Devotional Telugu
3.46K subscribers
106 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
గురు స్థానం

ప్రశ్నోత్తరాల తోనే మనిషికి అభివృద్ధి సాధ్యపడుతుంది. ఉన్న స్థితి నుంచి ఉత్తమ స్థితికి, ఉన్నత స్థాయికి చేరుతుంది. మనిషి స్వతహాగా జిజ్ఞాసువు. ఎన్నో తెలుసుకోవాలని తపిస్తాడు

తెలుసుకోవడం అంటే ముడుచుకున్న మొగ్గ వికసించి పువ్వు గా సువాసన వెదజల్లడం లాంటిది! విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం. ఆనందప్రాప్తి అనుభవ జ్ఞానం వల్లనే కలుగుతుందని పెద్దలంటారు.

జనించి ప్రశ్నలకు అందరూ సరైన సమాధానాలు ఇవ్వలేరు. గురువు ఆవశ్యకత అప్పుడే అవగతమవుతుంది. పుట్టి ఊహ తెలిసింది మొదలు వివిధ దశల్లో, నిత్య జీవనంలో అనేక ప్రశ్నలు ఉద్భవిస్తాయి. తల్లిదండ్రులు, చుట్టుపక్కల వాళ్ళు, సహాధ్యాయులు, ఉపాధ్యాయులు సమాధానాలు కొంతవరకు సవ్యమైన దిశలో నడిపిస్తారు. లౌకిక వ్యవహారాల స్థాయి దాటిన దరిమిలా ఒక ప్రత్యేక మార్గాన్ని ఎంచుకున్నా మనిషికి అందులో నిష్టాతులైన గురువు అవసరమవుతాడు. విలువిద్యలో ద్రోణుడు మేటి. ఏకలవ్యునికి నేర్పను అన్నాడు. ద్రోణుడి మట్టి బొమ్మను ఎదురుగా పెట్టుకుని గురువు పట్ల గౌరవంతో, శ్రద్ధగా ఏకాగ్రతతో ఏకలవ్యుడు ధనుర్విద్య అభ్యసించాడు.

మానవుడు పరమ శ్రేయస్సును పొందడానికి సతతం గురు భక్తిని కలిగి ఉండాలనేది జ్ఞానుల వాక్కు గురువు సాక్షాత్తు శ్రీహరి స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే గురువు అన్న భావన కలి ఉన్నప్పుడే శరణాగతి ప్రాప్తించి సాధ్యపడుతుంది అంటుంది గురుగీత.

పూర్వకాలంలో గురు శుశ్రూష కు అందుకే ప్రాధాన్యం ఉండేది, ఒకసారి శిష్యుని తన వాణ్ణి గా చేసుకుంటే, తనంతటి వాడిని చేసేదాకా గురువు నిద్ర పోయేవాడు కాదు. గురు శిష్య సంబంధం బాంధవ్యాలు అంత గొప్పగా దూరంగా ఉండేవి.

భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా మనుషుల్లో తాను వ్యాసుడి నంటాడు. గురు స్థానం మహా గొప్పది. దేవతలు సైతం తలవంచి నమస్కరిస్తారు. మహావిష్ణువు రామావతారంలో వశిష్ట, విశ్వామిత్ర లకు, కృష్ణావతారంలో సాందీపని మహర్షికి వినమ్రంగా శిష్యరికం చేయడం తెలిసిందే. పరమేశ్వర అవతారమైన ఆదిశంకరులు గౌడపాదాచార్యులను గురువుగా స్వీకరించారు. గురుముఖతా నేర్చుకోవడమే సరైనదని పురాణవచనం.

తెలుసుకోవాలన్న, నేర్చుకోవాలన్న కుతూహలం, జిజ్ఞాస మనిషికి ఉండాలే కానీ, ఎన్నో దారులు ఉన్నాయి. గణన యంత్రం (కంప్యూటర్) అందులో అంతర్జాలం (నెట్) వుంటే సమస్తం మన వెలికొనలపైన నాట్యమాడుతుంది. చుట్టూ ఇంతటి విశాలమైన ప్రపంచం ఉందా అని మనల్ని విస్తుపోయేలా చేస్తోంది. విస్తరించిన మాధ్యమాలు గురువు పాత్రను పోషిస్తున్నాయ. ఒక ప్రశ్నకు అనేక సమాధానాలు, పరిష్కారాలు..... అందుబాటులో ఉన్న ఇంతటి విషయ పరిజ్ఞానము గురు స్థానానికి ప్రత్యామ్నాయం కాదు, కాబోదు.

ప్రశ్న దానికి అనుబంధంగా అనేక సమాధానాలు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఏది సత్యమో, అసత్యమో తెలిసి తెలియని అగమ్య గోచర పరిస్థితిని కల్పిస్తున్నాయి. విషయంలో పరిపూర్ణమైన అవగాహన కలిగించలేక పోతున్నాయి.


ఒకప్పుడు గురువులు శిష్యుల గ్రహణ శక్తి బట్టి చెప్పదలచుకుంది మనసుకు హత్తుకునేలా విపులీకరించే వారు. విద్వత్తు మనిషి సమాజంలో మాననీయుడు గా వెలుగొందే వాడు. శ్రద్ధ ఉన్న వారికి విద్య లభిస్తుంది. అటువంటి శ్రద్ధను నేటి పిల్లలలో పాదుకొల్పిన బాధ్యత పెద్దలకు ఉంది. అశ్రద్ధకు జీవ జలాన్ని అందించే బాధ్యత ఎప్పటికీ గురువుదే. మన భారతావనిలో గురు స్థానాన్ని ఏది భర్తీ చేయలేదు
విలువైన కాలం
మనిషిగా జన్మనెత్తాం. బతుకుతున్నాం. కేవలం కాలం గడపటమే జీవితం కాదని మనకు తెలిసిఉండాలి. కాలం చాలా విలువైనది. పోగొట్టుకుంటే పొందలేనిది. కాలం విలువ గుర్తించినవారే విజయసోపానాలు అధిరోహించగలిగేది!
ఇద్దరు ఒకే రోజున, ఒకే సమయంలో పుట్టి ఉండవచ్చు. అయినా ఆ ఇద్దరికీ ఒకే విధమైన జీవితం, సమయం, అవకాశం లభించవు. కాలగమనంలో మేధావులు, మూర్ఖులు భూమి మీదకు వస్తారు. ఒకరు కాలంతో సంబంధం లేకుండా బతికితే, ఇంకొకరు కాలాన్ని దైవంగా భావించి విశ్వకల్యాణం కోసం అహర్నిశలూ తపిస్తారు.
నిత్యం మనం కాలంతో ప్రయాణం చేస్తూనే ఉంటాం. కాలంతో పోటీ పడుతుంటాం. కాలం తొందరగా జరిగిపోతుందని కొందరు బాధపడిపోతూ ఉంటారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండే కాలాన్ని చక్కగా విభజించుకుంటే నిద్ర లేకుండా పనిచేయవలసిన అవసరం ఉండదు.

కాలమే దైవం. జీవితాంతం కాలాన్ని సక్రమంగా వినియోగించుకోవడం తెలిస్తే ఎన్నో సాధించగలం. కాలాన్ని అర్థం చేసుకుంటే ఏ ఒక్క క్షణమూ వృథా చేసుకోం. ఎవరి సమయం వారికి మంచి మంచి అవకాశాలు ఇస్తుంది. భూమ్మీదకు ఒక మనిషి వచ్చినప్పుడే అతడి కాలనిర్ణయం జరుగుతుంది. ఆ కాలంలో ఉన్న ప్రకృతి సహా సర్వజీవులూ ఆ సమయానుగుణంగానే ప్రవర్తిస్తాయి. ఆయుష్షు గురించి ఆలోచన అనవసరం. అయితే గియితే కాలం నిరుపయోగం అవుతుందని బాధపడాలి.

కాలానుగుణంగా ప్రతి యుగంలో మార్పులుంటాయి. ధర్మం మారుతుంది. సంఘం మారుతుంది. మనిషి మారతాడు. విలువైన కాలగమనం మాత్రం మారదు. ఏ కాలానికి తగినట్లు ఆ కాలంలో వ్యవస్థ నడుస్తుంది.

కాలం చాలా గొప్పది. కాని దానికంటే ఆ కాలంలో జన్మించిన అవతార పురుషులు ఇంకా గొప్పవారు. అందుకే శ్రీరాముడి కాలంలో, శ్రీకృష్ణుడి కాలంలో అంటుంటారు. వారు కాలాన్ని ప్రభావితం చేశారు. కాలాన్ని దివ్యం చేశారు. కాలానికి ఒక చరిత్రను సృష్టించారు. వారి అవతార లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు.

ఒక్కోసారి కాలాన్ని మనం నడిపిస్తున్నామా, లేదా కాలమే మనల్ని నడిపిస్తుందా అనే మీమాంసకు గురి అవుతుంటాం. కాలాన్ని ఎవరూ నడిపించలేరు. కాలమే మన జీవితాలను మార్చిపారేస్తుంది. కాలమే పెను మార్పులకు గురిచేస్తుంది. కాలమే అనూహ్యమైన స్థితిలోకి మనల్ని నెట్టేసి చోద్యం చూస్తుంది. మనమొక లక్ష్యాన్ని గట్టిగా పట్టుకుని, జారిపోకుండా వెనకడుగు వేయకుండా ముందుకు ప్రయాణిస్తుంటే కాలం చేసిన సహాయానికి జోహార్లు అర్పించకుండా ఉండలేం.

దెబ్బ తగిలింది... మందు వేస్తాం. వెంటనే ఆ క్షణంలోనే నొప్పి మాయమైపోదు. దెబ్బ కనపడకుండా పోదు. చికిత్స చేస్తున్నా కొంత సమయం మనం ఆగాలి. అదే కాలం చేసే విచిత్రం. వైద్యశాస్త్రంలో కాలానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆయుర్వేదంలో కాలమూ చికిత్సలో భాగమే.

ప్రతి క్షణం మనం కాలంలోనే ఉంటూ కాలంతో సహజీవనం చేస్తూ ఉంటాం. చెడుకాలం, మంచి కాలమని మనిషి తనకు జరిగిన లాభనష్టాలను బట్టి విభజిస్తూ ఉంటాడు. నిజానికి కాలం నిమిత్తమాత్రం. మనం చేసే కృషిని బట్టే ఫలితాలు ఉంటాయి.

దైవాంశ సంభూతులం కాని మనం ధనం కన్నా, బంగారం కన్నా, ప్రాణం కన్నా కాలం విలువైనదిగా గుర్తించాలి. ఈ కాలాన్ని ఇతరులకు సహాయంకోసం, మంచి జీవనం కోసం, మానవత్వం నిలబెట్టడం కోసం ఉపయోగించుకోవాలి. అక్కడే ఉంది మన వివేకం. అదే నిజమైన ప్రజ్ఞ!
అహం

మానవుడిలో అంతశ్శత్రువులు ఆరు. వాటిలో మదం ఒకటి. ‘మదం’ అంటే అహం... దీన్ని విడిచిపెడితేనే మనకు ఆనందం లభ్యమవుతుంది. అహం మన చర్మచక్షువునే కాదు,అంతఃచక్షువులనూ మూసేస్తుంది. చిన్నా పెద్దా తారతమ్యాన్ని, వివేచన, విచక్షణలను హరిస్తుంది. మర్యాద రహితుల్ని చేస్తుంది. సత్యాన్ని చూడనీయదు, మాట్లాడనీయదు. అంతేకాదు- దాన్ని దరిదాపులకు చేరనీయక అడ్డుకుంటుంది. ధర్మాన్ని పాటింపనీయదు. మంచి, చెడుల్ని కాననీయదు. క్రోధాన్ని పెంచి ఆవేశపూరితంగా, ఆలోచనారహితంగా మాట్లాడేలా చేస్తుంది. మానవుడి సర్వభ్రష్టత్వానికి మూలమైనదీ శత్రువు.
అంతశ్శత్రువులను జయించి తాను ఆనందాన్ని పొంది అందరికీ దాన్ని పంచినవాడిగా వసిష్ఠుడు నిలుస్తాడు. ఆయన బ్రహ్మర్షిత్వానికే వన్నెతెచ్చి దానికి మరింత మహత్వాన్ని ఆపాదించినవాడు. అందుకు విరుద్ధంగా- అహాన్ని వీడక తపశ్శక్తులను, వివేచన, విచక్షణలను తన కోపాగ్ని కీలల్లో ఆహుతి చేసుకున్నవాడు విశ్వామిత్రుడు. అహం పుట్టించే మరిన్ని శత్రువుల్లో అత్యంత ప్రధానమైనది ‘క్రోధం’. కౌశికుడి వృత్తాంతం మనకు బోధపరచేదిదే.
అహాన్ని శరీరంలోని అణువునా పోషించి, పెద్ద చేసినవాడు దుర్యోధనుడు. అహం తెచ్చే దుర్గుణాల్లో మూర్ఖత్వమొకటి. పినతండ్రి తనయులకు రాజ్యభాగాన్ని ఇవ్వనన్నాడు. మూర్ఖత్వపు పొరలు కమ్మిన అతడి కళ్లు సత్యాన్ని, ధర్మాన్ని చూడనీయలేదు. వాటి గురించి ఆలోచించనీయలేదు. కడకు మహాసంగ్రామానికి హేతువై అపార జననష్టాన్ని కలిగించిన వాడయ్యాడు. ఎందరికో గర్భశోకం వాటిల్లజేశాడు.
అహాన్ని దరిదాపుల్లోకి రానివ్వకూడనివాడు గురువు. తనకున్న పాండిత్యం, బోధనా ప్రతిభ మరెవ్వరికీ లేదన్న ఆలోచన వచ్చిన ఉత్తర క్షణం- అతడు గురుపీఠానికి అనర్హుడు. తాను చెప్పిందే సరైనదనే గర్వంతో పాటు వినయ, విధేయతలకు దూరమవుతాడు. జ్ఞాన సముపార్జనలో వెనకంజ వేస్తాడు. కుశాగ్ర బుద్ధి, జ్ఞానపిపాస కలిగిన విద్యార్థి వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పే ఆలోచన చేయక అతడి ప్రశ్నలే అర్థరహితమంటాడు. అందువల్ల ఆ విద్యార్థి దృష్టిలో చులకనవుతాడు. పొందవలసినంత గౌరవాన్ని పొందలేడు. విద్య వల్ల మన సహజమైన వినయం మరింత శోభిల్లాలి. సుగంధాలను పరివ్యాప్తం చేయాలి.

సాధించిన విజయాలు మరింత ఉత్సాహాన్ని నింపాలి. ఆలోచన కొత్తపుంతలు తొక్కి మరిన్ని పనులను చేపట్టి, విజయం సాధించాలి. అలాగాక, అహం తలెత్తిందా తిరోగమనం మొదలైనట్లే. అది విద్యార్థికి, శాస్త్రవేత్తకు, ఆటగాడికి, ఒక లక్ష్యాన్ని చేరుకుని మరిన్ని లక్ష్యాలను చేరుకునే తపన కలిగిన ఎవరికైనా వర్తిస్తుంది.
అహం విడిచిన వేళ అంతా ప్రేమమయమే. అది మనల్ని సత్యశోధకులను, ప్రేమికులను చేస్తుంది. మన అవగాహనశక్తిని పెంచి, ఆలోచనాపరులను చేస్తుంది. శత్రుభావనను వీడేటట్లు చేసి అందర్నీ సమభావంతో చూసే ‘చూపు’నిస్తుంది. 
అహాన్ని వీడి జ్ఞానమనే మహాసముద్రంలో ఈదేవాడికే జీవితం లోతు తెలిసివస్తుంది. అది అతడికి ఒద్దికను నేర్పుతుంది. విధేయుణ్ని చేస్తుంది. జ్ఞాన పిపాసిగా ఉండనిస్తుంది. మోక్షసాధనా మార్గంలో పెద్ద ప్రతిబంధకం ఈ అహం.
అహాన్ని విడిచిన మనసు నిర్మలమవుతుంది. అప్పుడే అది భగవంతుడి సన్నిధిని చేరువ చేస్తుంది!
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
స్కాందపురాణంలో కార్తీక మాసం గొప్పదనం గురించి బ్రహ్మగారు నారదుడికి చెప్తారు. కార్తీక మాసానికి మరొక పేరు దామోదర మాసం. ఈ కార్తీకమాసానికి అధిదేవుడు దామోదరుడు. ఈ కార్తీక మాసంలో ఎవరు దామోదరుడుని(శ్రీకృష్ణ భగవాణుడు) ప్రతిరోజు అత్యంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, ప్రతిరోజు నేతితో చేసిన దీపంతో లక్ష్మీనాధుడిని ఆరాధిస్తారో, హరినామ స్మరణ చేస్తుంటారో, అటువంటివారికి ఇప్పటివరకు వారిని జన్మజన్మల యందు వెంటాడుతున్న దారిద్యం నశించి, అపారమైన భోగభాగ్యాలను, సిరిసంపదలను అపారంగా వర్షించటమేకాక, ఉత్కృష్టమైన మోక్షాన్ని అనుగ్రహింపచేస్తాడు శ్రీమన్నారాయణుడు.

కార్తీకమాసం ఎంతో పుణ్యప్రదమైన మాసం. మార్గశీర్ష మాసం తర్వాత అంత గొప్ప నెల ఏదైనా ఉంది అంటే అది కార్తీక మాసమే. దక్షణాయనంలో ఈ రెండు నెలలు పక్కపక్కనే వస్తాయి. ఈ రెండు నెలలో చేసే పూజలకు, దానాలకి ఎంతో గొప్ప ఫలితం ఉంటుంది. అంత గొప్పదైన ఈ కార్తీకమాసానికి అధిదేవుడు దామోదరుడు. అంటే తాడుచేత ఉదరమునకు (పొట్ట) కట్టబడిన కృష్ణుడు.

దామోదర లీల

కార్తీకమాసంలో ప్రతిరోజూ దామోదరలీలను, దామోదర అష్టకాన్ని పారాయణ చేయమంటారు పెద్ధలు. భాగవతంలో ఇది ఒక గొప్ప లీల. చిన్ని కృష్ణుడు వెన్న దొంగతనం చేస్తున్నాడని తల్లి యశోద, కృష్ణుడిని ఒకతాడుతో రోటికి కట్టాలని చూస్తుంది. కానీ తాడు సరిపోదు. మళ్ళీ కొంచెం పెద్ద తాడు కడుతుంది. అయినా సరిపోదు. ఆలా ఎంత తాడు తీసుకొచ్చిన అయన మాత్రం కట్టుబడట్లేదు. సమస్త బ్రహ్మాండాలు అయన కడుపులోనే ఉన్నాయని తెలియని ఆ గోపస్త్రీ అయన పరమాత్మ అన్న విషయం తెలియక ఆయన్ని కట్టేయాలని చూస్తుంది. చివరికి అమ్మ అవస్థని చూసిన భగవానుడు, ఆమె ప్రేమకి లొంగి ఒక రోటికి బంధింపబడ్డాడు.

ఈ లీల జరుగుతుంటే చతుర్ముఖ బ్రహ్మగారు, పార్వతీ సహితుడైన పరమశివుడు, 33 కోట్లమంది దేవతలు, ఋషులు ప్రచ్ఛన్న వేశాలలో నందుడి ఇంటి చుట్టూ తిరుగుతూ చూస్తున్నారు. ఈ కంటికి కనపడని పరమాత్మ, ఒక జాతకర్మ అంటే తెలియనివాడు, అండ, పిండ, బ్రహ్మాండాలను సృష్టించిన పరాత్పరుడు భక్తికి లొంగి ఒక ప్రాకృత బాలుడు వలె అమ్మకి బయపడుతున్నవాడిలా నటిస్తున్న కృష్ణపరమాత్మని ఒక రోటికి బంధించింది. వేదాలకు దొరకనివాడు, లక్ష్మీదేవి కౌగిటికి దొరకనివాడు, యోగుల మనస్సులకు దొరకనివాడు, ఈరోజు తల్లిప్రేమకు బంధీ అయ్యాడని, లోకంలో ఎవ్వరికీ ఇటువంటి వరాన్ని ఇవ్వనివాడు కేవలం ఈ గోపాలవనితకి ఇచ్చాడని దేవతలంతా ముక్కున వేలేసుకున్నారు. ఆలా రోటికి కట్టబడిన బాలకృష్ణుడు, రోటీని లాక్కుంటూ, లాక్కుంటూ ఎప్పటినుంచో నారదుని యొక్క శాపానికి గురై రెండు మద్ది చెట్లుగా పడి ఉన్న కుబేరుడి యొక్క కుమారుల శాప విమోచనం గావించి వారికి తిరిగి పునర్వైభవాన్ని అనుగ్రహించాడు బాలకృష్ణుడు. అటువంటి ఇంత గొప్ప లీల ఈ కార్తీక మాసంలోనే చేసాడు పరమాత్మ. ఇప్పటికీ సమాధి స్థితిలో ఉన్న మహాయోగులు, పీఠాధిపతులు సైతం ఈ లీలని ధ్యానం చేస్తూ ఉంటారు.

భాగవతంలో చెప్పబడిన ఇంతగొప్ప లీలని కార్తీకమాసమంతా పారాయణ చెయ్యడం, కార్తీక దామోదరుడికి నెయ్యిదీపంతో ఆరాధన చెయ్యడం, ప్రతిరోజు కొంచెం పాలని నైవేద్యంగా పెట్టడం, వీలనైంత సేపు కృష్ణ నామాన్ని జపించటం ద్వారా ఎన్నో జన్మలనుంచి అనుభవిస్తున్న దారిద్యం నశించి, సుఖ, సంతోషాలు, భోగభాగ్యాలని విశేషంగా అనుగ్రహిస్తాడు కృష్ణభగవానుడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పూర్వం ఇద్దరు రాజులు యుద్ధానికి దిగారు. ఓడిన రాజు తన రాజ్యాన్ని వీడి, అడవుల్లోకి పారిపోయాడు. అక్కడే ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతున్నాడు. గెలిచిన రాజు ఆ ఉత్సాహంతో యజ్ఞం తలపెట్టాడు. అనుకోకుండా, అక్కడ యాగధేనువు మరణించింది. అది అశుభ సూచన. యజ్ఞాన్ని ఎలా పూర్తిచేయాలో తెలియక ఆ రాజు తికమక పడ్డాడు. నగర పురోహితుల్ని సంప్రతిస్తే- ఆ ధర్మసూక్ష్మం తెలిసినవాడు ఓడిపోయిన రాజేనని తేలింది. ధర్మసంకటం నుంచి గట్టెక్కించగలవాడు ఆయనేనని నిశ్చయమైంది.

గెలిచిన రాజు ఏమాత్రం సందేహించకుండా ఓడిన రాజు వద్దకు వెళ్లి, యజ్ఞాన్ని పరిపూర్తి చేయాలని అర్థించాడు. ఆయనా ఏ శషభిషలకూ తావు లేకుండా ధర్మనిర్ణయం కోసం ముందుకొచ్చాడు. శత్రువుకు సహకరించాడు.

ఆ ఇద్దరు రాజులూ ఆర్షధర్మ నిర్వహణ విషయంలో అహంకారాల్ని త్యజించారు. వారి కథే- శ్రీకృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’లోని ‘ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం’ సారాంశం. సమాజం అనే ధర్మసౌధం పటిష్ఠంగా నిలిచేందుకు భారతీయ ప్రాచీన సాహిత్యం ఎంతగా తోడ్పడిందో, ఈ ఉదాహరణ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఈ కథలో ఓడిన రాజు ఖాండిక్యుడు; గెలిచినవాడు కేశిధ్వజుడు. కథ చివర గొప్ప మలుపు ఒకటుంది.

తన యజ్ఞ సంపూర్తికి సహకరించిన ఖాండిక్యుడికి గురుదక్షిణగా ఏది కావాలన్నా ఇస్తానని కేశిధ్వజుడు ప్రకటిస్తాడు. అది సంప్రదాయం. ఓడిన రాజుకు ఓర్మి ఎంత ప్రధానమో- గెలిచిన రాజుకు సంయమనం, ధర్మ సంప్రదాయ పరిరక్షణ అంతే అవసరం. ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్న ఖాండిక్యుడు తాను కోల్పోయిన రాజ్యం తిరిగి గురుదక్షిణగా కావాలన్నా ఇచ్చేయడానికి కేశిధ్వజుడు సిద్ధపడతాడు. ఇక్కడే ఓ చిత్రం చోటుచేసుకుంటుంది. రాజ్యసంపద అయాచితంగా వచ్చిపడుతున్నా ఖాండిక్యుడు కాదంటాడు! తనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని, అదే కేశిధ్వజుడి నుంచి తాను కోరుకునే గురుదక్షిణ అని ప్రకటిస్తాడు.

ఖాండిక్యుడి నిర్ణయం కేశిధ్వజుణ్ని విస్మయానికి గురిచేస్తుంది. ఆయన ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు ఖాండిక్యుడు అంటాడు- ‘రాజ్యభోగాలు కేవలం భౌతిక సంపదలు. వాటిని కష్టంతో, శారీరక శ్రమతో సాధించుకోవాలి. అంతేగాని, అవి అయాచితంగా లభించాలని కోరుకోకూడదు. కష్టపడి సాధిస్తేనే, వాటి విలువ తెలుస్తుంది. నా కంటే బలవంతుడి చేతిలో ఓడిపోయాను. అందులో సిగ్గు పడాల్సింది ఏముంటుంది? తిరిగి పుంజుకొని ధర్మమార్గంలో, క్షాత్రంతో నా రాజ్యాన్ని నేను తిరిగి చేజిక్కించుకోవాలి. అది ఒప్పుతుంది గాని, దొడ్డిదారిన పొందితే పాపమవుతుంది’ అని బదులిస్తాడు ఖాండిక్యుడు!

ఇలాంటి కథల్ని పిల్లలకు పాఠ్యాంశాలుగా నిర్ణయిస్తే, వారి బాల్యాన్ని అవి ధార్మిక పథంలోకి నడిపిస్తాయి. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. ఉచితాల కోసం తాపత్రయపడకుండా ఆపుతాయి. ఉచితానుచిత జ్ఞానాన్ని వారికి అలవరుస్తాయి.

ఆముక్తమాల్యదలోని ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం- ఆ కావ్యానికి గుండెకాయ వంటిదని ప్రశస్తి రావడానికి ముఖ్య కారణాలేమిటి? ఆ కథలోని ధార్మిక నేపథ్యం, ప్రబోధ గుణం. గెలుపు ఓటముల విషయంలో, కర్తవ్య నిర్వహణలో, అయాచిత అవకాశాల తిరస్కరణలో ప్రతిఫలించిన ధర్మస్వరూపమే- భారతీయతకు వన్నెలద్దుతూ వచ్చింది.

లోకంలో ఇలాంటి కథలు ఒళ్లు మరిపించడమే కాదు, కళ్లు తెరుచుకొనేలా చేస్తాయి. దీనికి మన ప్రాచీన సాహిత్యమే గొప్ప ఆదరువు.
🌺🙏🌺#లింగాష్టకం_యొక్క_అర్థం 🌺🙏🌺

1.బ్రహ్మ మురారి సురార్చిత లింగం
బ్రహ్మ , విష్ణు , దేవతల చేత పూజింపబడ్డ లింగం..!!

2.నిర్మల భాషిత శోభిత లింగం,
నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డ లింగం..!!

3.జన్మజ దుఃఖ వినాశక లింగం,
జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం..!!

4.తత్ ప్రణమామి సదా శివ లింగం,
ఓ సదా శివ లింగం నీకు నమస్కారం..!!
దేవముని ప్రవరార్చిత లింగందేవమునులు ,
మహా ఋషులు పూజింప లింగం..!!

5.కామదహన కరుణాకర లింగం,
మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను
చూపే చేతులు గల శివలింగం..!!

6.రావణ దర్ప వినాశక లింగం,
రావణుడి గర్వాన్ని నాశనం చేసినట్టి శివ లింగం..!!

7.తత్ ప్రణమామి సద శివ లింగం,
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

8.సర్వ సుగంధ సులేపిత లింగం,
అన్ని మంచి గంధాలు , మంచి గా పూసిన శివ
లింగం..!!

9.బుద్ధి వివర్ధన కారణ లింగం,
మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం ..!!

10.సిద్ధ సురాసుర వందిత లింగం,
సిద్ధులు , దేవతలు , రాక్షసుల చేత కీర్తింపబడ్డ
శివ లింగం..!!

11.తత్ ప్రణమామి సదా శివ లింగం,
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

12.కనక మహామణి భూషిత లింగం,
బంగారు , మహా మణుల చేత అలంకరింప బడ్డ శివ
లింగం..!!

13.ఫణిపతి వేష్టిత శోభిత లింగం,
నాగరాజు నివాసం చేత అలంకరింపబడ్డ శివ
లింగం..!!

14.దక్ష సుయజ్ఞ వినాశక లింగం,
దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివ
లింగం..!!

15.తత్ ప్రణమామి సదా శివ లింగం,
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

16.కుంకుమ చందన లేపిత లింగం,
కుంకుమ , గంధము పూయబడ్డ శివ
లింగం..!!

17.పంకజ హార సుశోభిత లింగం,
కలువల దండ చేత చక్కగా అలంకరింప బడ్డ శివ
లింగం..!!

18.సంచిత పాప వినాశక లింగం,
సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివ లింగం..!!

19.తత్ ప్రణమామి సదా శివ లింగం,
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

20.దేవగణార్చిత సేవిత లింగం,
దేవ గణాల చేత పూజింప బడ్డ , సేవించ బడ్డ శివ
లింగం..!!

21.భావైర్ భక్తీ భిరేవచ లింగం,
చక్కటి భావం తో కూడిన భక్తీ చేత పూజింప బడ్డ శివ
లింగం..!!

22.దినకర కోటి ప్రభాకర లింగం,
కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్య
బింబం లాంటి శివ లింగం..!!

23.తత్ ప్రణమామి సదా శివ లింగం,
నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!!

24.అష్ట దలోపరి వేష్టిత లింగం,
ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండే శివ
లింగం..!!

25.సర్వ సముద్భవ కారణ లింగం,
అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైన శివ
లింగం..!!

26.అష్ట దరిద్ర వినాశక లింగం,
ఎనిమిది రకాల దరిద్రాలను (అష్ట దరిద్రాలు) నాశనం చేసే
శివ లింగం..!!

27.తత్ ప్రణమామి సదా శివ లింగం,
నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!!

28.సురగురు సురవర పూజిత లింగం,
దేవ గురువు (బృహస్పతి), దేవతల చేత పూజింప
బడ్డ శివ లింగం..!!

29.సురవన పుష్ప సదార్చిత లింగం,
దేవతల తోటల్లో పూచే పువ్వులు (పారిజాతాలు) చేత
ఎప్పుడూ పూజింప బడే శివ లింగం..!!

30.పరమపదం పరమాత్మక లింగం,
ఓ శివ లింగమా, నీ సన్నిధి ఏ ఒక స్వర్గముతత్ ప్రణమామి
సదా శివ లింగంనీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ
లింగమా ..!!

31.లింగాష్టక మిదం పుణ్యం యః పట్టేత్ శివ సన్నిధౌ,
ఎప్పుడైతే శివుడి సన్నిధిలో చదవబడుతుందో , వారికి
చాలా పుణ్యం వస్తుంది..!!

32.శివ లోక మవాప్నోతి శివేన సహమోదతే,
శివ లోకం లభిస్తుంది ..!! శివుడి లో ఐక్యమయ్యే మార్గం దొరుకుతుంది🙏🙏
మారేడుగోప్పతనం

లక్ష్మీదేవి కుడిచేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను *శ్రీఫలము* అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది.


మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి, దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు.

మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగ పడుతుంది.
ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది. అందుకే

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం!

త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!!

అని తలుస్తాము.


దళములు దళములుగా ఉన్నవాటినే కోసి పూజ చేస్తారు. ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది.


అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది. అది మూడు, తొమ్మిది కూడా ఉంటాయి.


పుష్పములను పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి.


కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు.


మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు.అందులో మారేడు దళము ఒకటి.


మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనె శివలింగమునకు తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది.
అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యోగములు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉన్నా, మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకుని శివునికి పూజ చేసేవారు.

శివుడిని మారేడు దళంతో పూజ చేయగనే ఈశ్వరుడు *త్రియాయుషం* అంటాడట.

‘బాల్యం, యౌవనం, కౌమారం
ఈ మూడింటిని నీవు చూస్తావు’
అని ఆశీర్వదిస్తాడుట.

కాబట్టి

ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది.

శివుని మారేడు దళములతో పూజించే వ్యక్తీ మూడు గుణములకు అతీతుడు అవుతాడు.

మారేడు దళం శివలింగం మీద బోర్లాపడితే..జ్ఞానం సిద్ధిస్తుంది.

ఇంత శక్తి కలిగినది కాబట్టే దానికి *శ్రీసూక్తం* లో
*అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే*
(అమ్మా అలక్ష్మిని= దరిద్రమును పోగొట్టెదవుగాక) అని చెప్తాము.

మనిషికి మూడు గుణములు,
మూడు అవస్థలు ఉంటాయి.
నాల్గవదానిలోకి వెళ్ళడు.
నాల్గవది తురీయము.

*తురీయమే జ్ఞానావస్థ*

అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళముతో పూజ చేసిన వారికి వస్తుంది.

*మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే మూడు కోట్లమంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే*


ఇంట్లో మారేడు చెట్టు ఉంటే..


ఆ మారేడు చెట్టు క్రింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా.. అపారమయిన సిద్ధి కలుగుతుంది.
యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టుక్రింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి ..పీట వేసి .. ఆయనను అక్కడ కూర్చోపెట్టి ..భోజనం పెడితే ..అలా చేసిన వ్యక్తికి కోటిమందిని తీసుకువచ్చి ఏకకాలమునందు వంటచేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది.

శాస్త్రము మనకు లఘువులు నేర్పింది.

మారేడు చెట్టు అంత గొప్పది.

మారేడు చెట్టు మీదనుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది.

అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది.

‘మా-రేడు’ తెలుగులో
రాజు ప్రకృతి,
రేడు వికృతి.

*మారేడు అంటే మా రాజు*.
ఆ చెట్టు పరిపాలకురాలు.
అన్నిటినీ ఇవ్వగలదు.
ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు.
అది పువ్వు పూయవలసిన అవసరం లేదు.

ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా..మారేడు
పువ్వు పూయకుండా కాయ కాస్తుంది.

అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు.

అందుకే మీకు ఏది చేతనయినా కాకపోయినా ..మీ జీవితమును పండించుకోవడానికి, మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయములు శాస్త్రంలోచెప్పబడ్డాయి.అందులో


మొదటిది తప్పకుండా భస్మ ధారణ చేయడం,

రెండవది రుద్రాక్ష మెడలో వేసుకొనుట,

మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారయినా చేయుట.

ఈ మూడు పనులను ప్రతివ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు.◆◆◆
వేదాంతంలో కస్తూరీమృగం కధ చెబుతారు.కస్తూరీమృగం అంటే ఒక రకమైన జింక. సీజన్ వచ్చినపుడు దాని బొడ్డు నుంచి ఒక రకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది.అది మంచి మదపువాసనగా ఉంటుంది.అప్పుడు ఆ వాసన ఎక్కణ్ణించి వస్తున్నదా అని ఆ జింక వెదకడం మొదలుపెడుతుంది.ఆ వాసన తనవద్ద నుంచే వస్తున్నదని అది గ్రహించలేదు.ఆ అన్వేషణలో అలా అడవంతా తిరిగీ తిరిగీ చివరికి ఏదో ఒక పులి నోట్లో అది పడిపోతుంది. ప్రాణాలు కోల్పోతుంది.వేదాంత గ్రంధాలలో ఉన్న ఈ కధ అందరికీ తెలిసినదే.

మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా వ్యర్ధంగా ఇలాగే తిరుగుతూ ఉంటాడు.పుణ్యక్షేత్రాలనీ తీర్ధయాత్రలనీ అనవసరంగా తిరిగి డబ్బునీ కాలాన్నీ వృధా చేసుకుంటూ ఉంటాడు.నిజానికి వీటివల్ల పెద్దగా ఆధ్యాత్మిక ఉపయోగం అంటూ ఏమీ ఉండదు.
పాండవులు తీర్ధయాత్రలకు వెళుతూ కృష్ణుణ్ణి కూడా తోడు రమ్మని పిలుస్తారు.సాక్షాత్తు భగవంతుడైన కృష్ణునికి తీర్ధయాత్రల అవసరం ఏముంది? ఆ సంగతి మాయామోహితులైన పాండవులకు తెలియదు.కనుక కృష్ణుని కూడా తమలాగే మామూలు మానవుడిగా వారు భావించి తీర్ధయాత్రలకు రమ్మని ఆహ్వానిస్తారు.ఆయన చిరునవ్వు నవ్వి వారికొక దోసకాయ నిచ్చి 'నా ప్రతినిధిగా దీనిని తీసుకువెళ్ళి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనిని ముంచండి.'అని చెబుతాడు.వారు అలాగే చేసి తీర్ధయాత్రలు ముగించి తిరిగి వస్తారు.

అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి వారికి వడ్డింపచేస్తాడు కృష్ణుడు.ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది.

'అదేంటి బావా?ఇది చేదు దోసకాయ.కటికవిషంలాగా ఉంది.ఇలాంటి వంటకం చేయించావేమిటి?' అని వారు అడుగుతారు.

దానికి కృష్ణుడు నవ్వి.' బావా.ఎన్ని గంగలలో మునిగినా ఈ దోసకాయ చేదు పోలేదు చూచావా?' అంటాడు.

ఎన్ని తీర్ధయాత్రలు చేసినా,మనిషిలో మౌలికంగా ఎలాంటి మార్పూ రాదని కృష్ణుడు ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు.ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యం.

మనిషి ప్రయాణం బయటకు కాదు.లోపలకు జరగాలి.యాత్ర అనేది బయట కాదు.అంతరిక యాత్రను మనిషి చెయ్యాలి.ప్రపంచమంతా మనిషి తిరిగినా చివరకు ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేడు.అదే తనలోనికి తాను ప్రయాణం చేస్తే ఉన్న గదిలోనుంచి కదలకుండా జ్ఞానాన్ని పొందవచ్చు.పాతకాలపు మహర్షులు దేశాలు పట్టుకుని ఎప్పుడూ తిరగలేదు.ఒకచోట స్థిరంగా కూచుని తపస్సు చేశారు.జ్ఞానసిద్ధిని పొందారు.
Sahasra Sai:
కుమార షష్టి🌹

సుబ్రహ్మణ్యేశ్వర షష్టి సుబ్రహ్మణ్యారాధన అగ్ని ఉపాసనతోనే జరుగుతుందని శాస్త్రములు తెలియజేయుచున్నవి.

షణ్మతాలలో సుబ్రహ్మణ్యారాధన విధి సౌర, శాక్త, వైష్ణవ, గాణాపత్య, శైవములు. అయితే అగ్ని గర్భుడు అని పేరు అందుచే పంచాయతన పూజలో ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్య స్వామి వారి మూర్తి ఉండదు. అయితే దీపారాధన శివశాక్త్యాత్మకుడైన అగ్నిసంభవుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధించడం శుభమని వైదిక ధర్మం లో సుబ్రహ్మణ్యోపాసన చెప్పబడింది. ‘అహం’తత్వానికి ప్రతీక సుబ్రహ్మణ్యుడు. రహస్యంగా అందరిలోనూ ప్రకాశించే పరమాత్మ చైతన్యమిది కనుక ‘గుహ’ అన్నారు స్వామిని. శివతేజస్సు నుండి ఉద్భవించిన వాడు కనుక జ్ఞానతత్త్వం కలిగి ‘గురుగుహ’ అని స్వామికి నామం. అసలు స్వామి అనే మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడిదే. ఎందుచేతనంటే “దేవసేనాపతీ, శూరః, స్వామీ, గజముఖానుజః “ అని అర్ధంగా ఇవ్వబడినది.

పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I
అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా II
తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

పరమ పురుషుడు శివుడు లేక విష్ణువు. అవ్యక్త శక్తి ఉమాదేవి లేక లక్ష్మీదేవి. వీరిరువురి సమైక్య సమన్వయ తత్వమూర్తి కుమారస్వామి అని స్కాంద పురాణం చెబుతోంది.
అంటే కుమారస్వామిని పూజిస్తే శివశక్తుల్నీ, లక్ష్మీనారాయణులనీ కలిపి అర్చించినట్లే. ప్రబ్రహ్మతపోనిర్మితమైన శరవణం (రెల్లు తుప్ప) లోంచి ఉద్భవించినవాడు కనుక శరవణభవుడు అయ్యాడు.

కాలస్వరూపం:

వేదాలలో షణ్ముఖీయమైన సంవత్సర స్వరూపంగా స్వామిని వర్ణించారు. కాలాగ్ని స్వరూపమే ఇది. కాలాగ్నిరుద్రుడైన శివుని తేజమే ఈ సంవత్సరాగ్ని. ఆరు ముఖాలు – ఆరు ఋతువులు. పన్నెండు చేతులు – పన్నెండు మాసాలు. ఇదీ సంవత్సరాగ్ని రూపం. ఈ రూపం చిత్రాగ్ని అనే నెమలిపై ఆసీనమయ్యింది. వివిధ వర్ణాలను వెదజల్లే కాంతి పుంజమే ఈ నెమలి.

జ్ఞానస్వరూపుడుః

సుబ్రహ్మణ్యస్వామి వారు రాసిభూతమైన జ్ఞానస్వరూపం. సునిసితమైన మేధస్సుకు స్వామి వారి చేతిలో ఉండే శక్తి ఆయుధమే ప్రతీక. శివజ్ఞానప్రదాయిని అయిన అమ్మవారు ప్రసాదించిన దివ్యాయుధమిది. ఇదే అజ్ఞానమనే తారకాసురుని సంహరించిన జ్ఞానశక్త్యాయుధము. “జ్ఞానశక్త్యాత్మా” అనేది స్వామి వారి నామాలలో ఒకటి. ఇఛ్చా, జ్ఞాన, క్రియా అనేమూడు శక్తుల మయమైన శక్తిని ధరించిన జ్ఞానశక్తి స్వరూపుడు, జ్ఞానయోగంలో సాక్షాత్కరించే శివశక్త్యాత్మక తేజః పుంజం – కుమారస్వామి. ఆరుకోణాల చక్రం – బహుముఖీయమైన ప్రజ్ఞకు సంకేతం కనుక కవిత్వానికీ, ప్రతిభకీ, ఆధారశక్తిగా కూడా కుమారస్వామి ఉపాసన చెప్పబడినది. “షణ్ముఖీ ప్రతిభ” ప్రసాదించే ఈ కార్తికేయుని ‘కవి’గా పేర్కొన్నాయి శాస్త్రాలు.“పుట్టన్ బుట్ట శరంబునన్ మొలువ” అనే పద్యంలో పోతన గారు…”కావ్య రచనా సామర్ధ్యానికి నేను వాల్మీకిని కాను (పుట్టన్ బుట్ట), శరవణభవుణ్ణి కాను (శరంబునన్ మొలువ)” అంటూ ప్రార్ధించారు. కార్తికేయ భక్తులు ఇహలోకంలో ఆయుష్మంతులై పుత్రపౌత్రులతో వర్ధిల్లి అంత్యమున స్కంద సాలోక్యాన్ని పొందుతారు. ఓ రామా! ఈ కుమారసంభవం “ధన్యపుణ్యగాథ” అని విశ్వామిత్రుని మాట (వాల్మీకి రామాయణం – బాలకాండ).

ఏషతే రామ గంగాయా విస్తరోమయా I
కుమారసంభవశ్చైవధన్యం పుణ్యస్తథైవ చ II
భక్తశ్చయః కార్తికేయే కాకుత్ స్థ భువిమానవాః I
ఆయుష్మాన్ పుత్రపౌత్రశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్ II

మహాభారతంలో కూడా ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి వారి జనన గాథ, తారకాసుర సంహారం అద్భుతంగా వర్ణించారు వ్యాసమహర్షి. ధర్మరాజుగారికి మార్కండేయ మహర్షి చెప్తారు సుబ్రహ్మణ్య జనన వైభవం గురించి. ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అటు శ్రీరామాయణం లోనూ, ఇటు మహాభారతంలోనూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననం గురించి ఇవ్వడంలో రహస్యం సాధకులగా మనం గురువుల నుంచి తెలుసుకోవలసిన విషయం. రామాయణం లో రామచంద్రప్రభువుకి స్కందోత్పత్తి చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటంటే, సుబ్రహ్మణ్యుడి యొక్క శక్తి రాముడిలో ప్రవేశించాలి. అది రావణ సంహారమునకు అవసరము. దేవతలకు రాక్షసులకు, మంచికి చెడుకి, రాముడికి-రావణుడికి, పాండవులకి-కౌరవులకి మధ్య జరిగే యుధ్ధములలో దేవతా సైన్యం విజయం సాధించాలంటే, దేవసేనాపతి అయిన సుబ్రహ్మణ్య స్వామి వారి శక్తి అవసరము. ఇక్కడ ఇలా చెప్పడంలో రాముడిని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు…అసలు విషయం ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి వారు యజ్ఞ తత్వమునకు ప్రతీక, అలాగే శ్రీ మహావిష్ణువు కూడా యజ్ఞపురుషుడిగానూ, యజ్ఞతత్వమునకు ప్రతీక గానూ విష్ణు సహస్ర నామాలలో అభివర్ణించబడినది. అందులోనే శ్రీమహావిష్ణువుకి “స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః” అనే నామాలు ఉన్నాయి, అంటే స్కందుడు అన్నా, సుబ్రహ్మణ్యుడు అన్నా, మహావిష్ణువు అన్నా ఒకటే తత్వం అని అర్ధం. మరి విష్ణువే రాముడు కదా, ఆయనకి విశ్వామిత్ర మహర్షి సుబ్రహ్మణ్య తత్వం బోధించడంలో ఏమిటి రహస్యం అంటే రాముడు అవతార ప్రయోజనం కోసం సాధారణ మానవుడిగా వచ్చాడు, అప్పుడు ఆయన రావణ సంహారం చేయడానికి అవసరమైన సకల అస్త్ర శస్త్రములతో పాటుగా, యుధ్ధ వీరుడైన సుబ్రహ్మణ్యుని శక్తిని కూడా రాముడిలో
ప్రవేశ పెట్టడ

మే విశ్వామిత్రుల వారి ఆంతర్యము. ఇదే విషయం భారతంలో ధర్మరాజు గారికి సుబ్రహ్మణ్య వైభవం, తారకాసుర సంహారం చెప్పబడడలోనూ వర్తిసుంది.”కుమారసంభవం”. మహాకవి కాళిదాసు గారు రచించిన ఈ కుమారసంభవం మొత్తం ఎక్కడ చూసినా సుబ్రహ్మణ్యుడి ప్రసక్తి ఉండదు. కేవలం శివ పార్వతుల కళ్యాణ ఘట్టం వరకు చెప్పి ముగిస్తారు కాళిదాసు. శివ పార్వతుల ఏకత్వమే కుమారుని సంభవం. లక్ష శ్లోకాలు ఉన్న పురాణం స్కాందపురాణం. ఈ పురాణం పరమశివుడి నుంచి స్కందుడు విన్నాడు, అందుకే స్కాంద పురాణం అయ్యింది. తంత్ర శాస్త్రంలో కూడా వివిధ సుబ్రహ్మణ్య స్వరూపాలు చెప్పబడ్డాయి.

ఉత్థిత కుండలినీ శక్తికి ప్రతీకగా సుబ్రహ్మణ్యుడిని సర్పరూపంలో ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామి వారి ఇద్దరు భార్యలు అంటే ఇక్కడ లౌకికమైన భార్యలు అని కాదు. వల్లీ అమ్మ వారు కుండలినీ శక్తికి ప్రతీక. ఆ శక్తి చలనానికి ఆగమనంలో ప్రాకే నాదశక్తికి ప్రతీక వల్లీ అమ్మ. మనందరిలోనూ కుండలినీ శక్తి మూడున్నర అడుగుల చుట్ట చుట్టుకుని మూలాధార చక్రము నందు ఉంటుంది. అయితే ఆ కుందలినీశక్తిని కదపడం అనేది కేవలం సమర్ధుడైన గురువు పర్యవేక్షణలో చేయాలి.
సర్వం శ్రీ సుబ్రహ్మణ్య అర్పణమస్థు🌹
🙏🙏🙏🙏🙏🙏
Do not miss to the see 👆
కలశంపై కొబ్బరికాయ ఎందుకు?
మన సంప్రదాయంలో వ్రతాల వంటివి చేసే సందర్భంలో ఏర్పాటు చేసే కలశం ఈ సృష్టికి ప్రతీక. ‘‘కలశస్య ముఖే విష్ణుః..’’ ఇత్యాది మంత్రాలు ఈ విషయాన్ని వివరిస్తున్నాయి. కలశంపై అమర్చే కొబ్బరికాయ కూడా బ్రహ్మాండానికి సంకేతం. కొబ్బరికాయ పూర్ణఫలం. అదే కాయ, అదే విత్తనం కూడా! మనం అర్చించే దైవం సృష్టిలో అంతటా నిండి ఉన్నాడని, అంతటా ఉన్న పరమాత్మకు ప్రతీకగా ఏదో ప్రతిమను మనం ఏర్పాటు చేసుకున్నామని కొబ్బరికాయ అమర్చిన కలశం తెలియచేస్తోంది. వ్రతపరిసమాప్తి తర్వాత వినియోగించిన అన్ని పూజాద్రవ్యాలతోపాటు కలశంపై కొబ్బరికాయను కూడ నిమజ్జనం చేయాలి.
లాలనుచు నూచేరు లలనలిరుగడల -బాలగండవీర గోపాలబాల

ఉదుట గుబ్బల సరసము లుయ్యాల లూగ -పదరి కంకణరవము బహుగతులమ్రోగ వొదిగి చెంపల కొప్పు లొక్కింత వీగ -ముదురు చెమటల నళికములు తొప్పదోగ

మలయ మారుత గతులు మాటికి జెలంగ -పలుకు గపురపు తావి పైపై మెలంగ పలుగానలహరి యింపుల రాల్గరంగా - బలసి వినువారి చెవి బడలిక దొలంగ

లలనా జనాపాంగ లలిత సుమచాప -జలజలోచన దేవ సద్గుణ కలాప తలపు లోపల మెలగు తత్వప్రదీప -భళిర గండపరేశ పరమాత్మరూప
సోమవతి అమావాస్య అంటే
ఆ రోజు ఏం చేయాలి

శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇక ఆ సోమవారమూ, అమావాస్య కలసి వచ్చే రోజే ‘సోమవతి అమావాస్య’. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. మరి ఆ రోజు వెనుక ఉన్న కథ ఏమిటో, ఆనాడు ఏం చేయాలో పెద్దలు చెబుతున్న మాటలు విందాం…

దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే! తన అల్లుడైన శివుని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని కూడా అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించివేసుకుంది.

సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు. ప్రమథగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడిచేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చినవారందరినీ చావచితకబాదాడు. శివగణాల చేతిలో చావుదెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు. అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగినశాస్తిని అనుభవించాడు.

నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోళాశంకరుని మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారంనాడు అమావాస్య తిథి కూడా ఉన్నదనీ... ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడు.

శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం, అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి... తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని ‘సోమవతి అమావాస్య’ పేరుతో పిలవడం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు.

సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇందుకోసం తలార స్నానం చేసి శివుని పంచామృతాలతోనూ, జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు. ఇలా అభిషేకించిన శివుని బిల్వపత్రాలతో పూజించి, శివ స్తోత్రాలతో కొలిస్తే... సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరిసంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ పూజ పంచారామాలలో కానీ, రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట. ఏదీ కుదరకపోతే కనీసం శివపంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని చెబుతున్నారు.