Devotional Telugu
3.46K subscribers
106 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
ఆకర్షణ

భూమ్మీద ప్రతి పదార్థం భూమ్యాకర్షణకు లోబడి ఉంటుంది. భూమికి ఆకర్షణ శక్తి లేకపోతే, పట్టులేకుండా అన్నీ గాలిలో తేలుతూ ఉంటాయి. భూమ్మీద స్థిరత్వం లేకపోతే జీవి మనుగడే ప్రశ్నార్థకమయ్యేది.
గ్రహాలెన్నో ఉండగా భూమ్మీద జన్మించడం మన అదృష్టం. అయస్కాంతం తన ఆకర్షణ శక్తితో ఇనుమును తనవైపు లాక్కుంటుంది. అయస్కాంత శక్తి ఎంత బలంగా ఉంటే, దాని పరిధి అంత విస్తృతమై, దూరాన ఉన్న ఇనుమును సైతం ఇట్టే ఆకర్షించి అతుక్కుంటుంది.
మనిషి తన అందంతో, మనసుతో ఇతరులను ఆకర్షిస్తాడు. ఇతర జీవాలు తమకు ప్రకృతి ప్రసాదిత దైహిక అందంతో ఆకర్షించినా- ఒక్క మనిషి మాత్రం తన ప్రవర్తన, నడవడిక, మనసుతో అందర్నీ ఆకర్షిస్తాడు. సమస్త జీవజాతిలో మనిషికి మాత్రమే దక్కిన అపురూప వరం ఇది. తన ప్రవర్తనను విచక్షణతో సరిదిద్దుకుని అందరికీ దగ్గరయ్యేలా చేసుకునే అవకాశం ఒక్క మానవుడికి మాత్రమే ఉంది.
మనకు నిత్య జీవితంలో కొంతమంది దగ్గరవుతారు. మరి కొంతమంది మన సాన్నిహిత్యాన్ని ఇష్టపడక, దూరమవుతారు. కారణం- మన మనసుకున్న ఆకర్షణ, వికర్షణల ప్రభావం.

పట్టువస్త్రాలు, ధగధగలాడే నగలు, దీపధూప నైవేద్యాలతో అలంకరించిన భగవంతుడి దివ్యమంగళ విగ్రహం భక్తులను ఆకర్షించి, తన్మయత్వానికి గురిచేస్తుంది. ఆ భక్తిభావం వారి మనసులో స్థిరంగా నిలిచిపోతుంది. స్వామి దర్శనానంతరం ఆలయం నుంచి బయటకు రాగానే భక్తులకు ఎదురుపడేవారు ముందుగా అడిగే ప్రశ్న- ‘దర్శనం బాగా అయ్యిందా?’ అని. దర్శనానికి అంతటి ప్రాధాన్యం ఉంది. ముక్తికి దారిచూపే వంతెన- సర్వాలంకృత స్వామిసమ్మోహన రూపం.
‘మన ఆలోచనలకు ఎంత ఆకర్షణ శక్తి ఉంటే- మనం అనుకున్నది అంత త్వరగా, సంపూర్ణంగా పొందగలుగుతాం’ అంటారు రోండా బర్న్‌ ‘ద సీక్రెట్‌’ పుస్తకంలో. అల్కెమిస్ట్‌ పుస్తకంలో పాలో కొలొ- మనం దేన్ని బలంగా కావాలని కోరుకుంటే, ప్రకృతి సహకరించి అసంఖ్యాకంగా ఉన్న వనరుల నుంచి అవసరమైనదాన్ని ఆకర్షించి మనకు సొంతమయ్యేలా చేస్తుందంటాడు.
మనసు చాలా చిత్రమైంది. అది రోజుకు సుమారు అరవై వేల ఆలోచనలకు నెలవవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. నిరంతర ఆలోచనల పర్యవేక్షణ సాధ్యం కాదు. అన్ని ఆలోచనలూ సవ్యమైన రీతిలో సాగవు. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అపసవ్యంగా పరిభ్రమిస్తూ, మనసును తద్వారా మనుషులను తప్పుదారి పట్టిస్తుంటాయి. పిచ్చెక్కిస్తుంటాయి. ఎంత త్వరగా అందులోంచి మన మనసును బయటపడేస్తే, అంత త్వరగా మనోవికా సాన్ని పొందుతాం. అభివృద్ధి పథంలో ముందుంటాం.
మనిషి మనసు ఆలోచనా తరంగాలను ప్రసారం చేసే ఒక ట్రాన్స్‌మీటర్‌ అంటాడు ఓ భౌతిక శాస్త్రవేత్త. మనం దేని గురించి ఆలోచిస్తే, ఆ ఆలోచనా తరంగాలు ఒక ప్రత్యేక పౌనఃపున్యం(ఫ్రీక్వెన్సీ)తో ప్రకృతి మొత్తంగా విస్తరించి మనకు కావలసినదాన్ని ఆకర్షించి మనకు చేరువ చేస్తాయంటాడు.

మన ఆలోచనలు సదా సకారాత్మకం(పాజిటివ్‌)గా ఉండేలా చూసుకోవాలి. పొరపాటున ప్రతికూలం (నెగెటివ్‌) అయితే- అవి ఉపచేతన మనసుపై ముద్ర వేసి, ప్రకృతిలోని చెడును ఆకర్షించి అభివృద్ధికి అవరోధంగా నిలుస్తాయి.
మన మధ్య సంచరించి ఉత్తమ స్థితిగతులు పొందినవారు- అదృష్టవంతులు, కారణజన్ములు కారు. మనసు మర్మాన్ని తెలుసుకుని, దాన్ని తమ అదుపాజ్ఞల్లో పెట్టుకోవడమే వారి ఘనతకు కారణం.
ఆలోచనలకు ఉన్న శక్తి అపారం. అది తెలుసుకోవడమే మానవ జీవితంలోని అసలు రహస్యం. మనిషిని దేవుడికి దగ్గర చేసినా, దేవుణ్నిచేసినా, రాక్షసుడిగా మార్చినా- అందుకు ఆలోచనలకు ఉన్న ఆకర్షణే మూలకారణం.
MAAGHA PURANAM -- 15

శిష్యుడు పశ్చాత్తాపము పొందుట

సుబుద్ధియు అతని కుమార్తె ఆమె భర్త మొదలగువారు మాఘస్నానమువలన కలిగిన ఫలితముచే సమస్త దోషములు పోగొట్టుకొని సుఖించిరని సాంబశివుడు పార్వతికి తెలియజేయగా తిరిగి నీలకంఠుని పార్వతీ దేవి ఇట్లు ప్రశ్నించెను.
“నాధా! సుబుద్ధి కుమార్తె వృత్తాంతమును ఆమూలాగ్రముగ తెలియజేసితిరి. మరి సుబుద్ధి శిష్యుడగు సుమిత్రుడేమైనాడు? అతడే స్థితిలో నున్నాడు? వివరింపుడు. వినకుతుహలముగానున్నది” అని సాంబశివుని కోరినది. అందులకా పార్వతీపతి యిట్లు వివరించెను.
“సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగక్రీడలు దేలియాడినది మొదలు అతనికి ఘోర పాపమంటెను. తానూ చేసిన పాపమునకు ఫలితమనుభవించుచుంటిని గదా యని పశ్చాత్తాప మనస్కుడై గురువు గారి వద్దకు పోయి గురువు పాదములపై పడి “గురువర్యా! నేను మహా పాపినైతిని. క్షణభంగురమైన తుచ్ఛ కామవాంఛకు లోబడిపోయి నీకుమార్తెయగు సుశీలతో కూడితిని. అయినను అది నాదోషము కాదు. నేను పూజాద్రవ్యములు తెచ్చుటకు అడవికి పోవుచుంటిని. దారియందున్న ఉద్యానవనంలో నీకుమార్తె చెలికత్తెలతో బంతులాడుచు నేను ఏకాంతముగా పోవుట చూచి నెమ్మదిగా నావెంట వచ్చినది. నేను అటు అడవి మధ్యకు పోయి ఒక కోనేటి వద్దనున్న చెట్టుక్రింద విశ్రమించగా నీకుమార్తె మెల్లమెల్లగా నాచెంత జేరి నన్ను మంచిమాటలతో వంచించి తన కామ వాంఛ తెలియజేసినది. నేనందులకు ఒప్పుకొనలేదు. నన్ను బలవంత పెట్టినది. నన్ను క్షమించమని చెవులు మూసుకొంటిని. ఇక లాభం లేదని “నాతో నీవు క్రీడించకుందువేని నీ ఎదుటనే ప్రాణత్యాగ మొనరించుకొందును” అని చెప్పుసరికి నాకు భయము కలిగి నిజంగా ఆమె ప్రాణత్యాగమే చేసుకున్నచో మీరు నన్ను తప్పక దండించెదరని వెరచి ఆమెతో క్రీడించి, ఆమె వాంఛను తీర్చితిని. ఇందు నా తప్పేమీ లేదు. ఐనను నేను మహాపాప మనుభవించుచున్నాను. నేను కూడా పాపరహితుడ నెటులకాగలనో సెలవిండ”ని బ్రతిమాలెను.
శిష్యుడు పలికిన మాటలు సుబుద్ధి విశ్వశించి, తన కుమార్తె వలె తన శిష్యుని గూడ పాపరహితుని జేయనెంచి సుమిత్రా! నీపాప కర్మకు ప్రాయశ్చిత్తమున్నది. నీవును మావలె పాపరహితుడవు కాగలవు. అదెటులనిన నీవు గంగానదీ తీరమునకు వెళ్ళి అచట పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసుకొనుము. ఆ తపస్సుచే కలుగు ఫలితము వలన పాపము మబ్బు విడిపోయినటుల నశించిపోవును. అప్పుడు నీవు ముక్తుడగుదువు అని శిష్యునితో జెప్పెను.
“ధన్యోస్మి ధన్యోస్మి” మీయాజ్ఞ ప్రకారము నేనిప్పుడే ప్రయాణ సన్నద్ధుడనగుచున్నాను” అని గురువర్యులకు దండ ప్రమాణములాచరించి గంగానదీ తీరమునకు బయలుదేరెను.అటుల ప్రయాణమై సాగిపోవుచుండగా మార్గమధ్యమున గుట్టలు, కొండలు, సెలయేళ్ళు దాటి ఒక అరణ్య మధ్యమునకు వెడలెను. అచట మనోహరమైన ఆహ్లాద మొనరించు దృశ్యములు కనిపించినవి. కౄరమృగములు సాధుజంతువులు కలసిమెలసి తిరుగుచున్నవి. మయూరములు, సర్పములు విచ్చలవిడిగా తిరుగుచున్నవి. పరస్పర వైరుధ్యములు ఏ మాత్రము కనిపించలేదు.
అచట ప్రకృతి రమణీయత మనస్సునకానంద మొనరించుచున్నది. అట్టి ప్రాంతమందు ప్రయాస బడలిక తీర్చుకొందమని ఒక వటవృక్షము క్రింద విశ్రమించి నలుదిశల పరికించి చూడగా ఒక ఆశ్రమము కనిపించినది.
వెంటనే లేచి ఆయాశ్రమం వద్దకు వచ్చి తొంగిచూడగా ఆయాశ్రమములో కొంతమంది పురుషులు, స్త్రీలు, బాలికలు కాషాయాంబరములు ధరించి రుద్రాక్షమాలలను త్రిప్పుచు శ్రీమన్నారాయణుని ఫలపుష్ప ధూపదీప నైవేద్యములతో పూజించుచు మాఘపురాణ పఠనం చేయుచుండిరి. మధ్యమధ్య శ్రీహరి విగ్రహంపై అక్షతలు వేసి “హరిహరీ”యని బిగ్గరగా కేకలు వేయుచు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహములతో పూజ చేయుచుండిరి. ఆ దృశ్యమంతటినీ సుమిత్రుడు కనులార గాంచెను. పూజ పూర్తయిన తరువాత ప్రసాదం అందరూ సేవించిరి. బైట కూర్చుని వున్న సుబుద్ధికి కూడా ప్రసాదమివ్వగా “స్వామీ! మీరాచరించిన వ్రతమెట్టిది? దీనివలన ఫలితమేమి కలుగును? మనుజుడు పాపరహితుడగునా? ఈ నా సందియములను తీర్పవేడుచున్నాను” అని వినయవిగా ఆ మునిసత్తముల నడిగెను.
పాపములచే పీడింపబడుచున్న సుమిత్రుని ప్రార్థన విని అచ్చటనున్న మనుజులందరూ మాఘమాసమందాచరించవలసిన ధర్మములను అతనికి వివరించుటకు గాను వారిలో నొకరిని నియమించిరి.
అంత ఆ మునికుమారుడు సుమిత్రునితో మాఘమాస మహాత్మ్యమును ఇట్లు వివరించెను. “విద్యార్థీ! మేము చేసినది మాఘమాసమందాచరించవలసిన మాఘమాస వ్రతము. ఈ వ్రతము చేయుటవలన ఎటువంటి పాపములు చేసిననూ, వాటినన్నింటినీ నశింపచేయును. అనగా రౌరవాది నరక బాధలు వెంటాడుచున్నప్పటికిన్నీ ఈ వ్రతము చేసినంత మాత్రమున అవియన్నియు పెనుగాలికి ఎండుటాకులు ఎగిరిపోవునట్లుగా, పాపము లన్నియు నశించిపోవుట, మాఘమాసములో సూర్యుడు మకరరాశిలో వుండగా ఆదినము సూర్యోదయ సమయమందు ఒక నదియందు ఏమనుజుడు స్నానం చేయునో అట్టి మనుజుడు శ్రీహరికి ప్రియుడగును. ఎట్టి దోషము లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘపురాణమును వినుచు ఆ మాసమంతయు నదీస్నాన మొనర్చువారు వైకుంఠ వాసులగుదురు. అలాగున చేయనివాడు, అసత్యంలాడువాడు, పెద్దలను, గురువులను గౌరవించనివాడు,
భక్తులను చూచి ఎగతాళి చేయువాడు, పరస్త్రీలను బలాత్కరించి చెరుచువాడు, చోరత్వము చేయువాడు, బ్రహ్మహత్య చేయువానితో సమానుడ
ు. అటులనే ఇండ్లు తగులబెట్టుట, అబద్ధ సాక్ష్యములు చెప్పుట, జన సమర్ధముండు చోట మలమూత్రములను విడచుట, గుర్రములను పశువులను కన్యలను ఇతరులకమ్ముట, మొదలగునవి చేయువారు కూడా బ్రహ్మహత్య చేసినవారితో సమానం. మరియు దైవసంబంధమగు ధనమును అపహరించు వాడు, ఏ పుణ్య దినములలోనైన శుచిగా స్నానము చేసి దేవుని ప్రార్థించనివాడు, దానమిచ్చెదనని వాగ్దానము చేసి ఇవ్వనివాడు, బంగారము వెండి రత్నములు సాలగ్రామములు దొంగిలించు వాడును, జాతి భ్రష్టులై జార చోరత్వములు చేసి వేశ్యయింటికి తిరుగువాడు,వీరందరూ బ్రహ్మహత్యాది మహాపాతకములు చేసినవారితో సమానులగుదురు. ఇవిగాక అన్నభార్యను సోదరుని భార్యను, గురువు భార్యను, స్నేహితుని భార్యను కూడి రతి సల్పువాడును, తనకన్న వయసులో పెద్దయగు స్త్రీతో రతి సల్పువాడును, జీవహింసలు చేయువాడును, బీదప్రజలను హింసించువాడును, దోపిడీలు చేయువాడును మహాపాతకులు. అట్టివారు కూడా బ్రహ్మహత్య చేసినవారితో సమానుడు. ఇవిగాక తల్లిదండ్రులను హింసించు వాడును, వివాహ సంబంధములు చెడగొట్టు వాడును, నోరులేని పసిపాపల దొంగిలించి ఇతరులకు అమ్మువాడును, శరణు జొచ్చిన వానిని దండించు వాడును, ధర్మ కార్యములకు విఘ్నములు కలిగించు వాడును, పరధనం అపహరించు వాడును, చేసిన మేలు మరచిన కృతఘ్నుడును తానూ తీర్థయాత్రలు చేయక అట్లు చేసిన వారిని జూచి ఎగతాళి చేయువాడును బ్రహ్మహత్య చేసిన వానితో సమానుడగును.
గాన మేము ఆచరించిన వ్రతం మాఘమాస వ్రతం. ఈ వ్రతం చేయుట వలన మాకు ఏ మాత్రమూ పైన చెప్పిన మహాపాతకములలో ఏ ఒక్కటి వున్ననూ అవి నశించిపోవును. ఇది ముమ్మాటికీ నిజం. అందుచేతనే మేమందరం మాఘమాసవ్రతం భక్తిశ్రద్ధలతో ఆచరించుచున్నాము. మాఘమాసం ప్రారంభం కాగానే సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికి నదికిపోయి స్నానం చేసి సూర్యునికి నమస్కరించి, నీళ్ళు విడువవలెను. తరువాత విష్ణుమందిరమునకు పోయి శ్రీహరికి పూజచేసి తులసితీర్థము ప్రసాదం పుచ్చుకోవలెను. ఆవిధంగా మాసాంతము వరకు ఏ మనుజుడు ఆచరించునో అట్టివాడు అశ్వమేధయాగము చేసినంత ఫలితం కలుగును.
మాఘమాసమునకు శ్రీహరియే అధిదేవత. గాన యీ మాసమందు ఆచరించిన స్నానం వలన కల్గు ఫలము నిచ్చువాడు అతడే గనుక ఆ వైకుంఠవాసుడగు శ్రీహరిని పూజించవలెను. శ్రీమన్నారాయణుడు ఒకవేళ నదీతీరమునందు గానీ, చెరువు దగ్గరగానీ విష్ణుమందిరము లేకపోయినచో విష్ణు మూర్తి విగ్రహమును గాని విష్ణు పటమును గాని తీసుకువెళ్ళి నదీతీరమందు తులసీదళంతోను కస్తూరి గంధం, అగరు ధూపదీప నైవేద్యం, ఫలపుష్ప తాంబూలాదులతో పూజించి పురాణ శ్రవణము గావించవలయును.
ఈవిధముగా మాఘమాసమంతా చేసి మాసాన్తమున ఒక సద్బ్రాహ్మణునకు వస్త్రములు, బంగారము దక్షిణ ఇచ్చి సంతృప్తిగా పిండివంటలతో భోజనము పెట్టాలి. ధనమున్న వారు బ్రాహ్మణ సమారాధన చేసినయెడల ముక్కోటి దేవతలు సంతసించుటే గాక యముడు తన దూతలను పంపజాలడు. పునర్జన్మ కలుగదు. ఈ నా వచనముల్ అసత్యములు కావు. ఇప్పటివరకూ మాఘస్నాన ఫలితమంతయు విన్నావు గదా! ఇక మాఘమాసం మూడు దినాలు మాత్రమే వున్నది. గాన ఈ మూడు దినములలోను ఈ నదిలో స్నానము చేసి పూజా కార్యక్రమమునకు సంసిద్ధుడవు కమ్ము” అని మునీశ్వరుడు తెలియజేసెను.
అంత సుమిత్రుడు తన గురువగు సుబుద్ధి తన పాపపరిహార్ధము గంగానదీ తీరమునకు పోయి తపస్సు చేసుకోమని చెప్పినారు. అని మునీశ్వరునితో చెప్పగా – మరల ఆ ముని యిట్లు చెప్పినాడు.
“నీ గురువు చెప్పిన విషయం యదార్థము నీ గురువు పుత్రికతో గూడి రతి సల్పినావు. అందు నీదోషమేమియు లేకున్ననూ మహాపాపము మాత్రము సంక్రమించినది. అది నిన్ను వెంటాడుచునే యున్నది. తరుణోపాయము చేయనిచో ఈజన్మలోను మరుజన్మలోను కూడా నరకబాధలు తప్పవు. గాన ఈ మాఘమాసమందలి మూడు దినములయినను స్నానముచేసి, శ్రీహరిని పూజించుము. తరువాత నీవు గంగా తీరమునకుపోయి నీ గురువు చెప్పినవిధంగా భక్తితో తపస్సు చేసినయెడల నీవు జన్మ రాహిత్యమును పొందగలవు. మానవుని మనస్సు వార్ధము, చంచల భావము గలది. నీవు ఇంద్రియాలన్నింటిని బంధించి ఏకాగ్ర చిత్తముతో లక్ష్మీ
నారాయణుని ధ్యానించుము” అని ఉపదేశించగా సుమిత్రుడు అచ్చట మూడి దినములుండి మాఘస్నానములు చేసి నదీతీరమందు విష్ణువును పూజించి పురాణ పఠనమును గావించెను. తదనంతరము ఆ ఆశ్రమ వాసులకు నమస్కరించి గంగా నదీ తీరమునకు తపస్సు చేయుటకై వెళ్ళిపోయెను.
MAAGHA PURANAM -- 16

మాఘ పురాణం – 16వ అధ్యాయం

ఆడకుక్కకు విముక్తి కలుగుట
దిలీప మహారాజా! సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవి చెప్పిన రీతిగా విన్నావు కదా! ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈవిధముగా చెప్పెను. అదెట్లన –
మాఘమాసములో మాఘస్నానములు చేయువాడు గొప్ప ధనశాలి యగును. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికీ మాఘస్నానం మొదలిడిన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును. మాఘశుద్ధ దశిమనాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన యెడల శ్రీహరి కటాక్షమునకు పాత్రుడగును. అందులో అణుమాత్రమైననూ సంశయం లేదు. అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి మరల ఇట్లు పలికెను.
“నాదా! శ్రీలక్ష్మీ నారాయణుల వ్రతము చేసినయెడల మనోవాంఛాఫలసిద్ధి కలుగునని చెప్పియుంటిరి గదా! ఆ వ్రత విధానమెట్టిదో ఎటుల ఆచరించవలెనో వివరంగా తెలియపరచుడని పార్వతీదేవి పరమేశ్వరుని కోరింది.
అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. “మాఘ శుద్ధ దశమినాడు ప్రాతః కాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున గాని, ఇంటివద్ద గాని, మంటపము వుంచి, ఆ మంటపమును ఆవుపేడతో అలికి పంచరంగులతో మ్రుగ్గులు పెట్టి మంటపం మధ్య ఎనిమిది రేకుల పద్మము వేసి, అన్నిరకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మంటపము మధ్యమున వుంచి గంధం, కర్పూరం, అగరు మొదలగు ద్రవ్యములు విగ్రహాలకు రాసి పూజించవలెను. రాగి చెంబులో నీళ్ళు పోసి, మామిడి చిగుళ్ళను వుంచి దానిపై కొబ్బరికాయ పెట్టి, క్రొత్త వస్త్రము నొకదానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమ ప్రతిష్ఠించి పూజించవలెను. ఆ మంటపపు మధ్యలో సాలగ్రామమును వుంచియొక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి వారిచేత పంచామృత స్నానం చేయించి తులసి దళము తోను, పుష్పాలతోను పూజించి ధూపదీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము చెల్లించవలెను.
తరువాత రాగిపాత్రలో నీరుపోసి అర్ఘ్యప్రదానమివ్వవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను.
మాఘమాసస్నానం చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలయును. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు కాయగూరలు పండ్లు మొదలగునవి ఒక పాత్రయందు ఉంచి గాని, క్రొత్త గుడ్డలో మూటగట్టి గాని, దానమియ్యవలయును. మాఘపురాణమును స్వయముగా పఠించునపుడు గాని, లేక వినునప్పుడు గాని చేతిలో అక్షతలు వుంచుకొని భక్తితో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై వుంచి మరికొన్ని అక్షతలు తలపై వేసుకోవలయును. గాన ఓ శాంభవీ! మాఘస్నానం చేసి మాఘశుద్ధ దశమినాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన యెడల ఎటువంటి మహాపాపములైనను నశించిపోవును. ఇందులకొక ఉదాహరణ కూడా తెలియజేసెదను. సావధానురాలవై వినుము.
గౌతమమహర్షి ఒకనాడు తన శిష్యులతో గూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తరదిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందున్న మునిపుంగవులతో ఇష్టాగోష్టులు జరుపుకొనుచు అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతమముని తన శిష్యునితో గూడి కృష్ణా నదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరముననున్న ఒక రావిచెట్టు వద్దకు వచ్చి
శ్లో!!మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే!
అగ్రతశ్శివ రూపాయ వ్రుక్షరాజాయ తే నమః!!
అని రావిచెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులయి శ్రీహరిని విధియుక్తముగా పూజించిరి. తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించిరి. ఈవిధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ద దశమినాడు ఆ చెట్టు మొదట మండపమేర్పరచి మ్రుగ్గులు, బొట్లు పెట్టి మామిడాకు తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మంటపము మధ్యలో శ్రీహరి చిత్రపటం వుంచి పూజించినారు. ఆవిధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజావిధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావిచెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచటినుండి లేచి ఉత్తర దిశవైపు మళ్ళీ మరల తూర్పు తిరిగి, ఆ వైపునుండి దక్షిణ దిశకు కదలి మరల యధాప్రకారం పడమటి దిశలోనే కూర్చుండెను. శిష్యులు మరల బెదరించిరి. ముందు చేసినటులే రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను. శిష్యులు ఆ మంటపం చుట్టూ ప్రదక్షిణ చేసినందున అది మాఘమాసము అయి ఉన్నందున వెంటనే ఆ కుక్క రూపము వదలి ఒక రాజుగా మారిపోయాడు. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి మునులందరికీ నమస్కరించెను. అక్కడ నున్న ఆ కుక్క రాజుగా మారిపోవుట, చూచిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యం నొందిరి.
ఓయీ! నీవెవ్వరవు? నీవిట్లు మారుటకు కారణమేమి? అని గౌతముడు ప్రశ్నించాడు. మునిచంద్రమా! నేను కళింగరాజును. మాది చంద్రవంశం. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందునూ ప్రావీణ్యం గలదు. నాదేశ ప్రజలను ధర్మమార్గమున పరిపాలన చేయుచూ వున్నాను. దానధర్మములనిన నాకు అతిప్రేమ. నేను అనేక దానాలు చేసియుంటిని. గోవు, భూమి, హిరణ్య సాలగ్
రామదానాలు కూడా చేసియున్నాను. ఎక్కువగా అన్నదానం తిలదానం చేసియున్నాను. అనేక ప్రాంతములలో చెరువులు త్రవ్వించినాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం అన్నసత్రములు మంచినీటి చలివేంద్రములు మరెన్నో పుణ్యకార్యాలు చేసియున్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించినాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించినాను. పురాణాలలో వున్న అన్ని ధర్మాలను చేసియున్నాను. కాని నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా మీకు విశదపరచెదను వినుడు.
ఒకానొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞ మొకటి తలపెట్టాడు. యజ్ఞంచేయాలన్న సామాన్య విషయం కాదు కదా! దానికి కావలసిన ధనం వస్తుసముదాయం చాలా కావలెను. గాన ఆ మునిపుంగవుడు నావద్దకు వచ్చి అర్ధించెను. మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలడిగితిని. మునియు మిక్కిలి సంతసించి రాజా! నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసములో మకరరాశియందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయం అయిన తరువాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహాత్యము చదవుటగాని, లేక వినుట గాని చేయుము. దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియేగాక అశ్వమేధ యాగం చేసినయెడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము గాన, తీర్థ స్నానాలు చేయగా వచ్చిన ఫలము గాని లేక దాన పుణ్యములు అనగా పంచ యాగాలు చేసినంత ఫలము గాని పొందగలవు. మాఘ శుద్ధ సప్తమీ ఆదివారం వచ్చినగాని, దశమీ ఆదివారం వచ్చిన గాని, ఉదయమే స్నానం చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినచో మానవుడు ఎటువంటి పాపములనైనను విడువగలడు.
ఒకవేళ ఇతర జాతుల వారైననూ మాఘమాసమంతటా నిష్ఠతో నదీ స్నాన మాచరించి దానధర్మాలు మాఘ పురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించును. అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినటుల మాటలాడి ఇట్లంటిని.
“అయ్యా మునిసత్తమా! మీరు పలికిన విషయములు నాకు తెలియును. అవన్నియు బూటకములు. వాటిని నేను యధార్ధములని అంగీకరింపను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొక్కటి కాదు. గాన నేను మాఘస్నానములు చేయుటగాని, దాన పున్యాదులు జేయుట గాని, పూజా నమస్కారములు ఆచరించుట గానీ చేయను. చలిదినములలో చన్నీళ్ళు స్నానములు చేయుట ఎంతకష్టము! ఇకనాకు ఈ నీతి బోధలు చెప్పకుడు నాకున్న ఫలము చాలు” అని ఆ మునితో అంటిని.
నా మాటలకు మునికి కోపం వచ్చినది. ముఖం చిట్లించుకొని సరే, నేను చెప్పవలసినది చెప్పితిని. అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెడలిపోయినాడు.
అంతట నేను ఆ ముని చేతులు పట్టి బ్రతిమలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసుకొని పోయెను. ఆవిధంగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములు విడిచితిని. తరువాత నాకు కుక్క జన్మయే వచ్చినది. నా పాపఫలమేమో గాని కుక్కగా ఏడుజన్మలూ బాధపడితిని. ఇప్పుడు మీరు చేయు పూజాస్తలము చుట్టూ మూడు పర్యాయములు ప్రదక్షిణలు చేసితిని గాన నా పూర్వజన్మ నాకు కలిగినది. దైవయోగమున ఎవ్వరునూ తప్పించలేరు కదా! ఇటుల కుక్క జన్మతో వుండగా మరల నాకు పూర్వజన్మ ఎటుల సంక్రమించినదో వివరింప వేడెదను” అని రాజు పలికెను.
ఆ రాజు చెప్పిన వృతాంతమునకు ఆ ముని ఆశ్చర్యపడి మాఘ మాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు గలిగెనో అనుభవమే చెప్పుచున్నది. నీవద్దకు వచ్చిన ముని సత్తముడు ఉత్తముడు. అతడు పలికిన విషయములన్నియు యధార్థములే. నీవు కుక్కవై ఎటుల పవిత్రుడవైతివో ఆ వృత్తాంతమును వివరించెదను. సావధానుడవై ఆలకింపుము.
నేను నా శిష్యులతో ఈ మాఘమాసమంతయు కృష్ణవేణీ తీరమందుండిన కృష్ణా నదిలో మాఘమాసమంతయు స్నానములు, జపములు చేసి తిరిగి మరొక పున్యనదికి పోవుదామని వచ్చి యుంటిమి. మేమందరమూ ఈ వృక్ష రాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకొనుచున్నాము. కుక్క రూపంలోనున్న నీవు దారినిపోతూ ఇచ్చటి నైవేద్యమును చూసి తినవలయుననెడి ఆశతో పూజ సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా! నీశరీరము బురద మైల తగిలి వున్నది. చూచుటకు చాలా అసహ్యంగా వున్నావు. పరిశుద్ధమై భగవంతుని పూజ చేయుచున్న సమయములో అచటకు జంతువూ గాని, పక్షి గాని వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా! నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదండంతో తరిమిరి. నైవేద్యం తినవలయుననెడి ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి యధాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే తిరిగి మళ్ళీ వచ్చినావు. అట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు. అనగా మాఘమాస ఫలం భగవంతుని మండపం చుట్టూ తిరగడం వలన పునర్జన్మ వచ్చినదన్నమాట. ఇక మాఘమాసమంతాయూ నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలం వచ్చునో ఊహించుకొనుము అని గౌతమ ఋషి చెప్పగా రాజు మిగుల సంతోషించి గౌతమ ఋషికి అతని పరివారమంతటికీ నమస్కరించు చుండగా అంతలో ఆ రావిచెట్టులో నున్న ఒక తొర్రనుండి ఒక మండూకం బైటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై బడి బెక బెకమని అరచి అటు ఇటు గెం
తుచుండెను. హఠాత్తుగా కప్ప రూపమును వదలి ముని వనితగా మారిపోయెను.
ఆమె నవ యౌవనవతి అతి సుందరాంగి. ఆమె గౌతమ ఋషిని చూడగానే తనకు జ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచినది. అంత గౌతమ ముని అమ్మాయీ! నీవెవ్వరి దానవు? నీ నామధేయమేమి? నీ వృత్తాంతం తెలియజేయుము అని ప్రశ్నించిరి. గౌతమ మునిని చూడగానే తన పూర్వ జన్మ వృత్తాంతం తెలియుటచే ఇట్లు చెప్పదొడంగెను.
మాఘపురాణం - 17వ అధ్యాయం

కప్పరూపము వదలిన స్త్రీ తన వృత్తాంతమును చెప్పుట

మునిశ్రేష్ఠా! నా వృత్తాంతమును తెలియజేయుదును. కావున ఆలకింపుము. నా జన్మస్థానము గోదావరి నదికి సమీపమందున్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ. నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీర్థ వాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేసెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరికొన్నాళ్ళకు మాఘము ప్రవేశించినది. ఒకనాడు నా భర్త సఖీ! మాఘమాసము ప్రవేశించినది. మాఘమాసము చాలా పవిత్రమైనది. దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనమునుండీ ప్రతి సంవత్సరమూ మాఘస్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు గావున నీవును ఈ మాఘమాసమంతయు యీ కావేరీ నదిలో స్నానమాచరించుము. ప్రతిదినము ప్రాతఃకాలము నిద్రనుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము. నదిలో స్నానం చేయుము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటము పెట్టి పువ్వులతోను, మంచి గంధము అగరు, ధూపదీపములను వెలిగించి, స్వామికి ఖండశర్కర పటిక బెల్లం నైవేద్యము ఇచ్చి నమస్కరింపుము. తరువాత తులసి తీర్థము లోనికి పుచ్చుకొని తలకు రాసుకొనుము. మన కుటీరమునకు వచ్చి మాఘ పురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠించుము. దీనివలన నీకు చాలా ఫలము కలుగును. నీ ఐదవతనము చల్లగా ఉండును అని హితబోధ చేసెను.
నేను అతని మాటలను వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా చూచితిని. నా భర్త శాంత స్వరూపుడు. అయిననూ నేను హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపం వచ్చి శపించినాడు. ఓసీ మూర్ఖురాలా! నా ఇంటికి వచ్చి నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషివని నాకు తెలియదు. నీవిక నాతో నుండ తగవు. మాఘమాస వ్రతము నీకింత నీచంగా కనిపించినదా? సరియే. నీ పాపము నిన్నే శిక్షించును. కావున నీవు కృష్ణానదీ తీరమునందు ఉన్న రావిచెట్టు తొర్రలో మాండూక రూపంలోనుందువు గాక! అని నన్ను శపించెను.
వారి సింహగర్జనకు వణికిపోయితిని. వారి శాపమునకు భయపడి పోయితిని. వారి రౌద్రాకారమును చూడజాలక పోతిని. నాకు జ్ఞానోదయము కలిగినది. నాతప్పు నేను తెలుసుకున్నాను. “అన్నా! ఎంతటి మూర్ఖత్వముగా ప్రవర్తించితిని” అని పశ్చాత్తాపము కలిగినది. వెంటనే భర్త పాదములపై బడి రెండుపాదాలు పట్టుకొని “నాకీ శాపము ఎట్లుపోవును? మరల నిన్నెటుల కలుసుకొందును? నాకు ప్రాయశ్చిత్తము లేదా ని పరిపరివిధాల ప్రార్థించగా ణా భర్త కొంత తడవాలోచించి ఒక గడువు పెట్టెను. అది ఏమనగా గౌతమమహర్షి గోదావరీ నదీతీరమందున్న తన యాశ్రమమునుండి ఉత్తరదేశ యాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘ శుద్ధ దశమినాటికి కృష్ణానదీ స్నానము చేయుటకు వచ్చెదరు. అలాంటి సమయములో నీవు వారిని దర్శించినయెడల ఆ మహర్షి ప్రభావము వలన నీకు నిజరూపము కలుగును” అని చెప్పుచుండగా నేను కప్పరూపము దాల్చితిని. నాభర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించెను. నేను కప్పు రూపముతో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానదీ తీరాననున్న ఈరావి చెట్టు తొర్రలో నివాసమేర్పరచుకొని జీవించుచూ మీరాకకోసం ఎదురుచూచుచుంటిని. ఇది జరిగి ఎంతకాలమైనదో నాకు తెలియదు” అని తన వృత్తాంతము గౌతమమునికి తెలియజేసెను.
“అమ్మాయీ! భయపడకుము. నీకీ శాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయినది ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి వెయ్యేండ్లు నీ భర్తయును ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యెను. అతడిప్పుడు వైకుంఠములో వున్నాడు. నీవు తన మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది గదా! మాఘమాస ప్రభావం అసామాన్యమైనది. సకల సౌభాగ్యాలు, పుత్రసంతతి ఆరోగ్యము కలుగుటయే గాక మోక్ష సాధనమైనట్టిది కూడా. దీనికి మించిన మరియొక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రియమైనదీ వ్రతము. ఇటువంటి వ్రతమాచరింపుమని నీభర్త యెంత చెప్పిననూ వినిపించుకొనవైతివి. నీభర్త దూరదృష్టిగల జ్ఞాని. అతని గుణగణాలకు సంతసించెడి వారు. నిన్ను పెండ్లియాడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకొనవలయుననెడి ఆశతో నుండేవాడు. కానీ నీవలన అతనికి ఆశలన్నీ నిరాశాలై పోయినవి. నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్ళలో స్నానం చేయమన్నాడు. నీవు చేయనన్నావు.అందులకు నీకు నీరు దొరకకుండా చెట్టు తొర్రలో జీవించమని శపించినాడు. ఈ దినము నా సమక్షములో దైవ సన్నిధిని పడినందున నీ భర్త శాపము ప్రకారము మరల నీ నిజరూపము పొందగలిగినావు. అందునా ఇది మాఘమాసము. కృష్ణా నదీతీరము. కాగా మాఘమాస వ్రత సమయము నీకు అన్నివిధాలా అనుకూలమైన రోజు. అందుచే నీవు వెంటనే సుచివై రమ్ము. స్త్రీలు గానీ, పురుషులు గానీ ఈ సమయంలో ప్రాతఃకాలమున స్నానము చేసినయెడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు. ఎవరైనా తెలిసి గానీ తెలియక గానీ మాఘ శుద్ధ సప్తమి, దశమి, పౌర్ణముల యందును, పాడ్యమి రోజునను నదీ స్నానమాచరించిన యెడల వారి పాపాలు నశించును. మాఘ శుద్ధ పాడ్యమి నాడు స్నానమునను, అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి, దినములలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షే
పము చేసినయెడల శ్రీహరి సంతోషించి మనోవాంఛ సిద్ధించునటుల వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘ పురాణము వినిన మోక్షప్రాప్తి కలుగును. అని గౌతమ ముని ఆ మునివనితతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను.
MAAGHA PURANAM -- 18

మాఘ పురాణం - 18వ అధ్యాయం

పిసినిగొట్టు వ్యాపారికి మాఘమాస ఫలము కలుగుట
వశిష్ఠ మహాఋషి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును యిట్లు తెలియజేసెను.
“పార్వతీ! చాలాకాలం క్రిందట దక్షిణప్రాంతమందలి వసంతవాడయను నామము గల పెద్ద పల్లెయుండెను. అందొక బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండెను. అతని భార్య పేరు తాయారమ్మ బంగారు శెట్టి వట్టి పిసినిగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా నున్నది. కాని అతడు ఇంకనూ ధనాశ కలవాడై తనవద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యెను. కానీ ఒక్కనాడైనా హరిని ధ్యానించడం కానీ, దానధర్మాలు చేయుట గానీ ఎరుగడు. అంతేగాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు ఋణాలు ఇచ్చి అనుకున్న గడువుకు ఋణము తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతము స్వాధీన పరుచుకునే వాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్ళెను. ఆరోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి తల్లీ నేను ముసలి వాడను. నా గ్రామము చేరవలయునన్న ఇంకనూ పది ఆమడలు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చల్లగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటివద్ద ఈరాత్రి గడువనియ్యి. నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్బ్రాహ్మణుడను, సదాచార వ్రతుడను. ప్రాతఃకాలమున మాఘ స్నానం చేసి వెళ్ళి పోదును అని బ్రతిమలాడెను.
తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తన అరుగు మూల శుభ్రం చేసి అందొక తుంగ చాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొనుండని పలికెను. ఆమె దయార్ద్ర హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసమొంది విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలము ఇచ్చి దానిని భుజించుమని చెప్పి ఆర్యా! మాఘ స్నానము చేసి వెళ్ళెదనన్నారు కదా! ఆ మాఘ స్నానమనగానేమి? దాని వలన కలుగు ఫలితమేమి? సెలవిండు. వినుటకు కుతూహలముగా ఉన్నది. అని అనగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని “అమ్మా! మాఘ మాసము గురించి చెప్పుటకు నాకు శక్యము గాదు. ఈ మాఘ మాసములో నదియందు గానీ, తటాకమందు గానీ, లేక నూతియండు గానీ సూర్యోదయం అయిన తర్వాత చన్నీళ్ళు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసీ దళంతోనూ, పూవుల తోనూ, పండ్లతోనూ, పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను. తరువాత మాఘ పురాణం పఠించవలెను. ఇట్లు ప్రతిదినమూ విడువకుండా నెలరోజులు చేసి ఆఖరున బ్రాహ్మణునకు సమారాధన, దానములు ఇవ్వవలెను. అట్లు చేసిన యెడల మానవునికున్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించి పోవును. ఒకవేళ ఈ నెలరోజులూ చేయలేని వారు వృద్ధులు, రోగులు ఒక్కరోజైననూ అనగా ఏకాదశి రోజున గానీ, ద్వాదశి నాడు గానే, పౌర్ణమి దినమున గానీ పైప్రకారము చేసినచో సకల పాపములు వైదొలగి సిరి సంపదలు, పుత్ర సంతానం కలుగును. ఇది నా అనుభవంతో తెలియజేయుచున్నాను” అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను ప్రాతఃకాలమున బ్రాహ్మణునితో నదికి పోయి స్నానం చేయుటకు నిశ్చయించుకొనెను.
అంతలో పొరుగూరికి వెళ్ళిన తన భర్తయగు బంగారు శెట్టి ఇంటికి వచ్చినాడు. అతడు రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారు జామున స్నానమునకు పోవుదునని తెలియజేసెను.
భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టి కోపము వచ్చి వంటినిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపట కొరికి ఓసీ వెర్రిదానా! ఎవరు చెప్పినారే నీకీ సంగతి? మాఘ మాసమననేమిటి? స్నానమేమిటి? వ్రతము, దానములేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కి వేయుదును. డబ్బులు సంపాదించుటలో నా పంచ ప్రాణములు పోవుచున్నవి. ఎవరికినీ ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానము చేయమనెదవా? చలిలో చన్నీళ్ళు స్నానం చేసి పూజ చేసి దానములు చేస్తే ఒళ్ళు, ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకొని, భిక్షాం దేహి అని అనవలసిందే. జాగ్రత్త! వెళ్ళి పడుకో! అని భర్త కోపిగించినాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారునా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము సేతునా? అని ఆత్రుతగా ఉన్నది. కొన్ని ఘడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చియున్న వృద్ధ బ్రాహ్మణునితో మొగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకొని నదికి పోయి నీళ్ళలో దిగి భార్యను కొట్టబోవుచుండగా ఆ యిద్దరూ కొంత తడవు నీళ్ళలో పెనుగులాడిరి. అటుల పెనుగు లాడుచుండగా ఇద్దరూ నీళ్ళలో మునగవలసి వచ్చెను. అటుల మునుగుటచే ఇద్దరికీ మాఘ మాస ఫలము దక్కినది. భార్యను కొట్టి ఇంటికి తీసుకు వచ్చినాడు.
కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికీ ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారు శెట్టిని తీసుకొని పోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసుకొని పోవుటకు విష్ణు దూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకొని తీసుకొని పోవుచుండిరి. అప్పుడు తాయారమ్మ యమ భటులతో ఇట్లు పలికెను.
ఓ యమ భటులారా! ఏమిటీ అన్యాయము? నన్ను వైకుంఠమునకు
తీసుకు పోవుట ఏమి? నా భర్తను యమ లోకమునకు తీసుకొని పోవుట ఏమిటి? ఇద్దరమూ సమానమే కదా! అని వారి నుద్దేశించి అడుగగా “ఓయమ్మా! నీవు మాఘమాసములో ఒకదినమున స్నానము చేసితివి. అదియు ఆ వృద్ధ బ్రాహ్మణుని వలన విని స్నానం చేయగా నీకీ ఫలం దక్కినది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందునే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము. అని యమభటులు పలికిరి.
ఆమె మరల వారినిట్లు ప్రశ్నించెను. నేను ఒకే ఒక దినమున స్నానము చేసినందున పుణ్య ఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నాభర్త కూడా నీట మునిగినాడు కదా! శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేల కలిగెను? అని అనగా ఆ యమభటులకు సంశయం కలిగి ఏమియూ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియజేసిరి.
చిత్రగుప్తుడునూ వారి ఇద్దరి పాప పుణ్యముల పట్టిక చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్య ఫలము రాసి ఉన్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణు దూతలతో చెప్పెను.
విష్ణు లోకమునకు ముందుగా వెళ్ళియున్న తాయారమ్మ భర్త గతి ఏమయ్యెను? అని ఆత్రుతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి. భార్యాభర్తలు ఇద్దరూ మిక్కిలి సంతసమందిరి.
రాజా! వింటివా. భార్య వల్ల భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగెనో. భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించిననూ భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా! కనుక మాఘ స్నానం నెలరోజులూ చేసినచో మరింత మోక్షదాయకం అగుననుటలో సందేహం లేదు.
MAAGHA PURANAM -- 19

మాఘ పురాణం - 19వ అధ్యాయము

ఏకాదశీ మహాత్మ్యము

సంవత్సరములో వచ్చు పండ్రెండు మాసములలోను మాఘమాసం అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో గాని, నదిలేని చోట తటాకమందు గాని, తటాకం కూడా అందుబాటులో లేనియెడల నూతి దగ్గర గాని, స్నానం చేసినంత మాత్రముననే మానవుడు తాను చేసిన పాపములన్నియు హరించిపోవును.
పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నదీతీరమునందున్న యగ్రహారంలో నివశించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దానధర్మములు చేసి కీర్తిపొందియున్నారు.
అతడు చిన్నతనం నుండీ గడసరి, పెంకివాడు అయినను తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్ధుడయ్యెను. తనకున్న ధనంతో తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పరుండ బోవునపుడిట్లు ఆలోచించెను. అయ్యో! నేనెంతటి పాపాత్ముడనైతిని! దానం శరీరబలం ఉన్నదను మనోగర్వంతో జీవితాంతమూ ముక్తినిచ్చే పుణ్యకార్యమొక్కటియు చేయలేక పోయినాను గదాయని పశ్చాత్తాపం నొందుతూ నిద్రపోయెను. అన్ని రోజులు ఒకేవిధముగా వుండవు గదా! ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని యింటిలో ప్రవేశించి ధనం, బంగారం, ఎత్తుకొని పోయిరి.
అనంతుడు నిద్రనుండి లేచి చూడగా సంపదంతా అపహరింపబడినది. అన్యాయంగా ఆర్జించిన దానం అన్యాక్రాంతము అయ్యెనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కోరసాగెను. ఆ సమయముననే మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘమాస స్నాన ఫలం దక్కెను. నదిలో మునిగి తడి బట్టలతో ఒడ్డుకు వచ్చెను. చలికి గడగడ వణికి బిర్రబిగిసిపోయినాడు. “నారాయణ” అని ప్రాణాలు విడిచినాడు. ఆ ఒక్క దినమైనను నదిలో స్నానం చేయుట వలన తాను చేసియున్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యెను.” అని వశిష్ఠుడు తెలియజేసెను.
MAAGHA PURANAM -- 20

మాఘపురాణం - 20వ అధ్యాయము

భీముడు ఏకాదశీ వ్రతము చేయుట

పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు. భోజనప్రియుడు. ఆకలికి ఏమాత్రం ఆగనివాడు. బండెడన్నము అయినను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశీ వ్రతము చేయవలయునని కుతూహలం పుట్టెను. కానీ ఒక విషయంలో బెంగతో ఉండెను. అదేమందువా? ఏకాదశినాడు భోజనం చేయకూడదు కదా! భోజనం చేసిన ఫలం దక్కదుకదా! అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి ‘ఓయీ పురోహితుడా! అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అనెదరు గదా! దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగెను.
“అవును భీమసేనా! ఆరోజు అన్నిదినముల కంటెను ప్రశస్తమయినది. శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది. గనుక అన్ని జాతుల వారును ఏకాదశీవ్రతం చేయవచ్చును” అని పాండవ పురోహితుడు అగు ధౌమ్యుడు పలికెను.
“సరే నేను అటులనే చేయుదును గాని విప్రోత్తమా! నేను భోజన ప్రియుడనన్న సంగతి జగద్వితమే కదా! ఒక ఘడియ ఆలస్యమైన నేను ఆకలికి తాళజాలను గనుక, ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎటులని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండును. గనుక ఆకలి తీరులాగున ఏకాదశీ వ్రత ఫలము దక్కులాగున నాకు వివరింపుము అని భీముడు పలికెను.
భీమసేనుని పలుకులకు ధౌమ్యుదు చిరునవ్వు నవ్వి “రాజా! ఏకాదశీ వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతో ఏకార్యము చేసిననూ కష్టములు కనిపించవు. గాన నీవు దీక్షబూనినచో ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశీ అనగా మాఘశుద్ధ ఏకాదశీ మహా శ్రేష్ఠమయినది. దానికి మించిన పర్వదినం మరియొకటి లేదు. ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశీ రోజు పుష్యమీ నక్షత్రముతో కూడినదై యుండును. అటువంటి ఏకాదశికి సమానమగునది మరి ఏదియు లేదు. సంవత్సరము నందు వచ్చు ఇరువది నాల్గు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశీ మహా పర్వదినము గాన ఆ దినము ఏకాదశీ వ్రతం ఆచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము. ‘నియమము’ తప్పకూడదు. అని ధౌమ్యుడు భీమునకు వివరించెను.
ధౌమ్యుని వలన తన సంశయం నెరవేరుటకు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతం చేసి ఉపవాసముండెను. అందులకే మాఘ శుద్ధ ఏకాదశి “భీమ ఏకాదశి” అని పిలుతురు. అంతియేగాక ఓ దిలీప మహారాజా! పరమేశ్వరునకు, అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమునందే వచ్చును. గాన మహా శివరాత్రి మహాత్మ్యమును గురించి కూడా వివరించెదను. శ్రద్ధాళుడవై ఆలకింపుము” అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇటుల పలికిరి.
శివరాత్రి మహాత్మ్యము
ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైన దినమో అదేవిధంగా మాఘచతుర్దశీ అనగా శివ చతుర్దశి. దీనినే ‘శివరాత్రి’యని అందురు. ఈశ్వరునికి అత్యంత ప్రీతివంతమయిన దినము. ఇది మాఘమాసామునందు వచ్చు అమావాస్యకు ముందురోజు దానినే “మహాశివరాత్రి”యని అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశినాడు వచ్చును. ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘ మాస కృష్ణ పక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆరోజు నదిలో గాని, తటాకమందుగాని, లేక నూతివద్ద గాని స్నానం చేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళీ బిల్వ పత్రములతో పూజించవలయును. అటుల పూజించి శివప్రసాడం సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగరణ వుండి మరునాడు అమావాస్య స్నానం కూడా చేసిన యెడల ఎంతటి పాపములు కలిగి ఉన్ననూ అవన్నియు వెంటనే హరించుకు పోయి, కైలాస ప్రాప్తి కలుగును. శివపూజా విధానంలో శివ రాత్రి కంటే మించినది మరియొకటి లేదు. గనుక మాఘమాసం కృష్ణ పక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. గాన శివరాత్రి దినమున ప్రతివారూ అనగా జాతి బేధములతో నిమిత్తం లేక అందరూ శివరాత్రి వ్రత మాచరించి జాగరణ చేయవలయును.
“మున్ను శబరీ నదీ తీరమందున్న అరణ్యంలో కులీనుడను బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచుండెను. తనకు వేట తప్ప మరొక ఆలోచన లేదు. కడు మూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి, వాటిని కాల్చి తాను తిని తన భార్యాబిడ్డలకు తినిపించుట తప్ప మరేదియు తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పు గలవాడు, క్రూర మృగములు సహితం బోయవానిని చూచి భయపడి పారిపోయెడివి. అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు.
ఒకనాడు ప్రతిదినము వేటకు వెళ్ళునట్లే బయలుదేరి వెళ్ళెను. ఆనాడు జంతులేమియు కంటపడలేదు. సాయంకాలమగుచున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనస్సు అంగీకరించనందున పొద్దు గుంకి పోయిననూ అక్కడున్న మారేడు చెట్టుపైకెక్కి జంతువు కొరకు ఎదురు చూచుచుండెను. తెల్లవారుతున్న కొలది చలిఎక్కువగుచు మంచు కురుస్తున్ననూ కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టుక్రింద వున్నా శివలింగము మీద పడినవి. ఆరోజు మహాశివరాత్రి అందులో బోయవాడు రాత్రంతా తిండి తినక జాగరణతో వున్నాడు. తనకు తెలియక పోయిననూ మారేడు పత్రములు శివలింగముపై పడినవి ఇంకేమున్నది? శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వ పత్రములు పడుట తిండిలేక ఉపవాసం ఉండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి.
జరామరణము లకు హెచ్చు తగ్గులు గాని, శిశువృద్ధులు గాని లేవు.
పూర్వ జన్మలో చేసుకున్న పాప పుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే.
మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులొచ్చి వాని ప్రాణములు తీసుకుపోవుచుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో నున్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేసేది లేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను.
శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, నంది తుంబుర నారద గణాలతో కొలువుతీర్చుకున్న సమయంలో యముడు వచ్చి శివునకు నమస్కరించాడు. ఉమాపతి యముని దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలడిగి వచ్చిన కారణమేమిటని ప్రశ్నించెను.
అంతట యముడు మహేశా! చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. నారాకకు కారణమేమనగా ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు. దయా దాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసియున్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. ఆరాత్రి చలిబాధకు తట్టుకొనలేక బిల్వ పత్రములను కప్పుకొన్నాడు. జంతువులను వేటాడుటకు రాత్రి అంతయు మెలకువగా ఉన్నాడు. కాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు. గనుక అతనిని కైలాసమునకు తీసుకొని వచ్చుట భావ్యమా? అంత మాత్రమున అతనికి కైవల్యము దొరుకునా” అని యముడు విన్నవించుకున్నాడు.
యమధర్మరాజా! ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్వ పత్రములు నాపైన వేసి, తిండిలేక జాగరణతో నున్న యీ బోయవాడు కూడా పాపవిముక్తుడు కాగలడు. ఈ బోయవానికి కూడా ఆ వ్రత ఫలం దక్కవలసినదే గనుక ఈ బోయవాడు పాపాత్ముడయినను, ఆనాటి శివరాత్రి వ్రతమహిమ వలన ణా సాయుజ్యం ప్రాప్తమయినది అని పరమేశ్వరుడు యమునికి వివరించెను. యముడు చేయునది చంద్రశేఖరుని వద్దనుండి వెడలిపోయెను
MAAGHA PURANAM -- 21

మాఘపురాణం - 21వ అధ్యాయము
దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట
దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు, మహేశ్వరుల యొక్క అంశమున జన్మించిన ఆడు. అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేసినాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి వున్నారు.
దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మాహిష్మతియను నగరమును రాజధానిగా చేసుకొని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తాత్రేయుడు. ఒకనాడు దత్తాత్రేయుని యాశ్రమమునకు కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి “గురువర్యా! మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకొని వుంటిని. మాఘమాసం యొక్క మహాత్మ్యమును విని ఉండలేదు. గాన మాఘమాసముయొక్క విశిష్టతను గురించి మాఘ స్నాన ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను” అని దత్తాత్రేయుని కోరెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుని కోరికను మన్నించి యీ విధంగా వివరించిరి.
“భూపాలా! భరత ఖండములోనున్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమందెచ్చటనూ లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి పండ్రెండు. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశియందున్నప్పుడు ఆయా నదులకు పుష్కరారంభమగును. గనుక అటువంటి నదులయందు స్నానం చేసి దాన పుణ్యము లాచరించినయెడల దాని వలన కలుగు ఫలమును వర్ణించుట నాకు కూడా సాధ్యం కాదు. అందునూ మాఘమాసమందు నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితం కలుగుటయే గాక జన్మరాహిత్యం కలుగును. గనుక ఏ మానవుడైననూ మాఘమాసములో నదీస్నానం తప్పకుండా చేయవలెను. అటుల చేయని యెడల ఆ మనుజుడు జన్మజన్మలందు తాను చేసుకున్న పాపఫలము అనుభవించక తప్పదు.
మాఘమాసంలో సూర్యుడు మకరరాశియందుండగా మాఘ స్నానంబు చేసి, ఒక సద్బ్రాహ్మణునకు దానధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైననూ ముక్తి నొందగలడు. అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునకు ఈవిధముగా చెప్పుచున్నాను.
పూర్వకాలమున గంగా నదీతీరమున ఉత్తర భాగమున భాగ్యపురమను పట్టణము కలదు. అందు నివసించు జనులు భాగ్యవంతులు. గొప్ప వ్యాపారములు చేసి దానం సంపాదించి అపర కుబేరుని వలెనున్నారు. ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు గలడు. అతడును గొప్ప ధనవంతుడు. బంగారు నగలు, నాణెములు రాసుల కొలదీ ఉన్నవాడు.
మరికొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను. తండ్రి చనిపోగానే ఇద్దరన్నదమ్ములు తండ్రి ఆస్తిని భాగములు వేసి పంచుకొని ఇష్టమొచ్చినటుల పాడుచేయుచుండిరి. ఇద్దరూ చెరొక ఉంపుడుకత్తెను చేరదీసి కులభ్రష్టులు అయి ఉండిరి. ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్దపులి నోటబడి చనిపోయినాడు. చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనంలో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరచుటచే నోటివెంట నురగలు గ్రక్కుచూ చనిపోయినాడు. ఆవిధంగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపొయినారు.
యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలు చూసి పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు. రెండవవానిని స్వర్గలోకమునకు పంపించమన్నాడు. అప్పుడా చిన్నవాడు చిత్రగుప్తునితో ఇట్లు అన్నాడు.
“అయ్యా, మేమిద్దరమూ ఒకే తండ్రి బిడ్డలము. ఇద్దరమూ ఒకేవిధంగానే పాపములు చేసియున్నాము. అయినా అతనికి నరకమేల? నాకు స్వర్గమేల? ప్రాప్తించును!” అని అడిగెను. ఆ మాటకు చిత్రగుప్తుడు ఓయీ, వైశ్యపుత్రా! నీవు నీ మిత్రుని మిత్రుని కలుసుకొనుటకు ప్రతీదినము గంగానది దాటి ఆవలి గట్టునున్న నీ స్నేహితునితో సంభాషించి వచ్చుచుండెడివాడవు. అటులనే మాఘమాసంలో నదిని దాటుచుండగా కెరటాలు జల్లులు నీ శిరస్సుపై పడినవి. అందువలన నీవు పవిత్రుడవైనావు. మరొక విషయమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాతకములు కూడా నశించును. గాన విప్రుని చూచుటవలన నీకు మంచి ఫలితమే కలిగినది. అదియును గాక, ఆ బ్రాహ్మణుడు పఠించు గాయత్రీ మంత్రమును కూడా నీవు వినియున్నావు. గంగానదిలోని నీరు నీ శరీరం మీద పడినది గనుక నీ పాపములు నశించునందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను. అని చిత్రగుప్తుడు వివరించెను.
“ఆహా! ఏమి నా భాగ్యం! గంగాజలము నామీద పడినంత మాత్రముననే నా కింతటి మోక్షం కలిగినదా” అని వైశ్య కుమారుడు సంతసించి దేవతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను.
MAAGHA PURANAM -- 22

మాఘపురాణం - 22వ అధ్యాయం

గంగాజల మహాత్మ్యము ఓ కార్తవీర్యార్జునా! శివపూజ గురించి శివమహాత్మ్యమును గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రంపై వారధి కట్టినచోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధిని దాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడు సముద్రమును దాటునపుడు శివుని ధ్యానించి, రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరేముందు శివపూజ చేసి యుద్దరంగంలో ప్రవేశించాడు. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయమును చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛను ఈడేర్చుకొనిరి. గనుక పూజలందు శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమపవిత్రమైనది. ఎటులనగా గంగాజలం విష్ణు పాదములనుండి పుట్టినదియు, శివుని శిరస్సునుండి ప్రవహించునట్టియు అయినందుననే సర్వపాపరహితమైనది. గంగాజలంలో స్నానం చేసినచో మహాపాపములు సైతం హరించిపోవును. గాన గంగాజలమునకు అంత ప్రాముఖ్యత వున్నది. ఇంకనూ గంగాజలం గురించి చెప్పబోవునది ఏమనగా ఏనదిలో గాని, సెలయేరులో గాని, చెరువునందు గాని స్నానం చేయునపుడు ‘గంగ గంగ గంగ! అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున నీళ్ళు జల్లుకొనినచో అది గంగాజలంతో సమానమయినదగును. గంగాజలం విష్ణుమూర్తి ప్రతిరూపం గనుక గంగాజలంతో సాటియగు జలము ఈ ప్రపంచమునందెచ్చటనూ లేదు. అని గంగా జలమును గురించి కార్తవీర్యార్జునునకు దత్తాత్రేయుడు వివరించెను.
MAAGHA PURANAM -- 23

మాఘపురాణం - 23వ అధ్యాయము

బ్రాహ్మణ కన్యల విమోచనము కొంతకాలం క్రిందట మగధరాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండిరి. నల్గురకు నల్గురు కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్ళకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకొక గురుకుల విద్యార్ధి వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూచి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి తమ్ము వివాహము చేసుకోమని బలవంతము చేయ – ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కె నిరాకరించెను. అంత నా కన్యలు కోపంతో “నీవు పిశాచివి కమ్మని” శపించగా ఆ విద్యార్దియూ “మీరుకూడా పిశాచులగుదురు గాక”యని ప్రతిశాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే వుండి అందరినీ బాధించి, ఆహారము దొరికితే పెనుగులాడుచుండిరి. కొంత కాలమునకు ఒక సిద్ధుడాకోనేటి దగ్గరకు రాగా నా పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములెట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు “వీరందరి చేత మాఘమాసంలో గాయలోనున్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న పిశాచరూపం తొలగి పోవును” అని చెప్పగా వారట్లు చేయుటచే ఆ నలుగురకూ యధారూపములు కలిగినవి. అట్లు జరుగుట మాఘస్నానమే కారణము.
MAAGHA PURANAM -- 24

మాఘపురాణం - 24వ అధ్యాయము

విశ్వామిత్రునికి వానరముఖము కలుగుట
శూద్ర స్త్రీ వృత్తాంతము
మాఘమాసమందలి నదీస్నానం మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడ పరమ పవిత్రమైనది.
ఒక మాఘమాసంలో నొక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. తన భార్య మాత్రం స్నానమాచరించనని చెప్పుటచే ఆమె దేవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక ఉండిపొయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గందర్వుడొక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూచెను. ఆమె అందము యౌవనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలతో తేలియాడుచుండగా మరలనా గంధర్వుడు భార్యను వెదకుకొనుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు, గంధర్వస్త్రీ క్రీడించుచుండిరి. ఆదృశ్యమును చూచి మండిపడుచు “నీవు తపస్వివైయుండి కూడా కామతృష్ణ గల వాడవైతివి గాన నీకు కోతి ముఖము సంభవించుగాక యని విశ్వామిత్రుణ్ణి, “ఓసీ కులటా! నీవు పాషాణమై పడివుండు”మణి భార్యను శపించి వెళ్ళిపొయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానరముఖము కలిగివుండగా నారదుడు ఈవిషయం తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి “విశ్వామిత్రా! క్షణభంగురమైన తుచ్ఛ కామవాంఛకు లోని నీ తపశ్శక్తి అంతా వదులుకున్నావు. సరేలెమ్ము. గంగా నదిలో స్నానం చేసి నీ కమండలంతో గంగాజలం తెచ్చి ఈ పాషాణంపై చల్లుము. అని నారదుడు వివరించగా విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంగా మారిన గంధర్వ స్త్రీపై చల్లెను. ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వ లోకమునకు వెళ్ళిపోయెను. విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయినాడు.
_*🚩మాఘ పురాణం - 25 వ అధ్యాయము🚩*_

🕉🌞🕉️🌞🕉️🌞🕉️🌞🕉️🌞🕉️

*కలింగ కిరాతుడు - మిత్రుల కథ*

☘☘☘☘☘☘☘☘☘

గృత్నృమదమహర్షి జహ్నుమునితో మరల నిట్లు పలికెను. ఓయీ! మాఘమాస వ్రత మహిమ తెలుపు మరియొక కథను చెప్పెదను వినుము. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాసవ్రతము నాచరించి పాప విముక్తుడగునని యీ కథ తెలుపును వినుము. అతి ప్రాచీనమైన యీ కథ శ్రీహరి కథామహిమను తెలుపును.

పూర్వమొక కలింగ కిరాతుడు కలడు. అతడా ప్రాంతమున సంపద కలవాడు, పరివారము కలవాడు. ఆయుధములను ధరించి పరివారముతో నొకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళెను. అనేక మృగములను వేటాడెను. అతడు మృగములను వెదకుచు అడవిలో తిరుగుచుండగా నొకవిప్రుని జూచెను. ఆ బ్రాహ్మణుడు నర్మదా నదీ స్నానము చేయవలయునని బయలుదేరెను. మార్గ మధ్యలో ఆయాసముచే నొక మఱ్ఱిచెట్టు నీడలో విశ్రమించి మరల ప్రయాణము చేయదలచెను. కిరాతుడతని చూచి వాని వద్ద నున్న వస్త్రములు, ధనము మున్నగువానిని అపహరింప వలయునని తలచెను. తన వారితో వచ్చి యీ బ్రాహ్మణుని వద్దనున్న అన్నిటిని బలవంతముగ తీసికొనెను.

ఓయీ! నీవు దాచిన ధనమునిమ్ము, లేనిచో నిన్ను చంపుదునని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించెను. ఆ విప్రుడును 'నేను దరిద్రుడను నా వద్ద ధనమేమియు లేదని సమాధానము నిచ్చెను. వాని మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికెను. ఆ కిరాతుదు అచటి మార్గమున ప్రయాణించువారిని చంపి వారి నగలను, ధనమును దోచుకొనుచుండెను. అతడు క్రమముగా అరణ్య మార్గముననే కాక పట్టణ మార్గమున ప్రయాణించు వారి గూడ దోచుకొని చంపుచుండెను. వానికి ధనమును సంపాదింప వలయునను కోరిక విపరీతముగా పెరుగుచుండెను.

ఇట్టి కిరాతునకు బంగారు నగలను చేయువాడొకడు మిత్రుడుగ నుండెను. అతడును కిరాతునివలె క్రూరుడు, వంచనాపరుడు, బంగారపు నగలను చేయుచు దానిలోని బంగారము హరించెడివాడు. కిరాతుడును బాటసారుల నుండి దోచుకున్న నగలను అమ్ముమని స్వర్ణకార మిత్రునికిచ్చెడివాడు. అతడును నగలమ్మి అందులో కొంత ధనమును తీసుకొని మిగిలిన ధనమును కిరాతునకిచ్చెడివాడు. వీరికి మరియొక శూద్రుడు మిత్రుడుగ నుండెను. వాని తల్లియును అట్టిదే భర్త మరణించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్చావర్తనురాలయ్యెను. ఈ విధముగ నాకుటుంబమున కుమారుడు, తల్లి యిద్దరును కాముకులు స్వేచ్ఛావర్తనులుగా నుండిరి. వాని తల్లి చీకటిలో కామాతురయై తన విటుడు వచ్చుచోటికి పోయెను. చీకటిగానున్న ఆ యింటికి ఆమె వద్దకు రావలసిన విటుడు రాలేదు. అతడు వచ్చునని యామె వానికై వేచియుండెను. అచటకు ఆమె కుమారుడు వ్యభిచారిణి కాముకురాలయిన తన కిష్టురాలయిన స్త్రీ కొరకు వచ్చెను. చీకటిలో నున్న తల్లి తాను కోరిన ఆమెయనుకొనెను, వాని తల్లియు ఆ చీకటిలో వచ్చినది తాననుకొన్న విటుడే అనియనుకొన్నది. ఈ విధముగా తల్లియు కుమారుడును ఆ చీకటిలో ఒకరినొకరు యెరుగక తమకు కావలసిన వారేయనుకొనిరి. ఫలితముగా వారిద్దరును ఆ చీకటిలో కలిసిరి, సమాగమమైన తరువాత వారిద్దరును ఒకరి నొకరు గుర్తించిరి. వాని తల్లి విచారపడెను. కొంత కాలమునకు మరణించి నరకమును చేరి శిక్షలననుభవించుచుండెను. కుమారుడు మాత్రము నిర్భయముగా నుండెను. పరస్త్రీ వ్యామోహముచే అతడు తన సంపదనంతయు పోగొట్టుకొనెను. నిర్ధనుడై కిరాతుని చేరి వానికి స్నేహితుడయ్యెను. కిరాతుడు బ్రాహ్మణుని ధనమునకై చంపినవాడు. సువర్ణకారుడు నమ్మి యిచ్చిన నగలలో బంగారమును దొంగలించువాడు. శూద్రుడు తల్లితో వ్యభిచరించినవాడు. ఈ ముగ్గురికిని బ్రాహ్మణ మిత్రుడొకడు కలడు. అతడు వారితో కలసి వారితోబాటు పాపకార్యములను చేయుచుండెను, బ్రాహ్మణుడగుటచే వాడు పౌరోహిత్యమును కూడ చేయుచుండెను. వీరి కలయికతో పంచ మహాపాపములొకచోట చేరినట్లయ్యెను. బ్రహ్మజ్ఞానిని చంపినవాడు, కల్లుత్రాగువాడు, క్రూరుడు, బంగారము నపహరించినవాడు, గురుపత్నితో రమించినవాడు వీరైదుగురును పంచమహాపాతకులు. బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరమునకు పోయెను, అతడు ఆ గ్రామమున శ్రోత్రియుడైన బ్రాహ్మణునొకనిని జూచెను. ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్షమాలలను ధరించెను. లేడి చర్మము దర్భలు చేతబట్టియుండెను. గోవింద నామములు పలుకుచు తీర్థయాత్రలు చేయువాడు. కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించెను. బ్రాహ్మణ్యమును కోల్పోయిదీనుడై యున్నవానిని చూచి నీవెవరవు ఎక్కడికి పోవుచున్నావని యడిగెను. అతడును నేను బ్రాహ్మణుడను, కిరాతుని వద్ద పని చేయువాడనని పలికెను. అప్పుడు వీరవ్రతుడు ధ్యానమగ్నుడై యుండి కనులు తెరచి యిట్లనెను.

ఓయీ! నీవు చేసిన సమస్త పాపములను చెప్పెదను వినుము. నీ యజమాని బ్రహ్మహత్య మున్నగు పాపములను చేసినవాడు, హింసాపరుడు. వానికి బంగారమును దొంగలించినవాడు మిత్రుడు. వారికొక శూద్రుడు మిత్రుడు తల్లితో రమించినవాడు. ఇట్లు పంచమహాపాపములను చేసినవారితో తిరిగి నీ బ్రహ్మతేజమ్మును కోల్పోతివి. పాపాత్ములతో మాటలాడినను, వారిని చూచినను, తాకినను, వాడును వారివలె పాపాత్ముడగును. అట్టివారితో మాటలాడక తప్పనిసరి అయినను దర్భను చేత బట్టి మాటలాడవలెను. అట్టు చేసిన పాపమంటదు. నీవట్టి పాపాత్ముల సాంగత్యముచే బ్రాహ్మణత్వమును పోగొట్టుకొని పాపివైతివి. ఇట్టి నీతో మాటలాడరాదు. బ్రహ్
మహత్య చేసినవాడు, మద్యపానము చేసినవాడు, గురుతల్పగమనము చేసినవాడు, బంగారమును దొంగలించిన వాడు, వీరితో స్నేహము చేసినవాడు వీరైదుగురు పాపులే. ఇట్టివారికెంత దూరముగ నున్న అంత మంచిది. అని వీరవ్రతుడు నిశ్శంఖులునితో పలికి మిన్నకుండెను.

నిశ్శంఖులుడును వీరవ్రతుని మాటలను విని భయపడెను. జ్ఞానీ! నన్ను దయతో రక్షింపుము. నాకీ భయంకర పాపమునుండి విముక్తి యెట్లు కల్గును? సర్వపాపహరణ క్షమమైన ప్రాయశ్చిత్తమును తెలుపుమని వీరవ్రతుని ప్రార్థించెను. వాని మాటలను విని, దయాళువైన వీరవ్రతుడు మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారము ప్రాయశ్చిత్తము నిట్లు చెప్పెదను. నిత్యము నీవు చేసిన పాపములను చెప్పుచు తీర్థ యాత్రలను పన్నెండు సంవత్సరముల పాటు చేయుము. ప్రతి యింటను బిచ్చమెత్తుకొని ఆ బిక్షాన్నమును తినుచుండుము. ప్రతి మాఘమాసమున ప్రయాగ క్షేత్రమున ప్రాతఃకాల స్నానము చేసి మాధవుని దర్శింపుము. ప్రయాగ స్మరణముననే ముక్తి కల్గును. స్నానము చేసినచో వచ్చు పుణ్యమును చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసినచో వాని పాపములు పోవును. కావున పన్నెండు సంవత్సరములు పూర్తిగాగాని, సంవత్సరము పాటు కాని ప్రయాగ మాఘస్నానము నాచరింపుము. ఆవు తినగా మిగిలిన బియ్యమును వండుకొని తినుము ఈ ప్రకారమొక మాసము చేయుము అని అనెను. నిశ్శంఖులుడును అట్లేయని అంగీకరించెను. తన మిత్రులైన కిరాతాదులకు ప్రాయశ్చిత్తమును చెప్పుడని కోరెను. వీరవ్రతుడును వాని మాటలకు సంతోషించి నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికిని ఆచరింపదగినదని చెప్పెను. నిశ్శంఖులుడును వీరవ్రతునకు నమస్కరించి పన్నెండు సంవత్సరముల ప్రాయశ్చిత్తమును చేసికొన్న తరువాత నాకు ధర్మము నుపదేశింప గోరుదునని యడిగెను. ఆ ధర్మము నప్పుడు చెప్పుదును పొమ్మని పలికెను.

నిశ్శంఖులుడును కళింగ కిరాతుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పెను. వారును నిశ్శంఖులుని మాటలను విని భయమును, పశ్చాత్తాపమును పొందిరి. వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలచి ప్రయాణమైరి. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్నభోజనము, మాఘస్నానము చేసి పాపవిముక్తులైరి. నిశ్శంఖులుడు వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయుచు కాశీ నగరము చేరి కొంతకాలముండి తరువాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతము నాచరించెను. అన్ని తీర్థముల స్నానము పాపనాశనము, ప్రయాగ స్నానము. నిశ్శంఖులుడును వీరవ్రతుడు చెప్పినట్లు పన్నెండు సంవత్సరములు ప్రాయశ్చిత్తము నాచరించెను. పాపవిముక్తుడై వీరవ్రతుని వెదకుచు నైమిశారణ్యమునకు బోయి వీరవ్రతునకు నమస్కరించి యిట్లు పలికెను.

వీరవ్రతుడు తనకు నమస్కరించిన నిశ్శంఖులుని లేవనెత్తెను. ప్రేమతో కుశలము అడిగెను. రెండు గడియలు ఆలోచించి యిట్లనెను. ఓయీ నీ పాపమంతయు పోయినది. ప్రయాగ స్నానముచే దుష్టసాంగత్యజనిత దోషలుము కూడ పోయినది. నీవిప్పుడు బ్రహ్మతేజస్సుతో నున్నావు. మంత్రపూతమగు జలముతో మూడు దినములు స్నానము చేయింతును. నిరాహారముగ నీవీ మూడు దినములుండును. అప్పుడు నీవు మరింత పవిత్రుడవు కాగలవనెను. నిశ్శంఖులునిచే మంత్రజలమున స్నానము మూడు దినములు చేయించెను. నిశ్శంఖులుడు వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై యుండెను.


వీరవ్రతుడు నిశ్శంఖులునకు ఇట్లు ఉపదేశించెను. ఓయీ! నిరంతరము సంతోషముగనుండుము. వేదమార్గమును అతిక్రమింపకుము. శాస్త్రముననుసరించి కార్యములనాచరించుము. వివాహము చేసుకొని గృహస్థ ధర్మము నాచరింపుము. ప్రాణహింసను మానుము. సనాతన ధర్మమును పాటింపుము. సజ్జనులను సేవింపుము, సంధ్యా వందనము మున్నగు నిత్య కర్మలను మానకుము. ఇంద్రియ నిగ్రహమును కలిగియుండుము. హరిని హరుని పూజింపుము. ఇతరుల అపరాధమును చెప్పకుము. ఇతరుల వృద్ధిని జూచి విచారపడకుము. పరస్త్రీలను తల్లివలె చూదుము. చదివిన వేదములను మరువకుము. అతిధుల నవమానింపకుము. పితృదినమున శ్రార్థమును మానకుము. చాడీలను చెప్పకుము. ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుచుండుము. సిగ్గును విడిచి హరినామమును కీర్తింపుము. పెద్దలు చెప్పిన త్రిపుండుధారణము చేయుము. రుద్రాక్షమాలను ధరించి రుద్రసూక్తముతో శివుని అర్చింపుము. తులసి మాలను ధరించి తులసీ దళములతో లక్ష్మీనారాయణులను, బిల్యదళములతో శివుని అర్చింపుము. హరిపాద తీర్థమును సేవింపుము. నివేదాన్నమును భుజింపుము, యతీస్వరులను గౌరవింపుము. తల్లిదండ్రులను సేవింపుము. నియమముతో మంత్రానుష్ఠానము చేయుము. కామక్రోదాది శత్రువులను జయింపుము, మాఘస్నానమును మానకుము, మనస్సు నదుపులో నుంచుకొనుము. చిత్తశుద్ధితో వ్రతాదికము నాచరింపుము, అని వీరవ్రతుడు నిశ్శంఖలునకు ధర్మప్రశస్తిని ఆచరణ విధానమును చెప్పెను.

నిశ్శంఖలుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించెను. గురువు అనుమతినంది మరల కాశీనగరమునకు పోయెను. గృహస్థాశ్రమమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను. మాఘస్నానమును ప్రతి సంవత్సరము చేయుచుండెను. అనేక భోగములను పుత్ర పౌత్రులను పొంది సుఖమిగ నుండెను తరువాత మరణించి ముక్తి నందెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం శివమయం

‘విశ్వమంతటికీ ఆధారమై ఉన్నవాడు’ అనే అర్థం శివనామానికి ఉంది. అనంత విశ్వానికి ఆధారమై, తన సహజశక్తితో జగమంతా నడిపే ఈశ్వరుడి అసలు తత్త్వం- శాంతం, శుద్ధం, శుభం, క్షేమం. ఈ నాలుగింటినీ ఒక్క పదంలో చెబితే... ఆ పదమే ‘శివ’.
సామాన్య దృష్టిలో- ‘శివుడు ఒక దేవత. కోరిన వరాలిచ్చే దేవుడు’. తాత్త్విక దృష్టితో, యోగ భావనతో పరిశీలిస్తే చాలా అద్భుత తత్త్వాలు- వేద, పురాణ, ఇతిహాస, ఆగమ, కావ్యాది గ్రంథాల్లో గోచరిస్తాయి.
సాధకుల ప్రయోజనాల కోసం ఒకే శివత్వం-‘శివాన్ని’(శాంతిని, శుద్ధిని, శుభాన్ని) ప్రసాదించడానికి బహు రూపాలు ధరించింది- అని శైవగ్రంథాలు వివరిస్తున్నాయి. ఒకే ఈశ్వర శక్తియే స్త్రీ, పురుష తత్త్వాలుగా విశ్వమంతా వ్యాపించినది- అనే సత్యానికి సాకారం ‘అర్ధనారీశ్వర’ మూర్తి.
చైతన్యాన్ని ‘జ్యోతి’ అనడం శాస్త్ర పరిభాష. అన్నిటా లీనమైన ఆ చైతన్య జ్యోతినే ‘జ్యోతి ర్లింగం’ అన్నారు. శరీరంలో పది కర్మేంద్రి యాల్లో, పది  జ్ఞానేంద్రియాల్లో, మనస్సులో, జీవునిలో (పన్నెండింటిలో) లీనమైన ఈశ్వర చైతన్యమేద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపం! అలాగే మనలో- ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన- అనే పంచప్రాణాల్లో, నాగ, కూర్మ, కృకర,దేవదత్త,ధనంజయ-అనే అయిదు ఉపప్రా ణాల్లో వీటికి ఆధారమైన ఆత్మలో జన్మ (మొత్తంపదకొండు) ప్రాణశక్తులే ఏకాదశ రుద్రులు.
పంచభూతాలు, పంచతన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు), పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచప్రాణాలు... అనే పంచతత్వాల్లో నిండిన చైతన్య రూప శక్తి శివుడు. అందుకే ఆయనను పంచముఖుడిగా శాస్త్రాలు దర్శించాయి.
దేవతలను శాసించే శక్తి కుమారస్వామిగా, పలు సమూహాలను (గణాలను) నియమించే శక్తి గణపతిగా- ఈ రెండూ తన నుంచి వచ్చిన పుత్రులుగా పరివారమూర్తి శివుడు సాక్షాత్కరిస్తాడు.
పంచభూతాల్లో, సూర్యుడిలో, చంద్రుడిలో, జీవి చైతన్యంలో- వెరసి ఎనిమిదింటిలో- ఒకే శివుడు వ్యాపించి విశ్వరూపుడయ్యాడు. ఆ ఎనిమిదింటినీ శివుని ‘అష్టమూర్తులు’గా వేదాది శాస్త్రాలు పేర్కొన్నాయి.
శివుడి మూర్తులన్నింటిలో దివ్యమైన యోగరహస్యాలు, తత్త్వ సంకేతాలు, జ్ఞాన విశేషాలు గోచరిస్తాయి. ఏ రూపమూ లేని జ్యోతి స్వరూపుడైనా తన బహువిధ శక్తులను బహురూపాలతో ప్రకటించడమే శివలీల.
అపమృత్యువులను, అకాల మృత్యువును, అజ్ఞానమనే అసలు మృత్యువును తొలగించే అమృతేశ్వరుడు ‘మృత్యుంజయుడు’. శాశ్వతమైన ఆనందతత్త్వానికి సాకారమే మృత్యుంజయమూర్తి. దుఃఖాలను, రోగాలను పోగొట్టేవాడు కనుక ‘రుద్రు’డు. దేవతలకు సైతం శాసకుడు కనుక ‘మహాదేవుడు’. శుభానికి మూలమైనవాడు కనుకనే ‘శంభుడు’. శుభాలను ప్రసాదించేవాడు కాబట్టి ‘శంకరుడు’ అని వేదసూక్తాల్లో శివనామాలు కీర్తిస్తున్నాయి.
జాగ్రత్‌, స్వప్న, సుషుప్తి... అవస్థల్లో ఈశ్వర చైతన్యం అంతర్లీనంగా ఉన్నప్పటికీ, అవస్థల తాదాత్మ్యం వల్ల ఈశ్వరుని తెలుసుకోలేకపోతుంటాం. యోగులు ధ్యాన సమాధిలో ఈ మూడు అవస్థలను దాటిన ‘తురీయ’ భూమికలో బ్రహ్మానాంద రూపంగా ఈశ్వరానుభూతిని పొందుతారు.
యోగసాధనతో, తత్త్వజ్ఞానంతో శుద్ధమైన బుద్ధి ఇన్ని రకాలుగా శివతత్త్వాన్ని అనుభవానికి తెచ్చుకోగలదు, అనంతమైన శివత్వంతో ఐక్యం కాగలదు.శివభావనలో జాగరూకులై, పరమేశ్వర సాధనలో ప్రపంచ విషయాల అనుభవాన్ని వదలడమే జపవాసంగా, ధ్యానమే రాత్రిగా... ఈ సాధననే శివరాత్రి పర్వంగా శివయోగులు ఆచరిస్తారు, సర్వం శివమయం జగత్‌.