Devotional Telugu
3.46K subscribers
106 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
తొలిఏకాదశి విశిష్టత

ఈ రోజున ఏం చేయాలి.

హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘‘తొలి ఏకాదశిగా’’ గా పిలుస్తారు. దీనికే ‘‘శయనైకాదశి’’ అని ‘‘హరి వాసరమని‘‘ , ‘‘పేలాల పండుగ’’ అని పేరు. పురాణాలను అనుసరించచి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు.. అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకుని.. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు..

ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో బలి చక్రవర్తి వద్ద ఉంది.. కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు... పర్వదినాలు ఎక్కువగా వస్తాయి.. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి.. ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఆచరించాలి.. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు,.

ఏకాదశి తిథి: కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించడంతో శ్రీ మహా విష్ణువు అతనితో వెయ్యేళ్లు పోరాడి.. అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా.. శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి..రాక్షసుణ్ని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుందట.. అప్పటి నుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది.. నాటి నుంచి సాధువులు, భక్తజనులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి విష్ణుసాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు.

ఏకాదశి నాడు ఏం చేయాలి: ఏకాదశి నాడు ఉపవాసం ఉంది.. ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి.. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి.. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి..

పేలాల పిండి: తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి.. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలం.. కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈరోజున దేవాలయాల్లోనూ.. ఇళ్ల వద్దా పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు.🙏

సర్వేజనా సుఖినోభవంతు
Devotional Telugu
Audio
Chaganti Ramayana pravachanam….
@GodsofHindu
(Click the link to join)
చరమగీతం


శ్రీరామ జనన సమయంలో ప్రకృతి పరవశించిందని, పక్షులు ఆనందంగా స్పందించాయని చెబుతారు. ఆయన అవతార పురుషుడు. కారణజన్ముడు. సహజంగానే సమస్త ప్రకృతీ పరవశించి స్వాగత గీతాలు పాడుతుంది.
మనిషి జనన సమయంలోనూ తల్లి మనసు పరవశంతో మౌనగీతం పాడుతుంది. అదే తొలి గీతం. అది బిడ్డ ఆత్మను తాకుతుంది. రక్త బంధువుల ఆనంద తరంగాలన్నీ స్వాగత గీతాలే. ప్రేమ నిండినవారి ఆలింగనాలు, శిరసు మీద ముద్దులు- మధురమైన మౌన గీతాలు. 
సృష్టిలో మనం గమనించని మౌన సంగీతం ఎంతో ఉంది. అది చెవులకు వినిపించేది కాదు- మనసుతో విని, ఆత్మతో ఆనందించాల్సింది.
భగవంతుడు నాదప్రియుడని చెబుతారు. శివుడైనా, విష్ణువైనా సంగీత ప్రియులే. శివ పరివారమంతా సంగీత విద్వాంసులే. విశ్వమంతా ఓంకార ధ్వని తరంగాలతో పరవశిస్తుంటుంది. సూర్యగ్రహ తరంగాలు ఓంకార ధ్వనులని ‘నాసా’ శాస్త్రవేత్తలు గుర్తించారు.
సృష్టి అంతా సంగీతమయమే. స్వరాల మూలాలు పక్షులు, జంతువుల అరుపులని విద్వాంసులు చెబుతారు. సంగీతానికి మధుర స్వరం ఎలా కీలకమో గీతానికి ఉదాత్త భావన అంతే ముఖ్యం. సంగీత సాహిత్యాలు కవలలు. అవి కలిసి ఉంటేనే రససిద్ధి కలుగుతుంది.
అందరూ సంగీత విద్వాంసులు కాలేరు.
కానీ, సంగీత మాధుర్యాన్ని అందరూ ఆస్వాదించగలరు. త్యాగయ్య, అన్నమయ్య లాంటి వైతాళికులు తమ భక్తిగానామృతాన్ని పరమాత్మకు నివేదన చేసి ముక్తిని పొందారు. భక్త తుకారాం సశరీరంగానే వైకుంఠానికి వెళ్లాడని కథ ఉంది. ఆయన గీతాలకు భక్తి పరమళాన్ని మేళవించి పరమాత్మను మెప్పించాడు.
భజన కూడా సంగీతమే. భగవంతుడు భజన కీర్తనలతో ప్రసన్నుడవుతాడంటారు. శ్రీరామ భజన ఎక్కడ జరిగితే అక్కడ ఆంజనేయుడు ప్రసన్నుడై నర్తిస్తాడని ప్రతీతి.
వీటన్నింటి సారాంశం ఒక్కటే. మన జీవితంలో ప్రతి క్షణమూ దైవ స్మరణ, సేవ, కీర్తనలతో సత్ప్రవర్తనతో గడిచిపోవాలి. అలాంటి ప్రణాళికను మనకు మనమే రచించుకోవాలి. మన నిత్య కృత్యాలు, ఉద్యోగ ధర్మాలు ఈ కార్యక్రమానికి పెద్దగా ఆటంకాలు కావు. కర్తవ్య స్పృహ ఉండాలి. దైవంతో అవిచ్ఛిన్న అనుబంధం ఉండాలి.
మన హృదయం అనుక్షణం పని చేస్తూ దేహ రక్షణ, ప్రాణ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. మనసు ప్రపంచాన్నంతా తనలో ఇముడ్చుకుని అనేక ఆలోచనలతో సతమతమవుతూ ఉంటుంది. ఒకటి కర్తవ్య పాలనతో ఏమరుపాటు లేకుండా ఉంటుంది. రెండోది కర్తవ్యం తెలియక మర్కటంలా చంచలంగా వ్యవహరిస్తుంది. ఈ రెండు సిరుల మధ్య సంయమనం సాధించాలి. హృదయ సంగీతం సాగినంత కాలం మనిషి భద్రం. అది చరమగీతం పాడేలోపల మనిషి మేలుకోవాలి. విజ్ఞతతో వ్యవహరించాలి. ఆధ్యాత్మిక సత్యాలను అవగతం చేసుకోవాలి. ‘ఇదే... ఈ క్షణమే చివరిది’ అనుకుంటూ ప్రతి క్షణాన్నీ అంతర్యామికి అంకితం చేయాలి. అప్పుడు చరమగీతం గొప్ప వీడ్కోలు గీతం అవుతుంది. అంతర్యామి మందిరం స్వాగతం పలుకుతుంది!
విజేత

జీవితం బహు చిత్రమైనది. ఒడుదొడుకులు, ఆరాటం, పోరాటం మనిషి మనసును మధించి అశాంతికి గురిచేస్తాయి. గెలుపు, ఓటములు, కష్టసుఖాలు ఉంటాయి. మనసును సమాధానపరచుకొని ముందుకు సాగాలి. సాధారణంగా ఆటల్లో నెగ్గినవారిని, పాటల్లో గెలిచినవారిని విజేతలంటారు. కంటికి కనిపించకుండా మనల్ని ఆడిస్తుంది మనసు. దాని ఆట కట్టించగలిగితేనే మనిషి విజయం సాధించినట్లు!
మనసును అదుపులో పెట్టడం అంత సులభం కాదు. దానికి తగిన సాధన చెయ్యాలి. మనసును జయించడానికి ముందు ఇంద్రియ నిగ్రహం అలవరచుకోవాలి. మనసును మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. అంతేకాని, దాని చేతుల్లో కీలుబొమ్మ కారాదు. అభ్యాస వైరాగ్యాల ద్వారా మనసును స్వాధీనం చేసుకోవచ్చని గీతాచార్యులు వెల్లడించారు.
‘దేవుడి కృపను పొందవచ్చు. గురువు కృపను, సాధుజనుల కృపను పొందవచ్చు. కాని మనసు కృపను పొందలేక నాశనమవుతాడు’ అని సామెత ఉంది. ‘వెయ్యిసార్లు వెయ్యిమందిని యుద్ధంలో ఓడించిన వాడికన్నా తన మనసును జయించినవాడే పరాక్రమవంతుడు’ అంటుంది ధమ్మపద. మనసును స్వాధీనం చేసుకోవడం ప్రపంచంలో అన్నింటికన్నా కష్టమైన పని. స్వాధీనం తప్పిన మనసు మనిషి వ్యక్తిత్వం సమగ్రంగా వికసించకుండా అడ్డుపడుతుంది. మనోనిగ్రహం లేని వ్యక్తి విపరీతమైన పోకడలకు, ఎడతెరిపి లేని అంతర్మథనం వల్ల కలిగే మానసిక పతనానికి గురవుతాడు.
ఈ స్థూల శరీరంలో మనసు ఒక సూక్ష్మమైన భాగం మాత్రమే. భౌతికమైన స్థూల శరీరం మనసుకు పైన ఒక పొర. మనసు వెనక ఆత్మ ఉంది. మనసు సర్వ స్వతంత్రమైనది కాకపోయినా, దానికున్న శక్తులు అపారమైనవి. ఆ శక్తులను జయించడానికి మనిషి విశ్వప్రయత్నం చేయాలి. అప్పుడే అతడు విజేత కాగలడు. మనసెప్పుడూ ఒకేలా ఉండదు. మూడు బలమైన శక్తుల కలయికే దానికి కారణం. అవి సత్వం, రజస్సు, తమస్సు అనేవి.
శ్రీ రామకృష్ణ ‘పరిశుద్ధమైన మనసే పరిశుద్ధమైన బుద్ధి. అదే పరిశుద్ధమైన ఆత్మ’ అన్నారు. మనసు నాలుగు విధాలైన విధులను కలిగి ఉంటుంది. అవి: మది, బుద్ధి, అహంకారం, చిత్తం. ఇవన్నీ అంతఃకరణ తాలూకు వేర్వేరు రూపాంతరాలు. ‘మది’ ఒక వస్తువు. మంచి చెడులను అంచనా వేస్తుంది. ‘బుద్ధి’ మంచి చెడులను నిర్ణయిస్తుంది. చిత్తం జ్ఞాపకశక్తిని కలిగిస్తుంది. ‘నేను’ అనే భావాన్ని కలిగించేది ‘అహంకారం’. మనసును స్వాధీనం చేసుకోవాలంటే అది పవిత్రంగా ఉండాలి. మనం తినే ఆహారం పరిశుద్ధంగా ఉంటే మనసు పవిత్రమవుతుంది.
మనసును గెలవాలనుకునేవారు తమ కలతలు, కక్షలు, స్పర్థలు లోలోపలే దాచుకోరాదు. మనసుకు సృజనాత్మకమైన, ఆరోగ్యకరమైన కాలక్షేపం కల్పించాలి. శ్రీమద్భాగవతం ‘దానం, కర్తవ్య నిష్ఠ, వ్రతాలు, పురాణ శ్రవణం, పుణ్యకర్మలు ఇత్యాది పనులు మనసును స్వాధీనపరచుకోవడానికి దోహదం చేస్తాయి’ అని చెబుతోంది. ముఖ్యంగా భగవంతుడి గురించి ధ్యానం చేయాలి. గాయత్రీ మంత్రాన్ని అనునిత్యం జపిస్తే, మనసు మీ ఆధీనంలోనికి రావడానికి తోడ్పడుతుంది. పతంజలి ఓంకారాన్ని జపించడం ద్వారా మనసును స్వాధీనం చేసుకోవచ్చని సూచించారు.
‘వివేక చూడామణి’లో శంకరాచార్యులు ‘మెట్లపై నుంచి జారవిడిచిన బంతి ఏ విధంగా ఒక్కొక్క మెట్టుమీద నుంచి దొర్లుతూ కిందికి పడిపోతుందో అలాగే, మనసు తన ఆదర్శం నుంచి ఏ కొంచెం పక్కకు తప్పుకొని భోగవస్తువుల మీదకు  మరలినా క్రమక్రమంగా అది మరీ హీనస్థితికి జారిపోతుంది’ అన్నారు. మన సంకల్ప శక్తితో మనసు మీద పట్టు సాధించి నిలకడగా భగవంతుని ధ్యానించేటట్టు చెయ్యాలి. మనసును సుశిక్షితుడైన సైనికుడిలా మలచి మాట వినేలా చేయగలిగినవాడే విజేతగా విలసిల్లుతాడు.
తపస్సు

తపస్సు అంటే మనసును దైవం మీద లగ్నం చేసి ఆధ్యాత్మికంగా చేసే ధ్యానం. మనిషి జిజ్ఞాసాపరుడై తానేమిటో, ఇతర జీవరాశులకన్నా అన్ని విషయాల్లో ఎలా అధికుడో తెలుసుకున్నాక మనసు ప్రాధాన్యం అవగతమైంది. అటు తరవాత బుద్ధి కుశలతా అర్థమైంది. మనసును కుదురుగా ఉంచుకుంటే మనిషిగా సాధించలేనిది ఏదీ లేదని తెలుసుకున్నాడు. కొంత సమయం ధ్యానానికి కేటాయించాడు. మానసిక శక్తిని పొంది శరీరంతో ఎన్నో అబ్బురపరచే అద్భుతాలు సాధించాడు.

తపస్సు అంటే కీకారణ్యంలో ఒక చెట్టు కింద కళ్లు, ముక్కు మూసుకుని కూర్చున్న రుషులు మన మనో ఫలకంపై మెదులుతారు. తపస్సు అంటే తీవ్రమైన ధ్యానం అనుకునేవాళ్లూ ఉన్నారు. భగవద్గీతలోని 17వ అధ్యాయంలో మనోవాక్కాయాలతో చేసే మూడు విధాల తపస్సులను గీతాచార్యుడు మనకు ఉపదేశించాడు.

దేవతలను, ద్విజులను, గురువులను, జ్ఞానులను గౌరవిస్తూ పూజించటం, శుచిగా ఉండటం, నిజాయతీగా ప్రవర్తించడం, బ్రహ్మచర్యాన్ని, అహింసను అవలంబించడం శారీరక తపస్సు అవుతుంది.

ఎదుటివారికి ఉద్వేగం కలిగించని, రెచ్చగొట్టని మాటలు, సత్యంగాను, అవతలివారికి ప్రియాన్ని, హితాన్ని కలిగించేవిగా ఉండే మాటలు పలకడం, విధిగా వేదాధ్యయనం చెయ్యడం- వీటిని వాక్‌ తపస్సుగా చెబుతారు.
మనసును సదా ప్రసన్నంగా ఉంచుకోవడం, సౌమ్య స్వభావం కలిగి ఉండటం, మౌనంగా (మనసులో ఎటువంటి భావ సంచలనం ఏర్పడకుండా) ఉంటూ, ఆత్మనిగ్రహం కలిగి ఉండటం, మనసులో అహర్నిశలూ పరిశుద్ధ భావనలే ఉత్పన్నమయ్యేలా చూసుకోవడం- వీటిని మానసిక తపస్సుగా అభివర్ణిస్తారు.
ఇవన్నీ ఆచరణీయాలే. నిత్య జీవనయానంలో కష్టసాధ్యమైనవేమీ కాదు. వీటికోసం కానలకు పోవలసిన అగత్యం లేదు. మనిషిగా గౌరవాన్ని పొందడానికి, విలువను పెంపొందించుకోవడానికి అత్యంత ఆవశ్యకమైనవి.

మనసు కలుషితం కావడానికి జ్ఞానేంద్రియాలు ప్రధాన కారణం. చూడకూడని దృశ్యాలు, వినకూడని మాటలు, ఆఘ్రాణించకూడని వాసనలు, చూడకూడని రుచులను పదేపదే అనుభవంలోకి తెచ్చుకోవడం వల్ల- మనసు తద్వారా శరీరం వాటికి దాసోహం అవుతాయి. అందుకే పూర్వపు రోజుల్లో రుషులు సమాజం నుంచి తమను తాము వేరు చేసుకుని అడవుల బాట పట్టింది. కానల్లోకి చేరడమంటే ప్రకృతిలోకి ప్రయాణించడం. భగవానుడి సహజ సృష్టిలో భాగం పంచుకోవడం. అప్పుడే మోక్ష మార్గం సులువవుతుంది.

నిన్నటిదాకా నిత్యావసరాల కోసం తపించిన మనిషి నేడు ఆడంబరాలను అన్వేషిస్తూ ఉరుకులు, పరుగులు పెడుతున్నాడు. తనను తాను యాంత్రికంగా మార్చుకుని డబ్బుకు అపరిమిత ప్రాధాన్యం ఇస్తున్నాడు. ధనమే అన్నింటికీ మూలం అన్న స్థాయికి చేరుకున్నాడు. 

కఠోరమైన మనసు, వికృతమైన శరీరాలు కలిగిన రాక్షసులే తపస్సు చేసి భగవంతుణ్ని మెప్పించి అద్భుతమైన వరాలు పొందారు. మానవులు సున్నిత మనస్కులు.

అనుగ్రహించడానికి భగవంతుడు అందరికీ అందుబాటులోనే ఉంటాడు. ఆయనను అందుకోలేకపోతున్నారంతే. 
మనసు ప్రశాంతమైతే, మనిషి కుదురుగా ఉంటాడు. నిలకడ కలిగిన మనిషికి మానసిక బలం, శారీరక శక్తి సంపూర్ణ ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తాయి.
భగవంతుడి పై ప్రేమతో ,.... అత్మరామమై..

తుమ్బీఫలం జలాన్తర్బలాదధః క్షిప్తమప్యు పైత్యూర్థ్వమ్‌

తద్వన్మనః స్వరూపే నిహితం యత్నాద్బహిర్యాతి

సొరకాయ బుర్రను బలవంతంగా నీటిలోకి నెట్టినా అది పైకేతేలుతుంది. అలాగే మనసును బలవంతంగా స్వస్వరూపంలో నిలిపినా అది మరలా బహిర్ముఖంగా వస్తూనే ఉంటుందని దీని అర్థం. ‘‘శంకరభగవత్పాదులు ‘ప్రబోధ సుధాకరము’లో చెప్పిన శ్లోకమిది. మనసు బాహ్యేంద్రియాల ద్వారా దేనినో ఒక దానిని అభిలషించి దాని వెంట పరిగెత్తుతుంది. అది లభించకపోతే తన సొమ్మేదో పోయినట్లుగా పరితపిస్తుంది. వర్షాకాలంలో జలాధిక్యం చేకూరి ప్రవాహాల్లో నీరు కలుషితమై సహజమాధుర్యాన్ని కోల్పోయి క్షారమవుతుంది. ఆ జలమే గ్రీష్మంలో శుష్కించి తిరిగి సహజ మాధుర్యాన్ని పొందుతుంది. అలాగే.. విషయ భోగాలతో మనసు ఉద్రేకించి తమోగుణ ప్రధానమై కలుషితమవుతుంది. అభ్యాస-వైరాగ్యాలతో విషయ వాసనలు నశించగానే.. మనసు తిరిగి సత్యగుణంతో విరాజిల్లుతుంది. మనసు చంచలమై, వాసనలతో కూడుకుని ఉంటుంది. అది కోరికలకు పుట్టినిల్లు. సుఖప్రాప్తికి అనేక కల్పనలను చేసుకుంటుంది. సముద్ర తరంగాల వలె కోరికలు ఎల్లవేళలా ఉత్పన్నమవుతుంటాయి.

 

ఇందుకు కారణాలు.. మలం, విక్షేపం, ఆవరణం. మలమనగా పాపచింతన. విక్షేపమనగా చంచలత్వం. ఆవరణమనగా దేహం తానని భ్రమించడం. మనసు మనిషిని నరక సదృశమైన పతనావస్థకు తీసుకుపోగలదు. లేదా భూసురునిలాగానూ మార్చగలదు. అనియంత్రతమైన మనసు.. ఇంద్రియ భోగాలు, అహంకార తృప్తి, ధనసంచయమనే మూడు క్షేత్రాలలోనే సుఖాన్ని వెతుక్కుంటుంది. మనసు స్వచ్ఛందంగా అన్ని దిశలలో పరెగెత్తడం వల్ల ‘బుద్ధి’ అనే అంకుశం లేక, ఒక ఆలోచనను వదలి వేరొక ఆలోచనలోకి వెళ్లగలుగుతుంది. మనసు ఏ ఆలోచనల మీద స్థిరపడుతుందో అదే జాతికి సంబంధించిన ఆలోచనలు మనవైపు ఆకర్షించబడతాయి. మన మనో భూమిని సాత్విక ఆలోచనలతో నింపితే తద్వారా ఆ ఆలోచనలు పరిపుష్టి చెందుతాయి. మహర్షుల మార్గదర్శనం, సహకారం పొందే వీలుంటుంది. అప్పుడు మనలో అంతర్యామిగా ఉన్న భగవచ్ఛక్తి పనిచేయగలదు.

 

పూజ్యేషు అనురాగో భక్తిః

అని నారద భక్తి సూత్రము. అనగా పూజ్యులయందు లేక పూజ్య వస్తువులయందు మనస్సు చేరగలిగెడు అనురాగ పూర్వక వృత్తి ‘భక్తి’ అనబడును. అందుకే ‘అనన్య దృష్టి చేత నన్ను భజించు వాడు సాధువే’ అని శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పాడు. పరమాత్మ యందు గల అనన్య భక్తి అమృత స్వరూపమైనది. భగవన్నామామృతము గ్రోలువాడు, అనగా నామ జపము చేయు సాధకుడు పర్యవసానముగా భగవత్స్వరూపుడే అవుతున్నాడు. భక్తి మార్గం భగవంతుని చేరుస్తుంది. ఏ విధమైన భక్తి మార్గాన్ని ఎంచుకున్నా సరే ఆయనపై ‘ప్రేమ’ ప్రాప్తిస్తే ‘ఆత్మారామోభవతి’ అనే స్థితిలో భక్తుడు ఉండిపోతాడు. మనసుకు శాశ్వతమైన ఆనందాన్ని అందించే మనోరంజకమైన విషయం లభిస్తే నిశ్చలమవుతుంది. తనలో తాను ఆనందిస్తూ ‘ఆత్మారామ’మవుతుంది. ప్రశాంతమైన పరమధామం చేరుతుంది.
ఆగస్టులో శ్రీవారికి రెండుసార్లు గరుడవాహన సేవ

తిరుమల శ్రీవారికి ఆగస్టులో రెండుసార్లు గరుడవాహన సేవ జరగనుంది. ఆగస్టు 5న గరుడ పంచమి, 15న శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా ఆయా రోజుల్లో రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీనివాసుడు గరుడవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు.
డివోషనల్ తెలుగు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం, 🙏


మన ఆంధ్రరాష్ట్రంలో లో చాలా దేవాలయాలు ఉన్నాయి, ఈ దేవాలయాల విశేషాలు, చరిత్ర అందరికీ అందజేయాలన్న ఉద్దేశంతో, సరికొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం.

ఈ చానల్ ను ఫాలో అవ్వాలి అనుకుంటే ఈ క్రింది లింక్ నొక్కండి

@Templesinap
నిరాశ

ఈ పని ఎప్పటికీ జరిగేది కాదు. అది అసాధ్యం. అటువంటి మాటలు- ఆ మనిషి స్వశక్తి మీద నమ్మకం కోల్పోయి నిరాశతో మాట్లాడుతున్నాడనడానికి తొలి సంకేతాలు. ఆత్మస్థైర్యానికి ఉన్న శక్తి అపారం. అది తెలియకపోవడమే నిరాశ. భగవంతుడు ఎన్ని ప్రత్యామ్నాయాలు తన ముందుంచినా, మనసు నిరాశతో నిండి ఉన్నప్పుడు, ఈ పని జరిగే తీరుతుందని అతడికి అనిపించదు. అది జరిగేందుకు ఉన్న అవకాశాలు తన కళ్ల ముందే ఉన్నా, నిరాశ వాటిని అతడికి కనపడనీయదు. తనకున్న బలాన్ని తెలియనివ్వదు.
అందరు అతిరథ మహారథులైన వానరవీరులున్నా రాముడు సీతాన్వేషణ బాధ్యతను హనుమంతుడికే అప్పజెప్పినప్పుడు- అతడు ఇది నా వల్ల కాగల కార్యమా అనుకుంటాడు. సందిగ్ధావస్థకు చేరుకుంటాడు. సంకోచంతో సతమతమవుతాడు. హనుమంతుడిని సహచర వానరులంతా నువ్వు మాత్రమే ఈ పని చెయ్యగలవాడని ఏకకంఠంతో అన్నప్పుడు, శతయోజనాలకు ఆవల సముద్రంలో ఉన్న లంకా ద్వీపానికి లంఘించి సీతమ్మ జాడ తెలుసుకోవటం అతడికి కష్టమనిపించలేదు. నిరాశ తొలగిపోతే చేరే ఆత్మశక్తి అతడి దేహబలం కన్నా గొప్పది. ఆ విషయం గ్రహించిన తరవాత హనుమంతుడు చేసి చూపించినవన్నీ అద్భుతాలే.
మహాభారతంలో, యక్షప్రశ్నల ఉపాఖ్యానంలో, యక్షుడు ధర్మరాజును- లోకంలో అతి దట్టమైనది ఏది అని ప్రశ్నించినప్పుడు సమాధానంగా అతడు మనుషులకుండే నిరాశ అని సమాధానమిస్తాడు. నిరాశతో ఉన్న మనిషి అవకాశాలను వెదకటం అదొక శ్రమ అనుకుంటాడని, ఆశ ఏ కోశాన తనలో ఉన్నా, ఆ మనిషి శ్రమిస్తూ, అవి వెదుకుతూనే ఉంటాడని, ఆ వెదకటం శ్రమ అని అతడనుకోడని, ఆశా నిరాశలున్న వ్యక్తుల మధ్య తారతమ్యం అదేనని మానసిక విశ్లేషకులంటారు.  సాధించలేని లక్ష్యాలు తమ ముందుంచుకున్న మనుషులకు నిరాశ తప్పదు. అందుబాటులో ఉన్న అవకాశాలను వృథా కానీయకుండా సమీక్షించుకుంటూ సాగిపోగలిగితే, మనిషికి ఆత్మహత్యల వంటి ఆలోచనలు రావటానికి అవకాశమే ఉండదు.
నిరాశ మనిషి నిజమైన వ్యక్తిత్వాన్ని తొక్కిపట్టి ఉంచుతుంది. అతడు ఉదాసీనత, ఆత్మన్యూనతలతో, సంఘర్షణలు-సవాళ్లు లేనిదే జీవితం అనుకుంటూ, అది ఎప్పటికైనా తనకు లభిస్తుందా అని నిట్టూరుస్తూ కాలయాపన చేస్తుంటాడు. భగవంతుడు తనకిచ్చిన జీవితం మహదవకాశమని మరచిపోతాడు.

ప్రయత్న లోపాల పరిణామమే నిరాశ. సాలెపురుగొకటి గూడు నిర్మించుకునేందుకు అవస్థలెన్నో పడుతూ ఉంటుంది. తన ప్రయత్నాలు సఫలమయ్యే వరకు అది తన పట్టు విడవదు. గూడు ఎట్టకేలకు నిర్మితమవుతుంది. వరస అపజయాలతో దేశ బహిష్కృతుడై, అక్కడ తలదాచుకుంటున్న స్కాట్లాండ్‌ దేశపు రాజైన రాబర్ట్‌ బ్రూస్‌ అది గమనించి ఉత్తేజితుడవుతాడు. ఆ చిన్నజీవి ప్రయత్నాల నుంచి పొందిన ప్రేరణతో శత్రువులను ఎదుర్కొని విజయం సాధిస్తాడు.

నిర్లక్ష్యం, నిరాశ, నిస్పృహలతో జీవితం గడిపే మనిషెప్పుడూ కర్మయోగి కాలేడని, కర్మ యోగులే జ్ఞానయోగులవుతారని గీతలో భగవానుడు చెప్పింది మనిషికెప్పుడూ గుర్తుండాలి. జీవిత కాలక్రమంలో ఆయన మనిషికి ఇచ్చినవి ఎన్నో ఉంటాయి. అవన్నీ పొందని మనుషులూ ఉంటారు. వారిలో తృప్తిగా జీవిస్తున్న వారూ ఉంటారు. వారికి అది సాధ్యమెలా అయిందో వారినే అడిగి తెలుసుకుంటే, తృప్తిగా జీవించటానికి కావలసినదేమిటో వేరే వెదకనక్కరలేదు. ప్రత్యేక సాధనల అవసరం ఉండదు.
For Suggestions and to reach email - Devotional1974@gmail.com
భక్తి మోక్షానికి మార్గం


‘‘మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ

స్వస్వరూపాను సంధానం భక్తి రిత్యభిదీయతే’’


మోక్షాన్ని అన్వేషించే వస్తువుల్లో భక్తియే గొప్పది. ఆత్మ తత్త్వమును అన్వేషించడమే భక్తి, జీవాత్మలో పరమాత్మను దర్శించడమే భక్తి అని శంకర భగవత్పాదులు వివరించారు. ‘భజసేవాయం’ ధాతువు నుండి భక్తి అనే శబ్దం వచ్చింది. కనుక భక్తి అంటే సేవ అని అర్థం. పరమాత్మను సేవించుకోవడమే భక్తి. ఆ పరమాత్మను సాటి మనిషిలో దర్శించుకోవడమే అసలైన భక్తి. భక్తి అనేది మనిషిలోని దుర్గుణాలను సంస్కరిస్తూ మానవత్వాన్ని పెంచి అటునుండి పరతత్త్వం వైపు నడిపించగల మహత్తర శక్తి. వ్యక్తి ద్వారాసమాజం సంస్కరింపబడడానికి భక్తి ఒక సాధనం, సుఖ శాంతులకు నెలవు. భగవదనుగ్రహం పొందడానికి సులభోపాయం.


సాధారణంగా ఏవో కోరికెలు తీరాలని కొందరు, ఇంట్లోని వాతావరణం వలన కొందరు, బయట ఆధ్యాత్మిక వాతావరణ ప్రభావం వలన కొందరు, దేవునికి మొక్కకుంటే ఏమవుతుందో అనే భయంతో కొందరు భక్తి మార్గంలో ప్రయాణిస్తుంటారు.

చతుర్విధ పురుషార్థాలలో చివరిదైన మోక్షమే అసలైన పురుషార్థం అని భావించేవారున్నారు. మోక్షం అంటే ముక్తి, మళ్లీ జన్మించే అవసరం లేకపోవడం. బమ్మెర పోతన తాను భాగవతం ఎందుకు రాస్తున్నాడో తెలుపుతూ ప్రారంభ పద్యంలోనే ‘‘శ్రీ కైవల్య పదంబు జేరుటకై చింతించెదన్‌’’ అన్నారు. కైవల్యమే తన లక్ష్యం అన్నారు. భక్తినే మార్గంగా ఎంచుకున్నారు.

సమాజం సుఖశాంతులతో ఉండాలంటే ధర్మబద్దంగా జీవించాలి. ధర్మబద్దంగా జీవించడానికి ప్రేరణను ఇస్తుంది భక్తి. అందుకే భారతీయ జీవనంలో భక్తి అంతర్భాగం అయింది. మంత్రాలతో అర్చించడమే భక్తి అని కొందరు భావిస్తారు కానీ ఏ మంత్రమూ రాని సాలెపురుగు, సర్పము, ఏనుగు తమ తమ శక్తి కొలది పరమేశ్వరుని పూజించి మోక్షాన్ని పొందాయని శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో తెలుస్తుంది. వయసు ప్రధానం కాదని ధృవుని కథ వల్ల తెలుస్తుంది. తాత్కాలిక సుఖాలకో, శాశ్వతం కాని దేహం కోసమో ఆరాటపడకుండా తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, బంధువులను, సాటి మనుషులను గౌరవిస్తూ, భావితరాలకు మంచి జీవనాన్ని అందించేలా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, సర్వప్రాణులలో భగవంతున్ని దర్శిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడడమే నిజమైన భక్తి.