Devotional Telugu
3.46K subscribers
106 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
పక్కలో బల్లేలు

‘మంచి మనసులేని అందం, వాసన లేని పువ్వు, క్రమశిక్షణ లేని చదువు, సమయపాలన లేని విధి నిర్వహణ, ఆచరణ లేని మాటలు... ఎదుటివారికే కాదు, ఎవరికైనా కీడు చేస్తాయి’ అంటారు స్వామి వివేకానంద. సంస్కారవంతమైన హృదయంలో చెడు తలపులు రావు. చెడ్డతనమే అరిషడ్వర్గాలను ప్రేరేపిస్తుంది. ఇవి బయట ఎక్కడో కనిపించేవి కావు. మన(లోపలి) అంతశ్శత్రువులు. అవే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. వీటిలో ఏ ఒక్కటైనా చాలు మనిషిని సర్వనాశనం చేయడానికి! సప్త వ్యసనాలకు బానిస అయ్యాడంటే మనిషిని ఏదో ఒక దుర్లక్షణం ప్రభావితం చేస్తోందనే అర్థం.

పరస్త్రీ వ్యామోహం, జూదం, వేటాడి వన్య మృగాలను సంహరించడం, మద్యపానం, వాక్పారుష్యం, ఉగ్రదండనం (చేసిన తప్పిదానికి మించి శిక్ష విధించడం), అర్థదుర్వినియోగం అనే ఈ సప్త వ్యసనాలకు మనిషిని ప్రేరేపించేది కామక్రోధాది అంతశ్శత్రువులే. మనిషి తన వ్యసనాలను, బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి అనేక విధాలుగా సమర్థించుకుంటూ ఉంటాడు. అనేక సాకులు చెబుతుంటాడు. అసత్యం కంటే మించిన పాపం లేదని, సత్యాన్ని మించిన ధర్మం లేదని వైఖానస ధర్మసూత్రం వివరించింది. సత్యవాక్కు మాత్రమే మనిషికి తేజస్సును, కీర్తిని ఇస్తుందని ఛాందోగ్యోపనిషత్తు చెబుతోంది. అపసవ్య మార్గాన భోగవాసనలను అనుభవించాలన్న కోరికకు మూలం కామం. దాన్ని వదిలివేయడంలో గల చిదానందానుభూతిని మహోపనిషత్తు పేర్కొంది. మనో వికారాలన్నీ హృదయంలో నింపుకొని పుణ్యతీర్థ యాత్రలెన్ని చేస్తే మాత్రం ఏం లాభం అని ‘దుర్జన పద్ధతి’లో భర్తృహరి ప్రశ్నిస్తాడు. అజ్ఞానం, అవిద్య వల్లనే అహంకారం అంకురిస్తుందని విదురుడు అంటాడు.

మద మాత్సర్యాల వల్ల మనిషిలో ప్రతికూల ఆలోచనలు పెల్లుబుకుతాయి. ఆ ప్రతికూల ఆలోచనలే విజయానికి అవరోధాలవుతాయి. నిరహంకారి పలికే మంచి మాట దానం లాంటిది.  ప్రతిఫలంగా సత్ఫలితాన్నే ఇస్తుంది. చెడ్డమాట అప్పు లాంటిది. ప్రతిగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. తనకు తెలియనిది ఎంతో ఉందన్న సత్యాన్ని తెలుసుకోవడానికి మనిషి దీర్ఘాయుష్మంతుడై ఉండాలి. మన ప్రవర్తనే మనకు శత్రువుల్ని, మిత్రుల్ని తెచ్చిపెడుతుంది. మనసులోని మంచీ చెడు భావాలకు ప్రవర్తనే ప్రత్యక్ష దర్పణం.

దుర్మార్గం వీడనివాడు, సంయమనం లేనివాడు, ధ్యాన తత్పరత లేనివాడు, చిత్తశుద్ధి లేనివాడు ఆత్మజ్ఞానం పొందలేడని కఠోపనిషత్తు కథనం. ఆత్మజ్ఞాన ప్రాప్తి కోసం నిరంతరం సాధన చేసే సాధకుణ్ని అరిషడ్వర్గాలేమీ చేయలేవు. బ్రహ్మహత్య చేసినవాడికి, సురాపానం చేసేవాడికి, చోరుడికి, వ్రతభంగం చేసేవాడికి ప్రాయశ్చిత్తమనేది ఉంటుందని; కృతఘ్నుడికి మాత్రం నిష్కృతే లేదని మనుస్మృతి చెబుతోంది.

పరిమళభరితమైన కస్తూరిని తన నాభిలోనే ఉంచుకొని, అది ఎక్కడ ఉందోనని అంతటా అన్వేషించే లేడి వంటివాడు మనిషి. తనలోనే ఉన్న దైవాన్ని అంతర్‌దృష్టితో చూడలేక అరిషడ్వర్గాలను పక్కలో బల్లేలుగా ఉంచుకుంటాడు. ఐహిక వాంఛలకు దాసుడైన మానవుడు సత్యాన్ని, స్వీయ దౌర్బల్యాన్ని అవగాహన చేసుకుని, జితేంద్రియత్వం సాధించే దిశగా ప్రయాణిస్తే ఏనాటికైనా మోక్షార్హత పొందగలడు. ఆధ్యాత్మిక దృష్టితో మనిషి తనను తాను మలచుకొని రాగë�్వేషాలకు అతీతంగా జీవనయాత్ర కొనసాగించడమే మనిషి పరమావధి!
ఉగాది ప్రాముఖ్యత

ఉగాది ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది మన తెలుగు పండుగ అని. ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఈ రోజు కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు.

ఉగాది ప్రాముఖ్యంచైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాధ.”ఉగాది”, మరియు “యుగాది” అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. “ఉగ” అనగా నక్షత్ర గమనం.కి ‘ఆది’ ‘ఉగాది’.అంటే సృష్టి ఆరంభమైనదినమే “ఉగాది”. ‘యుగము’ అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది.

ఒక్క తెలుగు
సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు.

ఉగాది పచ్చడి ప్రాముఖ్యత :

ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక.

బెల్లం – తీపి – ఆనందానికి సంకేతం
ఉప్పు – జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం
వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు
చింతపండు – పులుపు – నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు – వగరు – కొత్త సవాళ్లు
కారం – సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు

మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండగ శుభాకాంక్షలు
సహనం ప్రధానం

జీవితంలో ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవాలన్నా, భౌతికపరమైనవి దక్కించుకోవాలన్నా మనిషికి సహనం తప్పనిసరి. చాలామంది ఎన్నో ముఖ్యమైన విలువల విషయంలో ‘అది నాకు సంబంధించింది కాదు’ అని కొట్టిపారేస్తుంటారు. మనిషి తన జీవన విధానాన్ని   పరిశీలిస్తే, ప్రతిరోజూ ఎరుకలేకుండా     ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంతో కొంత తెలిసో, తెలియకో అనుసరిస్తూనే ఉంటాడు. చిత్రమేమిటంటే ఆ అనుసరిస్తున్నది ఆధ్యాత్మిక సంబంధమైనదని భావించకపోవడం.
సహనం అంటే ఏమిటి? నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకుంటూ, నిరంతరం అంకితభావంతో చేసే కృషి. అవాంతరాలెదురైన సందర్భాల్లో సైతం, పక్కకు తప్పుకోకుండా ఆత్మస్థైర్యంతో పట్టుదలతో ఎదుర్కోవడం... పొగడ్తలకు, విమర్శలకు ప్రాధాన్యమివ్వకుండా చేసే యజ్ఞం. కార్యక్షేత్రం ఏదైనా కోరుకున్న ఫలితాలను సాధించాలంటే, శిఖరాలను అధిరోహించాలంటే- సహనం తప్పనిసరి. ప్రపంచం మనుగడే సహనంతో ముడివడిఉంది.
మనిషి సంకుచితత్వం, స్వార్థం, పాపాలు, అతిక్రమణలు, ప్రేమరాహిత్యం... అన్నింటినీ ఈ పుడమి భరిస్తూనే ఉంది. అందుకేనేమో తమిళకవి, తత్వవేత్త తిరువళ్ళువర్‌ సహనాన్ని భూమాతతో పోల్చి చెప్పారు.
ఎంత ప్రతిభఉన్నా, గొప్ప కళాకారుడిగా ఎదగాలన్నా, అవకాశాలను చేజిక్కించుకోవాలన్నా- సహనం అవసరం.
సహనం లోపించడంవల్ల కలిగిన అనర్థాలకు చరిత్ర, పురాణాలు సాక్ష్యమిస్తాయి. గొప్పగొప్ప సామ్రాజ్యాలు బుగ్గిపాలు కావడం, గొప్ప నియంతలు మట్టికరవడం... ఎన్నో జరిగాయి. అసహనంతో నిండిన మనసు- అసూయాద్వేషాలకు నివాసస్థలం.

శ్రీకృష్ణుడు పాండవులకు సహనం పాటించడంలోని గొప్పతనాన్ని చెబుతూ, నిజమైన యోగి లక్ష్యం స్థితప్రజ్ఞతని అంటాడు.
కొన్ని పరిస్థితుల్లో సహనం వేదనను రగిలిస్తుంది. మానసిక సమతుల్యతతో దాన్ని  స్వీకరిస్తూ, ఇష్టాయిష్టాలను పక్కనపెడితే ఎరుకలో ఒక కొత్తస్థాయిని     చేరుకోవచ్చు. ఈ వేదనవల్ల భగవంతుడి తేజస్సు హృదయంలోకి ప్రవేశిస్తుంది. సహనం మానసిక స్వచ్ఛతకు దారిచూపి భగవదనుగ్రహానికి చేరువ చేస్తుంది. విలువైనదేదీ త్వరితగతిన దక్కదు. లక్ష్యసాధనలో  ఆటుపోట్లు తప్పవు.
కష్టనష్టాలను భరించగలిగే సహనాన్నిబట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. ద్వంద్వాలతో నిండిన ప్రపంచంలో జీవిస్తున్న మనిషికి చిత్తశుద్ధి అవసరం. ఎరుకతో జీవించడమెలాగో నేర్చుకోవాలి. నాణేనికి బొమ్మ బొరుసూ ఉంటాయి. మనిషి అన్నీ తనకు అనుకూలంగా ఉండాలని ఆశపడటం సహజం. ఒక అదృశ్యశక్తి పరిస్థితుల్ని నియంత్రిస్తూంటుంది. మనిషి సదాలోచనలు, సహనమే ఆ విధిని అనుకూలంగా మార్చుకోవడంలో తోడ్పడతాయి.
ఎంతో నష్టానికి కారణమైన కురుక్షేత్ర సంగ్రామానికి సహనంలేని దుర్యోధనుడే కారకుడు.
అసహనంవల్లే అశోకుడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయేలా చేసిన కళింగ యుద్ధానికి కారకుడయ్యాడు.
మత సహనం లేనందువల్లే ఎన్నో వికృతమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. చిత్రమేమిటంటే- మతాలన్నీ సహనాన్నే బోధిస్తాయి.

మనిషికి సరైన వైఖరి, విశ్వాసం ఉంటే నిస్సహాయ పరిస్థితుల్లో సైతం అత్యద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. సహనం నిండుగా ఉంటే దైవబలంతోడై కొండలను సైతం కదిలించవచ్చునని గ్రహించాలి.
సృజనాత్మక జీవితం


నయనాలు తెరచి చుట్టూ చూస్తే కనిపించే ప్రతీది సృష్టికారుడి ‘సృజన’ అని తెలుస్తుంది. సృష్టికారుడు, సృజన వేరు వేరు కాదు. ఆ రెండూ ఒకటే. ఉపనిషత్తుల్లో దాన్ని ‘అద్వైతం’ అన్నారు. అంటే, ‘రెండుగా లేనిది’ అని అర్థం.
అంకురంలోంచి ఓ చిన్న మొక్క బయటకు రావడం, మొగ్గనుంచి పుష్పం విచ్చుకోవడం, కాయ పండుగా మారడం, బాగా మాగిన ఫలం మళ్ళీ విత్తనాలు ఇవ్వడం... ఇదంతా నిరంతరం సాగే సృజనాత్మక సృష్టి కార్యకలాపం.
సూర్యశక్తితో బలం పొంది సముద్రాలు ఆవిరిరెక్కలు కట్టుకుని ఆకాశంలో ఎగిరేట్లు చేసింది ఎవరు? ఆకాశం కాన్వాసు మీద మేఘాల సుద్దముక్కలతో చిత్ర, విచిత్రమైన బొమ్మలు గీస్తున్న చిత్రకారుడు ఎవరు? నిశ్చలంగా ఉన్న కొలనువాకిట్లో వానచుక్కలు వేసి అలల ముగ్గులు వేస్తున్న ఆడపడుచు ఎవరు? లోకం చీదరించే గొంగళిపురుగు రూపాంతర ధ్యానానికి మెచ్చి సీతాకోక చిలుక రెక్కలకు రంగులు అద్దిన వర్ణ చిత్రకారుడు ఎవరు? ఆకాశం మెడలో వేసే సప్తవర్ణమాలకు రంగులు, పూలిచ్చిన తోటమాలి ఎవరు? ఇంతటి ఘనమైన అద్భుత సృజనశీల కార్యాలు చేసేవి- ఆనందం, ప్రేమ స్వరూపాలు.
భగవంతుడు పిల్లల్లా ఆడుకుంటాడు. అతడు గొప్ప ఆటగాడు. అందుకే విశ్వంలో అనేకం సృష్టించాడు. అతడి దృష్టిలో ‘జీవితమే ఒక పెద్ద ఆట’, దుఃఖంతో ఉండి బోరున ఏడుస్తూ ఎవరైనా ఆడుకుంటారా? లేదు. ఆట ఆనందంతో ముడివడి ఉంటుంది. మనసు సంతోషంతో నిండినప్పుడు ఆట సంభవిస్తుంది. అందుకే మనిషికి బాల్యమంతా ఆటపాటలతోనే గడిచిపోతుంది. ఆటలు పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందిస్తాయి. చదరంగం లాంటి ఆటలు మస్తిష్కాన్ని చురుగ్గా ఉంచుతాయి. పరుగులతో కూడిన ఆటలు క్షణకాలాల్లోనే సరైన నిర్ణయాలు తీసుకునే బుద్ధికుశలతకు పదునుపెడతాయి. ఈ రీతిన సృజనశక్తి వయసుతోపాటు క్రమంగా బలపడి భవిష్యత్తులో కొత్తవాటిని కనిపెట్టే సృష్టికర్తలను తయారు చేస్తుంది.
చిన్నప్పుడూ స్నేహితులు చాలామంది ఉంటారు. కాలక్రమేణా ఆ సంబంధాలు విడిపోతాయి. బాల్యంనాటి ఆటలు, ఆనందాలు మెల్లగా దూరం అవుతాయి. మనిషి ఒంటరిగా మిగిలిపోతాడు. ఆలోచనలు జోరీగల్లాగా ముసురుకుంటాయి. శతవిధాలా వేధిస్తాయి. చేసేదేమీలేక గతంలోకి తిరిగి చూసుకుంటాడు. బాల్యం నాటి తీపిజ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. వయసుతోపాటు వచ్చే జ్ఞానం వల్ల వయోజనులు కొంతమంది మళ్ళీ ఆనందం పొందడం కోసం పిల్లలకు దగ్గరవుతారు. అందుకే తాతలు మనవళ్లతో జతకడతారు. వాళ్లకు గుర్రపు స్వారీలవుతారు. మాట్లాడే బొమ్మలవుతారు. నృత్యం, చిత్రలేఖనం, సంగీతం, సాహిత్యం... ఇవన్నీ సృజనాత్మక అంశాలు. ఈ కళల్ని సృజిస్తున్నప్పుడు మనసు వర్తమానంలో నిలుచుండిపోతుంది. ఫలితంగా పట్టరానంత ఆనందం కలుగుతుంది. కళలు- కళాప్రియుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. నెమ్మదిగా ధ్యానంవైపు తీసుకువెళతాయి. జీవితం పట్ల ప్రేమ పెంచుతాయి.
‘ఏ పని అన్నది ముఖ్యం కాదు... దాన్ని ఎలా చేస్తున్నామన్నదే ప్రధానం’ అని పెద్దలంటారు. పేరు ప్రతిష్ఠల కోసం పాకులాడకుండా, కీర్తి శిఖరాలకై వెంపర్లాడకుండా, నిదానమే ప్రధానంగా, శ్రద్ధాభక్తితో, ఎరుకతో, ఆనందంగా, పవిత్ర మనసుతో ఏ కార్యం చేపట్టినా అది సృజనాత్మకంగా ఉంటుంది.
వర్తమానంలో జీవించడమంటే, తామరాకుపై నీటి బిందువులా ఉండటం. ఆ క్షణాల్లో మనసు భూత భవిష్యత్తులకు సంబంధించిన డోలాయమాన స్థితిలో ఉండదు. అనవసర ఆలోచనలు వేధించవు, పరధ్యానంలోకి మళ్లించవు. అప్పుడు చేతు(చేత)ల్లో ఉన్న ప్రతీ పని ఒక ప్రార్థన అవుతుంది.
భయం

భయం పలురకాలు. అందంగా ఉన్నవారికి అది తరిగిపోతుందని భయం. యౌవనం శాశ్వతం కాదన్న ఆందోళన, వార్థక్యం చుట్టుముడుతుందని, రోగాలు పీడిస్తాయనే బాధ. సంపద కరిగిపోతుందనే మానసిక వ్యధ. ఇలా ఎన్నింటికో మనిషి భయపడుతూ భీరువవుతాడు. సహజ పరిణామాలకు చింతిస్తూ భీతిల్లుతాడు. భయపడవలసినవాటికి భయపడడు. అదే మానవ జీవితంలోని వింత!
సూర్యోదయం, చంద్రోదయం, వర్షాలు, ఉరుములు, మెరుపులు... ఇటువంటి అనేక ప్రకృతి పరిణామాలు మనిషిని భయపెట్టాయి. క్రమక్రమంగా భాషాపరంగా, విజ్ఞానపరంగా ఎదిగాడు. తనను భయపెట్టిన మార్పులు సహజమని అర్థం చేసుకున్నాడు. వాటివల్ల ఉపయోగాలు తెలుసుకున్నాడు. మనల్ని భయపెట్టే విషయాలపట్ల అవగాహన పెరిగిననాడు భయం తొలగిపోతుంది.

భయం మూఢనమ్మకాన్ని పెంచుతుంది. అది మన హేతుబద్ధతను, తార్కికతను, ఆలోచనాశక్తిని నశింపజేస్తుంది. విజ్ఞాన, శాస్త్ర రంగాల పురోగతిని నిలువరిస్తుంది. భయం గురించి మనం ఎంతగా భయపడితే అంతగా భయభ్రాంతుణ్ని చేస్తుంది. భయాన్ని అధిగమించాలంటే దాన్ని ఎదుర్కోవాలి. దానినుంచి పారిపోకూడదు.
పుట్టుకెంత సహజమో చావూ అంతే. ఈ రెండు పరిణామాల మధ్య సాగవలసిన జీవితాన్ని అర్థరహిత, ఆధారరహిత భయాలతో గడిపేయకూడదు. భయపడుతూ జీవించే జీవితం జీవితమే కాదు. అది మృతప్రాయమే. భయం వల్ల సంకల్పం వీగిపోతుంది. ఆలోచనాశక్తి సన్నగిల్లుతుంది. ఉత్సాహం నీరైపోతుంది. ఉద్యోగంలో, జీవితంలో చేరుకోవలసిన స్థితికి చేరలేం. జీవన క్రమంలో కొన్ని అవసరవేళల్లో తీసుకోవలసిన నిర్ణయాలు తీసుకోలేం.

భయం రెండు రకాలు. ఆరోగ్యకరమైనది, అనారోగ్యకరమైనది. మొదటిది- మనల్ని రుజుమార్గంలో నడిపే పాపభీతిని నేర్పుతుంది. స్వీయక్రమశిక్షణ ఇస్తుంది. మనస్సాక్షికి బద్ధుల్ని చేస్తుంది. ఎదుటివారికి హాని కలిగించాలనే ఆలోచననే దరిచేరనివ్వదు. ధర్మచింతనతో ప్రవర్తించే విధంగా ఉపకరిస్తుంది. ఇక రెండోది- జీవితంలో ముందుకు వెళ్లనీయదు. ఆలోచించనీయదు, ఎదగనీయదు.
మానవులు విపరీతంగా భయపడే విషయం మృత్యువు. నిజానికి ఈ భయం వల్ల మేలే జరుగుతుంది. చావు తప్పదన్న స్పృహ మనల్ని అప్రమత్తుల్ని చేస్తుంది. బాధ్యతలను నిర్వర్తించేలా, లక్ష్యాలను చేరేలా, చేయదలచుకున్న సత్కార్యాలను పూర్తి చేసేలా చేస్తుంది. అనివార్యమైన ఆ ప్రకృతి ధర్మం- మన జీవితానికొక అర్థాన్ని, సార్థకతను ఆర్జించుకొమ్మని హెచ్చరిస్తుంటుంది. ఈ మృత్యుభయాన్ని వీడిన క్షణం- మనిషికి ఆనంద సామ్రాజ్యమే. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలే. మన బుద్ధికే కాక మనసుకూ తెలియవలసిన విషయమిది. ఆ స్థితికి చేరుకున్ననాడు చావునైనా నవ్వుతూ ఆహ్వానిస్తాం.
మన మనసులోకి చూసినప్పుడు తప్పు అన్నది లేకుండా ఉండాలి. అప్పుడు ఏ అపరాధ భావమూ దరిచేరదు. అప్పుడిక దేనికీ విచారించవలసిన అవసరమే ఉండదు. మనిషి ఈ ప్రపంచాన్ని మోసం చేయవచ్చు. కానీ, అంతరాత్మను వంచించలేడు- అంతరాత్మ ఎప్పడూ వాస్తవాన్నే చూపుతుంది.
భయపడుతూ జీవించడమంటే అనేకసార్లు మరణించడమే. భయాన్ని వదిలిననాడే జీవితాన్ని నిర్భయంగా, ఆహ్లాదంగా, ఆనందంగా గడపగలం. అదే అసలైన జీవితం. భయపడటం మానేసినప్పుడే మన జీవితం మొదలవుతుందంటాడు ఓ తాత్త్వికుడు.
శక్తి మంత్రం -. విపత్తులు నివారణ కోసం

ఓం తేజోసి తేజో మయి దేహి!

వీర్యమసి వీర్యమ్‌ మయి దేహి! 

బలమసి బలం మయి దేహి!

ఓజోసి ఓజో మయి దేహి!

మన్యురసి మన్యుం మయి దేహి!

సహోసి సహో మయి దేహి! (శక్తి మంత్రం)


భగవంతుడిని ఆత్మ శక్తిగా, సంయమ శక్తిగా, శారీరక మానసిక శక్తులుగా, దివ్య శక్తిగా, ధైర్య శక్తిగా, సహన శక్తిగా భావిస్తూ ఆయా శక్తులను ప్రసాదించమని ప్రార్థించే మంత్రమిది. ఈ మంత్ర జపం వల్ల సాధకుడు తేజస్సంపన్నుడై ఒత్తిడులను సంభాళించుకునే శక్తిని సంపాదిస్తాడు. అలాగే ఋగ్వేదంలోని సూర్యసూక్తం కూడా సూర్యుడిని జీవితానికి ఆధారభూతునిగా, దేహానికి శక్తిగా, వర్షాన్ని, ఆహారాన్ని ఇచ్చేవాడిగా, ప్రపంచాన్ని రూపొందించి, పోషించేవాడిగా, పర్యావరణాన్ని కాపాడేవాడిగా, సకల కార్యాలనూ సాధించేందుకు ప్రేరణ శక్తిగా, ఉన్నత జీవనాన్ని ప్రసాదించే వాడిగా చెపుతుంది. అంతేకాదు.. చేసే పనిలో శ్రద్ధను, ఆసక్తిని కలిగి ఉండాల్సిన అవసరాన్ని ఈ వేదసూక్తాలు చెబుతాయి. వ్యక్తి తన మనసును, శరీరాన్ని, సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యతను వాటిని సాధించేందుకు అవసరమైన మార్గాలను సూచిస్తాయి. అక్షరాలుగా ఒకచోట కూర్చబడిన మంత్రాలకు ఈ శక్తి ‘నమ్మకం’ ద్వారా కలుగుతుంది. జీవన యాన కేంద్రం నమ్మకమైనప్పుడు అది అన్నింటినీ తనవైపు ఆకర్షించుకుంటుంది. పలికే ప్రతి అక్షరాన్నీ నిర్ణీత అంతరాలలో పలికినపుడు అవి మన కండరాలపై, నరాలపై, రక్తప్రసరణపై, గుండెపై తద్వారా శరీర ఆరోగ్యంపై మంత్రం తన ప్రభావాన్ని చూపుతుంది. అలాగే పలికిన పదాలు సూచనలుగా మన మనసుపై ముద్రింపబడతాయి. ఆ ముద్రలు బలీయమైతే దానికి సంబంధించిన కార్యావిష్కరణకు దారి చూపుతాయి. మన మనసు చాలా శక్తివంతమైనది. అది మనమిచ్చుకున్న సూచనల కనుగుణంగా పనిచేస్తుంది. మనస్సు బలీయమైతే, శారీరక ధర్మాన్ని అధిగమించి ముందుకు సాగుతుంది. కాబట్టి వేద మంత్రాల రూపంలో ఉచ్చరించిన అక్షరాలు శారీరకంగా మానసికంగా ప్రభావాన్ని చూపుతాయి. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్న కరోనా లాంటి క్రిమి చేసే నష్టాన్ని తగ్గించుకునేందుకు అవసరమైన మానసిక, శారీరక సన్నద్ధతను ఈ వేద మంత్రాలు లేదా సూక్తాలు ఇస్తాయి. అయితే ఒక్క విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఇవి వైద్యానికి అనుబంధంగా పనిచేస్తాయే కానీ ప్రత్యామ్నాయంగా జబ్బును తగ్గించేందుకు ఉపకరించవు. మనం ఈ మంత్రాలను ఉచ్చరించే సమయంలో వాటి అర్థాలను తెలుసుకొని వాటిని ఊహించ గలగాలి. ఎంత బాగా, దగ్గరగా ఊహించుకోగలిగితే అంత మంచి ఫలితాన్ని రాబట్టుకోగలం. కల్పన లేదా ఊహ మరియు నమ్మకం ఈ రెండూ ఒక పక్షికి రెండు రెక్కల లాంటివి. రెండూ బలంగా ఉన్న పక్షి ఆకాశంలో చక్కగా విహరించ గలదు. కాబట్టి నమ్మకాన్ని, కల్పనను ఆదరించి ఈ మంత్రాల ద్వారా ఉపశమనం పొందుదాం.
దానగుణం


లోకంలో ధనానికి మూడు గతులున్నాయి. అవి దానం, భోగం, నాశనం. దానం చెయ్యకుండా, తాను అనుభవించకుండా కూడబెట్టిన ధనం చోరులపాలో, రాజుపాలో అవుతుందని సుభాషితం. ‘దానమీనివాడు ధన్యుండుగాడయా’ అన్నాడు వేమన. దానంవల్ల పుణ్యం సిద్ధిస్తుంది. కీర్తి నిలుస్తుంది. ఎన్నో రాజ్యాలుండేవి. ఎందరో రాజులు పాలించారు. వారెవరూ సిరిమూటగట్టుకొని పోలేదు. గొప్పదాతలైనవారే యశఃకాయులయ్యారు. శిబి చక్రవర్తిని, బలి చక్రవర్తిని లోకం మరచిపోలేదు. కర్ణుడు అధర్మపక్షంలో ఉన్నా దానకర్ణుడుగా ప్రసిద్ధుడు. భూమికి పర్వతాలు, సముద్రాలు భారం కాదు.
దానగుణం లేనివారే భారమవుతున్నారు అంటాడు శ్రీనాథుడు.
శాస్త్రాల్లో అనేకరకాల దానాలు చెప్పారు. అయితే ఆధునికయుగంలో సమయ దానమూ గొప్పదే. కాలం చాలా విలువైనది. దాన్ని ఆపలేం. గతించిన కాలం   వెనక్కిరాదు. సమాజసేవ కోసం, సత్కార్యాల కోసం మన దైనందిన సమయంలో కొంత కేటాయించడం ఉత్తమ సంస్కారం.
కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపరయుగంలో దానం, కలియుగంలో ధ్యానం యుగధర్మాలుగా పేర్కొన్నారు. అయితే దానం అన్ని కాలాల్లోనూ ఉత్తమమే. పూర్వులు వదిలివెళ్లిన ధనంతో కొంతభాగాన్ని వారి ఆత్మకల్యాణం కోసం దానం చెయ్యాలి. అదే నిజమైన శ్రాద్ధం. జలతర్పణం, పిండదానం కేవలం ప్రీతిదాత్మకం. నిజమైన శ్రద్ధ పూర్వుల సంపదను వారి సద్గతుల కోసం సత్కర్మల కోసం దానం రూపంలో సమాజానికి ఇచ్చివేయడంలోనే ఉంది. ఎవరైనా లోభమోహాలకు వశులై తమ సంపదను సదుపయోగం చేసి ఉండకపోతే ఆ లోపాన్ని వారి వారసులు పూరించాలి.
దురాశతో, స్వార్థంతో కోట్ల ఆస్తుల్ని కూడబెట్టి వారసులకిస్తే- వారు బాధ్యతారహితులు, సోమరులు, అహంకారులు అవుతారు. పాపపుణ్యాలన్నీ ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఉంటాయి.
అయితే దానానికీ కొన్ని నియమాలు ఏర్పరచారు మన పూర్వులు. పాత్రత ఎరిగి దానం చెయ్యమన్నారు. మంచినేలలో నాటిన గింజలు ఫలించి సస్యాలవుతాయి. చవిటి నేలలో వేసిన బీజాలు నశిస్తాయి. అపాత్రదానం గాని, స్థోమతకు మించిన దానాలుకాని చేయకూడదు. పాత్రత అంటే యోగ్యత. ఇది మూడు విధాలు. ధర్మపాత్రం, కార్యపాత్రం, కామపాత్రం. ధర్మజ్ఞుడైనవాడికి చేసే దానం ఉత్తమం. దానగ్రహీత స్వీకరించినదాన్ని ధర్మకార్యాలకే వెచ్చిస్తాడు. కార్యపాత్రమంటే తగినపని. మంచిపనులకు అంటే ఒక దేవాలయం, విద్యాలయం, శరణాలయం వంటివాటి ఏర్పాటుకు దానంచెయ్యడం. మూడోది కామపాత్రం. కామమంటే కోరిక. యాచకుడు పేదరికంతో తన మనుగడకోసం బతుకుతెరువుకోసం అన్నమో, ధనమో, వస్త్రమో, భూములో కోరతాడు. వాడి స్థితినిబట్టి, అవసరాన్నిబట్టి యోగ్యత నిర్ణయించాలి.
అన్యాయార్జితమైన విత్తాన్ని దానం చెయ్యడంవల్ల ఫలంలేదు. ధర్మంగా కష్టించి సంపాదించినదాంట్లో కొంచెమైనా సమాజక్షేమానికి వ్యయంచేయడం మేలైన పని. ‘తక్కువ తీసుకో. ఎక్కువ ఇచ్చుకో’ అని సామెత. ఆకలిదప్పులతో ఉండి కూడా తనకు లభించిన అన్నాన్ని, జలాన్ని అర్థికి ఇచ్చివేసిన రంతిదేవుడి గాథ-
భాగవతంలో ప్రసిద్ధఘట్టం. మూడడుగుల నేల దానం ఇవ్వడంవల్ల నాశనమవుతావని గురువు శుక్రాచార్యుడు చెప్పినా వినని సత్యసంధుడు బలిచక్రవర్తి దానగుణం- సర్వకాలాలకూ ఆదర్శం.
నిండిపోయిన చెరువులో నీటిని రక్షించాలంటే దాన్ని కొంత బయటకు వదిలివేయడమే తప్ప మరో మార్గం లేదు. ‘ఇది నా భూమి’ అనేవాణ్ని చూసి భూదేవి నవ్వుతుంది. తాను అనుభవించక, చేయదగిన దానాలు చెయ్యనివాణ్నిచూసి ధనం నవ్వుతుంది. దానశీలిని లోభమోహాలు దరిచేరవు. దానం గుప్తంగా ఉండాలి. ప్రచారం కోసం, కీర్తికోసం అయోగ్యులకు, అనుచిత కార్యాలకు దానం చెయ్యడాన్ని అర్థదూషణమంటారు. అర్థదూషకుడు కుబేరతుల్యుడైనా చివరికి భిక్షమెత్తుకోవలసి వస్తుందని శాస్త్రవచనం. ‘సొంతలాభం కొంతమానుకో పొరుగువాడికి తోడుపడటం’ నేటి సూక్తి.
కుజన సుజనుల మైత్రి

మొదల జూచిన కడుగొప్ప పిదప కురుచ
ఆది కొంచెము తరువాత నధికమగుచు
తనరు దిన పూర్వ పరభాగ జనితమైన
ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి

ఉదయకాలపు నీడ మొదట పెద్దదిగా ఉండి పొద్దెక్కే కొద్దీ చిన్నదైపోతుంది. అట్లే కుజనుని (చెడ్డవాని) స్నేహం కూడా మొదట్లో ఆసక్తికరంగా ఉన్నా.. క్రమేణ ఆ మైత్రి అంతరించిపోతుంది. మధ్యాహ్నం నీడ ఆదిలో కొంచెంగా ఉండి సాయంకాలమయ్యే సరికి పెద్దదవుతుంటుంది. అదే విధంగా సుజనుల (మంచివారి) చెలిమి తొలుత అంత ఆసక్తికరంగా లేకపోయినా కాలక్రమేణా అలాంటివారితో మైత్రీబంధం బలపడుతుందని దీని అర్థం. శ్రీకృష్ణుని చెలిమితో పార్థుడు తన జీవితాన్ని పరమపవిత్రం చేసుకున్నట్లు.. మంచివారితో స్నేహం చేసిన వ్యక్తి అవతలివారిలోని మంచితనాన్ని పుణికిపుచ్చుకొని రాణిస్తాడు. దుర్యోధనునితో స్నేహం చేసిన కర్ణుడు అతని దురాశలకు వంతపలికి తన మాన్యతకు మచ్చతెచ్చుకొన్నట్లు.. చెడుగుణాలు కలవానితో స్నేహం చేసినవాడు అన్నివిధాలా చెడిపోతాడు.


సలక్షణాలు కలిగినవారితో స్నేహం చేయడం వల్ల పాపకార్యాలనే పాముల కాటుకు బలికాకుండా ఉంటాం. సజ్జన సాంగత్యం వల్ల  మనసు మంచి పనుల వైపు మళ్లుతుంది. అలాంటివారితో సమాజానికి కూడా మంచే జరుగుతుంది. మంచి పనులు చేయడం వల్ల త్రికరణశుద్ధి కలుగుతుంది. సుగుణ మిత్రుడు తనను ఆశ్రయించిన వారి మనసును బాధించే రహస్యాలను బహిర్గతం చేయడు. అలాంటివారు తమ స్నేహితులను ఆనందమనే నందనవనంలో విహరింపజేస్తారు. వారిని అన్నివిధాలా ఆదుకుంటారు. అవతలివారి ఆపదను తన ఆపదగా భావించి అండగా నిలుస్తారు. అదే.. చెడ్డగుణాలు కలవారితో స్నేహం మహాభయంకరమైన నరకాన్ని తలపిస్తుంది. అది అన్ని విధాల అనర్థాలకూ మూలం. అలాంటివారితో మిత్రత్వమే కాదు.. శత్రుత్వం కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే..

దుర్జనేన సమం సఖ్యం ద్వేషంచాపి నకారయేత్‌
ఉష్ణోదహతి చాంగారః శీతః కృష్ణాయతే కరమ్‌శ్రీ

మండే బొగ్గును (నిప్పును) చేత్తో పట్టుకుంటే చేయి కాలుతుంది. చల్లారిన తర్వాత ముట్టుకుంటే చేతికి మసి అంటి చెయ్యి నల్లగా మారుతుంది. చెడ్డవానితో స్నేహం, ద్వేషం కూడా అలాగే ఉంటాయని దీని అర్థం. అందుకే పొరపాటున కూడా చెడ్డవాని దరిచేరరాదు. అలాంటివారు పరిశుద్ధ మనస్కులనైనా కల్మష చిత్తులుగా మార్చివేసి వేధిస్తారు. సమాజమనే వృక్షానికి వారు చీడపురుగులు. అందువల్ల స్నేహం చేయవలసి వచ్చినప్పుడు చక్కగా ఆలోచించి, బుద్ధిచాతుర్యంతో పరిశీలించి, సన్మార్గులతో చర్చించి, స్వయంగా తెలుసుకొని బుద్ధిమంతులతోనే స్నేహం చేయాలి. అది మానవుణ్ని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేస్తుంది.
జై ఆంజనేయ, జై శ్రీరామ్


ఓం ఆంజనేయాయ నమ:
ఓం మహావీరాయ నమ:
ఓం హనుమతే నమ:
ఓం మారుతత్మజాయ నమ:
ఓం తత్త్వజ్ఞానప్రదాయ నమ:
ఓం సీతాదేవిముద్రాప్రదాయకాయ నమ:
ఓం అశోకవనికాచ్ఛేత్రే నమ:
ఓం సర్వమాయవిభంజనాయ నమ:
ఓం సర్వబంధవిముక్త్రే నమ:
ఓం ర క్షోవిధ్వంసకారాయ నమ:10
ఓం పరవి ద్యాపరిహారాయ నమ:
ఓం పరశౌర్యవినాశనాయ నమ:
ఓం పరమంత్రనిరాకర్త్రే నమ:
ఓం పరయంత్రప్రభేదకాయ నమ:
ఓం సర్వగ్రహవినాశినే నమ:
ఓం భీమసేనసహాయకృతే నమ:
ఓం సర్వదు:హరాయ నమ:
ఓం సర్వలోకచారిణ నమ:
ఓం మనోజవాయ నమ:
ఓం పారిజాతద్రుమూలస్థాయ నమ: 20
ఓం సర్వతంత్రస్వరూపవతే నమ:
ఓం సర్వతంత్రస్వరూపిణ నమ:
ఓం సర్వతంత్రతాత్మికాయ నమ:
ఓం కపీశ్వరాయ నమ:
ఓం మహాకాయాయ నమ:
ఓం సర్వరోగహరాయ నమ:
ఓం ప్రభవే నమ:
ఓం బలసిద్ధిరాయ నమ:
ఓం సర్వవిద్యాసంపత్రప్రదాయకాయ నమ:
ఓం కపీసేనానాయకాయ నమ: 30
ఓం భవిష్యచ్చతురాసనాయ నమ:
ఓం కుమారబ్రహ్మచారిణ నమ:
ఓం రత్నకుండలదీప్తిమతె నమ:
ఓం సంచాలద్వాలసన్నలంబ మానశిఖోజ్జ్వలాయ నమ:
ఓం గంధర్వవిద్యాతత్వజ్ఞాయ నమ:
ఓం మహాబలపరాక్రమాయ నమ:
ఓం కారాగృహవిమోక్త్రే నమ:
ఓం శృంఖలాబంధమోచకాయ నమ:
ఓం సాగరోత్తారకాయ నమ:
ఓం ప్రాజ్ఞాయ నమ: 40
ఓం రామదూతాయ నమ:
ఓం ప్రతాపవతే నమ:
ఓం వానరాయ నమ:
ఓం కేసరీసుతాయ నమ:
ఓం సీతాశోకనివరణాయ నమ:
ఓం అంజనాగర్భసంభూతాయ నమ:
ఓం బాలార్కసదృశాసనాయ నమ:
ఓం విభీషణప్రియకరాయ నమ:
ఓం దశగ్రీవకులాంతకాయ నమ:
ఓం లక్ష్మణప్రాణదాత్రే నమ: 50
ఓం వజ్రకాయాయ నమ:
ఓం మహాద్యుతయే నమ:
ఓం చిరంజీవినే నమ:
ఓం రామభక్తాయ నమ:
ఓం దైత్యకార్యవిఘాతకాయ నమ:
ఓం అక్షహంత్రే నమ:
ఓం కాంచనాభాయ నమ:
ఓం పంచవక్త్రాయ నమ:
ఓం మహాతపసే నమ:
ఓం లంకిణీభంజనాయ నమ: 60
ఓం శ్రీమతే నమ:
ఓం సింహకాప్రాణభంజనాయ నమ:
ఓం గంధమాదనశైలస్థాయ నమ:
ఓం లంకాపుర విదాహకాయ నమ:
ఓం సుగ్రీవసచివాయ నమ:
ఓం ధీరాయ నమ:
ఓం శూరాయ నమ:
ఓం దైత్యకులాంతకాయ నమ:
ఓం సురార్చితాయ నమ:
ఓం మహాతేజసే నమ: 70
ఓం రామచడామణిప్రదాయ నమ:
ఓం కామరూపిణ నమ:
ఓం పింగళాక్షాయ నమ:
ఓం వార్ధిమైనాకపూజితాయ నమ:
ఓం కబళీకృతమార్తాండమండలాయ నమ:
ఓం విజితేంద్రియాయ నమ:
ఓం రామసుగ్రీవసంధాత్రే నమ:
ఓం మహారావణమర్ధనాయ నమ:
ఓం స్ఫటికాభాయ నమ:
ఓం వాగధీశాయ నమ: 80
ఓం నవవ్యాకృతిపండితాయ నమ:
ఓం నవవ్యాకృతిపండితాయ నమ:
ఓం చతుర్బాహవే నమ:
ఓం దీనబంధవే నమ:
ఓం మహాత్మనే నమ:
ఓం భక్తవత్సలాయ నమ:
ఓం సంజీవననగాహర్త్రే నమ:
ఓం శుచయే నమ:
ఓం వాంగ్మినే నమ:
ఓం దృఢవ్రతాయ నమ:
ఓం బకాలనేమిప్రమథనాయ నమ: 90
ఓం హరిమర్కటమర్కటాయ నమ:
ఓం దాంతాయ నమ:
ఓం శాంతాయ నమ:
ఓం ప్రసన్నాత్మనే నమ:
ఓం శతకంఠమదాపహృతే నమ:
ఓం యోగినే నమ:
ఓం రామకథాలోలాయ నమ:
ఓం సీతాన్వేషణ పండితాయ నమ:
ఓం వజ్రదంష్ట్రాయ నమ:
ఓం వజ్రనఖాయ నమ: 100
ఓం రుద్రవీర్యసముద్భవాయ నమ:
ఓం ఇంద్రజిత్ప్రహితామోఘ నమ:
ఓం బ్రహ్మాస్త్రవినివారకాయ నమ:
ఓం పార్థద్వజాగ్రసంవాసినే నమ:
ఓం శరపం జరభేదకాయ నమ:
ఓం దశబాహవే నమ:
ఓం లోకపూజ్యాయ నమ:
ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమ:
ఓం సీతాసమేత శ్రీరామ పాదసేవా దురంధరాయ నమ: 108
పుట్టినరోజు

ఎవరికయినా సరే, పుట్టినరోజు అత్యంత ప్రధానమైన పండగ. శాస్త్రంమీద గౌరవం ఉన్న వాళ్ళు ‘నేను పుట్టినరోజు పండగ చేసుకోను’ అని అనకూడదు. జీవితంలో ఒక లక్ష్యం ఉండాలంటే దానికో శరీరం ఉండాలి. ఆ శరీరాన్ని పరమేశ్వరుడు మనకిచ్చిన గొప్పరోజు అది. అందుకే ఆరోజు దానిని పండగలా చేసుకోమని చెప్పారు. ఎవరికయినా ఒక పుట్టిన రోజు మాత్రమే ఉంటుంది. కానీ అమ్మకు ఎంతమంది బిడ్డలున్నారో అన్ని పుట్టిన రోజులతోపాటూ తను పుట్టిన రోజు కూడా ఉంటుంది. ‘‘అమ్మా! ఈ బిడ్డడిని ప్రసవిస్తే మీరు చనిపోతారు’’ అని చెప్పారు డాక్టర్లు మా అమ్మకు. దానికి మా అమ్మగారన్నారట...‘‘వాడు బతికితే చాలు, నేను ఉండకపోయినా ఫరవాలేదు’’ అని. కానీ ఈశ్వరానుగ్రహం, నా అదృష్టం– ఆవిడ బతికింది, నేనూ బతికాను. మృత్యువు రెండు కోరల మధ్యలోకి చేరి, జారి కిందపడి బతికిన రోజు మా అమ్మకది. అంటే మా అమ్మకు అది మరో పుట్టిన రోజేగా... అందుకే ప్రతి బిడ్డ పుట్టిన రోజు అమ్మకు మరో పుట్టిన రోజవుతుంది.

అందుకే పుట్టిన రోజును ఎలా చేసుకోవాలి? అమ్మకు కొత్త చీర పెట్టి, నమస్కారం చేసి తరువాత మాత్రమే తాను కొత్తబట్టలు కట్టుకోవాలి. అది మర్యాద. సంస్కారవంతుల లక్షణం. అమ్మ సృష్టికర్త, ఈ శరీరాన్ని ఇచ్చింది కాబట్టి ఆమె బ్రహ్మ. తన నెత్తురును పాలగా మార్చి బిడ్డ వృద్ధికి కారణమవుతుంది.. అందువల్ల ఆమె స్థితికర్త. ఓ గైనకాలజిస్టు ‘మాతృదేవోభవ’ పేరుతో ఒక పుస్తకం రాసారు. దానిలో ఆయన కొన్ని విషయాలు చెప్పారు. బిడ్డ పుట్టగానే తల్లి స్తన్యంలో ‘కొలోస్ట్రమ్‌’ అనే ఒక పసుపు పచ్చటి పదార్థం ఊరుతుంది. గర్భసంచీలో కటిక చీకట్లో అప్పటిదాకా ఉన్న బిడ్డ బయటికి వచ్చాక అంత వెలుతురు, అన్ని పెద్ద పెద్ద ఆకారాలు చూసేటప్పటికి లోపల ఉన్న మలం నల్లగా రాయిలా మారిపోతుంది. అది బయటకు వెళ్ళక అడ్డుపడి ఊపిరితిత్తుల, గుండె పనితనాన్ని మందగింపచేస్తుంది. ప్రాణోత్క్రమణం అవుతున్న స్థితిలో పరమ ప్రేమతో అమ్మ బిడ్డను దగ్గరగా తీసుకుని స్తన్యమిచ్చినప్పుడు ఆ కొలోస్ట్రమ్‌ బిడ్డ కడుపులోకి వెళ్లి లోపల అడ్డుపడిన నల్లటి మలం బయటకు వచ్చేసి వాడు ఆయుర్దాయం పొందుతాడు.
అందుకే అమ్మ స్థితికర్త. అమ్మ ప్రళయ కర్త కూడా. ప్రళయం అంటే చంపేయడం కాదు. నిద్రపుచ్చడం స్వల్పకాలిక ప్రళయం. పరమేశ్వరుడు చేసే మహోత్కృష్టమైన క్రియల్లో అదొకటి. అన్ని ప్రాణులకు నిద్రనిస్తాడాయన. అవి నిద్రలో సుఖాన్ని పొందుతాయి. బ్రహ్మ, విష్ణువు, శివుడు... ముమ్మూర్తుల సమాహార స్వరూపం అమ్మ. అందుకే ‘మాతృదేవోభవ’ అని మొదటి నమస్కారాన్ని అందుకుంటుంది. అమ్మతనం కేవలం స్త్రీయందే ప్రకాశిస్తుంది. అమ్మతనాన్ని చూడలేక ఆడతనాన్ని చూసినవాడు హింసింపబడి, నశించిపోతాడు. దేవీ భాగవతంలో అమ్మవారి మహిషాసుర మర్దని స్వరూపం అది. ఎక్కడ ఎవడు ఆడతనంలో అమ్మతనాన్ని చూసి గౌరవించి నమస్కరిస్తాడో వాడు దీర్ఘాయుర్దాయాన్ని పొంది భవిష్యత్‌ బ్రహ్మ అవుతాడు.
అస్తికుడు - నాస్తికుడు

ఒక ఊరిలో ఒక ఆస్తికుడు, ఒక నాస్తికుడు ఎదురెదురు ఇళ్లల్లో ఉండేవారు. ఆస్తికుడు పరమ విష్ణు భక్తుడు. ఆ ఇద్దరూ కొద్దిరోజుల తేడాలో చనిపోయారు. ముందు నాస్తికుడు చనిపోగా.. ఆ తరువాత ఆస్తికుడు మరణించాడు. విష్ణుదూతలు వచ్చి ఆస్తికుణ్ని వైకుంఠానికి తీసుకుని వెళ్లి అక్కడ సభలో విష్ణువును చూపించారు. ఆహా తన భక్తి పండింది అనుకున్నాడు ఆస్తికుడు. ఆ స్వామిని ఎన్నో స్తోత్రాలతో స్తుతి చేశాడు.

ఇంతలో విష్ణు దూతలు వచ్చి అతణ్ని ‘‘పద.. పద’’ అని సభలోంచి తీసుకెళ్లడం ప్రారంభించారు. దానికి అతడు అయోమయంతో.. ‘‘ఎక్కడికి తీసుకుపోతున్నారు?’’ అని వారిని అడిగాడు. ‘‘నువ్వు చేసుకున్న పుణ్యం అయిపోయింది. తిరిగి భూలోకానికి తీసుకుని పోతున్నాం’’ అని విష్ణుదూతలు చెప్పారు. ‘‘నా పుణ్యం అయిపోవడం ఏమిటి? నేను గొప్ప విష్ణు భక్తుణ్ని. నిత్యం ఆ స్వామిని కొలిచాను’’ అన్నాడు ఆస్తికుడు. ‘‘అది నిజమే. కానీ నువ్వు మూడు కారణాలవల్ల తొందరగా వెనక్కి భూలోకానికి వెళ్లిపోతున్నావు. ఒకటి.. నీకు నీ జీవితంలో భక్తి ఒక భాగం మాత్రమే. అందుకే రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక విధినిర్వహణలా పూజచేస్తూ మిగిలిన సమయంలో విష్ణువును ఆలోచనలలోనికి కూడా రానిచ్చేవాడివి కాదు. రెండో కారణం.. ‘స్వామీ! నన్ను వచ్చే జన్మలో గొప్ప ధనవంతుడిగా పుట్టించు.’ అని రోజూ ఆ దేవదేవుని కోరేవాడివి.

అంటే.. నీకు మళ్లీ పుట్టాలని, అదీ ధనవంతునిగా జన్మించాలని కోరిక ఉంది. ఇక మూడో కారణం.. రోజూ పూజ పూర్తవగానే ‘ఒక్కసారి కనబడు తండ్రీ.. చాలు’ అని కోరేవాడివి. అందువల్ల నీకు కేవలం ఒక్కసారి మాత్రమే విష్ణుదర్శనం అయింది. మళ్లీ పుట్టాలనే కోరిక ఉన్నందున భూలోకానికి వెళ్తున్నావు’’  అని చెప్పారు. అదే సమయంలో.. ఆస్తికునికి విష్ణు సభలో నాస్తికుడు కనిపించడంతో అతడు నివ్వెరపోయాడు. ‘‘వీడెలా వచ్చాడిక్కడికి? వీడు నాస్తికుడు కదా?’’ అని అతడు విష్ణుదూతలను అడిగాడు. దానికి వారు.. ‘‘అవును, నిజమే. అయితే, బతికి ఉన్నంతకాలం ఇతడు ‘దేవుడు లేడు. దేవుడు లేడు’ అంటూ.. తెలియక చేసినా నీకంటే ఎక్కువగా భగవన్నామ స్మరణ చేశాడు. వ్యతిరేకంగానైనా సరే.. నీకంటే ఎక్కువగా భగవంతుడి గురించి ఆలోచించాడు. మరొక ముఖ్యకారణం. ఇతడి ఇంట్లో ఇతడు తప్ప అందరూ ఆస్తికులే. ఇతడి భార్య విష్ణుమూర్తి భక్తురాలు. కొడుక్కి నారాయణ అని పేరుపెట్టుకుంది. గడచిన నెలలో వైకుంఠ ఏకాదశి మరునాడు ఉదయం ఆమె పాయసం చేసింది.

వీడు ఇంటి అరుగు మీద కూర్చుని ఆ పాయసం తింటుండగా పొలమారింది. విపరీతంగా దగ్గుతూ ‘నారాయణా చచ్చిపోతున్నానురా!’ అంటూ కొడుకుని పిలిచి, అతడు మంచినీళ్లు తెచ్చేలోపునే మరణించాడు. ఏ కోరికా లేకుండా తన ప్రసాదం తిని, నారాయణ నామస్మరణ చేస్తూ మరణించినందున శ్రీమహావిష్ణువు వీడికి వైకుంఠంలో నివాసం కల్పించారు’’ అని చెప్పారు. భక్తితో పాటు భావన కూడా చాలా ముఖ్యమని ఆస్తికుడు చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు. అయితే.. మరుజన్మలో అతడు తన పాత తప్పుల్ని పునరావృతం చేయలేదు. మనసారా విష్ణువును కొలిచి, చేసిన కర్మల ఫలితాన్ని ఆ పరమాత్మకు ధారపోయడం ద్వారా పాప, పుణ్యాలు అంటని మహా యోగి అయ్యాడు. తెలియక చేసినా భగవన్నామ స్మరణతో నాస్తికుడు వైకుంఠంలో స్థానం పొందితే.. మరుజన్మలో స్వామిని త్రికరణశుద్ధిగా పూజించిన పుణ్యంతో ఆస్తికుడు చివరకు ఆ స్వామి హృదయంలోనే చోటు సంపాదించుకున్నాడు. జనన, మరణ చక్రం నుంచి విముక్తి పొందాడు.
జీవితమే ఒక పరీక్ష


జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటాం. జీవితమే మనకొక పరీక్ష అని తెలిసేసరికి డీలాపడిపోతాం. పరీక్షలు లేకపోతే ఫలితాలు ఎలా వస్తాయి? ఫలితాలు తెలియకపోతే మన గుణగణాలు ఎలా తెలుస్తాయి? పరీక్షకు సిద్ధపడటంలోనే మనిషి గొప్పదనం ఉంది.
బంగారానికి అగ్నిపరీక్ష ఉంటుంది. వజ్రానికి కోత పరీక్ష ఉంటుంది. జ్ఞానం పొందాలంటే అడుగడుగునా పరీక్షలకు సిద్ధపడాలి.
బతుకులో ఈ పరీక్షల తాకిడి ఏమిటని చాలామంది బాధపడతారు. పరీక్ష లేకుండా ఉత్తీర్ణత సాధించాలనుకుంటారు.
చిన్న చిన్న పరీక్షలు రాస్తూ ఒక్కసారిగా పెద్ద పరీక్ష రాస్తాం. విజయం సాధించినప్పుడు మన కళ్లలో సంతోషం, హృదయంలో ఆనందం వద్దన్నా కలుగుతాయి. మళ్లీ మళ్లీ విజయాలు సాధించడానికి పరీక్షలు ఎదుర్కొంటాం. పక్షికి తుపాను పరీక్ష, పాముకు గద్ద పరీక్ష!
‘నన్ను పరీక్షించకు దేవా. నీ పరీక్షలకు తట్టుకోలేను...’ అని భక్తులు భగవంతుడికి మొరపెట్టుకుంటూ ఉంటారు. పరీక్షలు నలిపేస్తాయి. తడిగుడ్డ పిండినట్లు మనుషులను పిండేస్తాయి. కొందరు తట్టుకోగలుగుతారు. కొందరు తట్టుకోలేరు. పరీక్షాకాలంలో మనకు సరైన మార్గదర్శకత్వం ఉండాలి. అవగాహన చేసుకోగలిగే మంచి మేధ ఉండాలి. ఓర్చుకోగలిగే హృదయం ఉండాలి.
పరీక్షాకాలంలో భగవంతుడు మనిషికి తప్పక సహాయం చేస్తాడు. అదేమిటి- పరీక్షలు భగవంతుడే కదా పెడతాడు. మళ్లీ ఆయనే రక్షిస్తాడా అని సందేహం కలుగుతుంది. నిజానికి, దేవుడు పరీక్షలు పెట్టడు.
మనం చేసిన మంచో, చెడో మన ముందుకు వచ్చి పరీక్షల రూపంలో నిలబడతాయి. వాటిని అనుభవించి తీరాలి. ఆ బరువులు మొయ్యడానికి తట్టుకోలేక గోలపెడుతుంటే దైవం సహాయం చేస్తాడు.
ధర్మరాజు జూదం ఆడాడు. అందరినీ రాజ్యాన్నీ ఓడాడు. అరణ్యవాసం, అజ్ఞాతవాసానికి సిద్ధపడ్డారు
పాండవులు. ఎన్నో కష్టాలు, బాధలు. అదంతా ఒక పరీక్షగా తీసుకున్నారు. శ్రీకృష్ణుడి సహాయంతో గట్టెక్కారు. కష్టాలు రాకుండా ఉండవు. పరీక్షలు లేకుండా ఉండవు. సహాయం చేసే చెయ్యి మన వెనక ఉందన్న ధీమా నిలబెడుతుంది, గెలిపిస్తుంది.

జీవితం ఒక పరీక్ష అని తేలిపోతే చాలా సుఖంగా ఉంటుంది. దాన్ని విజయవంతంగా ఎదుర్కోవడానికి అన్ని శక్తియుక్తులతో మనిషి ఒక కచ్చితమైన ప్రణాళిక సిద్ధం చేసుకుంటాడు. ఆట ఆడాలి. ఆడుతూ ఎన్నో అవరోధాలు, అడ్డంకులు దాటుతూ విజయ పరీక్షకు నిలబడాలి.

కుంతీదేవి ఎన్నో కష్టాలు అనుభవించింది. తనకు మరిన్ని కష్టాలు ఇచ్చి పరీక్ష పెట్టమంది. ఆ విధంగా, ఆ వేదనలో దైవాన్ని నిరంతరం వేడుకుంటూ దగ్గరగా ఉంటానని చెప్పింది. మనిషికే కాదు, భగవంతుడికీ పరీక్షలు ఉంటాయి. దైవాన్ని నమ్మని మనిషే భగవంతుడికి ఒక పెద్ద పరీక్ష! అతడిని తన వైపు తిప్పుకోవడానికి ఎన్నో హృదయానుభవాలు కలిగిస్తాడు. నమ్మని మనిషి, అవన్నీ కాకతాళీయంగా జరిగాయని కొట్టిపారవేస్తుంటాడు. నమ్మినవాడి గురించి దైవం పట్టించుకోకపోయినా ఫరవాలేదు. నమ్మని వాడితోనే పెద్ద చిక్కు.
ఒక్కోసారి దేవుడే మనిషి రూపంలో దిగివచ్చి, కొంతమంది మనుషులను మార్చిన ఉదంతాలు వినిపిస్తుంటాయి. ఇంతకు మించి దైవానికి పరీక్ష ఏముంది?
పెద్దల దీవెనలు

పవిత్రతను నింపుతూ దివ్య సంకల్పంతో భగవదాశీస్సులను అందించే శుభకామనను దీవెన అంటాం. మతాలకు అతీతంగా పెద్దలు అందించే దీవెనలు మహత్వ పూర్ణమైనవి! విశ్వాసంతో కూడిన భక్తుల ప్రార్థనలు భగవంతుడి అనుగ్రహానికి పాత్రమవుతాయి. భగవదనుగ్రహం పొందిన గురువులు, రుషులు, యోగీశ్వరులు, మునీశ్వరులు- పిన్నలకు ఆశీస్సులు అందించే యోగ్యత కలిగి ఉంటారు. ప్రథమ గురువులైన తల్లిదండ్రులు బిడ్డలకు దివ్యాశీస్సులు అందించే మొదటి అర్హత గలవారని శాస్త్రాలు చెబుతాయి.
పరిపూర్ణ, ప్రసన్నచిత్తులైన మహనీయుల ఆశీస్సులకు ఎంతో బలం ఉంటుందని పురాణేతిహాసాల్లోని అనేక కథలు తేటతెల్లం చేస్తాయి.
 
మనిషి సదా మంచి ఆలోచనలు చేయాలి. మంచినే సంకల్పించాలి. మంచినే ఆచరించాలి అన్నది వేదాలు చెప్పిన నీతి నియమావళి. ఏది సంకల్పిస్తే అదే జరుగుతుందన్న భావనకు శాస్త్రీయ ఆధారం లేకపోయినా మంచి ఆలోచన చేయాలన్న స్మృతులు, శ్రుతులు, పురాణాలు, ఇతిహాసాల ప్రబోధకు ఆచరణ సాధ్యమైన ప్రాధాన్యం ఉంది. చిన్న పిల్లలను ‘శతమానం భవతి’ అంటూ దీవిస్తాం. వారికి సదా మంచి జరగాలని ఆశిస్తాం. పదేపదే చేసే ఆలోచన సంకల్పాన్ని ధరిస్తుంది. అలాంటి సంకల్పాలు మనల్ని కర్తవ్యోన్ముఖులను చేస్తాయి. సంకల్పం బలపడినప్పుడు కర్మలు చేస్తాం. పునరావృతమయ్యే ఆలోచనలకు అంతబలం ఉంటుంది కాబట్టి మంచి ఆలోచనలు చేయాలనే వాదానికి ప్రాముఖ్యం ఉంది.
దుఃఖ సమయంలో ప్రజలు దైవాన్ని ఆశ్రయించి అనుగ్రహం కోరతారు. పూర్వ కర్మల ఫలితంగా కష్టాలు నిర్ధారణ అయినవైతే, దైవప్రార్థన వల్ల కర్మ ఫలితం తొలగుతుందా అన్న సందేహం సాధకులకు కలుగుతుంది. మనసారా ప్రార్థనలు చేస్తే దైవానుగ్రహం లభిస్తుందని దుష్కర్మలు దగ్ధమై వాటి పరిణామాలు అనుకూలంగా మారతాయని పెద్దలు చెబుతారు. పెద్దల దీవెనలు శుభప్రదమని, వారి వాత్సల్య భావానికి పిన్నల జీవితాలను ఆనందదాయకం చేసే శక్తి ఉందని పండితులంటారు.
జీవుల ఆనందం కోసమే భగవంతుడు సమస్త జగత్తును సృజించాడు. అందుకు కారణం ఆయన ఆనంద స్వరూపుడు కావడమే. కష్టాలు వాటిల్లవచ్చనే భయంతో మానవుడు ఆనంద క్షణాలకు దూరం కాకూడదు. సదా మంచి జరగాలనే భావనలో ఆశావహ స్వరూపం ఉంది. పెద్దలు, పిన్నల మంచి కోరుతూ అందించే మంగళాశాసనమే ఆశీర్వచనం. విశ్వకల్యాణం కోరి పవిత్ర క్షేత్రాల్లో జరిపే క్రతువులు మానవాళికి చల్లని దీవెనలు అందిస్తాయి. క్షేత్రదర్శనం వల్ల భక్తుల హృదయాల్లో మంగళకరమైన భావనలు ఆవిర్భవిస్తాయి.
సాటివారికి మంచి జరగాలనే ప్రతి తలంపూ ఓ చల్లని దీవెనే. ఒకరికి మేలు జరగాలన్న ఆలోచనలకు పవిత్రమైన పునాది ఉంటుంది. అలాంటి తలంపులు సదా పరిమళంతో గుబాళిస్తాయి. ప్రతికూల ఆలోచనలు చేసినవారికి మానసికమైన నష్టం కలుగుతుంది. మంచి ఆలోచనలతో సాకారమైన కార్యంవల్ల అందరూ లాభం పొందుతారు.
సమాజ శ్రేయాన్ని కోరే శుభకామనలు సమూహ ఆత్మశక్తిని సంతరించుకుని ఊహాతీతమైన ఫలితాలు అందిస్తాయి. మంచి ఆలోచనలు వాక్‌ రూపాలై దీవెనలుగా సత్‌ పురుషుల నోటి నుంచి వెలువడతాయి. శుభాలు ఆకాంక్షిస్తూ పెద్దలు అందించే దీవెనలు వినాలని, అవి నిజం కావాలని ప్రతివారూ ఉవ్విళ్లూరుతుంటారు!
అహంకారం

పురాణాలు, ఇతిహాసాలు, చారిత్రక సంఘటనలు... గర్వం, అహంకారం మనిషి పతనానికి హేతువులని చాటుతున్నాయి. అహంకారం శాస్త్రీయత లేని తత్త్వమని మానసిక వైద్యనిపుణులు అంటారు. తమ గురించే తాము సదా ఆలోచిస్తూ ఇతరులను అకారణంగా చిన్నచూపు చూడటం, తప్పుల్ని వెతకడం... అహంకారంలోని తీక్ష్ణత. తన సంక్షేమమే, తన హితమే అహంకారి లక్షణం. మౌర్య సామ్రాజ్యానికి చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైనప్పుడు చంద్రగుప్తుడికి చాణక్యుడు ఒక సూచన చేస్తూ- ‘రెండు కారాల్ని వదిలేస్తేనే నీకు సంక్షేమ పాలనలోని పరమానందపు రుచి తెలుస్తుంది. అవే అహంకారం, మమకారం’ అని చెబుతాడు. ఇతరుల్లోని చెడును అన్వేషిస్తూ వారిని అవమానించడం కచ్చితంగా అహంకారమే! ఎన్నడూ లేనివాటిని ఉన్నట్లుగా, ఉన్న వాటిని లేనట్లుగా అహంకారులు ఊహించుకొంటారు. ఆత్మజ్ఞానం కలిగిన వారు, ఎప్పుడూ ఉన్నవాటిని ఉన్నట్లుగా... లేనివాటిని లేనట్లుగానే భావిస్తారు. ధర్మం, దైవబలం పాండవుల వద్ద ఉన్నాయి. యుద్ధం వద్దని కురు వృద్ధులు ఎంత చెప్పినా, అహంకారానికి ప్రతిరూపమైన దుర్యోధనుడు వినలేదు. పాండవుల దగ్గర ఉన్నదానికన్నా గొప్ప బలం తన వద్దే ఉందని గర్వపడి, కడకు వంశ నాశనానికి కారణమయ్యాడు. అందుకే అహంకారాన్ని మనిషిలోని బలహీనతగా విజ్ఞులు భావిస్తారు.

అహంకారంలో అహం (నేను) అనే భావానికే అధిక ప్రాధాన్యం వినాశకారకం. ‘నేను’ అనే యోచన తగనిదని శ్రీ శంకర భగవత్పాదులు వివేక చూడామణిలో చెప్పారు. ఇంకొకరిలోని గొప్పతనాన్ని అహంకారులు అంగీకరించరు. వాడా... వాడికేం తెలుసు- అనడం వీరి నైజం. శ్రీకృష్ణుడిలోని దైవత్వాన్ని అంగీకరించలేక శిశుపాలుడు తన మరణాన్ని కొనితెచ్చుకొన్నాడు. దక్షిణాఫ్రికాలో రైలులో మొదటి తరగతి పెట్టెలో ప్రయాణిస్తున్న గాంధీని శ్వేత జాతీయుడు అహంకారంతో అవమానించడం తెలిసిందే. ఆ అతి ధోరణి కారణంగానే తనలో భారత జాతీయ స్వాతంత్య్ర పోరాటానికి అంకురారోపణ జరిగిందని ఆత్మకథలో బాపూజీ వెల్లడించారు. స్వేచ్ఛను ప్రేమించడం అంటే ఇతరుల్ని ప్రేమించడం... మనల్ని మనమే ప్రేమించుకోవడం అహంకారమని కబీరుదాస్‌ అమృతవాణి చెబుతోంది.

తాను బలవంతుణ్నని అహంకరించడం తగనిదని... ఎంతో బలం ఉన్నా పాము చలిచీమల చేత చిక్కి మరణిస్తుందని సుమతీ శతకకారుడు బద్దెన స్పష్టీకరించాడు. మన గురించి మనకు ఎంత ఎక్కువగా తెలిస్తే అంత తక్కువ అహంకారం. ఎంత తక్కువగా తెలిస్తే అంత ఎక్కువ అహంకారమని మన వేమన అనే పుస్తకంలో ఆరుద్ర రాశారు. నాకన్నీ తెలుసునని ఎవరికి వారు అనుకోవడమంత మూర్ఖత్వం మరొకటి లేదు.

ఎనిమిదో శతాబ్దంలో నివసించినట్లు భావిస్తున్న గొప్ప తత్వవేత్త మండన మిశ్రుడికి ఎనలేని అహంకారం. మీమాంస, అద్వైత దర్శనాలపై ఆయన రచనలు చేశాడు. గర్వంతో శంకరాచార్యులతో తర్క గోష్ఠిలో పాల్గొంటాడు. చివరికి ఓటమిని ఒప్పుకొని సముద్ర జలం లాంటి విజ్ఞానంలో తనకు తెలిసింది గరిటెడు మాత్రమేనని అంగీకరించి శంకరులను గురువుగా స్వీకరిస్తాడు. శంకరాభగవత్పాదులు మండన మిశ్రుడికి సురేశ్వరాచార్యులని పేరుపెట్టి ఆయనలోని జ్ఞానాన్ని తగిన రీతిలో సత్కరించి దక్షిణామ్నాయ మఠమైన శారదా పీఠానికి తొలి పీఠాధిపతిగా నియమిస్తారు. విజ్ఞుడికి, అహంకారికి ఉన్న తేడా అదే.
పెద్ద గాలికి నిలువెత్తు వృక్షాలు నేలకూలతాయి. వెదురు మొక్క మాత్రం గాలితో పాటు వంగి, కూలకుండా నిలిచి గాలి జోరు తగ్గగానే నిటారుగా అయ్యి బతుకుతుంది. అందుకే విజ్ఞుల ముందు విర్రవీగడం మాని, తల వంచడం సైతం నేర్చుకోవాలి. లేకపోతే ఎంతటివారైనా చతికిలపడక తప్పదు.
ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది ...

దయచేసి షేర్ చేయండి

1. గణనాయకాష్టకం - అన్ని విజయాలకు.

2. శివాష్టకం - శివ అనుగ్రహం..

3. ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం...

4. శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది...

5. అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి....

6. కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం...

7. దుర్గష్టోత్తర శతనామం - భయహరం..

8. విశ్వనాథ అష్టకం - విద్య విజయం..

9. సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం..

10. హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ...

11. విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి...

12. శివ అష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి...

13. భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి...

14. శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం...

15. లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం , పీడ నాశనం.

16. కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం..

17. ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత..

18. శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం..

19. లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి..

20. శ్యామాల దండకం - వాక్శుద్ధి..

21. త్రిపుర సుందరి స్తోత్రం - సర్వజ్ఞాన ప్రాప్తి..

22. శివ తాండవ స్తోత్రం - రథ గజ తురంగ ప్రాప్తి...

23. శని స్తోత్రం - శని పీడ నివారణ...

24. మహిషాసుర మర్ధిని స్తోత్రం - శత్రు నాశనం..

25. అంగారక ఋణ విమోచన స్తోత్రం - ఋణ బాధకి...

26. కార్యవీర్యార్జున స్తోత్రం - నష్ట ద్రవ్యలాభం..

27. కనకధార స్తోత్రం - కనకధారయే...

28. శ్రీ సూక్తం - ధన లాభం..

29. సూర్య కవచం - సామ్రాజ్య సిద్ది..

30. సుదర్శన మంత్రం - శత్రు నాశనం...

31. విష్ణు సహస్ర నామ స్తోత్రం - ఆశ్వమేధయాగ ఫలం...

32. రుద్రకవచం - అఖండ ఐశ్వర్య ప్రాప్తి..

33. దక్షిణ కాళీ - శని బాధలు , ఈతిబాధలు...

34. భువనేశ్వరి కవచం - మనశ్శాంతి , మానసిక బాధలకు..

35. వారాహి స్తోత్రం - పిశాచ పీడ నివారణకు...

36. దత్త స్తోత్రం - పిశాచ పీడ నివారణకు..

37. లలిత సహస్రనామం - సర్వార్థ సిద్దికి...

నిత్యము భగవన్నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశిస్తాయి
.........................................................
సమస్యలు తీర్చే దత్తాత్రేయ మంత్రాలు

దయచేసి అందరికీ తెలిసేందుకు షేర్ చేయండి

1.సర్వ బాధ నివారణ మంత్రం.

"నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో ||
సర్వ భాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే||"

2. సర్వరోగ నివారణ దత్త మంత్రం.

"నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో||
సర్వ రోగ ప్రశమనం కురు శాంతిమ ప్రయచ్ఛమే||"

3. సర్వ కష్ట నివారణ దత్త మంత్రం.

"అనసూయాత్రి సమభూతో దత్తాత్రేయో దిగంబర: స్మర్తృగామీ స్వభక్తానాం ఉధ్ధర్తా భవ సంకటాత్||

4.దరిద్ర నివారణ దత్త మంత్రం.

"దరిద్ర విప్రగ్రేహే య: శాకం భుక్త్వోత్తమ శ్రియమ||
దదౌ శ్రీ దత్త దేవ: సదా దారిద్ర్యాత్ శ్రీ ప్రదోవతు||"

5.సంతాన భాగ్యం కోసం దత్త మంత్రం.

"దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతం||
యో భూదభీష్టదః పాతు సనః సంతాన వృద్ధికృత్||"

6. సౌభాగ్యం కోసం దత్త మంత్రం.

"జీవయామాస భర్తారం మృతం సత్యాహి మృత్యుహా||
మృత్యుంజయః స యోగీంద్రః సౌభాగ్యం మే ప్రయచ్ఛతు||"

7. అప్పులు తీరుటకు, అప్పుగా ఇచ్చిన ధనం తిరిగి రావడం కోసం దత్త మంత్రం.

"అత్రేరాత్మ ప్రదానేన యోముక్తో భగవాన్ ఋణాత్||దత్తాత్రేయం తమీశానం నమామి ఋణముక్తయే||"

8. సర్వ పాప నివారణ దత్త మంత్రం.

అత్రిపుత్రో మహాతేజా దత్తాత్రేయో మహామునిః||తస్య స్మరణ మాత్రేన సర్వ పాపైః ప్రముచ్యతే||

9.దత్తాత్రేయ అనుగ్రహ మంత్రం.

అనసూయాసుత శ్రీశ జనపాతక నాశన||
దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదో భవ||

10. ఉన్నత విద్య కోసం దత్త మంత్రం.

విద్వత్సుత మవిద్యం య అగతం లోక నిందితం|| భిన్న జిహ్వం బుధం చక్రే శ్రీ దత్తః శరణం మమ||

11. పోగొట్టుకున్న వస్తువులు, దొంగలించ బడ్డ ధనము లేక వస్తువుల తిరిగి పొందుటకు..

కార్త వీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్|| తస్య స్మరణ మాత్రేన హృతం నష్టంచ లభ్యతే||

విధానం

ఈ మంత్రాలలో మీ సమస్యకు తగట్టు ఏది అవసరమో ఆ మంత్రాన్ని రోజు 108 సార్లు లేక సమస్య తీవ్రత బట్టి 1008సార్లు గాని రోజూ ఉదయం జపం చేయాలి.. ఇలా 41 దినములు చేయాలి ..

జై గురుదత్త
జయ జయ శంకర - హర హర శంకర

భౌమాశ్విని - 16th-Jun-2020 & 14th-July-2020

భౌమాశ్విని (అశ్విని నక్షత్రంతో కూడిన మంగళవారం అరుదుగా లభ్యమయ్యే యోగం.) నాడు దేవీ అధర్వశీర్షం ప్రకారం దేవీమంత్రపారాయణ చేయడం ద్వారా మహామృత్యువును కూడా తరమవచ్చు. కంచి కామకోటిపీఠ మూలామ్నాయ సర్వజ్ఞపీఠాధిపతులు, జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ శంకరవిజయేంద్ర సరస్వతీ మహాస్వామి వారి సందేశ సారం

భౌమాశ్విన్యాం మహాదేవీసన్నిధౌ జప్త్వా మహామృత్యుం తరతి !
స మహామృత్యుం తరతి ! య ఏవం వేద ! ఇత్యుపనిషత్!

భౌమాశ్విని పర్వదినం నాడు అనగా 16 Jun 2020 మంగళవారం, ఏకాదశి తిథి, అశ్విని నక్షత్రం నాడు అమ్మవారి అనుగ్రహం కోసం సర్వులూ
*శంకరులు కైలాసం నుంచు తెచ్చిన మంత్రరూపమైన స్తోత్రం సౌందర్యలహరి,*

*లలితా సహస్ర నామ పారాయణం,*

*విరాట పర్వంలోని అమ్మవారి స్తోత్ర పారాయణం,*

*సప్తశ్లోకి పారాయణం,*

*దుర్గా చంద్రకళా స్తుతి పారాయణం,*

*అచ్యుతానంతగోవింద నామజపం*

యథాశక్తి చేయవలెను. చండీపాఠ పారాయణం, జపం, హోమం ఇంట్లోకానీ, గుడిలోకాని ప్రజలు ఎక్కువ గుమిగూడకుండా, ప్రజా క్షేమం కోరి నిర్వహించాలి. ఈ భౌమాశ్వని పర్వకాలంలో చేసే అనుష్ఠానానికి మన నిత్య అనుష్ఠానానికన్నా ఎక్కువ ఫలితాలుంటాయి. యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ..

రోగానశేషా నపహంసి తుష్టా దుష్టాతుకామాన్ సకలాబభీష్టాన్
త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యా శ్రయతాం ప్రయాంతి !!

స్వర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి
ఏవమేవ త్వయా కార్యం అమద్వైరి వినాశనం !!

ఈ సందర్భంగా అమ్మవారి అనుగ్రహం తో పరాశక్తి అనుగ్రహంచేత మహాశక్తిమంతులుగా మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రార్థన - ప్రయత్నం రెండూ చేసుకోవాలి...

- కంచి కామకోటిపీఠ జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ శంకరవిజయేంద్ర సరస్వతీ మహాస్వామి
🙏ఒక ఆవు అడవిలో గడ్డి మేస్తుండగా, ఒక పులిని చూసి పారిపోసాగింది🙏

పులి బారినుండి తప్పించుకోవడానికి ఆ ఆవు ఒక నీళ్ళులేని, బాగా బురదగా ఉన్న చిన్న చెరువులో దూకేసింది. ఆ ఆవును తరుముకుంటూ వస్తున్నద పులి కూడా ఆ తమకంలో ఆ బురదగా ఉన్న చెరువులో దూకేసింది.

ఆ రెండు ఆ నీళ్ళు లేని బురదతో ఉన్న చెరువులో ఎంత ఒకదాని మీద ఒకటి పడ్డా, ఆ చెరువులో నుండి బయట పడటం వాటి వల్ల కాలేదు.

పులి ఆవుని చూసి, ” ఇప్పుడు నీ ఎముకలు పరపరా నమిలేయాలని ఉంది ” అన్నది.

ఆ పులి ఆవు పైకి పంజా విసరాలని శతవిదాల ప్రయత్నించి విఫలమైంది. ఆ బురదలో నుండి తప్పించుకోలేక నిస్సహాయురాలైంది.

అప్పుడా ఆవు పులిని చూసి నవ్వి, ”నీకు యజమాని ఎవరైనా ఉన్నారా? అనడిగింది

పులి, "”ఏం మాట్లాడుతున్నావు. ఈ అడవికి యజమానిని నేనే!! నువ్వెందుకు అలా అడుగుతున్నావు. నాకు నేనే కదా యజమానిని” అని గర్వంగా గర్జించింది.

అప్పుడా ఆవు ”నువ్వీ అడవికి రాజువే కావచ్చు. కానీ ఇప్పుడు నిన్ను నీవు రక్షించుకోలేని స్థితిలో ఉన్నావు కదా”అన్నది..

పులి ”నీ పరిస్థితి అంతే కదా!! నువ్వు ఈ బురదలో కూరుకుని ఉన్నావు కదా!! ఆకలితో చస్తావు కదా”అన్నది.

అప్పుడా ఆవు ”నేను చావను.”అన్నది.

ఈ అడవికి రాజునైన నేనే ఈ బురదలో కూరుకుని పోయి బయటకు రాలేక పోతున్నాను. నువ్వొక సాధుజంతువైన నిన్ను ఎవరు రక్షిస్తారు” అన్నది పులి.

నిజమే !! నన్ను నేను రక్షించుకోలేను. కానీ నా స్వామి నన్ను రక్షిస్తాడు. సూర్యాస్తమయం అవ్వడంతో నేను ఇంటికి చేరక పోవడంతో నన్ను వెతుక్కుంటూ వస్తాడు. నన్ను ఈ బురదనుండి పైకి లేపి నన్ను రక్షించి, మా ఇంటికి నన్ను తీసుకువెడతాడు.”అని మధురంగా, మెల్లగా చెప్పింది.🙏

పులి స్థబ్దురాలై, దిగాలుపడిపోయింది.

సూర్యాస్తమయం కాగానే, ఆవు చెప్పినట్లు, దాని యజమాని వచ్చి, ఆవు దురవస్థ చూచి, ఆ బురదలో నుండి దానిని పైకి తీశాడు. దానిని ఇంటికి తీసుకుపోయాడు. ఆ ఆవు యజమాని దయపట్ల ఎంతో కృతజ్జత మనస్సులోనే చెప్పుకుంది. ఆవు దాని యజమాని, పులి దురవస్థకు చింతించారు. కానీ దాని దురహంకారం వారిని దాని దగ్గరకు చేరనివ్వలేదు

మనం ఆధ్యాత్మికంగా పరిశీలిస్తే, ఆవు శరణాగతి చేసినవాడికి ప్రతీక. పులి సామాన్య మానవునిలో ఉన్న అహంకారపూరిత మనస్సుకు ప్రతీక. యజమాని గురువు లేదా మన స్వామి. బురద మన చుట్టూ ఉన్న ప్రపంచం, ఆకర్షణలు, పులి ఆవును తరుముకు రావడం మన జీవిత పోరాటం అన్నమాట.

జీవిత పోరాటం అలసిపోయి, ఏమీ చేతకాక, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడే దైవాన్ని ప్రార్దించడం కాక, మనకు స్వామి ఒకడు ఉన్నాడు అని ఎల్లప్పుడూ అనుకుంటూ మనం ఆ స్వామికి శరణాగతి చేస్తే, దైవమయిన ఆ యజమాని జీవన సమరంలో మనం ఓడిపొతున్నప్పుడు, ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు ”నేనున్నాను” అంటూ వచ్చి మనలను పంకిలం నుండి లేవదీసి ఈ భవబంధాల నుండి విముక్తి ని ప్రసాదిస్తాడు. కాదంటారా?🙏
🙏ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే మిమ్మల్నీ కాపాడుతుంది🙏
విచిత్ర వినాయక దేవాలయము..!!💐శ్రీ💐

తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది. అదే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం.

ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా...పిట్ట కొంచం కూత ఘనం అన్నట్టు, ఈ ఆలయం ఘనత మాత్రం చాలా గొప్పది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం.

ఉత్తరాయణ కాలం (మార్చి నుంచి జూన్) వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు.
దక్షిణాయన కాలం(జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం.

అతిశయ వినాయగర్ ఆలయంలో మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ.., నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది ఇక్కడున్న ఈ బావి. ఇక్కడ వున్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది.

వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి..,
వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి.

అంతేకాదు, ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉంది. సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే.

కానీ, ఈ ఆలయంలో ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తారు.

చారిత్రక ప్రాశస్త్యం:.💐
ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారనీ, ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదనీ, చరిత్రకారుల అంచనా మాత్రమే కాదు, స్ధానికులు కూడా అదే చెప్తారు.

నిజానికిది శివాలయం. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని అంటారు.

ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా, ఈ ఆలయాన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించడం జరిగింది. ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. తర్వాతి కాలంలో రాష్ట్రాలు విడిపోయాక, ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో, కేరళ ప్రభుత్వం ఆధిపత్యం తగ్గింది. జై గణేశా..!!
సర్వేజనా సుఖినోభవంతు
రేపు 23/6/2020 పూరి జగన్నాథ్ రథయాత్ర👍💐💐

ఆషాఢ శుద్ధ విదియ నాడు మోక్ష క్షెత్రమైన "పూరీ" లో జగన్నాధ బలభద్ర సుభద్ర రధయాత్ర అత్యంత వైభవం గా జరుగుతుంది.

జగత్ప్రసిద్ధమైన ఈ రధయాత్ర పరమ పావనం.

"రధస్థం వామనం ద్రుష్ట్వా పునర్జన్మ న విద్యతే " --
రధాన్న ఉన్న వామనుని చుసిన వారికి పునర్జన్మ ఉండదు .

ఈ రోజునే శ్రీ రాముని రథోత్సవం అని ధర్మశాస్త్ర వచనం !

విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఇది .

హరె రామ హరె రామ రామ రామ హరె హరె
హరె కృష్ణ హరె కృష్ణ కృష్ణ కృష్ణ హరె హరె