Devotional Telugu
3.46K subscribers
106 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
కౌశికి వెళ్లి శుంభనిశుంభుల సంహారం పూర్తిచేసింది. ఆ తర్వాత అమ్మవారు వింధ్యవాసినియై వింధ్య పర్వతం మీద కూర్చుని ఉంది. ఆ సమయంలో బ్రహ్మ అమ్మవారికి కైమోడ్చి నమస్కరించి స్తోత్రం చేసి ఒక సింహమును ఆవిడకి వాహనంగా బహూకరించాడు. సింహవాహన అనే పేరుతో వింధ్యవాసిని అనే పేరుతో ఆ కౌశికి మనలనందరిని రక్షించడం కోసమని ఆ వింధ్యపర్వతం మీద వేంచేసి ఉన్నది.

ఇపుడు ఈ గౌరీ వ్యాఘ్రమును కూడా వెంటపెట్టుకుని పరమశివుడు ఉన్న మందరపర్వతం మీదకు వెళ్ళింది. ఆమెను చూసి పరమశివుడు ఎంతో సంతోషించాడు. ‘పార్వతీ, నేను ఆనాడు ఈమాట ఎందుకన్నానో దానిలో గల రహస్యం ఈనాడు నీకు అర్థం అయింది. ఈ శరీరమును విడిచిపెట్టి దీనితో రాక్షస సంహారం జరగాలి. ఇప్పుడు నువ్వు నాకు ప్రీతి కలగడం కోసమని అటువంటి శరీరంతో వచ్చి పక్కన కూర్చోవడం చేత లోకమునకు ఒక కొత్త మర్యాద ఏర్పడాలి. నీవు వాక్యము, నీవు విద్య. నేను ఆ విద్యచేత ప్రతిపాదింపబడే జ్ఞానమును. విద్య జ్ఞానము ఈ రెండూ ఎలా విడివడి ఉండవో అలా నీవు నేనూ ఎల్లప్పుడూ కలిసే ఉంటాము. నీవు సోమాత్మకంగా ఉంటావు. నేను అగ్నిస్వరూపంగా ఉంటాను. ఊర్ధ్వముఖ ప్రయాణం నాది. నీవు క్రిందికి వెడతావు.నేనే ఈ సృష్టినంతటినీ లయకారకుడనై కేవలము బూదిగా మార్చి ఉంచినపుడు నీ అనుగ్రహ ప్రవేశం చేత మరల సృష్టి పునఃసృష్టి జరుగుతోంది. కాబట్టి ఈ సమస్తము మనమిరువురమై ఉన్నాము. ఇక మనం విడివడినది ఎప్పుడు! అటువంటిది నీవు నామీద కోపపది దూరంగా వెళ్ళినట్లుగా కనపడడం ఒక అద్భుతం. లోకరక్షణ కోసమని ఇద్దరం ఇలా ఆకృతులను స్వీకరించాము. మనం చేసిన ఈ లీల వృథాగా పోదు. రాబోవు కాలంలో లోకమునకు రక్షణ హేతువు అవుతుంది’ అన్నాడు. ఇక్కడ మనం ఆ లోక రక్షణ హేతువైన విషయమును గూర్చి తెలుసుకోవాలి. ఆంద్రదేశమునందు, తమిళ దేశమునందు ఒక అలవాటు ఉంది. మనం పెళ్ళిచేస్తే ఆడపిల్ల ముందుగా గౌరీపూజ చెయ్యాలి. గౌరీపూజ చెయ్యడం వెనకాల ఒక రహస్యం ఉంది. అన్నీ అమ్మవారి స్వరూపములే. పరమేశ్వరునికి ఇల్లాలిగా ఉండడం చాలా కష్టం. ఎప్పుడూ ఆయన మనస్సుకి ప్రీతిగా ప్రవర్తించాలి. ఏ చెరుకువిల్లు పట్టుకుని బాణాలు వేస్తే కాముడు సాధించలేకపోయాడో ఆ చెరుకు విల్లు తాను పట్టుకుని ఏమీ మాట్లాడకుండా కూర్చున్న వాడిని మనకోసమని సంసారంలోకి తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టింది. ఇటు బిడ్డలకి తండ్రిని కూర్చోబెట్టింది. అటు ఈ సృష్టి నంతటినీ చేసి మరల ఆవిడ అనుగ్రహంతో లోకమంతటినీ ఆయనలో కలుపుతోంది. ఏకకాలంలో ఈ పనులన్నింటినీ అమ్మవారు చేస్తోంది. నూతన వధువు కూడా ఒకరికి ఇల్లాలు అవడం కోసమని పీటల మీదికి వెడుతున్నపుడు ఆమెకు కూడా సర్వకాలములయందు కష్టం వచ్చినా సుఖం వచ్చినా భార్య భర్తకు విశ్రాంతి స్థానము కనుక ఆమెయందు అటువంటి బలం రావాలని ఆమెచేత సన్నికల్లు తోక్కిస్తారు. పెళ్ళి పీటలమీద కూర్చునేముందు పెళ్ళి కూతురుచేత గౌరీపూజ చేయిస్తారు. ఆ సందర్భంలోనే తల్లిదండ్రులు తమ కుమార్తెకు ‘సన్నికల్లు ఎలా ఉందొ అలా నువ్వు కూడా అన్నిటినీ గట్టి మనస్సుతో పెట్టుకోవాలి. అత్తవారింటికి వెళ్ళగానే అత్తమీద మామమీద మరిది మీద ఆడపడుచుల మీద భర్తకు వేరొక రకమయిన మాటలను భర్తకి చెప్పి కష్టం కలిగించి ఇంటిని రెండు చేయకు అని బోధ చేస్తారు. వధువు ‘నా భర్తను అనుగమించి నా భర్త శుశ్రూష చేసి నా భర్త పొంది పోయేటట్లుగా ఆయన మనస్సు నేను గెలుచుకోవాలి. ఏది చేస్తున్నా, అయ్యో దానికి తెలియకుండా చెయ్యడమా నన్ను అంత అనుగమించే మనిషి కదా అని దానికి చెప్పి చేద్దామని చేసేటట్లుగా భర్త మనస్సు గెలుచుకోగల స్థితిని నాకు కల్పించు. నేను కూడా నా భర్త చేత అంతటి అనురాగమును పొందెదను గాక. నువ్వు ఎలా పెద్దింటమ్మవై వుండి పసుపు కుంకుమలతో గౌరివి అయ్యావో మమ్మల్ని కూడా అలా కాపాడు’ అని పెళ్ళికూతురు గౌరీ తపస్సు చేస్తుంది. మన ఆర్షధర్మం అంత గొప్పది. మనజాతి దంపతులు అలా ఉండాలని కోరుకుంది. అలా ఉండాలి లోహితాస్యుని వంటి బిడ్డలు పుట్టాలంటే మహాతల్లి ఆ గౌరీదేవిని ఉపాసన చెయ్యండి. ఆడపిల్ల ఒక ఇంటి కోడలిగా వెడితే అంతటి ధృతిని పొంది ఉండాలని, అంతటి ధర్మాచరణమును పొంది ఉండాలని మనం గౌరీపూజ చేస్తాము.

అక్కడ వ్యాఘ్రమునకు ఒక విచిత్రం జరిగింది. అక్కడ అమ్మవారు పులిని కూడా మందర పర్వతము దగ్గరకు తీసుకువెళ్ళింది. దానిని పరమశివునకు చూపించి – ‘అయ్యో పాపం ఇది నాతో పాటు వచ్చింది. తన స్వభావమును మార్చుకుంది. కాబట్టి దీనికి కూడా నందీశ్వరునితో సమానంగా నా అంతఃపురమునందు రక్షణ భారము వహించే అదృష్టమును ఇవ్వండి’ అంది. అపుడు శంకరుడు తప్పకుండా పార్వతీ అని వెండి బెత్తమును ఒక మంచి ఖడ్గమును ఇచ్చి ఒక బంగారు కవచం కట్టి అమ్మవారి ఇంటిముందు నందీశ్వరుని కన్న కొద్ది స్థాయిలో సోమనంది అనే పేరుతో నిలబడే అనుగ్రహాన్ని ప్రమథగణములలో ఒకడిగా ఇచ్చాడు. అమ్మవారిని అలా చూసినందుకు అది సోమనంది అయింది. సోమనంది మనకి నవనందులలో ఒకటిగా కనపడుతుంది. ఈ సోమనంది వృత్తాంతం ఈ గౌరీ వృత్తాంతం కౌశికీ వృత్తాంతం రాక్షససంహారం ఎవరు చదువుతున్నారో వాళ్ళందరికీ అమ్మవారి అనుగ్రహం చేత చక్కటి అనుకూల్యముతో కూడిన దాంపత్యము సిద్ధించి ఏ ఇబ్బందులు రాకుండా స్త్రీలు పసుపుకుంకుమలతో పది
కార్తీక పురాణం - 24

24వ అధ్యాయము - అంబరీషుని ద్వాదశీవ్రతము

అత్రి మహాముని మరల అగస్త్యునితో "ఓ కుంభసంభవా! కార్తీకవ్రత ప్రభావము నెంతివిచారించిననూ, యెంత వినిననూ తనివి తీరదు. నాకు తెలిసినంతవరకు వివరింతును. అలకింపుము.

"గంగా, గోదావరీ మొదలగు నదులలో స్నానము చేసిన౦దువలనను, సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులోనరించినను యెంత ఫలము కలుగునో శ్రీమన్నారయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీకవ్రతమందు శుద్ధద్వాదశినాడు భక్తిశ్రద్దలతో దానధర్మములు చేయువారికిని అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశినాడు చేసిన సత్కార్యఫలము యితర దినములలో చేసిన ఫలము కంటె వేయి రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశీ వ్రతముచేయు విధానమెట్లో చెప్పెదను వినుము.

కార్తీక శుద్ధదశమి రోజున, పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా యేకాదశి రోజున వ్రతమూ చేయక శుష్కోపవాసముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయును. దీనికొక యితిహాసము కాలదు. దానిని కూడ వివరించెదను. సావధానుడవై అలకింపుము"మని యిట్లు చెప్పుచున్నాడు.

పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమభాగవతోత్తముడు. ద్వాదశీవ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండ వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశినాడు, ద్వాదశి ఘడియలు స్వల్పముగా నుండెను. అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్దముగా నుండెను. అదే సమయమున కచ్చటకు కోపస్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి, ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలయునుగాన, తొందరగా స్నానమునకేగి రమ్మనమని కోరెను. దుర్వాసుడ౦దుల క౦గీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలెను. అంబరీషుడు యెంత సేపు వేచియున్ననూ దుర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను. "ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానముకు వెళ్లి యెంతవరకు రాలేదు. బ్రాహ్మణునకాతిధ్యమిత్తునని మాటయిచ్చి భోజనం పెట్టక పోవుట మహాపాపము. అది గృహస్తునకు ధర్మము గాదు. అయన వచ్చువరకు ఆగితినా ద్వాదశీఘడియలు దాటిపొవును. వ్రతభంగమగును. ఈ ముని మహా కోపస్వభావము గలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమియు తోచకున్నది. బ్రాహ్మణ భోజనమతిక్రమించరాదు. ద్వాదశి ఘడియలు మించిపోకూడదు. ఘడియలు దాటిపోయిన పిదప భుజించినయెడల, హరిభక్తిని వదలిన వాడనగుదను. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్పలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు, భోజనము చేసిన దూర్వాసునకు కోపము వచ్చును. అదియునుగాక, యీ నియమమును నేను అతిక్రమించిన యెడల వెనుకటి జన్మయందు జేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చితము లేదు." అని అలోచించి "బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీమహావిష్ణువే బోగట్టగలదు. కావున నేను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే వుత్తమము. అయిననూ పెద్దలతో ఆలోచించుట మంచి"దని, సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో యిట్లు చెప్పెను.

"ఓ పండిత శ్రేష్టులారా! నిన్నటి దినమున యేకాదశి యగుటం జేసి నేను కటిక వుపవాసము వుంటిని. ఈ దినమున స్వల్పముగా మత్రమే ద్వాదశి ఘడియలున్నవి. ద్వాదశి ఘడియలలోనే భుజించవలసియున్నది. ఇంతలో నా యింటికి దూర్వాస మహాముని విచ్చేసిరి. అ మహామునిని నేను భోజనమునకు ఆహ్వాని౦చితిని. అందులకాయన అంగీకరించి నదికి స్నానర్ధమై వెళ్లి యింతవరకూ రాకుండెను. ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింపవచ్చునా? లేక, వ్రతభ౦గమును సమ్మతించి ముని వెచ్చేవరకు వేచియుండవలెనా? ఈ రెండిటిలో యేది ముఖ్యమైనదో తెలుపవలసిన"దని కోరెను. అంతట యా ధర్మజ్ఞులైన పండితులు, ధర్మ శాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసికొని, దీర్ఘముగా అలోచించి "మహా రాజా! సమస్త ప్రాణి కోటుల గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగావించి దేహే౦ద్రియాలకు శక్తినొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును. అ తపము చల్లార్చవలెనన్న అన్నము, నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్త కలుగచేయువాడు అగ్నిదేవుడు, దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ యగ్నిదేవునందరు సదాపూజింపవలెను. గృహస్తు, యింటికి వచ్చిన అతిధి కడజాతివాడైనాను 'భోజన మిడుదు' నని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదవేదాంగ విద్యావిశారదుడును, మహతపశ్శాలియు, సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన అయుక్షిణము కలుగును. దుర్వాసునంతటి వానిని అవమానమొనరించిన పాపము సంప్రాప్తమగను" అని విశదపరచిరి.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్యమందలి చతుర్వి౦శోధ్యాయము - ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము.

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
శివపురాణం - 24 వ భాగం

మార్కండేయ చరిత్ర :
ళు పోస్తే నాన్నా నీకు మార్కండేయ ఆయుష్షురా’ అనేవారు. అలా రోజూ అంటూ నీళ్ళు పోస్తే ఆ ఆశీర్వచనం నిజమౌతుంది అని వారి ఉద్దేశం.

ఎక్కడైనా సరే శివాలయంలో కూర్చుని ఒంట్లో బాగుండని వారు చంద్రశేఖర అష్టకమును నామీద నమ్మకంతో చదివితే వాళ్లకి అపమృత్యుదోషం రాకుండా నేను పరిహరిస్తాను. వారిని నేను రక్షించి తీరుతాను అంటాడు పరమేశ్వరుడు. కాబట్టి చంద్రశేఖరాష్టకం అంత గొప్పది. ఎవరయితే ఈ చంద్రశేఖరాష్టకమును నమ్ముకుని ప్రతిరోజూ ఇంట్లో చాడువుకుంటారో అలాంటి వాళ్ళ ఇళ్ళలోంచి అకారణంగా సమయం కాకుండా అపమృత్యు దోషం వలన బయటికి శరీరములు వెళ్ళవలసిన అవసరం లేకుండా నేను వాళ్ళని వాళ్ళ వంశములను కాపాడతాను. ఇది చదివిన వారికి దీనిని వినిన వారికి అపారమయిన కీర్తిని తేజస్సుని ఆయుర్దాయం నేను కృప చేస్తున్నాను అన్నాడు. ఈ అష్టకం ఎక్కడ చదువుతున్నారో అక్కడ అంతా శుభం జరుగుతుంది అన్నాడు. ఎవరు నమ్మకంతో రోజూ శివుని సన్నిధానమునందు మృత్యు భీతితో ఈ అష్టకమును పూనికతో చదువుతున్నారో అటువంటి వారికి మృత్యు భయం ఉండదు. ఆపదలు రాకుండా పూర్ణమయిన ఆయుర్దాయం వాళ్ళు పొందుతారు. దానితో బాటుగా అఖిలమయిన అర్థములు యశస్సు సంపత్తి అన్నీ చేకూరుతాయి. వీరి ప్రయత్నం లేకుండా చిట్టచివరి రోజున చంద్రశేఖరాష్టకం చదివిన ఫలితం చేత ఊపిరి జారిపోతున్నప్పుడు శంకరుని నామం జ్ఞాపకమునకు వచ్చి చంద్రశేఖరా అంటూ ప్రాణం విడిచి ఆయన చేతనే మోక్షం ఇవ్వబడి ఆయనలోనే కలిసిపోతాడు. అంత గొప్ప అష్టకంతో కూడిన ఈ మార్కండేయ మహర్షి జీవితమును ప్రత్యేకించి మాఘమాసంలో ఎవరు చదువుతున్నారో/వింటున్నారో వారికి పరిపూర్ణమయిన శివకటాక్షం కలుగుతుందని శివపురాణామ్తర్గతమయిన వాక్కు.
పూర్వకాలంలో మృకండుడు అనబడే ఒక మహర్షి ఉండేవాడు. గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణయందు ఆయన, ఆయన భార్యయైన మరుద్వతి ఇద్దరూ కూడా బహుశ్రద్ధ పూనిక ఉన్నవారు. వీళ్ళిద్దరూ హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక ఆశ్రమమును నిర్మితం చేసుకుని తల్లిదండ్రులతో, శిష్యులతో అక్కడ నివసిస్తున్నారు. ఆవులనన్నిటినీ చేరదీసి కాపాడుతూ ఆ ఆవుపాలతో శివార్చన చేస్తూ ఆయన ఈలోకమునందు ప్రకాశిస్తున్నాడు. మరుద్వతి ఎంతో సంతోషంతో అత్తమామలకు సేవ చేసేది. భర్తను సేవించేది. శిష్యులను తల్లిలా కాపాడేది. వాళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో తమ జీవితమును పండించుకుని అందరికీ కామధేనువై కల్పవృక్షమై తమ జీవితమును నడుపుతున్నా వారికి బిడ్డలు కలుగలేదు. ఆ సాకుతో వారు శివార్చన మాత్రం మానలేదు. ఈశ్వరుడిస్తాడని పూనికతో వారు శివార్చన చేస్తున్నారు.

ఇలా ఉండగా ఒకరోజు మృకండుడు బ్రహ్మ ఉండే అంతఃపురప్రదేశమునకు వెళ్ళి బ్రహ్మగారి సభలోనికి ప్రవేశించడం కోసం మిగిలిన ఋషులతో పాటుగా లోపలికి వెడుతున్నాడు. అపుడు ఆయనను అక్కడ ఉండే ద్వారపాలకులు మీరు వెళ్ళకూడదు అని అడ్డుపెట్టారు. ఆయన ఆశ్చర్యపోయి ‘నేను ఎందుకు వెళ్ళకూడదు?” అని ప్రశ్నించారు. ‘మీకు సంతానం లేదు. అందువల్ల మీకు బ్రహ్మ సభా ప్రవేశార్హత లేదు’ అన్నారు. మృకండుని అవమానించడం వారి ఉద్దేశం కాదు. శాస్త్రవాక్కు ఒకటి ఉన్నది. సంతానం లేకపోతే పితృ ఋణం తీరదు. ఎవరయినా వివాహం చేసుకోక బ్రహ్మచర్యంలోనే ఉండిపోతే ఇలాంటి బిడ్డలను కన్నారు కాబట్టి ఆ బిడ్డల తల్లిదండ్రులను తిరగేసి చెట్లకు కట్టేస్తారు. దేవీ భాగవతంలో దీనికి సంబంధించి ఒక కథ ఉంది. అందుకే నేను పెళ్లి చేసుకోను అనరాదు. చేసుకుని తీరాలి. ఇక్కడ మృకండునికి పితృ ఋణం తీరలేదు. అది దోషం. మృకండు మహర్షి ధర్మ సూక్ష్మం తెలిసిన ఉన్నవాడు. ‘నాకు అనపత్య దోషం ఉంది’ అని మనస్సులో కొంచెం బాధపడుతూ ‘అయ్యో నన్ను ఎందుకు ఈశ్వరుడు పితృ ఋణం నుంచి విముక్తుడిని చేయలేదు’ అని బెంగ పెట్టుకుని తిరిగి వచ్చేస్తున్నాడు. అదే సమయంలో వేరొక ప్రదేశంలో ఉండే మహర్షుల భార్యలు అక్కడి ప్రదేశంలో ఉండే తపోవనములను దర్శించడం కోసమని వచ్చారు. వారు మరుద్వతిని చూసి చాలా సంతసించి ‘అమ్మా మేము చాలా దూర ప్రాంతం నుంచి ఇక్కడ ప్రదేశములను చూడడానికి వచ్చాము. మాకు కొంచెం దేవతార్చనకు అవకాశం ఇవ్వగలవా’ అని అడిగారు. అపుడు ఆవిడ మీరందరూ తప్పకుండా రండి’ అని వారందరినీ పిలిచి పంచభక్ష్య పరమాన్నాలతో చక్కటి భోజనం తయారుచేసి వాళ్ళకి భోజనం వడ్డించింది. అపుడు వాళ్ళు ‘అమ్మా, అలా మేము ఒక్కళ్ళం భోజనం చేయము మేమూ తల్లులమే కదా! నీ బిడ్డలను పిలు. నీ బిడ్డలు కూడా ఇక్కడ కూర్చుంటే మేము నివేదన చేసుకుని స్వీకరిస్తూ తత్ప్రసాదమును వారి చేతిలో కూడా ఉంచుతాము. ఆ పిల్లలతో కలిసి తినాలని మాకు కోరికగా ఉంది. నీ బిడ్డలను పిలువవలసినది’ అన్నారు. అపుడు మరుద్వతి ‘అమ్మా నేను తక్కువ నోములు నోచాను. నా నోములు ఫలించలేదు. నాకు బిడ్డలు లేరు. మీవంటి తపస్వినులు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో అన్నం తిన్న పుణ్యం చేత నాకడుపు పండుతుందని అనుకుంటున్నాను. దయచేసి స్వీకరించండి’ అంది. అపుడు వాళ్ళు ‘అమ్మా, ఏమీ అనుకోవద్దు. పురుషుడు పితృ ఋణం తీరడం కోసమే సంతానమును అపేక్షించే క్షేత్రముగా భార్యను స్వీకరిస్తున్నాడు. మీరు గృహస్థాశ్రమంలో ఎందుకు ప్రవేశించారో తత్ఫలాన్ని ఇప్పటికీ పొందలేక పోయారు. కాబట్టి అలా బిడ్డలు లేని ఇంట మేము భోజనం చేయము’ అని చెప్పి వారు వెళ్ళిపోయారు. అపుడు మరుద్వతి ఎంతో బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంది.ఆసమయంలో మృకండు మహర్షి కూడా బాధపడుతూ ఇంటికి వచ్చాడు. ఆయన భార్యను నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అని అడిగారు. జరిగిన విషయం చెప్పింది ఆవిడ. అపుడు ఆయన కన్నుల కూడా నీరు కారింది. సంతానం కలుగకుండా గల దోషం పరిహరింప బడడం ఈశ్వరానుగ్రహంగా ఉంటుంది. ప్రత్యేకించి సుబ్రహ్మణ్యుని అనుగ్రహం మీదనే వంశవృద్ధి ఆధారపడి ఉంటుందని శాస్త్రవాక్కు. అందుకే సుబ్రహ్మణ్యారాదన అంత గొప్పది. ఆయన పూజ తద్దోషమును పరిహరిస్తుంది. అపుడు మృకండుడు అన్నాడు “అయ్యయ్యో మరుద్వతీ, ఏక కారణమునకు ఇద్దరమూ గురయ్యాము. దేవీ, నువ్వు బాధపడకు. ఈశ్వరుడు ఉన్నాడు. నేను ఆయన గూర్చి తపస్సు చేస్తాను, బయలుదేరుతున్నాను” అని నీ తపస్సు చేసుకోవడం కోసమని బయలుదేరి ఒక మారేడు వనమునందు శివలింగమును ప్రతిష్ఠించి దానికి రోజూ అర్చన చేస్తూ తపస్సు చేస్తున్నాడు. మరుద్వతి తపస్సు చేస్తున్న భర్త గారికి అన్నీ అందిస్తూ ఆయన క్షేమమును విచారిస్తూ తాను కూడా ఖాళీ సమయంలో పరమేశ్వరారాధన చేస్తోంది. వీరిద్దరూ ఇలా తపస్సు చేస్తున్నా శంకరుడు ప్రత్యక్షం అవలేదు.

నారదమహర్షి కైలాసమునకు వెళ్ళి శంకరుని చూసి ‘తండ్రీ, నిన్ను నమ్మి ఆ దంపతులిద్దరూ తపస్సు చేస్తున్నారు. ఇలా పిలిస్తే పలికేవాడివి.వారినింకా ఎన్నాళ్ళు పరీక్షిస్తారు’ అన్నాడు. శంకరుడు మహర్షికి ప్రత్యక్షమై నీకు పదహారేళ్ళ వయసు ఉండే కుమారుడు జన్మిస్తాడని వరమిచ్చాడు. కుమారుడు పుట్టాడు. మార్కండేయుడని పేరు. ఆ దంపతులు, కుమారుడు కూడా పరమేశ్వర భక్తితో కాలం గడుపుతున్నారు. ఇలా గడిపేస్తుండగా ఒకరోజు నారదమహర్షి అక్కడికి వచ్చారు. మృకండ
ు దంపతులు మహర్షికి అర్ఘ్యపాద్యాదులు సమర్పించారు. నారదుడు మృకండునితో ‘మృకండా, నీకు ఒక్క విషయం జ్ఞాపకం ఉందా? ఈ పిల్లవానికి పదిహేనవ సంవత్సరం వెళ్లి పదహారవ సంవత్సరం వచ్చింది. అది కూడా కొద్ది రోజులలో అయిపోబోతోంది. ఆనాడే ఉపద్రవం కూడా వచ్చేస్తుంది. ఇలాంటి పిల్లవాడికి ఏదయినా జరగరానిది జరిగితే మీరు తట్టుకోగలరా! ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపోతోంది కదా’ అన్నాడు. నారదుడు ఈమాటలు చెప్పగానే మరుద్వతి ఏడుస్తోంది. ఇంత తపో నిష్ఠా గరిష్టుడయిన మృకండుడు కూడా దుఃఖమును ఓర్చుకోలేక క్రిందపడి దొర్లి ఏడుస్తున్నాడు. ఇంతలో మార్కండేయుడు గబగబా లోపలికి వచ్ఛి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు. వాళ్ళు ఉన్న సత్యమును ఎరుకలో పెట్టారు. పిల్లవాడు మాత్రం ఏ విచారమూ లేకుండా నవ్వుతూ నిలబడి ఉన్నాడు. అపుడు నారదుడు వాడి భక్తి, వాడి విశ్వాసం వాడి ధృతి వాడి ధైర్యం చూశారా! మీరు ఏ తపస్సు చేస్తే వాడు పుట్టాడో ఇప్పుడు వాడే తపించగల శక్తితో ఉన్నాడు. వాడే శివుడున్నాడు, రక్షించి తీరుతాడనే పూనికతో ఉన్నాడు. కాబట్టి మీరు కూడా శివార్చనను పెంచండి. తపస్సు మొదలుపెట్టండి. మొట్టమొదట వీనిని హిమాలయ పర్వత ప్రాంతములకు పంపించి వీనిని అక్కడ కూర్చోపెట్టి తపస్సు చేయమని చెప్పండి. ఎ శంకరుడు వీనిని ఇచ్చాడో ఆ శంకరుడు వేడిని రక్షిస్తాడో రక్షించడో తేలిపోతుంది. పిల్లాడిని పంపండి’ అన్నాడు. అపుడు మార్కండేయుడు “నన్ను అనుమతించండి. నేను దీర్ఘాయుష్మంతుడనవ్వాలని ఆశీర్వచనం చేయండి. శంకరుని గూర్చి తపస్సు చేస్తాను. నాకు ఆ మహానుభావుడు సిద్ధిని ఇస్తాడు. మీరేమీ బెంగ పెట్టుకోకండి’ అని చెప్పి పిల్లవాడు వెళ్ళిపోయాడు. అలా వెళ్లి హిమాలయ ప్రాంతమందు ఒక శివలింగమును తయారు చేసి దానికి చిన్న దేవాలయం లాంటిది నిర్మించి అక్కడ కూర్చుని తపస్సు మొదలు పెట్టాడు.

సమయం ఆసన్నమయింది. అక్కడ యమలోకంలో యమ ధర్మరాజు దూతలను పిలిచి మార్కండేయుడిని పాశములచేత బంధించి ఈ లోకమును చేరండి’ అని చెప్పాడు. యమదూతలు వెళ్లి పాశం వెయ్యడానికి భయం వేసి యమలోకానికి తిరిగి వెళ్ళిపోయారు. అపుడు యమధర్మరాజుకు ఎక్కడలేని కోపం వచ్చి నేను బయలుదేరి వెడతాను. నాకు ఏమగాడు అడ్డు వస్తాడో చూస్తాను’ అని బయలుదేరుతుండగా నారదుడు ఎదురు వచ్చాడు. మహర్షిని నమస్కారం చేశాడు యమధర్మరాజు. అపుడు నారదుడు ‘ఎందుకయ్యా పంతాలు పట్టింపులు. వాళ్లకి ఉన్నది ఒక్క పిల్లాడు. మహర్షి కదా. పుత్రభిక్ష పెట్టిన వాడవు అవుతావు కదా’ అన్నాడు. నారదుడు ఇలా అనేసరికి యమధర్మరాజుకి కోపం వచ్చేసింది. ప్రాణములు తీసి తీరతాను అని దేవాలయం దగ్గరకు వెళ్ళాడు. అతనిని బహిర్ముఖుని చేస్తే సరిపోతుంది అనుకోని బయటకు రా నేను యమధర్మరాజుని నీ ప్రాణములు తీయడానికి వచ్చాను. అదే నీకు మోక్షము. బయటకు రా’ అన్నాడు. అపుడు మార్కండేయుడు ‘ఓరి పిచ్చివాడా! నీకుకూడా ప్రభువెవడో వానిని నేను ఆరాధన చేస్తున్నాను. నేను ఈ శరీరంతో ఉండిపోవాలని కాదు. నా తల్లిదండ్రుల కోర్కె తీర్చడానికి ఈ శరీరంలో ఉండాలనుకుంటున్నాను. అలా ఉండేటట్లు చేయమని పరమశివుని ప్రార్థిస్తున్నాను. నేను ఆయనను ఆరాధన చేస్తుండగా ఫలితం ఆయన ఇవ్వాలి తప్ప ఇవ్వడానికి నువ్వెవరు? నీకు చేతనయితే ప్రాణాలు తియ్యి’ అన్నాడు. యమధర్మరాజు గారికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. చేతిలో మెరిసిపోతున్న యమపాశమును విసిరి లాగుతున్నాడు. పిల్లవాడు భయపడకుండా శివలింగమును కౌగలించుకుని చంద్రశేఖరునిపై అష్టకం చదువుతున్నాడు. అలా కౌగలించుకోవడంలో కంఠమునకు పడిన పాశం శివలింగమునకు తగిలింది. అంతే ఒక్కసారి శివలింగం ఫెటిల్లున పేలిపోయింది. వామార్ధ భాగమునందు పార్వతీ దేవితో శంకరుడు ఆవిర్భవించి తన ఎడమకాలి పాదంతో యమధర్మరాజు వక్షస్థలం పై ఒక్క తన్ను తన్నేటప్పటికి యమధర్మరాజు నీలపై విరుచుకు పడిపోయాడు. అపుడు శివుడు తన చేతిలోని త్రిశూలంతో ఒక పోటు పొడిస్తే యముడు మరణించాడు. పిమ్మట మార్కండేయుని వంక ప్రసన్నుడై చూశాడు. ఒక్కవరం కోరుకో. అన్నాడు.

మార్కండేయుడు ఇరువురికీ నమస్కరించి నేను ఏ కోరిక కోరను? పాపం యముడు తెలియక పొరపాటు చేశాడు. ఆయనను బ్రతికించండి’ అన్నాడు. అపుడు శంకరుడు ప్రసన్నుడై చూడగా యమధర్మరాజు మళ్ళీ లేచి నమస్కరించి “స్వామీ, నువ్వు వరం ఇచ్చినప్పుడు ఈ బాలుడికి పదహారు సంవత్సరములు ఆయుర్దాయం మాత్రమె ఉంటుందని చెప్పావు. నేను చేసిన దోషం ఏమిటి? చెప్పవలసింది’ అన్నాడు. శివుడు మందహాసం చేసి నా హృదయం నీకు అర్థం కాకపోవడమే నీ దోషం. ఎప్పుడూ పదహారేళ్ళు వయస్సు ఉండే పిల్లవాడిని నేను వాళ్లకి ఇచ్చాను. నువ్వు పదహారేళ్ళే అర్థం చేసుకున్నావు. అందుకని ఇలా జరిగింది ఏమీ బెంగలేదు. వెళ్ళు’ అన్నాడు. మార్కండేయుడిని చూసి పార్వతీదేవి పొంగిపోయింది. వీడికి మంచి వరమును ఇవ్వవలసింది అని చెప్పింది భర్తకి. అప్పుడు పరమేశ్వరుడు ‘ఈ లోకములు అన్నీ ఎప్పుడు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయో, ఎప్పుడు వటపత్రశాయి తన బొటనవేలిని నోటిలో పెటుకుని చీకుతూ ఒక మర్రి ఆకుమీద పడుకున్తాడో అప్పటి వరకు చిరంజీవివై ఉంది మార్కండేయాయుష్షు అనే కొత్త ఆయుష్షును సృష్టించి నీకు ఇస్తున్నాను అన్నాడు. అందుకే మనవాళ్ళు పూర్వం పిల్లలకు నీళ్
కార్తీక పురాణం - 25

25వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని శపించుట

"అంబరీషా! పూర్వజన్మలో కించిత్ పాపవిశేషమువలన నీకీ యనర్ధము వచ్చినది. నీ బుద్దిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము" అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు "ఓ పండితోత్తములారా! నానిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీనిష్టను విడచుట కన్న, విప్రశాపము అధికమయినది కాదు. జలపానము చేయుట వలన బ్రాహణుని అవమానపరచుటగాదు. ద్వాదశిని విడచుటయుగాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు. గాన, జలపాన మొనరించి వూరకుందును" అని వారి యెదుటనే జలపానము నొనరించెను.

అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణముచే దూర్వాసుడు స్నానజపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై క౦డ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ "ఓరీ మదాంధా! నన్ను భోజనానికి రమ్మని, నేను రాకనే నీవేల భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము? ఎంతటి ధర్మ పరిత్యాగివి? అతిధికి అన్నము పెట్టెదనని ఆశజూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్ష కుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిధిని విడిచి భుజించినావు కాన, నీవు నమ్మకద్రోహివగుదువేగాని హరిభక్తుడవెట్లు కాగలవు? శ్రీ హరి బ్రాహణావమానమును సహింపడు. మమ్మే యవమానించుట యనిన శ్రీహరిని అవమానించుటయే. నీవంటి హరినిందాపరుడు మరి యొకడులేడు. నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై వున్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వనించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపాన మొనరించితివి. అంబరీషా! నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టినావురా! నీ వంశము కళంకము కాలేదా?" అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అ౦బరీషుడు, ముని కోపమునకు గడ గడ వణుకుచు, ముకుళిత హస్తములతో "మహానుభావా! నేను ధర్మహీనుడను, నా యజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులూ, దయా దాక్షిణ్యములు గలవారూ కాన, నన్ను కాపాడు" డని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన యెడమకాలితో తన్ని "దోషికీ శాపమీయకుండా వుండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగానూ, మూడవజన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, యైదవజన్మలో వామనుడు గాను, ఆరోవ జన్మలో క్రూరుడవగు బ్రాహణుడవుగాను, యేడవ జన్మలో మూఢుడవైన రాజుగాను, యెనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగానిలేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్తునిగాను, పదవ జన్మలో పాప బుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక" అని వెనుక ముందు లాలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తడగుచుండగా, శ్రీ మహావిష్ణువు బ్రాహణ శాపము వృధాకాకూడదని, తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు - అంబరీషుని హృదయములో ప్రవేశించి "మునివర్యా! అటులనే - మీ శాపమనుభవింతు" నని ప్రాధేయపడెను. కాని దూర్వసుడింకనూ కోపము పెంచుకొని శపించబోగా, శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచూ దూర్వసునిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి "బ్రతుకుజీవుడా" యని పరుగిడెను. మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమున కరిగి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్లి పరమేశ్వరునీ యెంత ప్రార్దంచినను వారు సైతము చక్రాయుధము బారినుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి.

ఇట్లు స్కాంద పురాణంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి పంచవింశోధ్యాయము - ఇరవయ్యయిదో రోజు పారాయణము సమాప్తము.

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
శివపురాణం - 25 వ భాగం

నటరాజు :
మనకి పరమశివుని స్వరూపము అనేకరకములయిన మూర్తులుగా గోచరిస్తూ ఉంటుంది. పరమ శివునికి అరువది నాలుగు మూర్తులు ఉన్నాయి. శివుని స్వరూపమేమి అని అడిగితె మనకి శివలింగం అనే సమాధానం వస్తుంది. సాధారణంగా శివాలయముల అన్నిటియందు లింగ స్వరూపమే ఉంటుంది. కానీ సాకారంగా పరమశివుడికి పార్వతీదేవికి మూర్తి ఉన్నది. ఈ అరువది నాలుగులో ఒక భాగమును ‘ఘోర స్వరూపములు’ అంటారు. ఇవి సాధారణంగా శిక్షించడానికి వస్తాయి. రెండవది ‘అఘోరరూపములు’. మంగళప్రదంగా ఉంటాయి. అటువంటి మూర్తిని మీరు చూసినప్పుడు మీకు చాలా ఆనందం కలుగుతుంది. మీకు ప్రపంచంలో ఎన్ని రకములయిన విద్యలు ఉన్నాయో ఎన్ని కళలు ఉన్నాయో అంతమందీ కూడా తమ తమ కళలను ప్రదర్శన ప్రారంభం చేసే ముందు నమస్కరించవలసిన మూర్తి ఒకటి లోకంలో ఉంది. దానిని ఆనంద తాండవమూర్తి అంటారు. దానిని మనం ‘నటరాజు’ అని పిలుస్తుంటాం. కానీ శైవాగమం దానిని ‘ఆనంద తాండవ మూర్తి’ అని పిలుస్తుంది. ఆ తాండవం చెయ్యడంలో గొప్ప రహస్యములు కొన్ని ఉంటాయి. ఆనంద తాండవం చేసిన పరమశివుడు ఎవరు ఉన్నారో ఆయనలోంచే సమస్త శాస్త్రములు ఉద్భవించాయి. ఆయనలో నుంచే సమస్తమయిన కళలు వచ్చాయి. ఒక్క శంకరుడు చేసిన తాండవంలోంచి 650 రకాలైన నాట్యములు పుట్టాయి. ఈవేళ ఇప్పటికీ కర్మభూమిలో బ్రతికినవి 108 రకముల నాట్యములు. కూచిపూడి, ఒడిస్సీ, భరతనాట్యము ఇవన్నీ ఆనంద తాండవ మూర్తి అయిన శంకరుని దగ్గరనుంచే వచ్చాయి.

ఈ ఆనంద తాండవ మూర్తి చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఈ చిత్రమును గీయడం లేదా నిలబెట్టడం చాలా కష్టం. చేతులు కట్టుకుని ఆయన నాట్యమును నలుగురు మాత్రమే చూస్తారు. అందులో ఒకడు నందీశ్వరుడు, రెండవ వాడు భ్రుంగి, మూడవ వాడు పతంజలి, నాల్గవ వాడు వ్యాఘ్రపాదుడు. ఈ తాండవం ఆ స్వరూపంలో అప్పుడు సమస్త లయకారకమై ఉంటుంది. ఈ తాండవం ప్రదోష వేళలో జరుగుతూంటుంది. ఆయన నాట్యము చేత ఈ లోకమునకు రాజయ్యాడు. అందుకే ‘నటరాజు’ అని పిలుస్తుంటాము. ఆయన చేసే నాట్యం మామూలు నాట్యం కాదు. అది మీరు తెలుసుకుంటే చిదంబరంలో కనకసభ దగ్గరకు వెళ్లి అంత పెద్ద ఆనంద మూర్తిని మీరు చూడవచ్చు. అక్కడ ఆ మూర్తిని చూడగానే మీరు ప్రణిపాతం చేసి సాష్టాంగనమస్కారం చేసేస్తారు. అఘోర స్వరూపముల యందు చాలా గొప్ప స్వరూపములలో ఆనందమూర్తి స్వరూపం ఒకటి.

ఆనంద తాండవం చూసే స్థాయి పొందిన వాళ్ళలో మొదటి వాడు నందీశ్వరుడు. ఆయన అయ్యవారికి చాలా గొప్ప భక్తుడు. రెండవ వాడు భ్రుంగి. మూడవ వాడు పతంజలి. ఆదిశేషుని అవతారము. అందుకని ఆయన తల మనుష్యుడిగా ఉంటుంది. మిగిలిన శరీరం పాముగా ఉంటుంది. వ్యాఘ్రపాదుడికి తలకాయ మనుష్యుడిది. పాములు పెద్దపులివి ఉంటాయి. ఈ నలుగురు నిలబడి తాండవం చూస్తూంటారు. ముప్పది మూడు కోట్లమంది దేవతలు అక్కడే ఉంటారు. బ్రహ్మ శ్రీమహావిష్ణువు మద్దెల వాయిస్తూ ఉంటారు. పతంజలి తప్ప మిగిలిన దేవతలు ఎవరికీ తోచిన వాద్య విశేషణాన్ని వారు వాయిస్తూంటారు. డమరుకం కదలిక చేత ఇన్ని రకములయిన సృష్టి ప్రారంభం అయింది. ఆయన చేతిలో ఉన్న డమరుకం కారణంగా ఈయన సృష్టికర్త అయ్యాడు. పరమేశ్వరుని సృష్టి కదలిక వలన కొత్తగా కొన్ని ప్రాణులు లోకంలోకి వచ్చాయి. ఈ లోకంలోకి కొత్తగా ప్రాణులు రావడం అనే సమస్త కదలికలకు డమరుక సంకేతం. ఇవన్నీ జరుగుతున్నాయి అనడానికి ఆయన కదలికే కారణము. ఈశ్వరుని కదలికకు నర్తనమని పేరు. ఇదే ఆనంద తాండవము. ఆనంద తాండవ మూర్తి చేతిలో కుడివైపు డమరుకం ఉంటుంది. ఎడమచేతి వైపు అగ్నిహోత్రం ఉంది. ప్రపంచంలోని అన్ని వస్తువులు చివరకు భస్మమే అయిపోతాయి. ఈ విషయం లోపల బాగా నాటినట్లయితే వ్యక్తి తప్పుడు పనులు చేయడు. ఏది కాలంలో వచ్చిందో అది కాలమునందు ఉండదు అని మీకు అర్థం అయిపోతే మీ నడవడి యందు మార్పు వచ్చేస్తుంది. నటరాజ స్వామిని పరిశీలించినట్లయితే ఆయన కుడికాలి క్రింద ఒక రాక్షసుడు ఉన్నాడు. ఈయన కాలుకింద పడుకుని తల ఎత్తి నవ్వుతూ ఉంటాడు. ఏడవడు. మాయను గెలవడమే కుడికాలి కింద రాక్షసుని తొక్కి పట్టడం. ఎడమ కాలు బ్రాహ్మీ స్థితిని సూచిస్తుంది. కుడికాలు మాయను తొక్కితే పైకి లేచేది ఎడమకాలు. అందుకే ఆనంద తాండవ మూర్తి ఎడమకాలు పైకి లేచి ఉంటుంది. నీవు ఊర్ధ్వ ముఖ చలనము చేసి ఈశ్వరుడిని తెలుసుకునే ప్రయత్నం చేసి బ్రాహ్మీభూతుడవై ధ్యానము చేసి ధ్యానమునందు ఆనందమును పొంది ‘నేనుగా ఉండడం’ నీవు నేర్చుకో. నీవు నేనై ఉన్నాను అని తెలుసుకో. దానికి ధ్యానం అవసరం. ఇది చెప్పడానికి ఎడమచెయ్యి పైకి లేచిన ఎడమ పాదమును చూపిస్తుంది. కుడి చేయి అభయ ముద్ర పట్టింది. శివుడు చాలా తేలికయిన వాటిని పుచ్చుకుని పెద్ద శుభ ఫలితములను ఇస్తాడు. ఇది చెప్పడానికే ఆయన అభయముద్రను ప్రదర్శించాడు. పాపమును హరిస్తానని చెప్పాడు. హరించినప్పుడు ఉపాసకుడు క్రమంగా పెరుగుతాడు. పెరిగి ‘శివ’ – అంటే మంగళమును చేరతాడు. ఈ ‘శివ’ నుండి ఆనంద తాండవ మూర్తిలోనికి లయం అయిపోవాలి, తాను ఆనందంగా మారిపోవాలి. అలా మారిపోతుంటే ఇప్పుడు ఆయన దిగంబరుడుగా వచ్చాడు. అంటే శరీర భ్రాంతి లేకపోవడాన్ని ఆనందం అంటారు. ఆత్మస్వరూపి అయిన ఆనంద తాండవ మూర్తియండు సాధకుడు కలిసిపోతే తానె ఆనంద తాండవ మూర్తి అయిపోతాడు. ఆయనకి మరల చావడం
అనేది ఉండదు. ఇదే ఆఖరి చావు. శివుని విశేషములను వేటినీ మీరు సామాన్యముగా తీసుకొనుటకు ఉండవు. మీరు కేవలం ఒక నటరాజ స్వామి వారి మూర్తిని పెట్టుకుని అష్టోత్తరం చేస్తాను, సహస్రం చేస్తాను అంటే మీకు ఈ తత్త్వము ఆవిష్కరింపబడదు. ఇలా చూడాలన్న కోరిక పుట్టడమే చాలా కష్టం. కోరిక పుట్టినా అది నిలబడడం చాలా కష్టం. ఎందుకు అంటే కింద కుడికాలిక్రింద నవ్వుతూ ఒకడు బ్రతికే ఉంటాడు. వాడు ఎప్పుడు లేచి పట్టేసుకుంటాడో మనకి తెలియదు. ఎప్పుడయినా మాయ మళ్ళీ పట్టేస్తుంది. మళ్ళీ కూపంలోకి పడిపోతాడు. ఉదాహరణకు రావణాసురుడు శంకరుని ప్రార్థన చేశాడు. తనకు ఎటువంటి శంకరుని చూడాలని ఉన్నదో వివరిస్తూ స్తోత్రం చేశాడు “జటాటవీ గలజ్జల’ అని. ఇంత స్తోత్రం చేసిన రావణాసురుడు అలా నిలబడ లేకపోయాడు. పరమేశ్వరుని తనతో లంకకు రమ్మన్నాడు. ఏమయిపోయింది ఈ స్తోత్రం. అంటే అంతలో మాయ కమ్మింది. అడగడం కాదు. అడిగినవాడు నిలబడడం కూడా చాలా కష్టం. నిలబడడానికి శివానుగ్రహం ఉండి తీరాలి. శివానుగ్రహం కలిగితే ఆయనే నడిపిస్తాడు. కాబట్టి అటువంటి ఆనంద తాండవ మూర్తి అనుగ్రహం మనకు కలిగి మనుష్యజన్మ ప్రయోజనం నెరవేరేటట్లుగా నిర్హేతుక కృపాకటాక్షవీక్షణముల చేత ఈశ్వరానుగ్రహం మనయందు ప్రసరింపబడాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థన చేద్దాము.
కార్తిక పురాణం - 26

26వ అధ్యాయము - దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట - శ్రీహరి హితబోధ

ఈ విధముగా అత్రిమహముని అగస్త్యునితో - దూర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిసి, మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.

ఆ విధముగా ముక్కోపియైన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోను తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకువెళ్లి

"వాసుదేవా! జగన్నాథా! శరణాగతరక్షణ బిరుదాంకితా! రక్షింపుము. నీభక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను. ముక్కోపినై మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ హృదయముపై తనిన్నను సహించితివి. అ కాలిగురుతు నేటికినీ నీ వక్షస్దలమందున్నది. ప్రశాంతమనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడ రక్షింపుము.

శ్రీహరి! నీచక్రాయుధము నన్ను జంప వచ్చుచున్న"దని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరివిధముల ప్రార్దించెను. ఆవిధముగా దూర్వాసుడు అహంకారమును వదలి తనను ప్రార్దుంచుట చూచి - శ్రీ హరి చిరునవ్వు నవ్వి "దూర్వాసా! నీ మాటలు యదార్ధములు. నీవంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రడవు. నిన్ను జూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా! నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము యెట్టి హింసా కలిగించను. ప్రతియుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభవించే యాపదలను పోగొట్టుటకు ఆయా పరిస్ధితలకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గావింతును.

నీవకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని, అటువంటి నాభక్తుని నీవు అనేక విధములు దూషించితివి. నీ యెడమ పాదముతో తన్నితివి. అతని యింటికి నీవు అతిథినై వచ్చికూడ, నేను వేళకు రానియెడల ద్వాదశి షుడియలు దాటకుండ భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునుకు భయపడి, నీ రాకకై చూచి జలపానమును మాత్రమే జేసెను. అంతకంటే అతడు అపరాధము యేమిచేసెను!

చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ద దినములందు కూడా జలపానము దాహశాంతికిని, పవిత్రతకును చేయదగినదే కదా? జలపాన మొనరించిన మాత్రమున నాభక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్నవమానించుటకు చేయాలేదే? నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ జూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణువేడెను. నేనపుడు రాజు హృదయములో ప్రవేశించినాను. నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కాని, తన దేహము తాను తెలుసుకోనే స్దితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నాభక్త కోటిలో శ్రేష్టుడు. నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును.

అదెటులనిన నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ. నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము, సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్యరూపమెత్తుదును. మరి కొంత కాలమునకు దేవదానవులు క్షీర సాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. అ పర్వతమును నీటిలో మునగకుండ కూర్మరూపమున నా వీపున మోయుదును. వరాహజన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి, ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గమునుండి పారద్రోలబడిన ఇంద్రనకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామనరూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడయిన రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప, యదువంశమున శ్రీకృష్ణునిగను, కలియుగమున బుద్దుడుగను, కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రునియింట "కల్కి" యను పేరున జన్మించి, అశ్వారూఢుండనై పరిభ్రమించుచు బ్రహ్మదేషులనందరను మట్టుబెట్టుదును.

నీవు అంబరీషునకు శాపరూపమున నిచ్చిన పదిజన్మలను యీ విధముగా పూర్తిచేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నోసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి షడ్వింశోధ్యాయము - ఇరవయ్యారో రోజు పారాయణము సమాప్తము.

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
శివపురాణం - 26 వ భాగం

ఒకనాడు పార్వతీదేవి చెలికత్తెలయిన జయ విజయలు అమ్మవారితో ఒకమాట చెప్పారు. ‘అమ్మా, నంది నిన్నూ వహిస్తాడు, శంకరుడినీ వహిస్తాడు. కానీ ఆయనకు కొంచెం శంకరుని మాల ఔదలదాల్చడంలోనే సంతోషం ఎక్కువ. భ్రుంగీ అంతే. మన మాటే వినేవాడు ఒకడు లేడు. అలాంటి వాడు మనకి ఒకడు ఉంటే బాగుంటుంది. అందుకని నీవు ఒకడిని సృష్టించి ద్వారపాలకుడిగా పెడితే వాడు నీ మాటే వింటూంటాడు. అలాంటి వాడిని తయారు చెయ్యి. అతడు మన అంతఃపురమును కాపాడడానికి పనికివస్తాడు” అని చెప్పారు. వారి మాటలు విన్న పార్వతీ దేవి అలాగే చేద్దాం అని తన శరీరమునకు ఉన్న మలమును స్నానం చేసేటప్పుడు నలుగు పిండిలా తీసి దానిలోంచి ఒక పిల్లవాడిని తయారు చేసింది. నలుగులోంచి తయారు చేయబడిన పిల్లవాడు ఎలా ఉన్నాడన్నది ఎవరికీ తెలియదు. చాలా బాగుండాలని అమ్మవారు సంకల్పం చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. వాడు లేచి కూర్చున్నాడు. అపుడు వానితో నీవు వెళ్లి ద్వారము దగ్గర కూర్చుని ఎవరూ లోపలి రాకుండా నిలుపు’ అంది అపుడు ఆ పిల్లవాడు ద్వారం దగ్గర కూర్చున్నాడు.

ప్రమథగణములలో ముందు నందీశ్వరుడు విజయం చేస్తుండగా శివుడు లోపలి వెళ్ళబోయాడు.ఈ పిల్లవాడు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. ముందు శంకరుడు జ్యోక్యం చేసుకోలేదు. అపుడు ప్రమథగణములకు ఆ పిల్లాడికి మధ్య యుద్ధం జరిగింది. ఎవరు సలహా చెప్పారో వాళ్ళే అమంవారి దగ్గరకు వచ్చి అమ్మా పిల్లవాడు యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి నీ శక్తులను పిల్లవాడికి ఇవ్వవలసింది అని చెప్పారు. అమ్మవారు శక్తులను ఇచ్చింది. ఆ పిల్లవాడు అద్భుతమయిన యుద్ధం చేసి ప్రమథగణములనన్నిటిని ఓడించేశాడు. ఇంక అక్కడ నుండి బ్రహ్మ, విష్ణువు కూడా వచ్చేశారు యుద్ధానికి. అయినా ఆ పిల్లవాడు శంకరుడిని లోపలికి పంపించలేదు. అపుడు శంకరుడు చేతిలో త్రిశూలమును పట్టుకుని పిల్లవాని కంఠమునకు గురి పెట్టి విసిరాడు. అపుడు త్రిశూలం ఆ పిల్లవాని కంఠమును ఉత్తరించేసింది. ఆ పిల్లవాడు క్రిందపడి మరణించాడు. తరువాత శంకరుడు లోపలికి వెళ్ళాడు. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో పార్వతీదేవి బయట కాపలా పెట్టిన పిల్లవాని ప్రస్తావన వచ్చింది. అపుడు శివుడు ఆ పిల్లవానిని త్రిశూల ధారల చేత చంపేశాను అన్నాడు. అపుడు పార్వతీదేవి అయ్యో ఆ పిల్లాడిని నేనే సృష్టించాను – చంపేశారా అని దుఃఖమును పొందింది. ఆవిడ దుఃఖమును ఉపశమింపజేయడానికి దేవతలు అందరూ వచ్చారు. ఆవిడ శంకరుని తన బిడ్డను మరల బ్రతికించమని అడిగింది. అప్పుడు ఆయన తన అనుచరులను పిలిచి మీరు ఉత్తర దిక్కుగా వెళ్ళి మీకు మొట్టమొదట కనపడిన ప్రాణి ఏదయితే ఉంటుందో దాని తలకాయ తీసుకురండి. ఆ తలకాయ పిల్లవాడికి పెడతాను’ అన్నాడు. వాళ్లకి మొట్టమొదట ఏనుగు కనపడింది. వాళ్ళు దాని తలకాయ పట్టుకొచ్చారు. దానిని ఈ పడిపోయిన పిల్లవాని కంఠమునకు కలిపాడు. ఆ పిల్లవాడు చక్కగా లేచి కూర్చున్నాడు. ఇప్పుడు వానికి శంకరుడెవరో తెలిసి శంకరునికి నమస్కారం చేశాడు. వెంటనే శంకరుడు కూడా వాడిని ఎత్తి తొడమీద కూర్చోపెట్టుకున్నాడు. ఈలోపుగా సుబ్రహ్మణ్య జననం కూడా జరిగిపోయింది. ఈ ఇద్దరి పిల్లలతో సంసారం చక్కగా నడిచిపోతోంది.

ఒకరోజు ఒక యోగ్యమయిన సంబంధం వచ్చింది విశ్వరూప ప్రజాపతి అనే ఆయన తన ఇద్దరు కుమార్తెలయిన సిద్ధిబుద్ధి అనే వాళ్ళను ఇవ్వాలనుకుంటున్నాను అని వచ్చాడు. అపుడు శంకరుడు తన కుమారులను పిలిచి ఎవరు ముందు భూప్రదక్షిణ చేసి వస్తే వారికి ముందుగా పెళ్ళి చేస్తానన్నాడు. ఇద్దరూ బయలుదేరారు. గణపటిది మూషిక వాహనం. అందుకని ఆయన తల్లిదండ్రులిద్దరికీ ఏడుమార్లు ప్రదక్షిణం చేసి వారిని పత్ర పుష్పములతో పూజ చేశారు. సుబ్రహ్మణ్యుడికి ఎక్కడికి వెళ్ళినా వినాయకుడు ముందుగా వెళ్ళిపోతున్నట్లు కనపడుతున్నాడు. పార్వతీ పరమేశ్వరునకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసిన ఫలితమును ఆయన ఖాతాలో వేసి ‘నువ్వు చెప్పినటువంటి నియమమును పాటించిన వాడివి కనుక నీకు ముందు వివాహం చేస్తున్నాను అని చెప్పి సిద్ధి బుద్ధిలను గణపతికిచ్చి వివాహం చేశారు. సుబ్రహ్మణ్య స్వామీ వారు క్రౌంచ పర్వతం దగ్గరకు వెళ్ళారు. పార్వతీ పరమేశ్వరులు కూడా వెళ్ళారు.

ఇక్కడ మనకు కొన్ని సందేహములు కలగడానికి అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా శంకరుడు ఆ పిల్లవాని తలను తీసివేసి ఉంటే ఏనుగు తల పెట్టడం ఎందుకు? పడిపోయిన తలకాయనే అతికించవచ్చు కదా! అని. పార్వతీ దేవి అనగా పరమ ప్రక్రుతి. పరమ శివుడనగా పరమ పురుషుడు. పరమ ప్రకృతి అంటే పంచ భూతములు. పంచభూతములయందలి కదలిక పరమేశ్వరుడు. అమ్మవారు భూతములన్నిటిని తయారుచేస్తుంది. కానీ లోపల చైతన్యం శివుడు. అంటే శివ సంబంధమయిన ఎరుక లేదు. లోపల ఉన్న చైతన్యము ‘నేను’ అన్నది తెలియదు. పైన ఉన్న శరీరము మూడు గుణముల చేత బంధింపబడి ఉంది. ఈ మూడు గుణములే ప్రకృతి యొక్క మలము. అదే అమ్మవారి శరీరంలోంచి వచ్చిన మలము. ఆ మలముతో పిల్లవాడు తయారు అయాడు. అంటే త్రిగుణములయందు కొట్టుమిట్టాడుతున్నాడు. కాబట్టి ఈ తలకు ప్రకృతి తెలుసు శివుడు తెలియదు. లోపల ఉన్న చైతన్యం బయట నిలబడిన శివుడు అని తెలియదు. కాబట్టి ఆయన దానితోనే పోరాటం చేశాడు. శంకరుడు ఆ పిల్లవాని త
లను త్రిశూలంతో తరిగేశాడు. త్రిశూలమునకు ఉన్న మూడు త్రిగుణములు, వీటికి ఆధారమైన సత్యము శంకరుని చేతిలో ఉన్న త్రిశూలం. శంకరుడు గుణాతీతుడు. ఎప్పుడయితే శివుడి చేతి త్రిశూలం పిల్లవాని కంఠమునకు తగిలిందో త్రిగుణములకు సంబంధించిన బుద్ధి పోయింది. ఇప్పుడు ‘గజ’ – ఏనుగు తల పెట్టబడింది. ‘గ’ అంటే గతి అంటే కదలడం; ‘జ’ అంటే పుట్టడం. ఇపుడు ఆ పిల్లవానికి ఇందులోంచి పుట్టి ఇందులోకి వెళుతున్నాడో తెలిసిపోయింది. అంటే ఇప్పుడు శివసంబంధం వచ్చేసింది. శివుడు తెలిసిపోయాడు. తెలిసిపోవడం గజముఖం. అందుకని శంకరుడికి నమస్కారం చేశాడు. ఇది మీరు చెయ్యవలసిన ఉపాసనా క్రమమును వినాయకుని మూర్తి ద్వారా లోకమునకు తెలియజెప్పడం. ఏనుగు తల బ్రహ్మాండమును చెప్తే మనిషి శరీరం పిండాండమును చెప్తుంది. బ్రహ్మాండం, పిండాండం రెండింటి యందు పంచభూతములు ఉన్నాయి. రెండూ పంచ భూతములలో నిండి ఉన్నప్పటికీ రెండింటియందు ఉన్నది ఒక్కటే అని జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొంది తత్త్వమసి అర్థమయితే ‘తత్ త్వం అసి’ ‘అదే వాడి ఉన్నాడు’ జీవుడే ఈశ్వరుడై ఉన్నాడు అని తెలియడమే ఏనుగు ముఖం మనుష్యుడు తల కంఠం దగ్గర శివానుగ్రహంతో కలవడం. కాబట్టి తత్త్వమసి మహావాక్యం నడయాడితే మహాగణపతిగా తిరుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడాయన వినాయకుడు అయ్యాడు. ‘వి’ అంటే విశిష్టమయిన – అనగా విశిష్టమయిన నాయకుడు అయ్యాడు. మీరు ఆయనను ఉపాసన చేస్తే ఆయన మిమ్మల్ని అటువంటి పథంలోకి తీసుకు వెడతాడు. ఆయన విఘ్నములకు నాయకుడు. విఘ్నమును తీసేస్తాడు. మీరు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుస్తాడు.

గణపతి పరబ్రహ్మమై ఉన్నాడు. ఈయనకు సిద్ధిబుద్ధి భార్యలు. ఎవరు బుద్ధిని ఉపయోగిస్తాడో వాడు సిద్ధిని పొందగలడు. బుద్ధి అనేది ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. గణపతి ఆరాధన చేత మంచి బుద్ధి వచ్చి సిద్ధి పొందడమే ఆయనకీ సిద్ధి బుద్ధి భార్యలు అయి ఉండడం. ఆ అనుగ్రహం మీయందు ప్రసరింపబడడం. ఏనుగుకు అన్నిటికన్నా ఇష్టమైనది దాని దంతం. కానీ అది నమలడానికి పనికిరాదు. ఏనుగు ముఖం ఉన్న గణపతి వ్యాసుడు భారతం చెప్తుంటే తన దంతమును విరిచేసి దానితో రచన చేశాడు. మనకి ఉన్న వస్తువులను లోకోపకారానికి ఉపయోగించాలి. భారతమును రచించడానికి తన దంతం ఉపయోగ పడితే కొన్ని యుగాలపాటు పంచమ వేదమయిన భారతమును లోకం చదువుకుని ఉద్ధరింపబడుతుంది అని భావించి తన దంతమును విరిచేసి దానితో భారతమును రచన చేశాడు. ‘ఏకదంతం, శూర్పకర్ణం, లంబోదరం’ అని పేర్లు సంపాదించాడు. ఎంతో శాశ్వతమయిన యశస్సు పొందాడు. శివుడు ఎంత సులభుడో వినాయకుడు అంత సులభుడు. ఇరువది ఒక్క గరిక తెచ్చి ఆయన పాదముల మీద వేస్తే చాలు. అన్నీ ఇచ్చేస్తాడు. కొద్దిగా సింధూరమును గండయుగ్మమునాకు రాస్తే చాలు పొంగిపోతాడు. ఏనుగు తల కనపడితే మంగళ ప్రదము. చివరకు కలలోకి ఏనుగు వచ్చినా అది మంగళప్రదమే.

గణపతి స్వరూపంలో చిత్రమయినది ఎలుక. గణపతికి వాహనం ఎలుక. ఎలుక దొంగతనానికి ప్రతీక. మనతో పాటే ఉంటుంది. మన వస్తువులన్నీ ఎత్తుకుపోతూ ఉంటుంది. మన బ్రతుకూ అంతే. విఘ్నేశ్వరుని ప్రార్థిస్తే మనకి ఆయన పదిమంది హృదయాలను కొల్లగొట్ట గలిగిన దొంగతనమును పొందుతాడు. అనగా ఈశ్వరాభిముఖుడై భగవద్భక్తి చేత తాను మాట్లాడిన మాటలకు పరవశులై చాలామంది హృదయాలను తాను కొల్లగొట్టే దొంగ అవుతాడు. ఇలా మారడానికి ఎలుక విఘ్నేశ్వరుడిని వహించింది. మీరు కూడా అలా వహించడం నేర్చుకోవాలి. పదిమంది ప్రేమను సంపాదించుకోవడం నేర్చుకోవాలి. దీనిని సూచించదానికే ఎలుకను వాహనంగా పెట్టుకున్నాడు. ఎలుక చెవులు పెద్దవిగా ఉంటాయి చేట లాగా. గణపతిని నమ్మి ఆవాహన చేసి జాగ్రత్తగా ఉపాసన చేస్తే లోకంలో పొల్లు తీసేసి సారం వైపుకి మనలను నడిపిస్తాడు. పరమభక్తిని ఇస్తాడు. ఆయన ఆయుధమయిన గొడ్డలితో కర్మ పాశములను తెంచి భక్తీ పాశములను వేసి తన వైపుకి లాక్కుంటాడు.

చవితి తిథి ఆయనకు చాలా ఇష్టమైన తిథి. ఆరోజు ఎవరయినా వినాయకుడి గురించి ప్రత్యేకంగా వినినా, చదివినా వారు ఎంతో ప్రయోజనమును పొందుతారు. పరమ భక్తితో స్వామికి నమస్కారం చేసినా ఎవరు కోరుకున్నది వారికి అనుగ్రహిస్తాడు. విద్యార్థికి విద్య వస్తుంది. ద్రవ్యార్థికి ద్రవ్యం వస్తుంది. కన్యార్థికి కన్య దొరుకుతుంది. పుత్రార్థికి పుత్రుడు పుడతాడు. భోగార్థి అయిన వాడికి భోగములు కలుగుతాయి. మోక్షార్థికి మోక్షం దొరుకుతుంది. రాజ్యార్థికి రాజ్యం, కీర్తి కావాలనుకున్న వారికి కీర్తి వస్తుంది. ఆరోగ్యం కుదుటపడక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్లకి ఆరోగ్యం కలుగుతుంది. ఋణభారంతో ఉన్నవాడికి ఋణం తొలగుతుంది. ఇక్కట్టులలో ఉన్న వాడికి ఇక్కట్టులు తొలగిపోతాయి. గణపతి దర్శనం చేత గణపతి యొక్క అనుగ్రహం చేత గణపతి కథను చదవడం చేత సమస్త శుభములు సమకూడతాయని పెద్దలు మనకు ఫలశ్రుతిని వివరణ చేసి ఉన్నారు. కాబట్టి ఆ గజానన స్వరూపము అంత గొప్ప స్వరూపము.
కార్తీక పురాణము - 27

27వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించు

మరల అత్రి మహాముని అగస్త్యున కిట్లు వచించెను- కుంభ సంభవా! ఆ శ్రీ హరి దూర్వాసుని యెంతో ప్రేమతో జేరదీసి యింకను ఇట్లు చెప్పెను.

"ఓ దూర్వాస మునీ! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము లెత్తుట కష్టము గాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ యివ్వవలెను. గాన, అందులకు నేనంగగీకరించితిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని యింట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృతుడై ప్రాయోపవేశమొనర్పనెంచినాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని, ప్రజాపీడనము గాదు.

ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించ వలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్దమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని యెప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును, బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టిలాగిన వాడును, కాలితో తన్నినవాడును, విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును, విప్ర పరిత్యాగ మొనరించినవాడును బ్రహ్మహంతుకులే అగుదురు.

కాన, ఓ దూర్వాస మహర్షి! అంబరీషుడు నీ గురించి - తపశ్శాలియు, విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణసంకటం పొందుచున్నాడు. అయ్యో! నేను బ్రాహ్మణ హంతకుడనయితినే యని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి, నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీవుభయులకు శాంతి లభించును" అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు బంపెను.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి సప్తవింశోధ్యాయము - ఇరవయ్యేడవ రోజు పారాయణము సమాప్తము.

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
శివపురాణం - 27 వ భాగం

ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అసలు బ్రహ్మమెవరని సందేహం వచ్చింది. ఆ సందేహమును తీరతామని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి సద్యోదాత, అఘోర తత్పురుష ఈశాన వామదేవ అను అయిదు ముఖములు ఉంటాయి. ఈ అయిదు ముఖములతో ఋషుల వంక చూస్తూ అన్నాడు ‘అదేమిటయ్యా బ్రహ్మమెవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మమును’ అన్నాడు. అపుడు బ్రహ్మగారు ‘నేనే ఈ లోకముల నన్నిటిని సృష్టించాను నేనే నిక్కపు కర్తను. నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను నేనే వీటిని సంహారం చేస్తాను. నేనెప్పుడూ బతికే ఉంటాను. కాబట్టి నాకన్నా బ్రహ్మమెవరు? నేనే బ్రహ్మమును’ అన్నాడు. తరువాత పక్కనున్న విష్ణువు ‘బ్రహ్మా, నా అంతవాడిని నేను అంటున్నావు. అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా! బ్రహ్మమును నేను’ అన్నారు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. మనకి శృతి ప్రమాణం కదా అందుకని వేదాలని పిలుద్దాం అని వేదాలని పిలిచారు. అపుడు ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం చేయాలని మొట్టమొదట నారాయణుడు జన్మించాడో ఎవడు చిట్టచివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది. దాన్ని తీసి పారేసి యజుర్వేదమును పిలిచారు. అసురీశాక్తులు పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది తరువాత సామవేదమును పిలిచి అడిగారు మూడు కన్నులున్న వాడెవడు ఉన్నాడో ఎవరు ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో ఎవరడు తనలో తాను రమిస్తూ ఉంటాడో అటువంటి శివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది. పిమ్మట అధర్వణ వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు. తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. నాలుగు వేదములు అదే చెప్తున్నారు. ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు. అపుడు ప్రణవం ఎవడు నిరంతరమూ శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో, అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతి వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము’ అని చెప్పింది. ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. ఈమాటలు రుచించక పోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారింది. జ్యోతి సాకారం అయింది. సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. కానీ బ్రహ్మ నీవు ఎవరు? నువ్వు నా రెండు కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు. నన్ను స్తోత్రం చెయ్యి’ అన్నాడు.

బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి. కాబట్టి ఇపుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. ‘ఏమి నీ ఆజ్ఞ అని మొదటి రూపమును అడిగాడు. అహంకారంతో మాట్లాడుతున్నాడు. అయిదవ తలను గిల్లెయ్యి’ అంది. ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపమును పొందింది. దిగంబరమై అయిదవతలను గోటితో గిల్లేసింది. ఆ రూపమే కాలభైరవ స్వరూపం. ఇలా జరిగేసరికి బ్రహ్మ నాలుగు తలకాయలు బట్టుకు వెళ్లి అమ్మవారి చేతుల క్రింద పెట్టేసి ఈశ్వరా, నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు. అపుడు శంకరుడు కాల భైరవునితో నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది. కాబట్టి నిన్ను ఇవాళ్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు. నీవు ఎంత గొప్ప వాడవయినా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. ఈ అయిదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను. అపుడు నీ బ్రహ్మ హత్యా పాతకం పోతుంది. పుట్టేతప్పటికే నీ స్వరూపమును చూసేటప్పటికీ లోకం అంతా గజగజలాడిపోయింది. కాబట్టి నిన్ను భైరవ శబ్దంతో పిలుస్తారు. ఎవడు ఈశ్వరుని ధిక్కరించి ఇచట బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపడతావు. దీనిని ‘భైరవ యాతన’ అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయమునకు వచ్చినపుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసెయ్యి. అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను ‘అమర్దకుడు’ అని పిలుస్తారు.

ఇకనుంచి నీవు నా దేవాలయములలో క్షేత్ర పాలకుడవయి ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేసెయ్యి. నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు ‘పాప భక్షకుడు’ అనే పేరును ఇస్తున్నాను. నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు’ అని చెప్పాడు. అందుకే మనను కాశీక్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్రప్రవేశానికి అనుమ
తించిన క్షేత్రపాలకుడు కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవా’ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతా పూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇకనుంచి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తాడు. భైరవ మూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మేడలో ఒక గారెల దండ వేస్తారు. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదమును తీసుకోవాలి.

ఇహలోకమునందు ఇప్పటివరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింప చేస్తాడు.

అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసా దేవి ఆలయమునకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ‘ఒకసారి ఒంగోండి’ అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవ యాతన అని ఆ కర్ర ఠప్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయి. ఈవిధంగా ఆ నాడు పరమేశ్వరుడు కాల భైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు. ఆ మూర్తే ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వర ఆజ్ఞను ఔదలదాల్చి వచ్చినవాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు. ఆయన భక్తుల పాలిట కొంగుబంగారం. ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనపడతాడు.

కాబట్టి ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. ‘మేము కాశీ వెళ్ళాము – మాకు ఇంట ఏ భయమూ లేదు’ అని చెప్పడానికి ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు. కాబట్టి ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది.
ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో భక్తితో ప్రణమిల్లుతున్నారో ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా, సుఖంగా ఉంటారు.
కార్తిక పురాణం - 28

28వ అధ్యాయము - విష్ణు సుదర్శన చక్ర మహిమ

జనక మహారాజా! వింటివా దుర్వాసుని అవస్ధలు! తాను యెంతటి కోపవంతుడైనను, వెనుక ముందు లాలోచింపక ఒక మహాభక్తుని శుద్దిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున, ఎంతటి గొప్ప వారైనాను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోనవలెను.

అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణుని కడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి "అంబరీషా, ధర్మపాలకా! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము, నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్నాహ్వనించితివి, కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేయతల పెట్టితిని. గాని నా దుర్బద్ది నన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్దమైనది. నేను విష్ణువు కడకేగి యా విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్ధి౦చితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీవద్ద కేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను యెంతటి తపశ్శాలినైనను, యెంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందవియేమియు పనిచేయలేదు. నన్నీ విపత్తునుండి కాపాడు"మని అనేక విధాల ప్రార్ధఒచగా, అంబరీషుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి,

"ఓ సుదర్శన చక్రమా! నీకివే నా మన:పూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో, తెలియకయో తొందరపాటుగా యీ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను యీతడు బ్రాహ్మణుడు గాన, ఈతనిని చంపవలదు, ఒక వేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని, ముందు నన్నుచంపి, తర్వాత ఈ దుర్వాసుని జంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు యిలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్దములలో , అనేక మంది లోకకంటకులను చంపితివిగాని శరణుగోరువారిని యింత వరకు చంపలేదు. అందువలననే యీ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు. దేవా! సురాసురాది భూతకోటులన్నియు ఒక్కటిగా యేకమైననూ నిన్నేమియు చేయజాలవు, నీ శక్తికి యే విధమైన అడ్డునూలేదు. ఈ విషయము లోకమంతటికి తెలియును. అయినను మునిపుంగవునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్థించుచున్నాను.

నీ యుందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి యిమిడియున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును, శరణు వేడిన యీ దుర్వాసుని రక్షింపుము" అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి

"ఓ భక్తాగ్రేశ్వరా ! అంబరీషా! నీ భక్తిని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటభులను - దేవతలందరు యెకమైకూడ - చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా! ఈ లోకములో దుష్టశిక్షణ, శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్దాపించుచుండును. ఇది యెల్లరకు తెలిసిన విషయమే, ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీవ్రతమును నశింపజేసి, నానా యిక్కట్లు పెట్టవలెనని కన్ను లెఱ్ఱజేసి నీ మీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి, యీ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను.

ఈతడు కూడా సామాన్యుడు గాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మతేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భులోకవాసుల నందరను చంపగలదుగాని, శక్తిలో నా కంటె యెక్కువేమియు గాదు. సృషి కర్తయగు బ్రాహ్మతేజస్సు కంటెను, కైలాసవతియగు మహేశ్వరుని తేజశ్శక్తి కంటెను యెక్కువయైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని , క్షత్రియ తేజస్సుగల నీవు గాని తులతూగరు. నన్నెదుర్కొనజాలరు. తనకన్న యెదుటి వాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట యుత్తమము. ఈ నీతిని ఆచరించువారలు యెటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోనగలరు.

ఇంత వరకు జరిగినదంతయు విస్మరించి, శరణార్థియై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు" మని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి, " నేను దేవ గో, బ్రాహ్మణాదుల యుందును, స్త్రీలయందును, గౌరవము గలవాడను.

నా రాజ్యములో సర్వజనులూ సుఖిముగా నుండవలెననియే నా యభిలాష. కాన, శరణుగోరిన ఈ దుర్వాసుని, నన్నూ కరుణించి రక్షింపుము. వేలకొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్య మండలములు యేక మైననూ నీ శక్తీకి, తేజస్సుకూ సాటి రావు. నీవు అట్టి తేజోరాశివి మహా విష్ణువు లోకనిందితులపై, లోకకంటకులపై, దేవ - గో - బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి, వారిని శిక్షించి, తనకుక్షియుందున్న పధ్నాలుగు లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన, నీకివే నా మన:పూర్వక నమస్కృతులు" అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను.

అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాడాలింగన మొనర్చి "అంబరీషా! నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు నెవరు పఠింతురో, యెవరు దానదర్మములతో పుణ్యఫలమును వృద్ది చేసుకొందురో, యెవరో పరులను హింసించక - పరధనము
లను ఆశపడక - పరస్త్రీలను చెరబెట్టిక - గోహత్య - బ్రాహ్మణహత్య - శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి, యిహమందును పరమందును సర్వసాఖ్యములతో తులతూగుదురు. కాన, నిన్నూ దుర్వాసుని రక్షించుచున్నాను, నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాల గొప్పది. నీ పుణ్యఫలము ముందు యీ మునిపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు." అని చెప్పి అతని నాశీర్వదించి, అదృశ్యమయ్యెను.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి అష్టావింశోధ్యాయము - ఇరవయ్యెనిమిదో రోజు పారాయణము సమాప్తము.

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
శివపురాణం - 28 వ భాగం

శివపురాణం -- 28 --కుమారిలభట్టు:
ఒకానొక సమయంలో భారతదేశమంతటా బౌద్ధమతము వ్యాప్తి చెందినది. దీనికి సంబంధించి సనాతన ధర్మంలో కొంత ఆందోళన పాడడం జరిగింది. బౌద్ధము వేదమును అంగీకరించదు. వేదము ప్రమాణము కాదు అన్నవారిని నాస్తికుడు అని పిలుస్తారు. వేదప్రమాణమును అంగీకరించనిది నాస్తికము అవుతుంది. బౌద్ధము వైపు వెళ్ళిపోతే నాస్తికులు అయిపోతారని నాస్తిక మతమును ఖండించి తిరిగి ప్రజలలో కర్మ నియతిని ఏర్పరచి, మరల అందరినీ వేదమార్గంలో నడిపించడం కోసమని సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారు కుమారిల భట్టుగా వెలశారు. ఆయన ప్రయాగ క్షేత్రంలో పుట్టారు. ఏదయినా తెలుసుకోకుండా ఖండిస్తే దానివలన మర్యాద ఉండదు. బాగా తెలుసుకుని ఖండించాలి. అందుకని వారు ఒక బౌద్దారామమునందు చేరారు. అది ఏడు అంతస్తుల ప్రాకారము కలిగినటువంటి ఆరామము. అక్కడ అనేకమంది బౌద్ధులు ఉండేవారు. వేదము కాని, యజ్ఞము కాని, యాగము కాని, ప్రార్థన కాని, స్తోత్రము కాని చేయడం వారు అంగీకరించరు. అక్కడే కూర్చుని గురువుగారు చెప్పేది ఆయన వినేవారు. సనాతన ధర్మమును ఖండించినపుడు వాటి గురించి చెప్పినపుడు కుమారిల భట్టు ఏడుస్తూ ఉండేవాడు. ఒకరోజున గురువు ‘ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగాడు. అపుడు ఆయన ‘సనాతన ధర్మంలోని విషయములను ఎంతో గొప్పగా ఖండించారు. అందుకు సంతోషంతో ఆనంద భాష్పములు కారుస్తున్నాను’ అని ఆయన అబద్ధం చెప్పారు. ఎందుకు? అసలు ఆ మతంలో ఉన్నదేంటో తెలుసుకుంటే తప్ప ఖండించడం కుదరదు. పూర్వం అంటే అటువంటి కర్మనిష్ఠ ఉండేది. ఇప్పుడు నాలుగు శ్లోకములు, రెండు పద్యములు చదవడం రాకపోయినా అసలు అవతల మతంలో గొప్పతనం ఏమి ఉన్నదో తెలియకపోయినా అవతల మతానికున్న ప్రస్తాన త్రయం అంటే ఏమిటో తెలియకపోయినా, అవతల మతం మీద దుమ్మెత్తి పోసెయ్యవచ్చు. అంతటి హీనస్థితికి మనం దిగజారిపోయాము. ఇది కలియుగం కదా! కానీ కుమారిల భట్టు అటువంటి వాడు కాదు. విషయమును తెలుసుకుని, ఏది చెడో దానిని మాత్రమే ఖండించాలని అనుకున్నాడు. ఇలా అనుకుని గురువుగారి దగ్గర నేర్చుకున్నాడు.

బాగా నేర్చుకున్న తర్వాత ఈయన ఉద్దేశ్యమును శిష్యులు, గురువులు కనిపెట్టారు. ‘ఈయన బౌద్ధుడు కాడు. ఈయన బ్రాహ్మణుడు. ఈయన సనాతన ధర్మమునందు మక్కువ ఉన్నవాడు. వేదమంటే చాలా ప్రీతి కలిగిన వాడు. ఈయన కేవలం మన మతం గురించి తెలుసుకోవడానికి మనలో చేరాడు. కుశాగ్రబుద్ధి కనుక ఈవేళో రేపో మనతో వాదానికి దిగుతాడు. అప్పుడు మనం ఈయనను తట్టుకోవడం కష్టం. కాబట్టి ఆయన ఈ స్థితిని పొందకముందే ఈయనను చంపేస్తే గొడవ వదిలిపోతుంది’ అని అనుకున్నారు. ఆయనను మాటలలో పెట్టి ఏడవ అంతస్తుకి తీసుకువెళ్ళారు. ఒక కిటికీ దగ్గర నిలబెట్టి ఆయనతో మాట్లాడుతుండగా కొందరు వెనకనుంచి వచ్చి ఆయన రెండు కాళ్ళూ ఎత్తేసి, ఆయనను పైనుండి క్రిందికి తోసేశారు. అపుడు కుమారిల భట్టు క్రింద పడిపోతూ ఆయన ఒక శ్లోకం చెప్పారు. ‘వేదమే ప్రమాణం అయితే, సనాతన ధర్మం సత్యం అయితే వేదములలో చెప్పబడినవన్నీ సత్యములే అయితే, అది అనుష్టించవలసిన మతమయితే నేను క్రిందపడినప్పుడు మరణించకుందును గాక’ అని దాని అర్థం. ఏడంతస్తుల నుండి కిందపడిపోయినా ఆయనకు ఏమీ అవలేదు. కానీ కంట్లో ఒకరాయి గుచ్చుకుని నెత్తురు వచ్చింది. ఆయన వెంటనే వేదమాతను ప్రార్థన చేసి ‘నువ్వు ప్రమాణం అయితే నేను మరణించకూడదు అని నేను అన్నాను. ఇపుడు నేను మరణించలేదు. బ్రతికాను. నువ్వు ప్రమాణమని నిరూపించావు. చాలా సంతోషం. కానీ ఈ రాయి నా కంట్లో ఎందుకు గుచ్చుకోవాలి?’ అని అడిగాడు.

మనకి పురాణములలో అశరీరవాణి పలికింది అని తరచుగా చెప్తుంటారు. అశరీరవాణి అంటే వేదం. ఇప్పుడు వేదం అశరీరవాణియై పలికింది. వేదమును మొట్టమొదట ఈశ్వరుడు ఋషులకు చెప్పాడు. ఏ రూపము లేకుండా వారికి వినపడేటట్లుగా వాళ్ళ చెవిలో చెప్పాడు. అది అప్పటినుంచి వినబడుతూ గురువు దగ్గర శిష్యుడు, గురువు దగర శిష్యుడు అలా వింటూ వెళ్ళింది. కాబట్టి దానికి ‘శృతి’ అని పేరు వచ్చింది. వింటూ స్వరం తెలుసుకుని పలికారు కనుక దానికి శృతి అని పేరు వచ్చింది. కాబట్టి ‘మనకి శృతి ప్రమాణము. ఇటువంటి శృతి ప్రమాణం అయితే చావకూడదని నేను అనినప్పుడు నేను చావలేదు కానీ నా కంటికి ఎందుకు దెబ్బతగిలింది’ అని ఆయన అడిగారు. అలా అడిగితే అశరీరవాణియైవేదము అంది ‘నీవు పైనుండి క్రింద పడిపోయేటప్పుడు ‘వేదమే ప్రమాణం అయితే’ అంటూ పడ్డావు. ‘వేదము ప్రమాణం కనుక నేను మరణించను’ అని నీవు అనలేదు. చిన్న అనుమానం పెట్టుకున్నావు. అటువంటి అనుమానము నీ శ్లోకమునండు ఉండరాదు. నీవు బ్రతికావు కానీ నీకు ఈ చిన్న అనుమానం ఉండడం వల్ల కంట్లో రాయి గుచ్చుకుంది’ కుమారిల భట్టుకి కంటికి దెబ్బ తగిలింది కానీ వేదము ప్రమాణం అయింది. అప్పటి నుంచి మరల అందరూ కర్మానుష్ఠానం యజ్ఞము, యాగము, దానము ఇవన్నీ మళ్ళీ మొదలుపెట్టారు. కానీ శంకర భగవత్పాదుల అంశ కుమారిల భట్టుకన్నా కొంచెం పైస్థాయి. వీళ్ళకి కర్మయందు కొంచెం కోరిక ఉండడం, కోరిక తీరకపోతే కోపం రావడం లాంటివి ఉంటాయి. ముందు కర్మ నిలబడితే వెనక జ్ఞానం వస్తుంది. ఇంత గొప్ప కుమారిల భట్టుకు కర్మ నిలబెట్టవలసి వచ్చినపుడు కంటివెంట అప్పుడప్పుడు నీళ్ళు వచ్చాయి.
అదే శంకరాచార్యుల వారు అయితే జ్ఞానంలో ఉంటారు. ఆయన బ్రహ్మజ్ఞాని. తలకాయను ఇచ్చేస్తారా అని కాపాలిని అడిగితే తీసుకుపో అన్నారు. అందుకే బ్రహ్మజ్ఞాని స్థాయిని చూసి ఈశ్వరుడు కూడా పొంగిపోతాడు. బ్రహ్మజ్ఞాని కన్నా గొప్ప స్థాయి ఇంక సనాతన ధర్మమందు లేదు.

కుమారిల భట్టు కర్మ గురించి వ్యాప్తిచేశాడు కనుక జ్ఞానమార్గము గొప్పది అని చెప్పడానికి శంకరాచార్యుల వారు ఆయన దగ్గరకి వచ్చారు. కానీ అప్పటికి కుమారిల భట్ట తుషాగ్ని ప్రవేశం చేసేశారు. తుషాగ్ని అంటే ఊకను పెద్ద రాశిగా పోసుకుని ఆ ఊకను అంటిస్తారు. ఊకకు ఉండే లక్షణం ఏమిటంటే అది గబగబా కాలిపోదు. తుషాగ్నిలో నిప్పు సెగ మెలమెల్లగా క్రిందనుండి అంటుకుంటూ వస్తుంది. ముందు వేడి పుడుతుంది. సెగ పుడుతుంది. ఒళ్ళు ఉడికిపోతుంది. తరువాత కిందకు వస్తుంది. తరువాత పాదములు, మోకాళ్ళు, తొడలు అన్నీ కాలిపోతుంటాయి. ఎంత కాలిపోతుంటే బూదిలోకి అలా దిగిపోతూ ఉంటాడు. ఎంత దిగిపోతుంటే అంత కాలుస్తూ ఉంటుంది. కాల్చి కాల్చి చివరకు ప్రధానమయిన అవయవములయిన గుండె మొదలగునవి కాలిపోయేంత వరకు ఆ ఒళ్ళు కాలిపోతున్న బాధ అనుభవించవలసిందే. ఈవిధంగా క్రిందనుండి పైకి కాలుస్తూనే ఉంటుంది. కదలకుండా కూర్చుని తుషాగ్నిలో ఆయన కాలిపోతున్నారు. ఆ సమయంలో శంకరాచార్యుల వారు వచ్చారు. వచ్చి ‘అయ్యో, మీరు ఎందుకు ఇలా కాలిపోతున్నారు? ఎందుకు మీరు ఈ పని చేయవలసి వచ్చింది? నేను మిమ్మల్ని కర్మ మార్గం నుండి జ్ఞాన మార్గంలోకి తిప్పడానికి వచ్చాను’ అని చెప్పారు. అపుడు కుమారిల భట్టు ‘నేను తెలిసి చేసినా తెలియక చేసినా గురువుల పట్ల అపచారం చేశాను. బౌద్ధము సనాతన ధర్మమును అంగీకరించని నాస్తికమతం కావచ్చు. కానీ ఇప్పుడు నేను సనాతన ధర్మ ప్రచారం కోసం బౌద్ధమతంలో ఉన్న రహస్యములు తెలుసుకోవడం కోసం వాటిని ఖండించడం కోసం గురువుల దగ్గర శిష్యుడుగా చేసి వాటిని నేర్చుకున్నాను. ఇలా గురువు దగ్గర వినకూడదు. వాటిని విన్నాను కనుక దానికి ఈ శరీరం తుషాగ్నిలో కాలిపోవడం ఒక్కటే సరియైన ప్రాయశ్చిత్తం. అందుచేత దీనిని ఇలా కాల్చేస్తున్నాను’ అన్నారు. ఆయన ఎంతటి మహాత్ములో చూడండి. నిష్ఠతో ఉన్నవాడు కాబట్టి ఆ కర్మనిష్ఠకే శరీరమును వదిలేశాడు. సుబ్రహ్మణ్య స్వామీ అవతారములు అన్నీ కూడా అగ్నియందే పర్యవసిస్తాయి. అందుకే అగ్నిహోత్రంలోకే తుషాగ్నిలోకి కుమారిల భట్టు వెళ్ళిపోతూ ‘నా శిష్యుడు మండనమిశ్రుడు’ ఉన్నాడు. ఆయనతో వాదించి ఓడించండి. అపుడు లోకం అంతా కర్మమార్గం నుండి జ్ఞానమార్గంలోకి వెడుతుంది’ అన్నాడు.

ఏమి చిత్రం జరిగిందంటే అంతకుపూర్వం వరకు పూజలుచేస్తే మీరు ఏ పూజ చేస్తున్నారో ఆ పూజలో స్వామి పేరు చెప్పి ప్రీత్యర్థం అనేమాట చెప్పడం సంకల్పంలో లేదు. ఇది చెప్పకుండా పూజ చేసేవారు. శంకరాచార్యుల వారు మండనమిశ్రుని గెలిచిన తర్వాత కర్మ భాగమునందు ఒక కొత్త విషయం కలిసింది. మీరు ఏది చేసినా సంకల్పంలో....ప్రీత్యర్థం అని దేవత పేరు చెప్పి నీళ్ళు ముట్టుకుంటారు. ‘ఈ కర్మను నేను ఇప్పుడు ఈశ్వరానుగ్రహం కొరకు చేస్తున్నాను’. ఈ కర్మ చేస్తే ఫలితం వచ్చేస్తుందని కాదు. ఈ కర్మ చేస్తే ఈశ్వరుడు ప్రీతిచెంది ఫలితమును ఇవ్వాలి. ఈశ్వర ముఖంగా ఫలితం రావాలన్న జ్ఞానమును అంకురింపచేయడానికి సంకల్పమును శంకరాచార్యుల వారే అక్కడ మార్చారు. మండనమిశ్రుడు ఓడిపోయినతరువాతి నుండి అలా మారింది. కనుక తుషాగ్నిప్రవేశం చేసిన గొప్ప అవతారం కుమారిల భట్టు అవతారం. ఆయన అవతారం రాబట్టే మనకి సనాతన ధర్మం మరల నిలబడే అవకాశం ఈ లోకమునందు కలిగింది. అంతటి మహోత్కృష్టమయిన అవతారం కుమారిలభట్టు అవతారం.

ఎప్పుడెప్పుడు వేదం చేత ప్రతిపాదింపబడిన బ్రహ్మమును గూర్చిన ఆలోచనయందు వైక్లబ్యము కలుగుతుందో, వేదము ప్రమాణము కాదనే ఆలోచనలు ప్రబలుతాయో, అప్పుడు ముందుగా సుబ్రహ్మణ్యుడే అవతరిస్తూ ఉంటాడు. రాక్షసులను సంహరించడం ఆయనకేమీ పెద్ద విషయం కాదు. లోకమునకు వైదికమయిన మార్గమును ప్రబోధం చేయవలసి వస్తే ఎప్పుడెప్పుడు ఎంతవరకు సమాజంలో బోధ జరిగితే తప్ప కుదరదో అంత గొప్ప బాధ్యతను ఆయన భుజాల మీదకు ఎత్తుకుంటాడు. ఆయన మహాజ్ఞాని. ఆయన జ్ఞాన బోధ చేయగలడు. లోకం అంతాకూడా సనాతన ధర్మమును విడిచిపెట్టి నాస్తికము వైపు నడుస్తున్న రోజులలో ముందు కర్మనిష్ఠను చూపించడం కోసమని ఆయన కుమారిల భట్టు రూపంగా వచ్చాడు. అంతే కర్మనిష్ఠతో చిట్టచివరకు ఆయన తుషాగ్ని ప్రవేశం చేసేశారు. వేరొక సందర్భంలో ఆయన తిరుజ్ఞాన సంబంధర్ గా వచ్చారు.
కార్తీక పురాణం - 29

29వ అధ్యాయము అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశి ప్రాణము

అత్రి మహాముని అగస్త్యులవారితో యీ విధముగా - సుదర్శన చక్రము అంబరీషునక భయమిచ్చి వుభయులను రక్షించి, భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడువ నారంభించెను.

ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదముల ఫైబడి దండ ప్రణామములాచరించి, పాదములను కడిగి, ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని, "ఓ మునిశ్రేష్టా! నేను సంసార మార్గమందున్న యొక సామాన్య గృహస్తుడను. నా శక్తి కొలది నేను శ్రీ మన్నారాయణుని సేవింతును, ద్వాదశశీ వ్రతము జేసుకోనుచు ప్రజలకు యెట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్ని౦పుడు. మీ యెడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యమివ్వవలయునని ఆహ్వానించితిని. కాన, నా అతిధ్యమును స్వీకరించి నన్నును, నా వంశమును పావనము జేసి కృతార్దుని చేయుడు, మీరు దయార్ద్ర హృదయులు, ప్రధమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీరాక వలన శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ వుపకారమును మరువలేకున్నాను.

మహానుభావా! నా మనస్సంతోషముచే మిమ్మెట్లు స్తుతింపవలయునో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంటవచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు యెంత సేవచేసినను యింకను ఋణపడియుందును. కాన, ఓ పుణ్యపురుషా! నాకు మరల నర జన్మ రాకుండా వుండేటట్లును, సదా, మీ బోటి మునిశ్రేష్ఠుల యందును - ఆ శ్రీ మన్నారాయుణుని యందును మనస్సు గలవాడనై యుండునట్లును నన్నాశీర్వదించు"డని ప్రార్ధించి, సహాప౦క్తి భోజనమునకు దయ చేయుమని ఆహ్వానించెను.

ఈ విధముగా తన పాదముల పైబడి ప్రార్ధించుచున్న అంబరీషుని ఆశీర్వదించి "రాజా! ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు యిష్టుడవు. తండ్రితో సమానుడవైనావు.

నేను నీకు నమస్కరించినచో నా కంటె చిన్న వాడగుట వలన నీకు అయుక్షిణము కలుగును.అందుచేత నీకు నమస్కరించుట లేదు. నీవు కోరిక యీ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర యేకాదశి వ్రతనిష్టుడవగు నీకు మనస్థాపమును కలుగ జేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని, నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నివే దిక్కయితివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము గాక, మరొకటి యగునా?" అని దుర్వాస మహాముని పలికి, అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్యపరమాన్నములతో సంతృప్తిగా విందారగించి, అతని భక్తిని కడుంగడు ప్రశంసించి, అంబరీషుని దీవించి, సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను.

ఈ వృత్తాంతమంతయు కార్తిక శుద్ధ ద్వాదశీ దినంబున జరిగినది. కాన ఓ అగస్త్య మహామునీ! ద్వాదశీ వ్రత ప్రభావమెంతటి మహాత్మ్యము గలదో గ్రహించితివిగదా! ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై వుండును. కనుకనే, ఆరోజుకంతటి శ్రేష్టతయు, మహిమ గలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము యితర దినములలో పంచ దానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ యేకాదశి రోజున శుష్కోపవాసము౦డి పగలెల్ల హరి నామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ, లేక, వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశినాడు తన శక్తి కొలది శ్రీమన్నారయణునకు ప్రీతీకొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టి వాని సర్వ పాపములు యీ వ్రత ప్రభావము వలన పటాపంఛలై పోవును. ద్వాదశీ దినము శ్రీమన్నానరయుణుకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశ ఘడియలు తక్కువగా యున్నను. ఆ ఘడియలు దాటకుండగానే భుజింపవలెను.

ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసమేర్పరచుకొని వుండాలని కోరిక వుండునో, అట్టి వారు ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ యొక్కటియు విడువకూడదు. శ్రీహరికి5 ప్రీతీకరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి యెంత మాత్రము సంశయింప కూడదు. మఱ్ఱి చెట్టు విత్తనము చాల చిన్నది. అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగ జేసిన యే కొంచము పుణ్యమైనను, అది అవసానకాలమున యమదూతల పాలు కానీయక కాపాడును. అందులకే యీ కార్తీకమాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి.

ఈ కథను యెవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్దించి సంతాన ప్రాప్తి కూడా కలుగును - అని అత్రిమహాముని అగస్త్యనకు బోధించిరి.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము.

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
పోలి స్వర్గం కథ ( రేపటి రోజున పోలిస్వర్గం)

కార్తికమాసం చివరికి రాగానే గుర్తుకువచ్చే కథ ‘పోలిస్వర్గం’. ఇంతకీ ఎవరీ పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? దానిని తల్చుకుంటూ సాగే ఆచారం ఏమిటి? అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి. పోలిస్వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తికమాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్నీ సూచించే గాధ.

అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారట. వారందరిలోకి చిన్నకోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా, వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం. అందుకే కార్తికమాసం రాగానే చిన్నకోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయల్దేరేది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీస్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావల్సిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయల్దేరేవారు అత్తగారు.
కార్తికమాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనేలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేంది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు, దాని మీద బుట్టని బోర్లించేంది. ఇలా కార్తికమాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తికమాసం చివరిరోజు కాబట్టి ఆ రోజు కూడా నదీస్నానం చేసి ఘనంగా కార్తికదీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది. వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటిపనులన్నీ అప్పగించి మరీ వెళ్లింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటిపనులను చకచకా ముగించేసుకుని కార్తిక దీపాన్ని వెలిగించుకుంది.

ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమయినా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చటవేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారూ, ఆమె కోడళ్లూ... ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు.

ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటిదొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి... టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది. ఇలా వదిలిన అరటిదీపాలను చూసుకుంటూ పోలిని తల్చుకుంటారు. కార్తికమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా, ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే.... మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రహ్మణులకు దీపాన్ని కానీ, స్వయంపాకాన్ని కానీ దానం చేస్తుంటారు.

తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్నీ కూడా శ్రీమహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలిదీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. పైగా ఈ సంవత్సరం (2019) అమావాస్య మంగళవారంనాడు వచ్చింది కాబట్టి చాలామంది బుధవారమే (27/11/2019) పోలి దీపాలను వెలిగించుకోవడానికే సుముఖంగా ఉన్నారు.

ఇదీ పోలిస్వర్గం వివరం! కార్తికమాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది. భగవంతుని కొలుచుకోవడానికి కావల్సిందే శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది. అన్నింటికీ మించి ఆహంకారంతో సాగే పూజలు ఎందుకూ కొరగానివని హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతినీ బోధిస్తోంది. అందకే ప్రతి కార్తికమాసంలోనూ, ప్రతి తెలుగు ఇంట్లోనూ... పోలిస్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది.
శివపురాణం - 29 వ భాగం

శివపురాణం 29 – స్కందోత్పత్తి – కుమారసంభవం:
మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి. ఆయనకు 13మంది భార్యలు ఈ 13మంది దక్షప్రజాపతి కుమార్తెలు. కశ్యప ప్రజాపతి భార్యలలో ‘దితి, అదితి’కి ఉన్నంత ప్రాశస్త్యం మిగిలిన భార్యలకు కనపడదు. దితి భావనలు శ్రీమన్నారాయణుని దుష్టశిక్షణకు అనేకమయిన అవతారములు తీసుకునేటట్లుగా చేశాయి. దితియందు మార్పురాలేదు. కాబట్టి ఇపుడు తేడా క్షేత్రమునందే ఉంది. ఇప్పుడు మరల బిడ్డలు కావాలని కశ్యప ప్రజాపతిని అడిగింది. ‘నాకు ఇంద్రుడిని చంపే పిల్లవాడు కావాలి’ అని. అపుడు కశ్యప ప్రజాపతి నవ్వి ‘నీ కోరిక తీర్చగలిగిన వాడిని నేను కాదు ఈశ్వరుని సేవించు. నీవొక గొప్ప తపస్సు చెయ్యి తపస్సు చేస్తున్నప్పుడు ధర్మంలో లోపం రాకూడదు. నీకు బిడ్డ పుట్టేవరకూ అలా ఉండగలిగితే నీకు ఇంద్రుడిని సంహరించగలిగిన కుమారుడు పుడతాడు’ అని చెప్పాడు. ఆవిడ లోపలి కశ్యప ప్రజాపతి తేజము ప్రవేశించింది. ఆవిడ గర్భిణీ అయింది. లోపల గర్భం పెరుగుతోంది. ఇది ఇంద్రుడికి తెలిసింది. ఇంద్రుడు ఆవిడ దగ్గరకు వచ్చి ‘అమ్మా, నీకు సేవచేస్తాను’ అన్నాడు. ఆవిడ ధర్మం పాటించింది ఇక్కడ. ఇంద్రుడిని సేవ చేయడానికి అంగీకరించింది.

ఒకనాడు ఆవిడ మిట్టమధ్యాహ్నం వేల తల విరబోసుకుని కూర్చుని ఉంది. కునుకు వచ్చి మోకాళ్ళ మీదకి తల వాలిపోయింది. జుట్టు వచ్చి పాదములకు తగిలింది. స్త్రీకి అలా తగలకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం జుట్టు చివర ముడివేసి లేకుండా స్త్రీ తిరుగరాదు. జుట్టు అలా పాదముల మీద పడగానే ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో లోపల ఉన్న పిందమును ముక్కలుగా నరికేశాడు ‘మారుదః మారుదః – ఏడవకండి’ అంటూ. అపుడు దితి ఏడ్చి కనీసం వాళ్ళకి నీదగ్గర పదవులియ్యి అని ఇంద్రుని అడిగింది. మారుదః మారుదః అని కడుపులో ఇంద్రుని చేత చెప్పబడ్డారు కనుక వాళ్ళు ‘మరుత్తులు’ అనే పదవులు పొంది స్వర్గలోకంలో వారి పదవులను అధిష్ఠించారు. ఇపుడు దితికి మరల భంగపాటు అయింది.

ఇలా కొన్నాళ్ళు అయిపొయింది. మరల ఆవిడ తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి ఒక చిత్రమయిన కోరిక కోరింది. ‘నాకు దేవతలనందరిని గెలవగల కుమారుడు కావాలి’ అని అడిగింది. అపుడు ఆయన ‘పదివేల సంవత్సరములు నియమముతో చతుర్ముఖ బ్రహ్మగురించి తపస్సు చెయ్యాలి. అప్పుడు నీకు నీవు కోరుకునే కొడుకు పుడతాడు’ అని చెప్పాడు. అటువంటి తపస్సు బ్రహ్మాండంగా ప్రారంభం చేసింది. కొన్నివేల సంవత్సరములు తపస్సు చేసిన తరువాత బ్రహ్మ అనుగ్రహమును పొందింది. గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి ‘వజ్రాంగుడు’ అని పేరు పెట్టారు. వజ్రాంగుడు అనగా వజ్రముల వంటి అంగములు కలిగిన వాడు అని అర్థం. వాడికి దేహమునందు బలం ఉంది. బుద్ధియందు సంస్కారం ఏర్పడలేదు. యితడు బయలుదేరి దేవలోకమునకు వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుని జయించి అతడిని పదవీచ్యుతుని చేశాడు. అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు. ఇంద్రుడు వరుణుడు దిక్పాలకులు మొదలైన దేవతలనందరినీ బంధించి తన కారాగారంలో పారేశాడు. ఇప్పుడు బ్రహ్మ కశ్యప ప్రజాపతిని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు. వారు వస్తే వజ్రాంగుడు లేచి స్తోత్రం చేసి నమస్కారం చేశాడు. సముచితాసనమున కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులను ఇచ్చాడు. అపుడు బ్రహ్మ ‘నాయనా, నీవు చేసిన అతిథిమర్యాదకు చాలా సంతోషించాము. కానీ దిక్పాలకులకు పదవులను నేను ఇచ్చాను. నీవు వాళ్ళను పట్టుకువచ్చి కారాగారంలో పడేశావు. నువ్వు విజేతవే. అందులో సందేహమేమీ లేదు. కానీ వాళ్ళ పదవులు వాళ్ళను చేసుకొనీ’ అని చెప్పాడు. వాళ్ళమాట మీద వజ్రాంగుడు ఇంద్రుడిని, తాను బంధించిన ఇతర దేవతలను విడిచిపెట్టాడు. వజ్రాంగుడు బ్రహ్మతో ఇలా అన్నాడు ‘మహానుభావా అనుకోకుండా ఈవేళ నాకోసం ఇలా వచ్చావు. నేనూ నిన్ను ఒక్కటి ప్రార్థన చేస్తున్నాను. అసలు మనశ్శాంతికి ఏది కారణమో ఏది నిజమయిన తత్త్వమో ఏది తెలుసుకోవాలో అది నాకు ఒకసారి దయచేసి బోధ చేయవలసింది. ఉపదేశం చేయవలసింది’ అని అడిగాడు. ఇటువంటి కోరిక కోరేసరికి ఆయన పొంగిపోయి ‘నాయనా నీవు ఎల్లప్పుడూ సత్త్వ గుణమును పట్టుకుని ఉండు. ఈశ్వరుని నమ్మి ఉండు. నీకు ఏ ఇబ్బంది ఉండదు. నీకు ఒక భార్యను ఇస్తున్నాను నేను. ఆమె పేరు ‘వరాంగి’. నేను సృష్టించి ఇస్తున్నాను. తీసుకో’ అని బ్రహ్మ దగ్గరుండి పౌరోహిత్యం చేసి వజ్రాంగుడికి వరాంగికి పెళ్ళిచేశారు.

వజ్రాంగుడు తన భార్యతో కలిసి నిరంతరం ధర్మాచరణ చేస్తున్నాడు. ఒకరోజున వజ్రాంగుడు భార్యను పిలిచి ‘నీకు ఏమి కావాలనుకుంటున్నావు? నీవు ఏమీ బెంగపెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో చెప్పు’ అని అడిగాడు. అపుడు వరాంగి ‘ముల్లోకములను గెలవగలిగిన వాడు పాకశాసనుని కన్నుల వెంట నీళ్ళు కార్పించగలిగిన వాడు నా కడుపున కొడుకుగా పుట్టేటట్లుగా నన్ను అనుగ్రహించు’ అన్నది. ఇప్పుడు వరాంగి వల్ల వజ్రాంగుడు మనశ్శాంతిని కోల్పోయాడు. పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మ గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు. వజ్రాంగుడు నమస్కారం చేసి ‘స్వామీ, వరాంగి కోరిన కొడుకును ఆమెకు ఇప్పించండి’ అని అడిగాడు. వరాంగికి తాను కోర