయాన్ని, సానుభూతిని కోరిన రుజువుల్లేవు. ఎందుకంటే- ఇతరుల కన్నీటిని తుడవడంలోని సాటిలేని ఆనందాన్ని తెలిసిన ‘శ్రీకృష్ణుడు’ ఆయన.
చెట్టులా బతకాలి!


పాలసముద్రం చిలికితే లక్ష్మితోపాటు కల్పవృక్షం ఉద్భవించిన కథ అందరికీ తెలిసిందే. గోవులకు తల్లి కామధేనువులాగానే, చెట్లకు జనని కల్పవృక్షం కావచ్చు. సృష్టిలో మనిషికంటే ముందే చెట్లు ఉన్నాయంటారు శాస్త్రవేత్తలు.
భారతదేశంలో వైద్యానికి పనికిరాని మొక్క గాని, చెట్టుకాని లేవని ఆచార్య నాగార్జునుడు రుజువు చేశాడంటారు. మనం చెట్లను దైవాలుగా పూజిస్తాం. మరికొన్ని దేశాల్లోనూ ఈ ఆచారం ఉంది.
కొబ్బరి చెట్టును కల్పవృక్షంతో పోలుస్తారు. ఆ చెట్టులో పనికిరానిదంటూ ఉండదు. రైతుకు ఎన్ని కొబ్బరి చెట్లు ఉంటే అంత సంపన్నుడు.
భూమాతకు చెట్లు శ్వాసకోశాలు. ఇలాంటి చెట్లను విచక్షణా రహితంగా నరికి పారేస్తున్నారు. మంగళకరమైన పచ్చదనాన్ని పరిహరించి మరుభూములుగా మార్చుకుంటున్నాం.
ఒకప్పుడు ఇంటింటా వేప, మామిడి వంటి వృక్షాలు ఉండేవి. విశాలమైన ఆవరణలు కనిపించేవి. ఇప్పుడు మనసుల మాదిరే ఇళ్లూ ఇరుకైపోయాయి. కొందరి ఇళ్లలో తులసి మొక్క కూడా కనిపించడం లేదు.
తులసి దేవతాంశ కలిగిన ఔషధంగా చెబుతారు. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులకు తులసి సంజీవని లాంటిది. సత్వరం ఉపశమనం కలిగిస్తుంది.
దేవతా వృక్షాలు, ఔషధశక్తి గల మొక్కలు భగవంతుడు భారతదేశానికి ప్రసాదించిన వరాలు.లక్ష్మణుడి ప్రాణరక్షణ చేసిన సంజీవని మన దేశ అద్భుతం.
సృష్టి రహస్యాన్నంతా తనలోనే దాచుకున్నట్టు చిన్న విత్తనం విచ్చుకుని మౌనంగా మహావృక్షమై సేవలకు సిద్ధమైపోతుంది. పక్షులకు, పాంధులకు స్వాగతం పలుకుతుంది.
ప్రాణుల్లో ఉత్తమ ప్రాణిగా జన్మించిన మనిషి దైవం తరవాత దైవం అంతటివాడు. ఆపదల్లో ఆదుకొనేవాడే దైవం. కాని, బ్రహ్మవంశంలో పుట్టిన రావణుడు లోక కంటకుడైన రాక్షసుడు అయినట్లు, సృష్టి రక్షకుడిగా ఉంటాడని భగవంతుడు భావించిన మనిషి విధ్వంసకుడిగా మారిపోయాడు. విశాల దృక్పథంతో మామిడి చెట్టులా విస్తరించాల్సిన మానవత్వం, స్వార్థంతో కొమ్మలు లేని తాడిచెట్టులా ఎదిగింది. ఇదే మనస్తత్వాన్ని వారసత్వం అందిపుచ్చుకొంటోంది. మనిషితనం నేతి బీరకాయలో నెయ్యి అవుతోంది.
ప్రపంచానికి చెట్టుకు మించిన గురువు లేడు. మౌనంగా ఎదగడమే కాదు, జీవిత పర్యంతం వివిధ సేవలందించి, అది మౌనంగానే తనువు చాలిస్తుంది. చెట్టు మరణించినా, బూడిదయ్యే వరకు మనిషికి ఉపయోగపడుతూనే ఉంటుంది.
చెట్టుకు ప్రాణమే కాదు- మనసు కూడా ఉంటుంది. మనసుతో వినగలిగితే వృక్ష విలాపాలు మనల్ని దుఃఖ వివశుల్ని చేస్తాయి. చెట్టు జీవితమే గొప్ప సందేశం. ఆదర్శానికి చెట్టు మారుపేరు. అది అర్థం చేసుకోగలిగితే, మనిషి చెట్టులా బతకడానికి ఇష్టపడతాడు.
ఒక మనిషి సమాజం కానట్టే, ఒక చెట్టు వనం కాలేదు. వనసీమలు శాంతి నిలయాలు. తపోభూములకు వనాలు ఆలవాలాలు. సృష్టిలోని అందాలకు అడవులు నెలవులు. అదొక ప్రత్యేక ప్రపంచం. చిత్ర విచిత్రాలైన జీవరాసులుంటాయి. ఎలాంటి అపకారం చెయ్యకుండా చూసి ఆనందించాలి తప్ప, వాటి ప్రశాంత జీవితానికి భంగం కలిగించకూడదు. ఒక చెట్టు నరికితే ఎన్నో పక్షులు అనాథలవుతాయి. ఒక అడవి నరికేస్తే ఎన్నో ప్రాణులు ఆధారం కోల్పోతాయి. కుటుంబ పెద్ద మరణిస్తే ఎలాగో, ఒక మహావృక్షాన్ని నేల కూల్చినా అంతే.
చెట్లు ప్రాణవాయువునిచ్చే దేవతలు. ఏ చెట్టూ తన ఫలాలను తాను తినదు. ఉపకార బుద్ధితోనే జీవిస్తుంది. అలాగే మరణిస్తుంది.
మనిషి చెట్టును చూసి బతుకును బాగుచేసుకోవాలి. పరోపకార బుద్ధిని అలవరచుకోవాలి. అప్పుడు ఆ మనిషి మరణించినా స్మృతి వనంలో గంధపు చెట్టుగా చిరకాలం ఉండిపోతాడు!
రెండో పురుషార్థం


‘ధనం కలిగినవాడే బలవంతుడు. ధనం గలవాడే పండితుడు. ధనం సర్వశ్రేయాలకు నిదానం. ధనం లేనివాడి జీవనమేల? అర్థ పరిహీనుడికి  నిరంతరం ఖేదం సంభవిస్తుంది’ అంటాడు నీతిచంద్రికకారుడు. ‘అర్థ’ శబ్దానికి అర్థాలు చాలా ఉన్నా- ధనవాచకంగా లోకంలో రూఢికెక్కింది. పురుషార్థాలు నాలుగింటిలో రెండోది ‘అర్థం’.
మానవులు కోరే సమస్త వస్తు సమూహాన్ని ‘అర్థ’ శబ్దం సూచిస్తుంది. విద్య, భూమి, సువర్ణం, పశువులు, ధన ధాన్యాలు మొదలైనవన్నీ ‘అర్థం’లో భాగమేనన్నాడు వాత్సాయనుడు. ఆర్జనం, వర్ధనం, రక్షణం అనే మూడూ అర్థమనే పురుషార్థ స్వరూపమంటాడు దండి దశకుమార చరిత్రలో. ధర్మాచరణకు, కామ పురుషార్థానుభవానికి అర్థమే కారణమవుతుంది. ధర్మకామాలు రెండూ అర్థానికి రెండు అవయవాలని, అర్థసిద్ధి చేతనే రెండింటి అనుభవం కలుగుతుందని మహాభారతం శాంతిపర్వం చెబుతోంది.
అర్థ ప్రాధాన్యాన్ని గురించి శాస్త్రాలు, ఇతిహాసాలు, కావ్యాలు ఎంతగానో చెప్పాయి. ధనాన్ని న్యాయబద్ధంగా సంపాదించు కోవాలి. ధర్మ పద్ధతిలో అనుభవించాలి. త్యాగబుద్ధితో దానం చేయాలి. మనిషికి వస్తు సంపదల మీద, సుఖభోగాల మీద కోరిక కలుగు తుంది. ఆ కోరిక తీర్చుకునేందుకు తనకు చేతనైన మార్గంలో ప్రయత్నించి వాటిని సాధిస్తాడు. తానను కున్నవి కొన్ని లభించినా, మరికొన్ని సాధించవలసిన కొత్తవి చేరుతూ ఉంటాయి. వాటిని తీర్చుకోవడానికి మనిషి లోకాన్ని సేవిస్తూ, శ్రమిస్తూ ఉంటాడు. తాననుకున్నది సాధించుకోవడం ముఖ్యం కనుక నీతి తప్పి ప్రవర్తించడానికి వెనకాడడు. క్రమంగా అన్ని విధాలా పతనమైపోయే ప్రమాదమూ ఉంది. మన సనాతన సంప్రదాయంలో అర్ధకామాలకు ప్రత్యేకమైన అస్తిత్వం లేదు. మనిషి తాను చేయదలచిన ప్రయాణానికి తన పాదాల సాయం స్వీకరించినట్లు అర్థ కామాలనే తన పాదాల సాయంతో ధర్మం ముందుకు సాగుతుంది.
ధృతరాష్ట్రుడు, అతడి పుత్రులు, పుత్రుల మిత్రులు జీవితానికి అర్థమే పరమార్థమనుకున్నారు. అర్ధాన్ని(రాజ్యాన్ని) తమదిగా నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతో పాండవుల్ని ఎన్నో ఇడుములపాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు తామనుకున్నదాన్ని దక్కించుకోకుండానే పరలోకాన్ని చేరారు. ధర్మరాజుది ధర్మోత్తరమైన జీవితం. పెదతండ్రి రాజ్యం మొత్తానికి తనను యువరాజును చేసినప్పుడు రాజ్యం దక్కిందని అతడు పొంగిపోలేదు. కొంతకాలం తరవాత కుటిలబుద్ధితో ధృతరాష్ట్రుడు అర్ధరాజ్యమే ఇచ్చినప్పుడు కుంగిపోనూలేదు. ధర్మానికి విరుద్ధం కాని అర్థ కాంక్ష అతణ్ని అర్ధరాజ్యస్థితి నుంచి సార్వభౌమ స్థితికి పెంచింది.
ధనానికి దానం, భోగం, నాశం అనే మూడు గతులున్నాయి. ఒకరికి పెట్టక, తాను తినక, దాచి పెట్టిన సంపదకు ఏదో ఒక మార్గంలో నాశనం తప్పదు. ‘సంపాదించిన విత్తానికి త్యాగమే రక్షణ. చెరువులో నిండుగా ఉన్న నీటికి పారుదల ఒక్కటే రక్షణ’ అంటోంది విక్రమార్క చరితం. పాత్రుడికి దానం చేయ మన్నారు. అది ఉత్తమం. తాను ఆర్జించింది అనుభవించడం తప్పు కాదు. కానీ అది మధ్యమమే. ఈ రెండూ జరగకపోతే దొంగలు అపహరించుకుపోతారు. ఇది అధమం. ధనానికి ధర్మం, అగ్ని, రాజు, దొంగలు అనే నలుగురు దాయాదులు. వీరిలో జ్యేష్ఠమైన ధర్మానికి అవమానం కలిగితే తక్కిన ముగ్గురికీ కోపం వస్తుందంటాడొక కవి. దానశీలురు ధనాన్నంతా దానం చేసి సర్వమూ కోల్పోయినా అది అతడికి శోభనే కలిగిస్తుంది. అర్ధ స్వభావాన్ని అర్థం చేసుకుని ప్రవర్తిస్తే ఒక పురుషార్థాన్ని సాధించగలుగుతాం.
శాంతం స్వర్గతుల్యం


మనిషి కొండంత విలువను పోగొట్టేది గోరంత కోపం. కోపం వచ్చిన మనిషి విచక్షణను కోల్పోయి పశువుగా మారతాడు.
కోపాన్ని జయించిన మనిషి గోవిందుడు. జనం అతణ్ని మెచ్చుతారు. అతడి సాంగత్యాన్ని ఇష్టపడతారు. సప్త రుషుల్లో విశ్వామిత్రుడు, జమదగ్ని ఉగ్రస్వభావులు. కశ్యప, అత్రి, భరద్వాజ, గౌతమ, వసిష్ఠులు సాధుపుంగవులు. మునుల్లో దుర్వాసుడు ముక్కోపి.
పుడమిపై పాపభారం పెరిగి, పుణ్యాత్ములు హింసపడుతుంటే భగవంతుడికీ కోపం వస్తుంది. పర్యవసానమే- అవతారాలతో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ నెరపడం. శాంతం మనిషి ముఖాన్ని, రూపాన్ని ఉద్దీపింపజేస్తుంది. ధ్యానంలో ఉన్న బుద్ధభగవానుడి ప్రశాంత వదన దర్శనం మానవుడిలోని కోపాన్ని నశింపజేస్తుంది.
నవరసాల్లో వీరం, భయానకం, బీభత్సం, రౌద్రాలకు కారణం కోపమే! తన కోపమే తన శత్రువు అన్నాడు సుమతీ శతకకారుడు బద్దెన. కోపం మనిషిని ఏకాకిని చేస్తుంది. పనులకు విఘాతం కలిగిస్తుంది. సమాజ జీవి అయిన మనిషికి పదిమంది శ్రేయోభిలాషులుంటేనే సంఘజీవనం సంతోషదాయకం అవుతుంది. పరిస్థితులన్నీ ఎప్పడూ ఒక్కలాగా ఉండవు. ఒక్కోసారి అనుకోని విధంగా, ఆయా విపత్కర సమయాలు మనిషి కోపానికి హేతువులవుతాయి. అలాంటప్పుడే సంయమనం పాటించి, మనసును నియంత్రించుకోవాలని మానసిక శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తారు.
సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తికి అహంకారంతో కోపం వస్తే, అధమ స్థాయి వ్యక్తి కోపానికి ఏమీ చేయలేని నిస్సహాయత కారణమవుతుంది. స్థాయీభేదాలన్నది ఈ శరీరానికే, ఆత్మకు అంటవు అన్న పురాణ వచనాలు మనిషిలోని ఈశ్వరుణ్ని పరిచయం చేస్తూ, సమానత్వ భావనల్ని అంకురింపజేస్తాయి. అందరిలో తనను చూసుకునే వ్యక్తిలో కోపానికి ఆస్కారం ఉండదు.
ప్రకృతికి కోపం వస్తే, అది అన్ని క్రోధాలకన్నా భయంకరమైనది అంటాడు చాణక్యుడు. అదెంతటి నిజమో సోదాహరణంగా రుజువవుతూనే ఉంది!
కార్యార్థి సామ, దాన, భేద], దండోపాయాలతో కార్య సాఫల్యత పొందాలి. కార్యసాధకుడికి కోపం ఉండకూడదు. నొప్పింపక, తానొవ్వక, సమయానికి తగ్గట్టు ప్రవర్తిస్తూ ఫలితం సాధించాలి. సంధి ప్రయత్నాల కోసం శత్రుశిబిరాలకు వెళ్ళడమంటే, పులిగుహలోకి అడుగుపెట్టడంతో సమానం. అక్కడ కవ్వింపులు, వెక్కిరింపులు, కయ్యానికి కాలుదువ్వడం అత్యంత సహజం. దూతలుగా వెళ్ళేవారిలో సదా శాంతి, సామరస్యభావాలు తొణికిసలాడాలి.
ఇళ్లలో నవ్వుతూ శాంత స్వభావాన్ని వ్యక్తం చేసే సభ్యుల ఛాయాచిత్రాలు ఉంటాయే తప్ప, కోపాన్ని ప్రతిఫలించేవి ఉండవు కదా!
శాంతం మిఠాయి అయితే, కోపం కారంలాంటిది. సాధారణంగా ఎవరైనా మిఠాయిని ఇష్టపడినట్టుగా కారాన్ని కోరుకోరు. శుభవార్తలను సంతోషంగా పంచుకోవడానికి మిఠాయినే ఎంచుకుంటారు. శాంతం లేక సౌఖ్యం లేదు అన్నది త్యాగరాజ కృతి. మనసులో కోపం ఉన్న మనిషికి సుఖం, శాంతి ఉండవు. కోపాన్ని అదిమి ఉంచడానికే నవ్వుతూ బతకాలంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు.
కోపం నరక సదృశం, శాంతం స్వర్గతుల్యం అన్నది ఆధ్యాత్మిక ఉపదేశం. ప్రశాంత చిత్తమే మోక్షపథం కనుక మనిషి, ఇతర జీవుల్ని ఈ విషయంలో అధిగమించాలి. ఉత్తమంగా నిలవాలి!
ఏమని ప్రార్థించాలి?


ప్రార్థన (ప్ర+ఆర్థన) అంటే చక్కగా వేడుకోవడం. ఈ వేడుకోలుకు అర్థం, పరమార్థం అనేవి రెండూ బొమ్మ బొరుసు లాంటివి. మనిషి ఈ ప్రపంచంలో సుఖంగా ఉండాలనుకోవడం, అందుకు తగ్గ వెసులుబాటుకోసం ప్రయత్నించడం సహజం. ధర్మంగా ధనం సంపాదించుకోవచ్చు. ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకోవచ్చు.
ధనం ఇంధనంలా దహించుకుపోతుంది. కోరికలు గుర్రాల్లా పరుగులు తీస్తూనే ఉంటాయి. ఈ విషయం ప్రతి మనిషికీ ఏదో ఒక రోజు అర్థం అవుతుంది. అప్పుడు ఈ భౌతికమైన సుఖాలు కేవలం తాత్కాలికమేనన్న ఎరుక కలుగుతుంది. వీటికి మించిన శాశ్వతానందం ఎక్కడుందన్న జిజ్ఞాస మొదలవుతుంది. గుండెలోతుల్లో నుంచి గంగాజలంలా పైకి లేచిన ఆ ఆకాంక్ష, ఒక ఆర్తనాదమై ఒక ఆవేదనారూపమై చెలరేగుతుంది. అదే ప్రార్థన!

దూడను ప్రసవించగానే గోమాత తన బిడ్డను ఆప్యాయంగా నాలుకతో నిమిరినట్టు, భగవంతుడు భక్తులను లాలించి, పాలిస్తాడు. పరమ ప్రేమస్వరూపుడైన భగవంతుడికి తన సంతానంపై ఉన్న అనంతమైన ప్రేమానురాగాలను వరాల రూపంలో అందిస్తాడు.
సాత్వికులైన ధ్రువుడు, ప్రహ్లాదుడు శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించగానే భౌతికమైన వాంఛలు తొలగి భగవంతుడి పాదసేవనం అనే పరమానందం కావాలని అడిగారు. తపస్సు చేసిన హిరణ్యకశిపుడు, రావణుడు అధికారం, ఆధిపత్యం కోరారు! కోరి తమ వినాశాన్ని వారే కొని తెచ్చుకున్నారు. పరుల సుఖాల్నే మన సుఖమని, విశ్వశ్రేయమే మనకూ శ్రేయోదాయకమని, బుద్ధిగా జీవించాలని త్రికరణ శుద్ధితో ఆ పరమాత్మకు చేసే విన్నపమే ప్రార్థన! అదే మన ఆధ్యాత్మిక ప్రగతికి తొలి సోపానం.
భగవంతుణ్ని సేవించే భక్తులను నాలుగు తెగలుగా చెబుతారు- ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. ఈ నలుగురిలో ఆయనకు చాలా దగ్గరివాడు జ్ఞాని అని గీతాచార్యుడు సెలవిచ్చాడు.
భగవంతుడు అన్నీ ఇచ్చాడు. అయినా, ఏదో తెలియని ఆరాటం గుండెల్లో ఆరడి చేస్తూనే ఉన్నది. కారణం ఏదో ఒకమూల స్వార్థపిశాచం పీడించడం వల్లే అలా మనసు అల్లాడుతూ ఉంటుంది. మనం చేయవలసినదేదో శక్తివంచన లేకుండా, సక్రమంగా చేస్తే చాలు... తక్కినదంతా ఆయనే చూసుకుంటాడు. ఆ మాట కూడా గీతాచార్యుడు చాలా స్పష్టంగానే చెప్పాడు. అయినా అజ్ఞానం, అహంకారం, మమకారం... ఈ మూడూ ఏకమై మనల్ని పెడదారికి ఈడుస్తూ ఉంటాయి.
అలా జరగకుండా మనసును నిర్మలంగా ఉంచమని, ప్రపంచాన్ని ప్రేమగా చూడగల హృదయ సౌందర్యాన్ని ప్రసాదించమని, పరోపకారం వైపు బుద్ధిని మరల్చమని, మాటలకందని మౌనభాషలో భగవంతుణ్ని వేడుకోవడమే నిజమైన ప్రార్థన. ఆ ప్రార్థన సన్నని వెలుగై మన జీవితాలను గమ్యంవైపు నడిపిస్తుంది. ‘సర్వేజనాః సుఖినో భవంతు’ అనే ఒక గొప్ప ప్రార్థనను వేదం ప్రపంచానికి అందించింది. అదే మన జీవితాలకో దారిదీపమై వెలుగు చూపాలని అర్థించాలి. అదే మనం చేయవలసిన ప్రార్థన!
విదుర నీతి


జీవితం ప్రశాంతంగా గడపాలని ప్రతి వ్యక్తీ కోరుకుంటాడు. సమాజంలో శాంతి ఉన్నప్పుడే ప్రజలు సుఖంగా ఉంటారు. ఇందుకు నీతినియమాలు తోడ్పడతాయి. నీతి తప్పిన సమాజంలో అశాంతి నెలకొంటుంది. మన సాహిత్యం లోక క్షేమాన్ని కోరుకొంటుంది. భారతీయ ధర్మశాస్త్రాలు మానవుడు ఎలా జీవిస్తే సమాజానికి మేలు జరుగుతుందో చెబుతాయి. ఈ గ్రంథాలను రచించినవారు మహర్షులే! యుగధర్మాలను బట్టి ఈ ధర్మశాస్త్రాలు విభిన్న మార్గాలను మనకు సూచిస్తాయి. కృతయుగంలో మనుధర్మ శాస్త్రం, త్రేతాయుగంలో గౌతమస్మృతి, ద్వాపరంలో శంఖలిఖితుల స్మృతి- ప్రామాణికాలు. కలియుగంలో పారాశర్య స్మృతిని పాటించాలని రుషులు భావించారు. మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని నీతుల గురించి అభిప్రాయాలూ మారుతున్నాయి. కొన్ని మాత్రం యుగాలు మారినా మారవు.
ఎప్పటికీ సమాజానికి ఉపయోగపడే నీతులు చెప్పినవారిలో విదురుడు ముఖ్యుడు. ఒక దాసికి,  వ్యాసుడికి జన్మించిన విదురుడు ధృతరాష్ట్రుడికి తోడుగా ఉంటూ హితోక్తులు చెబుతూ, పాండవుల మేలు కోరుతూ ఉండే కృష్ణభక్తుడు.
రాయబారానికి శ్రీకృష్ణుడు వెళ్ళినప్పుడు ఎవరి ఇంట్లోనూ భోజనానికి అంగీకరించడు. విదురుడి ఆహ్వానాన్ని మన్నించి అతడి ఇంటికి మాత్రం వెళ్ళాడు. విదురుడు భక్తితో స్వయంగా తానే కృష్ణుడికి ఆహారం తినిపించాడు. భక్తి పారవశ్యంతో ఒడలు మరచి, అరటిపండు తొక్క ఒలిచి దాన్నే కృష్ణుడి నోటికి అందించి, లోపలి పదార్థాన్ని పారవేశాడు! విదురుడి నిర్మల భక్తికి ఇది నిదర్శనం.
సంజయుడు పాండవుల వద్దకు రాయబారానికి వెళ్ళివచ్చిన తరవాత, ధృతరాష్ట్రుడివి అన్నీ అధర్మ కృత్యాలేనని అధిక్షేపించాడు. అప్పటి నుంచి మానసిక క్షోభతో ధృతరాష్ట్రుడికి నిద్రపట్టలేదు. విదురుణ్ని పిలిచి మంచి మాటలతో తన మనసుకు ప్రశాంతత కలగజేయమన్నాడు. విదురుడు ముందుగా నిద్ర పట్టనివాళ్లెవరో చెబుతాడు. ‘బలవంతుడితో విరోధం పెట్టుకున్న వాడికి, సంపద పోగొట్టుకున్న వాడికి, కాముకుడికి, దొంగకు నిద్ర ఉండదు’ అని అంటాడు. విదురుడి నీతులకు ఏ యుగంలోనైనా విలువ అలాగే చెక్కుచెదరకుండా ఉంటుంది!
జ్ఞానులు ఎలా ప్రవర్తిస్తారో, మూర్ఖులు ఎలా ఉంటారో విదుర నీతులనుబట్టి చక్కగా తెలుసుకోవచ్చు. తనకు అందనిదాన్ని గురించి ఆరాటపడనివాడు, పోయినదాన్ని గురించి విచారించనివాడు, ఆపదలో సైతం వివేకం కోల్పోనివాడే జ్ఞాని. అధికమైన సంపద, విద్య ఉన్నప్పటికీ ఉత్తముడు వినయంగానే ఉంటాడు.
మూర్ఖుడు వెంటనే చేయవలసిన పనిని అడుగడుగునా అనుమానిస్తూ, ఆలస్యంగా చేస్తాడు. అతడు తాను తప్పుచేసి, ఎదుటివాణ్ని నిందిస్తాడు. ధనం లేకుండా కోరికలు పెంచుకోవడం, సమర్థత లేకపోయినా ఇతరులపై మండిపడటమనే ఈ రెండూ మనిషిని కృశింపజేస్తాయి.
‘మధుర పదార్థం నలుగురికీ పంచకుండా ఒక్కడే భుజించకూడదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక్కడే కూర్చుని బయటపడే ఉపాయం ఆలోచించకూడదు... అందరూ నిద్రపోతుంటే ఒక్కడే మెలకువతో ఉండకూడదు. మానవుడికి ఆరు సుఖాలున్నాయి. అవి ఆరోగ్యం, ధన సంపాదన, ప్రియురాలైన భార్య, చెప్పినట్లు వినే పుత్రుడు, సంపాదనకు పనికివచ్చే విద్య!’ అని విదురుడు విశదీకరించాడు.
సమాజానికి ఎప్పటికీ పనికొచ్చే విధంగా ఉపదేశించిన విదురనీతులు అజరామరాలు. అందుకే భారతానికి ‘ధర్మశాస్త్రం’ అనే పేరు వచ్చింది!
ఎది సత్యం?

అందరూ నిజాన్ని, నిజాయతీని ఇష్టపడతారు. కాని, అది ఇతరుల్లో చూడాలనుకొంటారు. తమకు వర్తించదనుకొంటారు కొందరు. ‘సత్యమేవ జయతే’ సూత్రం పాటిస్తున్నామంటూ అబద్ధం తప్ప పొరపాటునైనా నిజం చెప్పరు కొంతమంది.
అపనమ్మకానికి పునాది అబద్ధమే. అబద్ధాలు చెప్పడం కూడా అపరాధమే. ఆధ్యాత్మిక దృష్టిలో అసత్యం మహా పాపం. ఎందుకంటే, అసత్యానికి, మోసానికి ఆట్టే తేడా లేదు. మోసానికి పెట్టుబడి అబద్ధాలే.
సత్యహరిశ్చంద్రుడు సత్యదీక్ష కోసం ఎన్ని కష్టాలైనా పడ్డాడు కాని, ఒక్క అబద్ధం కూడా ఆడలేదు. ఇప్పటి కాలంలో కొందరు ఒక్క నిజం కూడా చెప్పరు. దొంగ సాక్ష్యాలన్నీ అబద్ధాల సంపుటులే.
ఆధ్యాత్మిక రంగంలో ‘ఏది సత్యం?’ అనే ప్రశ్నకు ఎంతో ప్రాధాన్యం ఉంది. దానికి అనుబంధ ప్రశ్న ‘ఏది నిత్యం?’. ఏది సత్యమో అది నిత్యం అంటారు వేదాంతులు. భగవంతుడే సత్యస్వరూపుడంటారు. ‘సత్యమేవ జయతే’- అంటాయి ఉపనిషత్తులు. అంటే, దైవ సంకల్పానికి విజయం నిశ్చయం! వాక్కులతో ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆత్మకు అసలు నిజం తెలుసు. మనోవేగం కన్నా దైవజ్ఞాన వేగమే చాలా ఎక్కువంటారు. జరిగినవి, జరుగుతున్నవి మాత్రమే మనిషికి తెలుసు. జరగబోయేదీ భగవంతుడికి తెలుసంటారు. దీనినే త్రికాల జ్ఞానంగా చెబుతారు. మహర్షులు త్రికాల వేదులు. అందుకే వారు దైవ సమానులు. భగవంతుడితో మహర్షులు, దేవర్షులు పూజలందు కొంటారని పురాణ ఇతిహాసాల్లో చదువు తుంటాం. లోకకల్యాణం తప్ప వారికి ఇతర స్వార్థాలు ఉండవు. వసిష్ఠ, కశ్యప, నారద మునీంద్రులు ఈ కోవకు చెందినవారు.
‘సత్యం’ అనే ఇరుసు మీదనే లోకాలు పరిభ్రమిస్తున్నాయి. సుదర్శనమే లోకచక్రం. స్థితి కారకుడైన విష్ణువు సుదర్శనంతోనే లోకకంటకులను సంహరిస్తాడంటారు.
ఆగ్రహంలోనూ నిగ్రహం చూపగలవారే మహర్షులు. విశ్వా మిత్రుడు ఆగ్రహంతో తన నూరుగురు కుమారులను అంతం చేసినా, వసిష్ఠుడు విశేషమైన నిగ్రహం చూపాడు. అందుకే ఆయన బ్రహ్మర్షి కాగలిగాడు.
ప్రకాశవంతంగా సూర్యుడు వెలిగే వేళ మబ్బు కప్పినంతలో సూర్యుడు లేడనుకోగలమా? మనం మాయ ప్రభావంలో ఉన్నామని గ్రహించగలిగితే మనం చూసేది సత్యం కాదని తెలుస్తుంది. ‘ఏది సత్యం’ అనే ప్రశ్నతో శోధన చేస్తే, మన కృషి తీవ్రతను బట్టి సమాధానం దొరుకుతుంది.
మమకారమే ఆధ్యాత్మిక ప్రయాణానికి అడ్డుగోడ. అభిమన్యుడి మరణంతో కుంగిపోతున్న అర్జునుడికి సత్యబోధ చేస్తాడు శ్రీకృష్ణుడు.  చంద్రుడి కుమారుడిగా అభిమన్యుణ్ని చెబుతాడు. మరణానంతరం అభిమన్యుడితో అర్జునుడు సంభాషించే సన్నివేశాన్ని కృష్ణుడు కల్పించినప్పుడు- ‘నీవెవరో నాకు తెలియదన్నా’డంటారు. అర్జునుడి భ్రమ తొలగిపోవడం అక్కడ ప్రధానాంశం.
కేవలం పరమాత్మ ఒక్కడే సత్యం, నిత్యం. అందుకే గీతాకృష్ణుడు ‘మరే ఆలోచనలూ లేకుండా నన్ను మాత్రమే ఆశ్రయించు. నిన్ను రక్షిస్తాను’ అంటాడు. దేని నుంచి రక్షణ? అసాధ్యమైన అష్టవిధ మాయల ప్రభావం నుంచి అని మనం గ్రహించాలి.
గీతాబోధ అర్జునుడి కొరకే అనుకోకూడదు. మనందరికీ అని అర్థం చేసుకుంటే గీతా  ప్రయోజనం సిద్ధిస్తుంది.
సత్య దర్శనం!

నమ్మకం ఒక అయస్కాంత శక్తి. ‘దేవుడు వున్నాడు’ అన్న విశ్వాసమే ఆధ్యాత్మిక కార్యక్షేత్రంలో ఎంతటి ఘనతనైనా సాధించేలా చేస్తుంది.ఏ కార్య నిర్వహణలోనైనా సమష్టితత్త్వం, పరస్పరాధారిత విధానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ‘విపత్కర పరిస్థితులు’ ఏర్పడినప్పుడు జాతి మొత్తంగా ఒక్కతాటిపై నిలిచి వాటిని అధిగమించాలి. మనిషికి ఆరోగ్యవంతమైన జీవితమే ఉన్నతం. క్రమశిక్షణాయుతమైన జీవితం వ్యక్తిగత, సమష్టి అలవాట్లు, ఆలోచనలు, కార్యాచరణలలో నిబద్ధతను పాటించడం వంటి వాటివల్ల మాత్రమే అది సాధ్యపడుతుంది. కట్టుబాట్లతో కూడిన అలవాట్లను సమాజంలో ప్రతిష్ఠించేందుకు సనాతన సంప్రదాయం వేదమంత్రాలను, సూక్తాలను వాడుకున్నది. వీటిలో శాంతిమంత్రాలు ప్రముఖమైనవి. వాటిలో ‘ఐతరేయ ఉపనిషత్తు’లోని ‘శాంతిమంత్రం’ ఒకటి. ‘మంత్రం’ అంటే మననం చేసేవారిని రక్షించేది.

ఓం వాజ్ఞ్మే మనసి ప్రతిష్ఠితా/ మనోమే వాచి ప్రతిష్ఠితా/ మావిరావీర్మ ఏధి/ వేదస్య మ ఆణీస్థః/ శ్రుతం మే మా/ ప్రహాసీరనేనా ధీతేనాహో రాత్రాన్‌/ సందధామృతం వదిష్యామి/ సత్యం వదిష్యామి! తన్మావవతు/ తద్వక్తారమవత్వవతు/ మామవతు వక్తారమవతు వక్తారమ్‌/ ఓం శాంతిః శాంతిః శాంతిః’. ‘నా వాక్కు మనసులో ప్రతిష్ఠితమగుగాక. మనస్సు వాక్కులో ప్రతిష్ఠితమగుగాక’. ఇక్కడ వాక్కును వ్యష్టిగా తీసుకుంటే మనస్సు సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. వాక్కు, మనస్సు ఏకమవడం వల్ల కార్యం ప్రకాశితమవుతుంది.

‘ప్రకాశమవడం’ అంటే ‘సాక్షాత్కారమవడమే’. ఏదైతే ప్రకాశిస్తుందో అదే జ్ఞానం, అదే పరమాత్మ సాక్షాత్కారం. అలా సాక్షాత్కరించిన పరమాత్మను, ‘ఓ పరమాత్మా! నాలో ప్రకాశించెదవుగాక’ అని సాధకుడు వేడుకుంటున్నాడు. అలా ప్రార్థించడం అంటే ‘సత్యం బోధపర్చుకోవటమే’. వేదం అంటే తెలుసుకోవడం.

ఏది తెలుసుకోవడానికి యోగ్యమైందో, దేనివల్ల మన సమాజానికి శ్రేయస్సు కలుగుతుందో దానిని తెలుసుకోవడమే వేదజ్ఞానం. ‘ఆ శ్రేయస్కరమైన ఆలోచనలు నిరంతరం మనస్సులో నిలిచి పోవాలని’ సాధకుడు ప్రార్థిస్తున్నాడు. ‘దేనికి స్పందిస్తామో, దేనిని ఆలోచిస్తామో, దేనిని పలుకుతామో, దేనిని ఆచరిస్తామో అది శ్రేయస్కరమైందై నన్ను వీడకుండుగాక’. దేనిని ‘మనసా వాచా కర్మణా’ నమ్ముతామో దానిని స్మరిస్తాం. దేని స్మరణ మన ప్రగతికి, సుగతికి ఉపకరిస్తుందో దానిని మాత్రమే వినాలని, స్మరించాలని సాధకుడు భావిస్తున్నాడు.

‘నేర్చుకున్న దానిని నేను రేయింబవళ్ళూ యోచించెదనుగాక. బుద్ధికి గోచరమైన వ్యావహారిక సత్యాన్ని పలుకుదునుగాక. పారమార్థిక సత్యాన్ని పలుకుదును గాక’. ‘ప్రపంచావిష్కరణలో ముందుగా ఋతం, సత్యం ఉత్పన్నమైనవని’ శాస్ర్తాలు చెబుతున్నాయి. ‘ఋతం’ అంటే ‘ప్రాకృతిక నియమాలు’. ఇది వ్యావహారిక సత్యం. దేశకాలమాన పరిస్థితులకు అతీతంగా సర్వకాలీనం, సర్వజనీనం, సహజం, అవ్యక్తమైన ప్రకృతే సత్యంగా పిలువబడుతుంది. అదే భగవంతుడు. ఇది పారమార్థిక సత్యం. ‘సూర్యుడు ప్రతి నిత్యం తూర్పున ఉదయిస్తాడు, పశ్చిమాన అస్తమిస్తాడు’. ఇది వ్యావహారిక సత్యం. కానీ, నిజానికి సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. ఇది పారమార్థిక సత్యం. ప్రాకృతిక స్పందనల ద్వారా పొందిన విజ్ఞానం ధర్మాచరణకు దోహదపడితే ‘సత్యదర్శనం’ అవుతుంది.

సుప్తచేతనాత్మకమైన మనసుకు ఇచ్చుకునే సూచనలు ఎంత బలంగా ఉంటే మన ఆశయం అంత బలంగా సిద్ధిస్తుంది. చేతనాత్మక, సుప్తచేతనాత్మక మనసుల మధ్య పరస్పర సంబంధాలు ఎంత బలపడితే అంత ప్రభావవంతంగా కార్యావిష్కరణ జరుగుతుంది. నిజానికి ప్రతి ఆలోచనా ఒక కారణం కాగా ప్రతి స్థితీ ఒక కార్యం. ఆకృతి ఉంటేనే దానికి ప్రయోజనం ఉంటుంది. మానసిక ప్రపంచంలో రూపం ఏర్పడితేనే అది దాని కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది. నిజానికి మానసిక ప్రపంచంలో ఒక రూపం ఏర్పడాలంటే అది నిజంగా ఉన్నట్లుగా మనం భావించాలి. ఎంత బలంగా భావించి, దర్శించగలిగితే ఆశయసాధనకు అంత దగ్గరగా వెళతాం. ‘నాకిది కావాలని’ కోరుకుంటాం. నిజంగా అది సాకారం కావాలంటే మన ప్రయత్నం పరిపూర్ణంగా ఉండాలి. కల్పన, నమ్మకం రెండు రెక్కలున్న పక్షి అనుకొంటే, ఆ ఊహనే మనం ‘ఆశయం‘ అనుకోవచ్చు. ఇది బలంగా ఉన్నచోటనే లక్ష్యం నిలుస్తుంది. మంత్రార్థాన్ని భౌతికంగా కాకుండా, దాని అంతరంగాన్ని గ్రహించి నియమిత అంతరాలలో ఆయా సూచనలతో అంతర్మనస్సును బలోపేతం చేయడం వల్ల ఎంతటి లక్ష్యాన్నయినా, ఏ వ్యాధినైనా జయించగలం.
నమ్మకమే అత్యున్నత శక్తి!
‘మననం చేయడం’ అంటే నిరంతర స్మరణ. దానివల్ల అంతర్మనస్సు అవసరమైన జ్ఞానాన్ని పొందుతుంది. బలమైన సంకల్పంతో కూడిన జ్ఞానం సత్కార్యాన్ని ఆవిష్కరిస్తుంది. వీటినే ‘ఇఛ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు’గా చెబుతారు. ఇవే వాక్కుకు, మనస్సుకు, శరీరానికి (మనస్సు ఆలోచనకు, వాక్కు జ్ఞానానికి, శరీరం ఆచరణకు) ప్రతీకలుగా నిలుస్తాయి. శ్రద్ధతో ప్రార్థించడం అంటే ఇనుముకు అయస్కాంత శక్తిని సమకూర్చడం వంటిది. ఈ అయస్కాంత శక్తినే నమ్మకం (విశ్వాసం) అంటున్నాం. ‘నమ్మకం’ ఉంటేనే ఏదైనా సాధించగలం. దీనిని కోల్పోతే అనామకులుగా మిగిలిపోతాం. భావన, అనుభూతి, శక్తి, సామర్థ్యం, ప్రేమ, సౌందర్యం... వీటి అంతరంగ శక్తిని ఊహించి, వినియోగించుకోగలిగితే అత్యున్నత ఫలితాలు ఆవిష్కారమవుతాయి. ఇది ఫాంటసీ కాదు. ఉదా॥కు మనం ఆక్సీజన్‌-హైడ్రోజన్‌లను 1-2 నిష్పత్తిలో కలిపితే నీరు వస్తుంది. ఇదేదో యాదృచ్ఛికం కాదు. ఎన్నిమార్లు కలిపినా ఆ మిశ్రమం అలా నీటినే ఇస్తుంది.
మీరు ఏ ఊర్లో ఉన్నా, మీ ఇంట్లోనే ఉంటూ, మీకు నచ్చిన సమయములో, మీ మొబైల్ ఫోన్ ద్వారా భగవద్గీతను ఉచితముగా నేర్చుకునేందుకు వీలుగా భగవద్గీత 18 అధ్యాయములు, 700 శ్లోకములను అర్ధాలతో సహా రికార్డ్ చేసి వెబ్ సైట్ లో పెట్టాము. మీరు చేయవలసిందల్లా http://learnbhagavadgitaonline.org అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి, మీ భగవద్గీత పుస్తకమును తెరచి, 1వ అధ్యాయము 1వ శ్లోకము నుండి మొదలు పెట్టి, రోజుకి పది శ్లోకములను అర్థాలతో సహా నేర్చుకోండి. 70 రోజులలో మీరు భగవద్గీత 700 శ్లోకములను చదవగలుగుతారు. భగవద్గీతను చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. ఎంతోమంది భగవద్గీతను నేర్చుకోవాలి అనుకున్నా నేర్పించేవారులేక నేర్చుకో లేకపోతున్నారు. దయచేసి ఈ మెసేజ్ ను వాళ్ళందరికీ అందేటట్టు చేయండి.
మృదు భాషణం


నిండైన నది నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది. పిల్లకాలువలుగా చీలి గులకరాళ్ల మీద ప్రవహిస్తున్నప్పుడు గలగలమంటూ శబ్దాలు చేస్తుంది. నీళ్లతో నిండుగా ఉన్నప్పుడు కుండ తొణికిసలాడదు. ఇలాంటి ఉపమానాలు మనిషికి ఎన్ని చెప్పినా మాట్లాడాలనుకున్నది అతడెప్పుడూ మాట్లాడటం మానడు. భావ వ్యక్తీకరణకోసం భగవంతుడు అతడికిచ్చిన మహత్తరమైన శక్తి- మాట. సృష్టిలో మరేజీవిలోనూ అది కనబడదు. మనసులోంచి వచ్చేదిలా ఆ మాట ఉండాలి. మంచి అభిప్రాయం అనిపించాలి. అందరినీ ఆలోచింపజేయాలి. ప్రయోజనం కలిగించగలదై ఉండాలి.
గీతలో భగవంతుడు మనిషికి ఆహ్లాదకరంగా మాట్లాడటం నేర్చుకొమ్మని చెబుతాడు. రెచ్చగొట్టి, ప్రలాపాలుగా అనిపించే మాటలు వద్దన్నాడు. అటువంటి మాటలు తనకు వినిపించిన తక్షణమే స్పందించవద్దన్నాడు. సత్యాన్ని ప్రతిబింబించేవి, ప్రియమైనవి, ఎదుటి వ్యక్తి హితాన్ని కోరేవిలా మాటలుండాలన్నాడు. ఆ విధంగా మాట్లాడగలవాడిని ‘వాక్‌ తపస్వి’ అన్నాడు. మృదుభాషణం మనుషులందరిలో  కనిపించాల్సిన లక్షణంగా శాస్త్రాలన్నీ గుర్తించాయి. వేదాంతి అరిస్టాటిల్‌ విశ్వసనీయత గోచరించేలా మాట్లాడితే అవి మానవ స్వభావాన్నే మార్చగలవంటాడు. పరస్పరం అవిశ్వాసం కలిగించే మాటలే మనుషులొకరినొకరు చూసి భయపడటానికి కారణ మన్నారు గాంధీజీ.

మనిషి తనను తాను సమర్థించుకునేందుకు మాట్లాడు తున్నానని ఎవరికీ అనిపించనీయ కూడదు. అదే ఉద్దేశమైతే అతడు మాట్లాడకుండా ఉండటమే మంచిది. కొన్ని మాటలు వింటున్నప్పుడు మధురమైనవిగా, సందేశమేదో అందజేస్తున్నవిగా అనిపించినా అందులో అంతర్లీనంగా విషం, వ్యర్థాల వంటివి దాగి ఉండవచ్చు. అనుభవంతో కానీ అర్థంకాని విషయమది. ఆ విధంగా మాట్లాడే మనుషుల్ని నీతిచంద్రిక కర్త చిన్నయసూరి పయోముఖ విషకుంభాలన్నాడు.
ఆచితూచి మాట్లాడటం అందరికీ చేతకాని అభ్యాసం. మాట నేర్పు ఉన్నవారినే మహారాజులు రాయబారులుగా, మహామంత్రులుగా నియమించుకునేవారు. రామాయణంలో హనుమంతుడు, భారతంలో విదురుడు, సంజయుడు, కృష్ణరాయల అమాత్యుడు తిమ్మరుసు... అటువంటి మాటకారులే.
మంచి ముత్యాలనిపించే మాటలెప్పుడూ మెరుస్తూనే ఉంటాయి. అవి పండితులకైనా పామరులకైనా శాశ్వతంగా వినపడతాయి. వ్యక్తులు, వ్యవస్థలను విమర్శించడమొక్కటే లక్ష్యం కాకుండా, ఛలోక్తులతో నర్మగర్భంగా, లోకజ్ఞానాన్ని ప్రస్ఫుటించే పొడుపు కథలు ఉపమానాలతో మాట్లాడిన మాటలు, ఆత్మవిమర్శకు అవకాశమివ్వటమే కాక, కాలపరీక్షకు సైతం నిలబడతాయి. శబ్దాడంబరంతో పాండిత్యాన్ని ప్రదర్శించాలనుకుంటే పొరపాటే అవుతుంది. వాగ్ధాటితో నిజాన్ని వక్రీకరించేవారు వక్తలనిపించుకోలేరు. నిజాన్ని క్రమబద్ధీకరించేందుకు చెప్పేవైనప్పుడు మాటలు వ్యక్తిత్వానికి వన్నెతెస్తాయి.
భర్తృహరి ‘వాగ్భూషణమే సుభూషణం’ అని నిర్ద్వంద్వంగా చెబుతాడు.
మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడకపోవటమూ మహాపరాధమే. ధృతరాష్ట్రుడు అవసరమైనప్పుడు నోరు మెదపకుండా ఉండటం మహాభారత యుద్ధానికి ముఖ్యకారణమని విశ్లేషకుల అభిప్రాయం.
వాక్‌ స్వాతంత్య్రంతో మనిషికి వచ్చే స్వతంత్రం ప్రత్యేకమైనదైనా నిజాన్ని నిర్భయంగా చెప్పడానికే అది ఉన్నదని మనుషులు గ్రహించాలి. మాటకు మంత్రానికుండే ప్రభావం ఉంటుంది. అది వరమిచ్చేదిలా ఉండాలి కానీ శాపమిచ్చేలా ఉండకూడదు. మనుషులను కలపాలి కానీ విడదీయకూడదు. ఆ గ్రహింపు ఉంటే మనుషులంతా మంత్రద్రష్టలవుతారు!
ధర్మ నిధులు


ధర్మ స్వరూప నిరూపణం, కర్తవ్య నిర్వహణం, భవబంధ విమోచనం అనే మూడు అంశాలూ మానవ ధర్మానికి మూడు స్కంధాలు. వీటిలో మొదటిదానికి మహాభారతం, రెండోదానికి రామాయణం, మూడోదానికి భాగవతం దర్పణాలుగా పండితులు భావిస్తారు. భారతీయ సంస్కృతికి పట్టుగొమ్మలు, జీవధారలూ అయిన గ్రంథరాజాలు ఇవి. మానవ జాతికి సంస్కారాన్ని అందించే ఈ గ్రంథాల్లో సనాతన ధర్మం ప్రతిష్ఠితమై ఉంది. ఈ మూడు గ్రంథాల గమ్యం వేదప్రతిపాదనం. వేదమనే అంతర్యామితత్త్వానికి దేహేంద్రియ మానసాల్ని కల్పించి మూర్తిమత్వాన్ని పరికల్పించడమే ఈ మూడు గ్రంథాల పరమార్థం. వేదవేద్యుడైన పరమ పురుషుడు నరుడిగా ఎలా ప్రవర్తించాడో తెలిపేది రామాయణం. వేదాన్ని సమగ్రంగా మథనం చేసి ధర్మామృతాన్ని ఇచ్చింది మహాభారతం. భౌతిక జీవితం పొందిన జీవుడు నారాయణుడిగా వెలిగి, వెలిగించడానికి భావైక గమ్యమైన సులభ భక్తి మార్గాన్ని ఉపదేశిస్తుంది భాగవతం. వీటిని ప్రసాదించిన వాల్మీకి, వ్యాస మహర్షులు వేదావతారమూర్తులు.
సమస్త విశ్వంలో వ్యక్తి తాదాత్మ్యం చెందే స్థితిలో రామాయణ మహాకావ్యం ఆదికవి హృదయం నుంచి ఆవిర్భవించింది. తపస్వి వాల్మీకి సర్వమానవ జగత్కల్యాణానికి ఉపకరించే సద్గుణ సముపేతుడైన వ్యక్తి ఉన్నాడని నారదుడి ద్వారా తెలుసుకొని ఆ వ్యక్తి దృక్పథాన్ని ఉదాత్త రీతిలో హృదయాకర్షక కథనంగా చెప్పడానికి సంకల్పించాడు. ఈ భూమ్మీద నదులు, పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం లోకంలో రామాయణం స్థిరంగా నిలిచి ఉంటుందని బ్రహ్మ వాల్మీకిని ఆశీర్వదించినట్లుగా పండితుల వాక్కు. మంచిచెడుల సంఘర్షణ శ్రీరాముడి ప్రయాణం వెనక అంతర్లీనంగా గోచరిస్తుంది. దైవాంశను తనలోనే దాచుకొని విశ్వప్రేమ సుగంధాన్ని, ప్రేమను, కరుణను చుట్టూ ఉన్న ప్రపంచానికి పంచిపెట్టిన ధీరోదాత్తుడు శ్రీరాముడు. జీవితంలో అన్ని కోణాలకూ వర్తించిన శాశ్వత విలువలు కలిగిన విశ్వకావ్యం రామాయణం.
కృష్ణ ద్వైపాయనుడనే వ్యాసుడు భారతీయ సంస్కృతీ ప్రాసాదానికి మూలస్తంభం. వేదాలు బోధించే ధర్మాధర్మాల్ని సామాన్య మానవులకు అర్థమయ్యేటట్లు చెప్పడం కోసమే కౌరవ పాండవ కథా కథన వ్యాజంతో మహాభారతం రచించాడు. అందుకే భారతం పంచమ వేదంగా ప్రశంసలందుకొంది. మహాభారతం విజ్ఞాన సర్వస్వం. వ్యాసమునీంద్రులు దర్శించిన భారతం భారతీయ తత్వ సమగ్ర దృష్టి. విశ్వవాఙ్మయంలో ఇంతగా మానవ హృదయాన్ని మధించి వివిధ రీతుల్లో విస్తృతంగా చిత్రించిన కావ్యం మరొకటి లేదు. అన్ని కాలాలకు, అన్ని దేశాలకు ఉపయోగించే ధర్మాలు భారతంలో ఉన్నాయి. బహువిధ సంకీర్ణమైన మానవత్వ భావగతుల్ని అద్భుతంగా చిత్రించింది భారతేతిహాసం.
భగవంతుణ్నీ భక్తుణ్నీ సంధానించేది భాగవతం. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక తత్త్వాల స్వరూప స్వభావాల కూడలి, నిరాకారమైన భక్తికి సాకారమైన కథనం భాగవతం. భక్తికి, ముక్తికి ప్రాణాధారమైనది భాగవతం. భాగవత పఠనం మనిషిని శాంతచిత్తుణ్ని  చేస్తుంది. రామాయణం కావ్యమని, భారతం ఇతిహాసమని, భాగవతం పురాణమని స్థూలమైన అవగాహన. ఈ మూడు గ్రంథాలూ మానవ జాతిని అనుగ్రహించడం మొదలుపెట్టి ఎన్ని వేల సంవత్సరాలయిందో! ఈ జాతి వారసత్వ సంపదగా ఈ అక్షర సౌధాలు నిత్య నూతనంగా ప్రకాశిస్తూనే ఉంటాయి.
ఆశావహ జీవితం


పుట్టిన ప్రతి ప్రాణికీ పూర్తికాలం జీవించాలన్న కోరిక ఉంటుంది. చరాచరాలకూ అలాగే ఉంటుంది. చెట్టును కాండం మొదలు వరకు నరికినా అది మళ్ళీ చిగురించాలన్న కాంక్షతో ఉంటుంది. నిత్యం పారే నదికి ఓ కొండ అడ్డుపడ్డప్పుడు అది కొద్దిసేపు ఆగి సేదదీరుతుంది. పల్లం ఎటువైపుందో తెలిసేదాకా నిరీక్షిస్తుంది. ఆ తరవాత దారి చూసుకొని ముందుకు ప్రవహిస్తుంది.
అడవిలో మొలిచే మొక్కలకు నీళ్లు పోసేవారెవరూ ఉండరు. అలాగని అవి నిరాశకు లోనుకావు. వర్షాల ఆగమనానికై ఆశగా ఎదురుచూస్తాయి. వీలుకానప్పుడు పులి కూడా రెండు అడుగులు వెనక్కి వేస్తుంది. దానికీ మరణభయం ఉంటుంది. ఆయుష్షు తీరేదాకా బతకాలన్న బలమైన వాంఛా ఉంటుంది.
ఒక్కోసారి వెనక్కి రావడమూ ముందుకు పోవడంలో భాగం అవుతుంది. వాస్తవానికి అది సార్వజనీనం! జీవన పయనం- ఏ దిశలో సాగుతోంది అన్నది ముఖ్యం కాదు. అది ఆరోహణా భావనతో ఉందా లేదా అన్నదే ప్రధానం. జీవచైతన్యానికి నిర్విరామంగా విస్తృతం కావడమే తెలుసు. ఆ సహజాతి సహజ గమనం పటాటోప ప్రదర్శన కాదు. ఎవరి మెచ్చుకోలు కోసమో చేసే పని అంతకన్నా కాదు.
పశు పక్ష్యాదులు, ఎడారుల్లో సంచరించే జీవులు, ఉభయచరాలు ఎంతో ఓర్పు, సహనంతో కాలం వెళ్ళ బుచ్చుతాయి. మున్ముందు కాలం అనుకూలంగా ఉంటుందన్న ఆశతో ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకొని జీవిస్తాయి. జీవకోటిలో తెలివితేటలున్న మనిషి మాత్రం అనుకున్నదే తడవుగా ఫలితం వెంటనే కనబడాలని చూస్తాడు.
ఒక పేదవాడు తన ఇంటిముందు ఓ మొక్క నాటాడు. కొన్ని రోజులకు అది పెరిగి పెద్దదయింది. అది పండ్లు ఇచ్చి ఆకలి తీర్చుతుందని ఆశపడ్డాడు. చాలా రోజులు ఎదురు చూశాడు. కాని, అలా జరగలేదు. తగినంత ఆహారం అందక శరీరంతోపాటు మనసూ బలహీనపడింది. ఫలితంగా, అతడి నిరీక్షణ- కాలాన్ని మరింత పొడిగించిన భావన కలగజేసింది. విసుగు తెప్పించింది. కోరిక నెరవేరలేదని అతడిలో కోపాగ్ని రగిలింది. విచక్షణా జ్ఞానం కోల్పోయాడు. పూత, కాత రెండూ లేని చెట్టు ఎందుకని దాన్ని నరికివేశాడు. మరుసటి రోజు తెల్లవారి లేచి చూస్తే పడిపోయిన చెట్టుకు ఒక పువ్వు పూసి ఉంది. ఆ సన్నివేశం చూశాక అతడిలో దుఃఖం పొంగుకొచ్చింది. ఆ చెట్టును పట్టుకుని విలపించాడు. తొందరపడ్డానని బాధపడ్డాడు. జీవితం ఇలాగే అనూహ్య తీర్పునిస్తుంది. కారణం, అది నిత్యనూతనం. అందువల్లే ‘ఫలితం పని చేసేవాడి చేతిలో లేదు. అది కాలపురుషుడి నిర్ణయం’ అని గీత చెబుతుంది.
అనుకూలించని పరిస్థితుల్లో ఆకలిగొన్న జంతువు ఒకటి ఎత్తున ఉన్న కొమ్మ ఆకులు తిందామనుకుంది. అందుకోసం దాని పొట్టి మెడ సాచడం మొదలు పెట్టింది. కాళ్లూ పొడుగుంటే బాగుండేదని భావించింది. రోజూ దాని ప్రయత్నాలు సానుకూల వైఖరితో సాగేవి. కొంత కాలానికి దాని మెడ పొడుగ్గా సాగింది. కాళ్లూ పెద్దగా అయ్యాయి. అదే జిరాఫీగా రూపాంతరం చెందింది. మానసిక భావాలకు అనుగుణంగా శరీరం స్పందిస్తుంది. అది ప్రాకృతిక నియమం. అమీబా నుంచి చింపాంజీ దాకా జరిగిన జీవ పరిణామ క్రమంలో ‘ఆశావహ దృక్పథం’ కీలకం. అందువల్లే, ‘యద్భావం తద్భవతి’ అన్నారు వేదాంతులు. ‘నీ ఆలోచనే(సంకల్పం) నువ్వు’ అని బుద్ధుడూ ప్రబోధించాడు. దుందుడుకు వైఖరితో ఏ ప్రయోజనాలూ సిద్ధించవు. సానుకూల ధోరణితోనే మానవుడు ముందుకు వెళ్ళగలడు!