Devotional Telugu
3.46K subscribers
106 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
వృషభం.. ధర్మస్వరూపం

గోవుకు భారతీయ సంస్కృతిలో ఉన్నంత ప్రాధాన్యం బహుశా మరెక్కడా లేదేమో. వేదాల్లోనూ, పురాణాల్లోనూ పలుచోట్ల పలు విధాలుగా గోవు అనే పదాన్ని అనేక అర్థాల్లో వర్ణించారు. గోవు అన్న పదం కేవలం ఆవును మాత్రమే కాక ఎద్దును కూడా సూచిస్తుంది. ప్రత్యేకించి చెప్పాలంటే గోవృషభం అంటే ఎద్దు, గోధేనువు అంటే ఆవు అని చెప్పాలి. ఆవుకు పూజ చేయడం అతి సాధారణంగా చూస్తున్నా ఎద్దును గురించి కూడా పుస్తకాల్లో వర్ణన కనిపిస్తుంది. కోడె దూడను శివుడికి సమర్పించే ఆచారం పురాణాల్లోనూ, శైవ సంప్రదాయంలోని ఆగమాల్లోనూ చెప్పబడింది. అందువల్ల ఈ ఆచారం బహుశా అనాదిగా ఉండి ఉండవచ్చు. ఇటీవల కబేళాలకు మళ్లుతున్న మల్లన్న కోడెల గురించి వార్తలు వచ్చాయి. ఇదివరలో కూడా ఇలాంటి వార్తలను గమనించాం. ఈ నేపథ్యంలో ఒకసారి ఈ ఆచారానికి ఉన్న నేపథ్యాన్ని గమనిద్దాం.

స్కాందపురాణంలో గోవుల్ని శివుడికి అర్పించే విషయంపై ప్రస్తావన ఉంది. ఇక్కడ శివుడికి గోదానం చేయాలని చెప్పబడింది. గోదానం అంటే కేవలం ఆవు అనే కాక ఎద్దును కూడా ఇవ్వాలని చెప్పారు. ‘గాంపయస్వినీం’ అంటే పాలిస్తున్న ఆవును, ‘వృష సంయుతాం’ అంటే ఎద్దుతో పాటు శివుడికి అర్పిస్తే సమస్త జగత్తునూ దానం చేసినంతటి పుణ్యంతో సమానమట. ఇలా చేసినవాడు కోట్లాది సంవత్సరాలు శివుడితోపాటు భోగాలను అనుభవిస్తాడని చెప్పారు. వృషభాలతో పాటు గోవులను దానం చేసినవాడు కోటి సూర్యుల ప్రకాశంతో వెలుగుతున్న విమానాల్లో రుద్రుడితో సమానంగా తిరుగుతూ భోగాలను అనుభవిస్తాడని, గోవు శరీరంపై ఎన్ని రోమాలు ఉండే అన్ని వేల యుగాలు రుద్రలోకంలో సుఖాలనుభవిస్తాడని ఇదే పురాణంలో మిగిలినచోట్ల కూడా చెప్పారు. దేవాలయాలకు భూములున్న రోజుల్లో వాటి సేద్యానికి, అన్నదానాలు మొదలైనవాటికి గోవుల అవసరం ఉండి ఉండవచ్చు. యజ్ఞంలో అడుగడుగునా గో సంబంధమైన ఉత్పత్తులు చాలా అవసరం. అసలు వృషభం అంటే ఏమిటి? సంస్కృతంలో వృష అంటే వర్షించడం లేదా తడపడం అని అర్థం. వృషభం అంటే వర్షించేది. ఎద్దు తన రేతస్సును వర్షించి గో సంపదను పెంచుతుంది. గోసంపద ఆ రోజుల్లో ఒక ముఖ్యమైన సంపద. కౌరవులు విరాట నగరాన్ని రెండువైపులా ముట్టడించి గోవులను తోలుకెళ్లడం ఈ విషయాన్ని సూచిస్తుంది. వేదమంత్రాల్లో ‘చత్వారి శృంగాః’ అంటూ ప్రారంభమయ్యే అతి ప్రసిద్ధి చెందిన మంత్రం ఉంది. నాలుగు కొమ్ములు, మూడు కాళ్లు, రెండు తలలు, ఏడు చేతులు ఉన్న వృషభం మూడు తాళ్లతో కట్టివేయబడి, బిగ్గరగా రంకె వేస్తోంది అది దీని అర్థం. ఈ మంత్రానికి వ్యాకరణ శాస్త్రపరంగా, వేదాంతపరంగా, యజ్ఞపరంగా, జ్యోతిష్యపరంగానూ ఇలా అనేక అర్థాలు చెప్పారు. యజ్ఞపరమైన అర్థాన్ని చూస్తే నాలుగు వేదాలు నాలుగు కొమ్ములు. కర్మ, ఉపాసన, జ్ఞానం అనే మార్గాలు మూడు పాదాలు. మూడు తాళ్లతో కట్టబడటం అంటే సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలతో కట్టబడి ఉన్న మనందరి ప్రవృత్తి. వృషభం అంటే ధర్మం. ధర్మానికి అధిపతి శివుడు. రంకె వేయడం అంటే భగవంతుని తత్వాన్ని గొప్పగా బోధిస్తున్నాడు అని ప్రాచీనుల వ్యాఖ్య. ధర్మాన్ని ఆచరిస్తే అది మనం కోరిన కోరికల్ని వర్షిస్తుంది. చతుర్విధ పురుషార్థాల్లో (ధర్మము, అర్థము, కామము, మోక్షము) అర్థము, కామము రెండూ కూడా ధర్మానికి, మోక్షానికి మధ్యలో ఉండటం గమనించాలి. ధర్మం అనే తాటిపైనే నడుస్తూ అర్థాన్ని (సంపదను), కామాన్ని (కోరికలు) పొందాలని అర్థం. అలా చేసినప్పుడే ఆ సంపద, సుఖము మనస్సును పరిశుభ్రంగా ఉంచి నాలుగో పురుషార్థమైన సత్యాన్వేషణ గురించి ఆలోచించే శక్తినిస్తుందని అర్థం.
స్కాంద పురాణంలో శివపార్వతుల కల్యాణాన్ని వర్ణించారు. శివుడిని భర్తగా పొందడం కోసం పార్వతి తపస్సు చేస్తుంది. ఆ సమయంలో శివుడు మాయా బ్రహ్మచారి రూపంలో అక్కడకు వస్తాడు. ఆయన పార్వతితో మాట్లాడుతూ.. శివుడి గురించి తపస్సు చేడయం వృథా అని, అతను ఎద్దు వాహనంపై తిరుగుతుంటాడనీ.. ఇలా చాలా రకాలుగా నిందలు చేశాడు. పార్వతి అందుకు సమాధానంగా శివుడు పరబ్రహ్మ స్వరూపమని చెబుతుంది. శివుడి తత్వాన్ని వర్ణిస్తుంది. అందులో కూడా ‘వృషో ధర్మ ఇతి ప్రోక్తః’ అంటుంది. వృషభం అంటే ధర్మస్వరూపమని, ధర్మాన్ని శాసించేవాడు శివుడని అర్థం చెబుతుంది.
Contd.,...
వేద మంత్రాలను దర్శించిన రుషులు తాత్విక చింతనతో కూడిన విషయయాలను ప్రతీకాత్మకంగా కవితా ధోరణిలో చెప్పారు. ఇలా ప్రతీకాత్మకంగా ఉన్న విషయాలను రుషులు మరింత విస్తారంగా కథల రూపంలో పురాణాల్లో రాశారు. తాత్వికమైన భావం పురాణంగాను, పురాణం ఆచారంగాను మారడం మనం పలుచోట్ల చూడగలం. పురాణాల్లో గోదానాన్ని గురించి వర్ణించే సమయంలో కోట్ల యుగాలపాటు శివలోకంలో ఉంటారని, రుద్రుడిలా ఉంటారని చెప్పడం కేవలం అతిశయోక్తులు మాత్రమే. వేదాలకు అర్థాన్ని చెప్పే మీమాంస శాస్త్రంలో పై విధమైన వాక్యాల్ని అర్థవాదాలు అన్నారు. ఒక పనిని ఆచరింపజేయడానికి అది ఇవ్వబోయే ఫలాన్ని అతిశయోక్తులతో చెప్పడం, చేయకూడని విషయాన్ని అతిశయోక్తులతో చెప్పి భయపెట్టడం పురాణాల విధానం. భక్తులను సన్మార్గంలో ప్రవర్తింపజేయడానికే ఇలా చెప్పారని గుర్తుంచుకోవాలి. కానీ అవన్నీ అక్షరాలా నిజం అని భావించకూడదు. ఇవన్నీ ఒకానొక అమాయక యుగంలో, అందులోనూ పామరులకు చెప్పబడినవి. ఆధునికులకు ఇలాంటివాటిని అక్షర సత్యాలుగా చెబితే మూఢనమ్మకాలనే విమర్శలు వస్తాయి. పండితులు వీటిని వివరించి చెప్పడం చాలా అవసరం. శివుడికి కోడెలను సమర్పించే ఆచారాన్ని కూడా ధర్మాచార్యులు పరిశీలించి ప్రస్తుత కాలంలో ఆచరించదగిన దాన్ని నిర్దేశిస్తే బాగుంటుంది.
నమస్కారం మనిషికి సంస్కారమేనా?
🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం ఎందుకు చేయాలి?
🙏🙏🙏🙏🙏🙏
*****************
భారతీయ సంప్రదాయంలో పెద్దవాళ్లను, కొత్తవారిని పరిచయం చేసినప్పుడు నమస్కారం చేస్తుంటారు. రెండు చేతులు జోడించి హృదయానికి దగ్గరగా చేర్చి చేసేదే నమస్కారం. పెద్దా, చిన్నా ఎవరికయినా మనం నమస్కారంతో గౌరవిస్తుంటాం. నమస్కారం ద్వారా మనలోని అహాన్ని నిర్మూలించడంతో పాటు ప్రేమ, మానవత్వం, స్నేహం... తదితర గుణాలను వ్యక్తం చేస్తుంటాం. దేవాలయాల్లో దైవారాధనలో కళ్లు మూసుకొని నమస్కారం చేస్తాం. దీని ద్వారా అంతర్లీనంగా భగవంతుని సన్నిధిలో వున్నట్టు అనుభూతికి లోనవుతాం. మేధావులు, మహాపురుషులు, పెద్దవారు, విజ్ఞానుల దగ్గరకు వెళ్లినప్పుడు వారి వద్ద పూర్తిగా వంగి నమస్కారం చేస్తాం. వారిలోని గొప్పదనానికి వందనం చేసినట్టు అని అర్థం. మానవుల్లో రకరకాల తేడాలున్నప్పటికీ అందరిలోనూ ఆ పరమాత్మ ఒక్కడే. ఎదుటివారు కూడా తన లాంటి వారేనన్న భావనతో చేసేదే నమస్కారమని పెద్దలు చెబుతారు.
**************
🙏🙏🙏🙏🙏🙏
***************
శుభోదయం
మాఘ పురాణం – ౧వ అధ్యాయం
శౌనకాది మునులు యజ్ఞము చేయ తలపెట్టుట
సకల పురాణములకు ఆలవాలమైన నైమిశారణ్యమందు ఒకప్పుడు శౌనకాది మహాఋషులు లోక కళ్యాణార్థమై, ఒక మహాయజ్ఞమును తలపెట్టిరి. ఆ మహాయజ్ణము పరిసమాప్తమగుటకు ఒక పుష్కరకాలము అనగా పన్నెండు సంవత్సరములు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చిననూ, ఆ యజ్ఞమును పూర్తీ చేయవలయుననెడి దీక్షతో శౌనకాది మునులు తలపెట్టి, యజ్న స్థలముగా నైమిశారణ్యములో ప్రవహించు గోమతీ నదీతీరమును ఎన్నుకొని ఒక శుభ ముహూర్తమున యజ్ఞమును ప్రారంభించిరి. అంత పెద్ద యజ్ఞము చూచి తరింపవలయుననెడి కోరికలతో, భరతఖండము నలుమూలలనుండీ తపోధనులెందరో వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసము లేర్పరచుకొనిరి.
అచటికేతెంచిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు, వేదములామూలాగ్రముగా నవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయన మొనర్చిన మునికుమారులు వచ్చి పాల్గొనిరి.
ఆవిధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోను, పరివారముల తోను, తండోపతండములుగా యజ్ఞస్థలానికి జేరుకొనిరి. వేలకొలది ఋషిపుంగవులతో ఆ యజ్ఞస్థలము క్రిక్కిరిసి యుండెను. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదియు, పుణ్యప్రదమైనదియు, 12 సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహాయాగమగుటవలన పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందముతో వేంచేసి యాగాది కార్యక్రమములో పాల్గొనిరి.
దూర ప్రాంతాలనుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందున అమితానందం నొందిరి. సూతుల వారి ఆశీర్వాదములతో నిర్విఘ్నంగా యాగం జరుగునని అందరూ సంతోషపడిరి.
సూత మహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రముగ తెలిసియున్న మహానుభావుడు. వేదం, పురాణ ఇతిహాసాది సమస్త విషయములందూ వారికి తెలియనిది లేదు. అవి అన్నియు వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు, ఎల్లవేళలా నవ్వులొలికించు ముఖారవిందము, మేలిమి బంగారం వలె ప్రకాశించుచున్న శరీరం, వర్ణింప నలవికానిది. అటువంటి పుణ్య పురుషుడగు సూత మహాముని ఆగమనమునకు స్వాగతం పలికి, సాష్టాంగ దండ ప్రణామములాచరించి యజ్ఞం జరుగు ఆ పండ్రెండు సంవత్సరములలో యెన్నియో పురాణ గాధలు విని తరించవలెననెడి కోరికతో ముని పుంగవులందరూ వేచియుండిరి.
సూతుల వారు శౌనకాది మునుల కోరికలను గ్రహించినారు. ఇటువంటి పుణ్య కార్యములందు పురాణ పఠనం గావించి అశేష మునిసత్తములను తృప్తి పరచుట తన విద్యుక్తధర్మమని యెంచి వారి కోరికను మన్నించినారు.
ఒక శుభ ముహూర్తమున ఆశ్రమ వాసులందరూ సూతుల వారికి అర్ఘ్య పాద్యములొసంగి ఉచితాసనములపై ఆసీనులను జేసి “మునిశ్రేష్ఠా! మునికులతిలకా! ఇంతకుమున్ను ఎన్నియో పురాణ గాధలు తమరు తెలియజేయగా విని ఆనందించియున్నాము. అనేక ఇతిహాసములను ఆలకించి, అందలి సారమును గ్రహించి యుంటిమి. సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతికథలు మాకు వినిపించుచునే యున్నారు. అయినను మీబోటి సిద్ధపురుషులు పదునాలుగు లోకములు సంచారము చేసి యున్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకొనియున్నారు. గాన వినదగు విషయాలేమైనా యున్నయెడల విరామ కాలములో మాకు వినిపించవలయు”నని శౌనకాది మునులు ప్రార్థించిరి. ఆ ప్రకారముగా కోరిన శౌనకాది మునులు తన వలన క్రొత్త సంగతులు తెలుసుకొనవలెననెడి కుతూహలం కనపరచినందున వారలను జూచి సూత మహాముని ఇటుల పలికిరి –
“ముని పుంగవులారా! మీ మనోవాంఛను గ్రహించితిని. మీరు వినదగిన కథను నాకు తెలిసియున్నంత వరకూ విచారించి మీకు తృప్తి కలిగించెదను. ఇటువంటి మహా సమయమున పుణ్య కథలు చెప్పుట వలన నాకున్నూ, వినుట వలన మీకున్నూ పరమార్థము కల్గు’నని పలికెను.
శౌనకాది మునుల కోరిక
సూతమహామునిని అడిగినదే తడవుగా వారందులకు అంగీకరించగా “ధన్యులమైతి”మని మునులందరూ అమితానందం నొంది సూతులవారి పాదములను కండ్లకద్దుకొని సూతమహామునితో –
“ఆర్యా! పద్మపురాణమందు లీనమైయున్న మాఘమాసం యొక్క మహాత్మ్యంను మరల మరల వినవలయుననెడి కుతూహలం కలుగుచున్నది. అదియునుగాక రాబోవు మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహాత్మ్యం, ఆచరించవలసిన విధానం, మాకు వివరించవలసిందిగా” కోరిరి.
ఆ విధంగా శౌనకాది మునులు ఇతర తపశ్శాలురు కోరుటవలన సూతమహర్షి మిక్కిలి సంతసించి యిట్లు పలికిరి.
“ముని పుంగవులారా! మీరందరూ అతిముఖ్యమైన విషయాన్నే అడుగుచున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోవుచున్నది. ఇటువంటి సమయంలో మాఘ పురాణం వినుటవలన కలిగే ఫలము అంతింత కాదు. అదియునుగాక ఈ మహాయజ్ఞం జరుగుచున్న సమయములో మాఘమాసం యొక్క మహాత్మ్యం మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందులకు నేను అదృష్టవంతుడనే. కాన సావధాన మనస్కులై ఆలకింపు”డని సూతమహర్షి ఇట్లు వివరించిరి –
“నేను ణా తండ్రి శిష్యుడగు రోమహర్షుని శిష్యుడను. అతడు మహా తపస్వి, జ్ఞాని. నాతండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విష్ణ్వంశ సంభూతుడగు వేదం వ్యాస మహర్షికి ప్రియ పాత్రుడను. వారి దయవలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్ధ్యములు కలిగిన వాడనయితిని. నేను తెలియజేయుచున్న నీతిబోధలు సకల లోకములకు శుభములు కలుగును. మీరడిగినటులే పూర్వం దిలీప మహారాజుకు తన కులగురువైన వశిష్ఠమహాముని మాఘమాస మహాత్మ్యమును వివరించినా
రు. ఆ విషయమునే నేను మీకు వివరించబోవుచున్నాను.
దుఃఖ దారిద్య్ర నాశయ శ్రీ విష్ణోస్తోషణాయచ
ప్రాతఃస్నానం కరో మధ్యమాఘే పాప వినాశనం
మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనా నేన మేదేవ యధోక్త ఫలదోభవ

మాఘ స్నాన శ్లోకం
MAAGHA PURANAM -- 2

మాఘ పురాణం – 2వ అధ్యాయం

దిలీప మహారాజు వేటకు బయలుదేరుట:

దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులొనర్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రివలె అన్ని విధములా కాపాడుచుండెను. ఒకనాడా భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలెననెడి కోరిక కలిగెను. మనసున కలిగిన కోరికను ఎట్టి వారలకైననూ నెరవేర్చుకొనుట సహజమే కదా! ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్యసమేతుడై వెడలెను.
దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి కౄరమృగములతో నిండియున్నది. ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను, మనుష్యులను చంపి నానా భీభత్సములు చేయుచున్నవి.
దిలీపుడు అడవిలో మాటువేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను మట్టు పెట్టుచుండిరి. ఇలా కొన్ని రోజుల వరకూ అడవియందు వుండి అనేక క్రూర జంతువులను జంపిరి. ఒకనాడొక మృగం పై బాణం వేసెను. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయెను. దిలీపుడు పట్టు విడువక దాని వెంట పరుగెత్తెను. ముందు మృగం, వెనుక దిలీపుడు, ఆతని వెనుక పరివారము పరుగిడుచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమున ప్రవేశించెను. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎందిపోతున్నది. నీటికొరకు పరివారమంతా వెదుకుచుండిరి. అదృష్టం కొలదీ ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామరపువ్వులతో నిండి అతి మనోహరముగా నుండెను. దిలీపుడూ అతని పరివారమూ, తృప్తిదీర నీరు త్రాగిరి. గట్టుపైన ఉన్న వట వృక్షం క్రింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు, అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి, బాణములను వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను.
అటుల ఇంటిముఖం పెట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యెను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు గలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడియుండెను. ఆ బ్రాహ్మణుడును క్షణమాగి, ఆ రాజును గాంచి “ఈతని ముఖవర్చస్సు చూడగా గుణవంతునివలె నున్నాడు. ఈతని కేదయినా ఉపకారము చేయుట మంచిది” అని మనసులో తలచి – మహారాజా! శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్ననూ అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి? మాఘమాస మహాత్మ్యం నీకు తెలియదా!” అని ప్రశ్నించెను.
ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని జూచి – “విప్రోత్తమా! అటుల ప్రశ్నించారేమిటి?” అని ఆశ్చర్యంతో పలికెను.
“పరమ పావనమైన మాఘమాసం కదా!” అని జ్ఞాపకం చేయుచుంటినని బ్రాహ్మణుడు పలికెను.
“చిత్తము స్వామీ! నాకు గుర్తులేదు. రాజప్రసాదమున నున్న పురోహితులు చెప్పియుందురు. నేను మృగయావినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకా విషయం జ్ఞప్తి లేదు. కావున మాఘమాస మహాత్మ్యము నెరింగింప వలసినదిగా ప్రార్థించుచున్నా”నని దిలీపుడు వేడుకొనెను.
ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి “రాజా! సూర్యవంశపు గురువైన వశిష్ఠులవారు అప్పుడప్పుడు మీకడకు వచ్చుచుండును గదా! ఆతని వలన మాఘమాస మహాత్మ్యమును గురించి తెలుసుకొనుము. ఆ మహామునికి తెలియనిది ఏదియు లేదు. గాన అటుల చేయుము” అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయెను.
దిలీపుడు వశిష్ఠుని కడకుబోవుట:
దిలీపుడు తన పరివారంతో నగరము జేరెను. పదేపదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటులనో ఆ రాత్రి గడిపెను. మరునాడు ప్రాతఃకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు, సకలాభరణములు ధరించి, మంత్రి, సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను.
ఆ సమయములో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు వేదపఠనం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును జూచి వారికి తపోభంగము కలుగనీయరాదనీ కొంతతడవు వేచియుండెను. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు. అందుచే గురుభక్తి మిక్కుటముగా నుండెను. మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సునుండి లేచి రాజును కుశల ప్రశ్నలడిగి ఉచితాసనముపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమని యడిగెను.
దిలీపుడు వశిష్ఠునితో “ఋషిసత్తమా! తమవలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సంతుష్టుడనైతిని. కానీ మాఘమాస మహాత్మ్యముగాని,దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమనుండి తెలుసుకొన గోరి తమ వద్దకు వచ్చితిని. గాన పరమ పావనమూ మంగళప్రదమూ అయిన మాఘమాస మహాత్మ్యమును వివరించవలసినదిగా కోరుచున్నాను” అనెను.
అవును మహారాజా. నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసము యొక్క మహాత్మ్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన యావశ్యకత ఎంతయినా గలదు.
మాఘమాసముయొక్క మహాత్మ్యమును వర్ణింప నాకుకూడా శక్యముగాదు. ఇతర దినములలో చేయు క్రతువులు గాని, యాగములు గాని, ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసములో చేయునదీస్నానమువలన గొప్ప ఫలము కలుగును. అటువం
టి ఫలము నిచ్చు మాఘమాసము అన్నివిధముల శుభప్రదమైనది. గాన యీ మాఘమాసమునందు చేయు నదీ స్నానమువలన మనుజుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు. అంతియేగాదు. మాఘము అన్నివిధాలా పుణ్యప్రదమైనది.
అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును గాని మాఘ మాసములో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్న మహత్తుగలది మరొకటి లేదు.
MAAGHA PURANAM -- 3

మాఘపురాణం - 3వ అధ్యాయము

వింధ్య పర్వతము:

దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరల ఇట్లు చెప్పదొడంగెను. భూపాలా! నేను తెలుపబోవు విషయము చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగెను. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు. త్రాగుటకు నీరు లేదు. అంటువ్యాధులు ప్రబలి జనులు, పశువులు, చాలా నష్టపడినవి. అందువలన యజ్ఞయాగాది కార్యములు గాని, దేవతార్చనలు గాని, చేయలేకపోయిరి. వనములందు తపస్సు చేసుకోను మునీశ్వరులు సహితం ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదలి వలస పోవుచుంటిరి. అప్పుడు భృగుమహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను. రేవానదీ తీరమందున్న ఫలవృక్షములు పంట భూములు నీరులేక బీడు పడిపోయినవి. త్రాగడానికి నీరు కూడా లభించుట లేదు.
మహా తపస్వియగు భృగుమహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేక పోయాడు. ఎన్నో సంవత్సరాలనుండి ఆ ప్రాంతమందుండుటవలన అచటినుండి కదలుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధిలేక హిమాలయ ప్రాంతములకు వలసపోయాడు.
హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచరియ వున్నది. ఆ కొండచరియ అచటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా వున్నది. అది తెల్లగా కూడా వున్నది. ఆ కొండచరియయందు ఇంద్రనీలములు ఉండుట వలన ధగధగా మెరుస్తున్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండవద్దకు వచ్చి శ్రీమన్నారాయణు భక్తిభావముతో ప్రార్థించిరి. అంతియేగాక ఆ పర్వతమువద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరించుచుందురు” అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి. అంతట దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను.
“ఓ మహానుభావా! ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలుగజేసినవి. ఇంకను విశేషములున్న తెలుపగోరెదను” అని ప్రార్థించెను.
మరల వశిష్ఠులవారు ఇట్లు చెప్పిరి. “రాజా! నీయభీష్టం ప్రకారమే వివరింతును. సావధానుడవై ఆలకింపుము.
“ ఆ పర్వతరాజము కడు వింతయైనది. దానిపైనున్న వింత చెట్లు, పురాతన వన్య మృగములు, అనేక రకముల పక్షులతో నున్న ఆ అప్ర్వటం ముప్పది యోజనముల పొడవు కలిగి పది యోజనములు ఎత్తుగలదియై అలవారుచుండెను. అటువంటి పర్వతం వద్దకు భృగుమహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూచి సంతోషించాడు. తాను తపస్సు చేసుకొనుటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకొనుచుండెను” అట్లు కొంతకాలం గడచిపోయెను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకి వచ్చి తపమాచరించుకొనుచున్న భృగుమహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.
గంధర్వ యువకుని వృత్తాంతము:
“భృగుమహర్షీ! నా కష్టమును ఏమని విన్నవింతును? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించిననూ పులిమొగం నాకు కలిగినది. ఏ కారణంచే నాకు అటుల కలిగెనో బోధపడకున్నది. ఆమె ణా భార్య అతిరూపవతి, గుణవంతురాలు మాహాసాధ్వి. ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని. గాన ణా యీ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాదను తొలగింపజేయుడు” అని పరిపరి విధముల ప్రార్థించెను. భృగుమహర్షి గంధర్వుని దీనాలాపము నాలకించెను. ఆతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలచివేసినట్లయింది. ఆ గంధర్వుని కెటులైనను తన శక్తికొలది సాయము చేయవలయునని నిశ్చయించుకొని ఇట్లనెను.
“ఓయీ గాంధర్వ కుమారా! నీవు అదృష్టహీనుడవు. అదృష్ట హీనత వలననే నీకీ కష్టదశ కలిగింది. పాపం, పేదరికం, దురదృష్టం అను మూడునూ మనుజుని కృంగదీయును. ఈ మూడింటినీ నివృత్తి చేసుకొనవలెనన్న మాఘమాస స్నానమే పరమౌషధం. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమపావనమైన మార్గం. గావున నీవు నీ భార్యతో గూడ పర్వతం నుండీ ప్రవహించుచున్న నదిలో స్నానం చేయుము. అదియునుగాక యిది మాఘమాసము గదా! వెళ్ళబోయిన తీర్థమెదురైనట్లు అన్నియు సమకూడుతున్నవి. ఈరోజుతో నీ కష్టములు తొలగిపోవును. నీ మనోవాంఛ యీడేరును. భయపడకుమని మాఘస్నాన ఫలము గురించి వివరించెను.
ఆ గంధర్వుడు భృగుమహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినెను. తన భార్య కూడా మునీశ్వరుని వచనములాలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై ఆదాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానం చేసెను. వెంటనే తనకున్న పెద్దపులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను. ఆ గాంధర్వ దంపతులు అమితానందం నొందిరి.
అంత వారిద్దరూ భృగుమహర్షి కడకువచ్చి సాష్టాంగ నమస్కారము చేసిరి. భృగువు వారలను దీవించి పంపివైచెను.
ఈవిధంగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్ఠులవారు దిలీపునకెరిగించి, “వింటివా రాజా! గంధర్వ కుమారుని వృత్తాంతం? మాఘమాసములో పుణ్యనదులయందు స్నానమాచరించిన యెడల ఎట్టి ఫలం కలుగునో ఊహించుకొనుము.
MAAGHA PURANAM -- 4

మాఘ పురాణం - 4వ అధ్యాయము

కుత్సురుని వృత్తాంతము:

పులి ముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తరువాత మాఘమాస మహాత్మ్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పుచుండెను.
పూర్వకాలమున కుత్సురుడను పేరుగల విప్రుడొకడుండెను. అతడు కర్దమమునియొక్క కుమార్తెను వివాహమాడెను. కొంతకాలమునకా దంపతులకు ఒక కుమారుడు జన్మించెను.

కుమారునికి అయిదవ యేడు రాగానే ఉపనయనం చేసెను. ఆ బాలుడు దినదినాభివృద్ధి నొందుచు పెద్దలను గౌరవించడం విద్యాభ్యాసముయెట శ్రద్దజూపుట, నీతి నియమాలను పాటించుట, దైవకార్యములయందు భక్తి కలిగియుండుట మొదలగు కార్యములను నెరవేర్చుచు సకల శాస్త్రములనభ్యసించెను.

ఈవిధంగా కొంతకాలం గడచెను. ఆ బ్రాహ్మణ బాలునకు యుక్తవయస్సు వచ్చెను. అతనికి దేశాటనకు బోవలయునని కోర్కె కలిగి తీర్థయాత్రలకు బయలుదేరెను. అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు సిద్ధులను సేవించుచు, మాఘమాసం వచ్చునప్పటికి కావేరీ నదీ తీరమునకు చేరుకున్నాడు.

“నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించినది. ఇది నా భాగ్యం” అని ఆ విప్ర యువకుడనుకొని సంతృప్తి చెందెను.

మాఘమాసమంతయు ఇచటనేయుండి అధికఫలమును సంపాదించెదను” అని మనమున నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యమూ ఆ నదిలో స్నానము చేయుచు భక్తితో భగవంతుని సేవిస్తూనే అచటనే కాలం గడుపుచుండెను. ఆవిధముగా నదీ తీరమున మూడు సంవత్సరములుండి అత్యధిక పుణ్యఫలము సంపాదించెను. ఆ తరువాత అన్ని కోర్కెలను సంపాదించుటకు ఘోరతపమాచరించవలయుననీ తలంచి ఆ సమీపమందొక పర్వతముపై తపస్సు చేసికొన సంకల్పించి తపస్సుజేయ మొదలిడెను. అట్లు కొంతకాలము నిష్ఠతోనూ, నిశ్చల మనస్సుతోనూ, తపస్సు చేయుచుండెను. అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యెను.
ఆ విప్రయువకుడు కన్నులు తెరచి చూచుసరికి శంఖ, చక్ర గదాధరుడై కోటి సూర్యుల ప్రకాశముతో వున్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు. అమితానందముతో సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రము చేశాడు.

ఈవిధముగా స్తుతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తి భావమునకు శ్రీహరి సంతసమంది అతనిని ఆశీర్వదించి ఇట్లు పలికెను.
ఓ విప్రకుమారా! నీవు భక్తి ప్రభావముచే నన్ను ప్రసన్నుని చేసుకొంటివి. అది ఎటులనగా నీవు నిడవకుండ అనేక పర్యాయములు మాఘమాసములో నదీ స్నానము చేసి తపశ్శాలురు కూడా పొందని మాఘమాస పుణ్య ఫలమును సంపాదించితివి. అందుచేతనే నీపై నాకు గాఢానురాగము కలిగినది. గాన నీకేమి కావలయునో కోరుకొనుము. నీ అభీష్టము నెరవేర్చెదను” అని శ్రీమన్నారాయణుడు పలికెను.

శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై – ప్రభూ జగద్రక్షకా! సర్వాంతర్యామీ! ఆపద్బాంధవా! నారాయణా! ఆ దివ్య దర్శనము వలన నా జన్మ తరించినది. నిన్ను చూచినది మొదలు నేను ఏవిధమైన సుఖాలు కోరుటకు నా మనస్సంగీకరించలేదు. మనుజుడు ఏ మహాభాగ్యము కొరకు జీవితాంతము వరకు దీక్ష వహించునో అట్టి మహద్భాగ్యము నాకిపుడు కలుగగా మరొక కోరిక కోరగలనా? నాకింకేమియు అవసరము లేదు. కానీ మీ దివ్యదర్శనము నాకు ఎటుల కనిపించినదో అటులనే అన్ని వేళలయందు ఈ స్థలమందు భక్తులకు దర్శ మిచ్చుచుండవలెను. అదియే నాకోరిక” అని ప్రార్థించెను.

శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి నీ అభీష్టము నెరవేర్చెద గాక! అని పలికి నాటినుండీ అచటనే ఉండిపోయెను.

కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు వెళ్ళెను. చాలా దినములకు కుమారుడు వచ్చెనని వృద్ధులై వున్నా తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలడిగిరి.
MAAGHA PURANAM -- 5

మాఘపురాణం - అయిదవ అధ్యాయం

మృగ శృంగుని చరిత్ర

ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు గనుక ‘కౌత్సు’డని పిలవబడుచున్ననూ ఆతనిని “మృగశృంగు”డను పేరుతొ పిల్చుచుండిరి. అదెటులనగా అతడు కావేరీ నదీతీరమున ఘోర తపస్సు చేసియున్నాడు గదా! అప్పుడాతను శిలవలె నిలబడి దీక్షతో తపస్సు చేసుకొను సమయంలో ఆ ప్రాంతమందు తిరుగాడు మృగములు, జంతువులు, తమయొక్క శృంగములచే నతనిని గీకెడివి. అందుచేత అతనికి ‘మృగశృంగు’డను పేరు సార్ధకమయ్యెను.
వివాహమాడు కన్య గుణములు
మృగశృంగునాకు యుక్తవయస్సు వచ్చియుండుటచే అతనికి వివాహము చేయవలెనని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి. ఈ విషయము మృగశృంగునితో చెప్పిరి. మృగ శృంగుడు వారిమాట లాలకించి ఇట్లు పలికెను. “పూజ్యులగు తల్లిదండ్రులారా! నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము వివరించితిరి. ఐననూ నా అభిప్రాయము గూడ ఆలకింపుడు. అన్ని ఆశ్రమాలకంటే గృహస్థాశ్రమము మంచిదని దైవజ్ఞులు నుడివిరి. అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు. దానికి కారణ మేమనగా ప్రతి పురుషునకు తనకనుకూలవతియగు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును. దానికీ ఉదాహరణగా స్త్రీయెటులుండవలయుననగా –
శ్లో: కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా
శయనేషు రంభా రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రీ!
ఇవి ఆరు ధర్మములు ఉండవలెనని స్త్రీని గురించి వర్ణించియున్నారు. అనగా యింటి పనులలో దాసీవలెను, రాచకార్యములలో భర్తకు సహకారిగా మంత్రివలెను, శయన మందిరంలో రంభవలెను, భోజన విషయమున తల్లి వలెను, రూపమున లక్ష్మి వలెను, శాంతి స్వభావములో భూదేవి వలెను స్త్రీ ఆరువిధముల వ్యవహరింప వలెను.
అంతియేగాక చతుర్విధ పురుషార్థములైన ధర్మం, అర్థము, కామము, మోక్షము అని నాలుగు పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధింపనెంచిన మిగతా మూడున్నూ అనవసరం. ధర్మాన్ని అర్థాన్ని మనుజుడు ఏవిధంగా సాధించునో కామమును గూడా అట్లే సాధించవలయును.
ప్రతి మానవుడు వివాహం చేసుకొనే ముందు కన్యయోక్క గుణగణములు తెలుసుకొనవలయును. జీవిత సుఖములలో భార్య ప్రధానమయినది. కనుక గుణవంతురాలగు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు.
గుణవతియగు పత్నితో కాపురం చేసిన ఆ సంసారం స్వర్గతుల్యముగా నుండుటయే కాక, అట్టి మనుజుడు ధర్మ-అర్థ-కామ-మోక్షములను అవలీలగా సాధించగలడు.
భార్య గయ్యాళి వినయ విధేయతలు లేనిదై యున్నచో ఆ భర్త నరకమును బోలిన కష్టములనుభవించుచు మరల నరక కూపమునకే పోగలడు. గనుక పెండ్లి చేసుకొనుటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలెను. అదెటులన కన్య ఆరోగ్యవతియై యే విధమైన రోగాగ్రస్తురాలై ఉండకూడదు. యెంత అందమయినదైననూ మంచి కుటుంబములోని కన్యయై యుండవలెను. బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలయి, దేవా బ్రాహ్మణులను పూజించునదియై, అత్తమామల మాటలకు జవదాటనిదై యుండవలెను.
ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పియున్నారు. గాన అటువంటి గుణవంతురాలగు కన్యనే ఎంచుకొనవలయును. అయినా అదెటుళ సాధ్యపడును? అని మృగ శృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులో నున్న సంశయములను తెలియజేసెను. కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరల ఇట్లు పలికెను.
“కుమారా! నీమాటలు నాకెంతయో సంతోషమును కలిగించినవి. వయస్సులో చిన్నవాడవైననూ మంచి నీతులు నేర్చుకొన్నావు. నీయభీష్టం నెరవేరవలయునన్న ణా దీన దయాళుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు. భగవంతునిపై భారం వేయుము” అని పలికెను.
MAAGHA PURANAM -- 6

మాఘపురాణం - 6వ అధ్యాయం

సుశీల చరిత్ర
భోగాపురమను నగరంలో సదాచారుడు, దైవభక్తుడగు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను. అతనికి అందాలభరిణె వంటి ఒక కుమార్తె గలదు. ఆ కన్యపేరు సుశీల. మంచి శీలం గలది. మంచి బుద్ధిమంతురాలు. చిన్నతనం నుండియూ దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును స్వీకరించుచు, పురాణ పఠనమునందే సదా మనస్సు నిలిపి కాలం గడుపుచూ, యుక్త వయస్కురాలై పున్నమి చంద్రుని బోలు మోము కలదై యుండెను.
ఆమె గుణములు తెలుసుకొని ఆమెవద్ద అన్ని లక్షణములు ఉండుట వల్ల మృగ శృంగుడు సుశీలనే పెండ్లియాడదలచాడు.
ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాండ్రతో కలసి కావేరీ నదికి స్నానమునకు బయలుదేరి వెళ్ళినది. ఆ సమయమున నొక ఏనుగు అడవినుండి ఘీంకారం పెట్టుచు వచ్చి స్నానార్థమై వచ్చిన అ అముగ్గురు కన్యలను తరుమజొచ్చెను. వారు భయపడి ఏదిక్కూ గానక ముందు వెనుకలు జూడక పిక్కబలం కొలది పరుగిడబోవుచుండగా దారిలో గట్టులేని నూతిలోపడి ప్రాణములు విడిచిరి. ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసివచ్చి చూచుసరికి ముగ్గురూ చనిపోయి వున్నారు.
ఆ వార్త మృగ శృంగునకు తెలియుటచే అతడునూ వచ్చి ఆ ముగ్గురి మృతదేహములనూ చూశాడు. ఎక్కడలేని దుఃఖమూ కలిగింది. వారినెటులనైనను బ్రతికించవలయునని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహములను కాపాడుచుండుడని చెప్పి తాను సమీపముననున్న కావేరీ నదిలో రొమ్మువరకు దిగి ధ్యానం చేయసాగెను.
అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగ శృంగుని వద్దకు వచ్చినది. ఐననూ మృగ శృంగుడు చలించలేదు. నిర్భయముగా ధ్యానిస్తూనే వున్నాడు.
ఏనుగు కూడా మృగ శృంగుని కెదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది. అటుల కొంచెంసేపు నిలబడి తటాలున తన తొండంతో మృగశృంగుని పట్టుకొని తన వీపుపై కెక్కించుకొన్నది. ఐననూ ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయు శుభసూచకమని తలచినాడు. నీరు మంత్రించి ఏనుగుపై చల్లెను. తన రెండు చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు. క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదలి ఒక దేవతారూపంలో నిలబడి తనకు శాపవిమోచనం కలిగించిన ఆ మృగ శృంగునకు నమస్కరించి దేవలోకమునకు పోయెను.
వింటివా దిలీప మహారాజా! మాఘస్నాన ఫలం వలన ఏనుగునకు శాపవిమోచనమై ఎట్లు నిజరూపం వచ్చినదో! మిగిలిన వృత్తాంతం కూడా శ్రద్ధగా ఆలకింపుడు.
MAAGHA PURANAM -- 7

మాఘపురాణం - ఏడవ అధ్యాయం

మృగ శృంగుడు యముని గూర్చి వ్రతమాచరించుట
ఆవిధంగా ఏనుగునకు శాపవిమోచనమైన తరువాత మరల మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతబడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించు నిమిత్తం యమధర్మ రాజును గురించి తపస్సు చేయ నారంభించినాడు.
నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోరదీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమయి – “మృగశృంగా నీ కఠోరదీక్షకు, పరోపకార పరాయణతకు నేనెంతయు సంతసించితిని. నా గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ తపమాచరించి ఉండలేదు. నీకేమి కావలయునో కోరుకొనుము. నీ యభీష్టం నెరవేర్చెదను” అని యముడు పలికెను.
ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరచి చూడగా యముడు తన ఎదుట నిలబడియున్నాడు. వెంటనే చేతులు జోడించి “మహానుభావా! ఎంతటి తపశ్శాలురకైనను దర్శనమివ్వని మీరు నాబోటి సామాన్యునికి మీ దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరుకాదు. అకాల మరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తుని జేయుడు” అని ప్రార్థించెను.
మృగశృంగుని పరోపకార బుద్ధికీ, దయార్ద్ర హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారము ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానము చేయనేంచి “మృగశృంగా! నీ భక్తికి మెచ్చితిని. నీ పరోపకార బుద్ధి నన్నాకర్షించింది. నీకు జయమగుగాక” అని యముడు దీవించగా –
మహాపురుషా! మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు. మిమ్ము సోత్రము చేసిన వారికి, స్తోత్రము విన్నవారికి జరామరణములు కలుగవు. అట్టివారికి అన్ని విధముల శుభములు కలుగునటుల అనుగ్రహింపుము అని ప్రార్థించగా –
“అటులనే నీ కోరిక సఫలమగుగాక” యని యమధర్మరాజు దీవించి యద్రుశ్యుడయ్యెను.
విశ్వదర్శనం


నేత్రాలు మనిషికి జ్ఞాన ద్వారాలు. సృష్టినంతా దృష్టి ద్వారానే గ్రహించగలుగుతాం. దృష్టి లేనివారిది అంధకార ప్రపంచం. కొద్ది గంటల చీకటికే మనిషి అల్లాడిపోతాడు. జీవిత కాలం చీకటి బాధ- అనుభవించేవారికే తెలుసు. చూసే దృశ్యాల ప్రభావం మన మనసు మీద ఉంటుంది. ఒక సుందర దృశ్యాన్ని చూస్తున్నప్పుడు కలిగే పరవశం మనసంతా నిండిపోతుంది. నవరస భావాలన్నీ దృశ్య ప్రపంచంలోంచే మనకు లభిస్తాయి.
జ్ఞాన దృష్టికి సర్వత్రా సమభావమే కనిపిస్తుంది. ఈ విషయాన్నే గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. జ్ఞానలోపం వల్లనే దుర్విచక్షణలు ఏర్పడుతున్నాయి. శరీరం, దాన్ని ఆశ్రయించుకుని ఉండే ప్రత్యేకతలు, ప్రజ్ఞ మనిషిలో అహంకారానికి కారణం అవుతాయి. తన గురించి తాను అధికంగా ఊహించుకుంటూ విర్రవీగడమే అహంకారం. కారం ఎక్కువైతే తినలేం. అహంకారం ఎక్కువైతే ఎవరూ మనల్ని భరించలేరు.

దీనత్వమంటే, లేశమైనా అహంకారం లేని మానసిక స్థితి. అలాంటి స్థితిలో ఉండటమే అసలైన ఆధ్యాత్మికత. శ్రీరామకృష్ణులు, శ్రీరమణులు, గురునానక్‌ వంటి మహాత్ములందరూ ఆ స్థాయికి చెందినవారే.
అసలైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవారు వినయభూషణులై ఉంటారు. వారికి కోపతాపాలు, ఆశాపాశాలు ఉండవు. మరికొందరు ఆవుచర్మం ధరించిన తోడేళ్లలా వినయాన్ని పైపైన, తమ అంతరంగంపై ఆచ్ఛాదనగా కప్పుకొంటారు. విజ్ఞులు వారి కపట వినయాన్ని ఇట్టే పట్టేస్తారు. కృష్ణ వేషధారి భగవంతుడు కానట్టే, వినయ వేషధారిలో వినయమూర్తి ఉండడు. అటుపైన వినయనటన హాస్యాస్పదంగా ఉంటుంది. అపహాస్యం పాలయ్యాక గాని, తమ విఫలవినయ ప్రహసనం వారికి అర్థం కాదు.
బంగారం స్వచ్ఛతనుబట్టే అదెంత మేలిమి రకమో నిర్ణయిస్తారు. వ్యక్తికున్న ప్రతిభకన్నా వ్యక్తిత్వ ఉదాత్తతనుబట్టే గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఈ సత్యం అర్థమైతే, ఎవరూ పై మెరుగులకోసం ఆరాటపడరు. పొగడ్తలకోసం వెంపర్లాడరు. నిజమైన ప్రజ్ఞకు పొగడ్తలెందుకు? అది పారిజాత సుగంధంలా అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆకర్షిస్తుంది.
బదరీ నారాయణుడు తనను అప్సరసలు ప్రలోభపెట్టాలని ప్రయత్నించినప్పుడు, వారికంటే అందమైన ఊర్వశిని సృష్టించి తన స్థితప్రజ్ఞను చూపాడు. అవసరాన్ని బట్టి ఆయుధం తియ్యాలి. సందర్భాన్ని బట్టి ప్రజ్ఞను చూపాలి. మనిషి ఆర్జించుకున్న ప్రత్యేకతలన్నీ ఆయుధాలే. వినయం ఆధ్యాత్మిక కవచం. వీటిని సద్వినియోగం చేసుకున్నప్పుడే సత్ఫలితాలు లభిస్తాయి.
దృష్టి అంటే కేవలం చూపు మాత్రమే కాదు- చూసే విధానం కూడా. మనం చూసే విధానాన్ని బట్టే మన అవగాహన ఉంటుంది. అందరూ కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడికి బోధించడం చూశారు. కానీ, అర్జునుడు విశ్వంభరుడైన పరమాత్మ విశ్వదర్శనం చూశాడు. ఇలా ఉంటుంది దృష్టి భేదం.
శరీరాలు వ్యక్తులకు పరిచయాలు కావు. అదృశ్య వ్యక్తిత్వమే అసలు పరిచయం. సర్వప్రజ్ఞలూ అదృశ్య వ్యక్తిత్వానికే చెందుతాయి. దేహబలం శరీర పరిచయం అయితే మేధ, ఇతర ప్రజ్ఞలన్నీ వ్యక్తిత్వానికి పరిచయాలు. మాటలు, నడవడి, వ్యవహారశైలి మన వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి.
గౌరవ అగౌరవాల నిర్ణయం మన వ్యక్తిత్వాన్ని బట్టే జరుగుతుంది. జ్ఞానులు తమ అంతరంగ ప్రపంచాన్ని, అజ్ఞానులు తమ బాహ్య ప్రపంచాన్ని ఆనందమయం చేసుకుంటారు. మన దృష్టి దైవప్రతిమలు, చిత్రాల దగ్గరే ఆగిపోతే ఆ అంతర్యామి మనకెన్నడూ అవగతం కాడు. ప్రహ్లాదుడి లాగా విశ్వాన్ని పరమాత్మ ప్రతిరూపంగా చూడటమే అసలు దృష్టి. అదే విశ్వదర్శనం!
పాదపూజ

భారతీయ సంస్కృతి, సదాచారాలు చాలా అర్థవంతమైనవి. భౌతిక దృష్టికి అందని పరమార్థం వాటిలో నిక్షిప్తమై ఉంటుంది. పాదపూజ ఒక ఆచారంగా, సామాన్య వ్యవహారంగా అనిపించవచ్చు. అది వేదకాలమంత ప్రాచీనమైంది. పవిత్రమైంది.
పూజనీయులు, జ్ఞానసంపన్నులు పాదపూజకు అర్హులు. ఆ మహనీయులను జీవితకాలమంతా ధర్మమార్గంలో నడిపించింది వారి వ్యక్తిత్వం. ఆ పాదాలు సమున్నతమైన వ్యక్తిత్వానికి, ధర్మ నిబద్ధతకు ప్రతీకలు. పాదప్రక్షాళన చెయ్యడమంటే ఒక వ్యక్తి జీవన విధానాన్ని ఆసాంతం గౌరవించడం. పాదపూజ అనంతరం వినియోగించిన నీటిని తలపై చల్లుకోవడం, పెద్దల పాదాలకు శిరస్సు తాకించి నమస్కరించడం ఆచారం. దేహానికి అట్టడుగు భాగం పాదాలైతే అత్యున్నత అవయవం శిరస్సు. మస్తిష్కం మేధకే కాక గర్వం అహంభావాలకు నిలయం. చరణాలకు శిరసా నమస్కరించడమంటే దర్పాన్ని వీడి ఆయా వ్యక్తుల ఔన్నత్యాన్ని అంగీకరించడమే.
అపరిచితులైనప్పటికీ అతిథుల్ని పాదపూజతో సత్కరించడం ప్రాచీనకాలంలో ఉండేది. వచ్చిన వ్యక్తి అన్నింటా మనకన్నా యోగ్యుడా కాదా అన్న శంక వారికి ఉండేది కాదు. అతిథిలో దైవాన్ని చూడటమే నాటి జీవన విధానం. భోజనాదుల అనంతరం అతిథికి పాదసేవ చెయ్యడం ద్వారా సంతోషపరచేవారు. సనాతన జీవనశైలి ఎంత నిరాడంబరమైందో తెలియజెప్పే సన్నివేశాలివి.
మునులు, రుషిపుంగవులు సభా మంటపానికి విచ్చేసినప్పుడు సాక్షాత్తు మహారాజు వారికి ఎదురెళ్ళి ఆహ్వానించి, ఉచితాసనంపై కూర్చోబెట్టి పాదపూజ చేసేవారు. వేద విజ్ఞులై సకల శుభాలను అనుగ్రహించే ఆ మహనీయుల గొప్పతనం ముందు మహారాజ పదవిని చాలా అల్పమైనదిగా భావించేవారు.
సకల లోకాలకు స్థితి కారకుడు శ్రీ మహా విష్ణువు. ఆయన అర్ధాంగి లక్ష్మీదేవి. ఆమె ఐశ్వర్య ప్రదాత. ఆమె నిరంతరం విష్ణు పాదసేవలో నిమగ్నమై ఉంటుందంటారు. భౌతిక విషయాసక్తులైన మనుషులు ధనాభిలాషులవుతుంటారు. మోక్ష కారకుడైన పరంధాముడిని విడిచిపెట్టి సంపదలను కోరుకోవడం అజ్ఞానం అనిపించుకుంటుంది. అన్నమయ్య, త్యాగయ్య వంటి భక్తులు కోరివచ్చిన సుఖాలను విడిచిపెట్టారు. తమ సంకీర్తనల ద్వారా విష్ణు పాదాల ప్రాధాన్యాన్ని లోక విదితం చేశారు.
ప్రమథలు శివభక్తులు. శివుడు తన కుమారుల్లో ఒకరిని ప్రమథ గణానికి నాయకుడిని చెయ్యాలని భావించాడు. వినాయకుడు, కుమారస్వామి ఇద్దరూ శక్తి సంపన్నులే. నాయకత్వం వహించడానికి ఇరువురూ సుముఖత వ్యక్తం చేశారు. శివుడు సర్వ పుణ్యక్షేత్రాలను దర్శించి పవిత్ర తీర్థాల్లో స్నానమాచరించి ముందుగా వచ్చినవారికి నాయకత్వ విధులు అప్పగిస్తానని షరతు పెట్టాడు. మయూర వాహనుడైన కుమారస్వామి వెంటనే ప్రయాణమయ్యాడు. లంబోదరుడు మూషిక వాహనంపై వెళ్ళడానికి సందేహించాడు. ఎంత శీఘ్రగతిలో ప్రయాణం చేసినా తమ్ముడిని దాటి వెళ్ళడం అసాధ్యం అనిపించింది. యుక్తితో ఆలోచించాడు. తల్లిదండ్రుల పాదాలకు మించిన పవిత్ర తీర్థాలు, పుణ్యక్షేత్రాలు లేవనిపించింది. శివ పార్వతుల పాదాలను పూజించాడు. భక్తితో వారికి ప్రదక్షిణలు చేశాడు. ఆ మహిమ కారణంగా కుమారస్వామి వెళ్ళిన ప్రతిచోటా వినాయకుడు దర్శనమిచ్చాడు. వినాయకుడు ప్రమథ గణాలకు నాయకుడై గణపతి అన్న పేరు పొందాడు.
కన్యాదాన సమయంలో వరుడి కాళ్లు కడిగే సంప్రదాయం ఉంది. వరుడిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా భావించి ఆ కార్యక్రమం నిర్వహిస్తారు.
MAAGHA PURANAM -- 8

మాఘపురాణం - 8వ అధ్యాయము

యమలోక విశేషములు
మృగశృంగుని పట్టుదల చేతను, యముని కటాక్షము చేతను ఆ మువ్వురు కన్యలు నిద్రనుండి మేల్కాంచినటుల లేచి, వారు యమలోకమందు చూచిన వింతలూ, విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి.
యమలోక మందలి జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలనుభవించుచున్నారు. ఒక్కొక్క పాపి తానూ చేసిన పాపకర్మలకెంతటి శిక్షలననుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి. ప్రతి పాపినీ ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింపజేయుదురు. సలసల కాగిన నూనెలో పడవేయుదురు. విషకీటకములున్న నూతిలో త్రోసివేయుదురు. తలక్రిందులుగా వ్రేలాడగట్టి క్రింద మంట పెట్టుదురు. మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు. అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయింది.
అపుడా కన్యలు వారిని ఓదార్చి “మీరు భయపడకుడు. ఆ నరక బాధనుండి బైటపడు ఉపాయమొక్కటే యున్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖముల ననుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీస్నానము చేయుట తనకు తోచిన దానములు, ధర్మములు, జపతపములు యిత్యాది పుణ్యకార్యములు చేయుటవలన నంతకుముందు చేసియున్న పాపములన్నియు పటాపంచలై నశించుటయే గాక, స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును. గాన మాఘమాస స్నానఫలము అంత ప్రసిద్దమయినది.
మాఘమాసమందు నదీస్నానమాచరించి నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానము చేసిన కోటి క్రతువులు చేసినంత ఫలితము కలుగును. మాఘమాసమంతయు పురాణ పఠనం చేసినను, లేక వినినను, శ్రీహరి దయకు పాత్రులగుదురు గాన మీరు భయపడవలసిన పనిలేదు. నరక బాధలనుండి బైటపడుట కంతకంటే సులభమార్గము మరియొకటి లేదు” అని వారి తల్లిదండ్రులకు వివరించిరి.
రధసప్తమి

‘మాఘం’ (మా+అఘం).. అంటే పాపం లేనిది. విష్ణువుకు, శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ‘సూర్యారాధనము’ అత్యంత పుణ్యఫలప్రదం. అందునా.. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి పరమ పవిత్రమైన రోజు. ఈరోజు సూర్యభగవానుడి రథం ఉత్తర దిక్కుకు తిరుగుతుంది. అలాగే.. నక్షత్ర మండలం ఈ రోజు రథాకారంలో ఉంటుంది. అందుకే ఈరోజుకు ‘రథ సప్తమి’ అని పేరు. రథసప్తమినాడు అరుణోదయ కాలంలో.. లేదా సప్తమి తిథి ఉన్నప్పుడు ఏడు జిల్లేడు ఆకులను తలపై, భుజాలపై, చేతులపై పెట్టుకుని

యద్యజ్జన్మకృతం పాపం మయా జన్మసు సప్తసు

తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ


..అంటూ చేసే సమంత్రక స్నానం,పుణ్య నదీ స్నానం ఏడు జన్మల పాపాలను పోగొడుతుంది. ఈ శ్లోకం చెప్పుకోకుండా జిల్లేడు ఆకులను పెట్టుకుని స్నానం చేసినా ఫలితం ఉండదు. తలపై పెట్టుకునే జిల్లేడు ఆకు సూర్యశక్తిని గ్రహించి బ్రహ్మరంధ్రం ద్వారా శరీరంలోకి పంపిస్తుంది. అది వేసవి వేడిమిని తట్టుకునే శక్తినిస్తుంది. అందుకే జిల్లేడు ఆకులు పెట్టుకుని స్నానం చేస్తారు. అలాగే.. ఈరోజున సూర్యధ్యానం, సూర్య నమస్కారాలు మహాఫలప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి.

 
సూర్యకిరణాలలోని ‘ప్రాణశక్తిని’ అత్యధికంగా నిల్వ చేసుకొనే వృక్షాల్లో ‘రుద్రాక్ష’, ‘జిల్లేడు’, ‘రేగు’ ముఖ్యమైనవి. ‘రుద్రాక్ష’ వల్ల ‘మశూచి’, ‘జిల్లేడు’ వల్ల వాత దోషాలు, చర్మ రోగాలు, కురుపులు పోతాయి. తెల్ల జిల్లేడు మరీ శ్రేష్ఠము. ‘రేగు’ రక్తశుద్ధికి మంచిది. ఇక.. ఈ రోజు ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి, వాటిపై బియ్యం, పాలు కలిపి పొంగలి చేసి చిక్కుడు ఆకుల్లో ‘సూర్యు’నికి నైవేద్యం పెడతారు. ఈ ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల పాపక్షయం, రోగక్షయమై మానవులకు ఎంతగానో మేలు కలుగుతుంది. కనుకనే మన సనాతన ధర్మంలో.. విశేష ఫలాలనిచ్చే ముఖ్యమైన పండుగ ‘రథ సప్తమి’ అని ‘ధర్మసింధు’ చెబుతోంది. మనిషి కంటితో చూడగలిగిన ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణుడు. ఆ స్వామిని ఈ మాసంలోనే కాదు.. ఏడాది పొడుగునా ఆరాధించాలి. ‘ఆదిత్య హృదయం’ పారాయణ.. సూర్యనమస్కారాలతో భాస్కరుణ్ని మెప్పిస్తే సర్వరోగాల నుండి విముక్తులం కావడమే కాదు.. పుణ్యలోక ప్రాప్తి కూడా పొందుతాం. అవి కూడా చేయలేనివారు..

 
సప్తాశ్వరథమారుఢం ప్రచండం కశ్యపాత్మజమ్‌

శ్వేతపద్మ ధరం దేవం తం సూర్యం ప్రణామామ్యహమ్‌


..అంటూ నిత్యం ఆదిత్యుడిని మనసారా స్మరించి నమస్కరించినా చాలు ఆ ప్రత్యక్ష నారాయణుడి కృపకు పాత్రులవుతారు.
MAAGHA PURANAM -- 9

మాఘపురాణం -9వ అధ్యాయము
పుష్కరుని వృత్తాంతము
ఈవిధంగా ఆ ముగ్గురు కన్యలు పునర్జీవుతులైన వృత్తాంతమును దిలీపునకు వివరించగా దిలీపుడు శ్రద్ధగా వినిన తర్వాత తనకు కలిగిన సంశయమును గురువర్యులను వశిష్ఠుల వారితో ఇటుల నుడివెను. –
“పూజ్యులైన ఓ మహర్షీ! ఈ భూలోకమునకు, యమలోకమునకు దూరమెంత?” చనిపోయిన ణా ముగ్గురు కన్యల ప్రాణములెంత కాలములో వెళ్ళి వచ్చినవి?” అని ప్రశ్నించెను.
వశిష్ఠుళ వారు దీర్ఘముగా నాలోచించి యిటుల బదులు చెప్పిరి. “మాహారాజా! అందరు తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగితివి. శ్రద్ధగా వినుము. భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు. చనిపోయిన ముగ్గురు కన్యలూ పుణ్యవతులు. వారొకసారి మాఘమాసములో స్నానమాచరించి యున్నందున వారికి కలిగిన పుణ్యఫలం వలననే మరల బ్రతుక గలిగినారు.
దీనికొక ఉదాహరణ వివరింతును ఆలకింపుము. ఒకప్పుడు పుష్కరుడను విప్రుడు ఈ కన్యల వలననే యమకింకరులచే యమలోకానికి పోయి తిరిగి భూలోకమునకు వచ్చెను. ఆ వృత్తాంతం కడు చిత్రమైనది.
పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు. సకల జీవులయందు దయగలవాడు. పరోపకారము చేయుటయే తన ప్రధాన ధ్యేయం. అతడు ప్రతి మాఘమాసమందునూ, నిష్ఠతో స్నాన జపములు మొదలగు పుణ్యకార్యములు విడువకుండ చేయు దీక్షావంతుడు. సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుచు, భజించుచు జీవితమును గడుపుచున్న పరమభక్తుడు.
ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణములు తోడ్కొని రండని తన భటుల కాజ్ఞాపించినాడు. యమభటులు వెంటనే పోయి యా విప్రపుంగవుని ప్రాణములు దీసి యమునివద్ద నిలబెట్టినారు. ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచనా నిమగ్నుడై ఉండెను. భటులు తోడ్కొని వచ్చిన పుష్కరునివైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచుండెను. యమ ధర్మరాజునకు ఏదో భయము ఆవరించినట్లయింది. వెంటనే పుష్కరుణ్ణి తన ప్రక్కనున్న ఆసనముపై కూర్చుండమని కోరెను.
యముడు భటుల వంక కోపంగా చూచి – “ఓరీ భటులారా! పుష్కరుడను పేరుగలవాడు ఆ గ్రామమందే మరియొకడు గలడు. వానిని తీసుకురాకుండా యీ ఉత్తముని ఏల తీసుకు వచ్చితిరి?” అని గర్జించుసరికి గడగడ వణికిపోయిరి.
యమధర్మరాజు పుష్కరుని వైపు జూచి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళుడు” అని చెప్పెను. జరిగిన పొరపాటునకు పుష్కరుడు కూడా విచారించి, సరే వచ్చిన వాడను ఈ యమలోకమును కూడా చూచి పోవుదును” అని అనగా యమలోకమును చూచుటకు పుష్కరునకు అనుమతించెను.
పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరుల పొందుచున్న నరక బాధలను చూడసాగెను. జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధముల శిక్షల ననుభవించుచుండుట పుష్కరుడు కనులారాగాంచెను.
అతనికి అమితమగు భయము కలిగెను. తన భయం బోవుటకు హరినామ స్మరణ బిగ్గరగా చేయసాగెను. వారి నామస్మరణ విన్న ఆ పాపజీవులు తమతమ పాపములను పోగొట్టుకొనుచుండిరి. వారి శిక్షలు ఆపు చేయడమైనది. యమలోకమంతయు చూచిన తరువాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చెను. పాపులు అనుభవించుచున్న నరక బాధలను చూచి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవుని స్మరించుచుండెను.
ఈ ప్రకారముగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకము వెళ్ళి తిరిగివచ్చిన వారున్నారు. ఇది నిజము.
మున్ను శ్రీరామచంద్రుడు పరిపాలించు సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయినాడు. ఆ వార్త విని రామచంద్రుడు యముణ్ణి ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించినాడు.
అటులనే శ్రీకృష్ణుడు తనకు విద్యగరపిన గురువుగారి కుమారుడు చనిపోగా తన మహిమ వలన తిరిగి బ్రతికించెను.