Devotional Telugu
3.46K subscribers
106 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
ఇంక వరగర్వంతో హిరణ్య కశిపుడు విజృంభించాడు. దేవతలను జయించాడు. ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించాడు.పంచభూతాలను నిర్బంధించాడు. తపసులను భంగ పరచాడు. సాధులను హింసింపసాగాడు. దేవతలు విష్ణువుతో మొరపెట్టుకొనగా విష్ణువు - "కన్నకొడుకునకు ఆపన్నత తలపెట్టిననాడు హిరణ్యకశిపుని పట్టి వధింతును. మీకు భద్రమగును" - అని వారికి అభయమిచ్చాడు.

ప్రహ్లాదుడు
ముఖ్య వ్యాసము: భక్త ప్రహ్లాదుడు

హిరణ్యకశిపుడు తపసు చేసుకొనే కాలంలో దేవతలు అదనుచూసుకొని అతనిరాజ్యంపై దండెత్తి కౄరంగా కొల్లగొట్టారు. గర్భవతియైన రాక్షసరాజు భార్యను ఇంద్రుడు చెరపట్టగా నారదుడు ఇంద్రుని మందలించి, ఆమెను రక్షించి తన ఆశ్రమానికి కొనిపోయాడు. ఆశ్రమంలో నారదుడొనర్చిన భాగవత తత్వబోధను గర్భస్థుడైన ప్రహ్లాదుడు గ్రహించాడు. రాజ్యానికి తిరిగివచ్చిన హిరణ్యకశిపునకు నారదుడు అతని ధర్మపత్ని నప్పగించాడు.

ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు. లలిత మర్యాదుడు. నిర్వైరుడు. అచ్యుతపద శరణాగతుడు. అడుగడుగున మాధవానుచింతనా సుధా మాధుర్యమున మేను మరచువాడు. సర్వభూతములందు సమభావము గలవాడు. సుగుణములరాశి. అట్టి ప్రహ్లాదునకు విద్య నేర్పమని, తమ రాజప్రవృత్తికి అనుగుణంగా మలచమనీ రాక్షసరాజు తమ కులగురువులైన చండామార్కులకప్పగించాడు.

చదవనివాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గలుగున్
చదువగ వలయును జనులకు
చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ

అని కొడుకునకు బోధించి గురుకులమునకు పంపాడు. ఈ బాలకునకు చదువుచెప్పి నీతికుశలుని గావించి, రక్షించమని గురువులను ప్రార్థించాడు.గురుకులంలో ప్రహ్లాదుడు గురువులపట్ల వినయంతో వారుచెప్పిన విషయాలను చెప్పినట్లు ఆకళించుకొన్నాడు.

చదువులలో మర్మం
ఒకమారు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చేరబిలచి - నీవు ఏమి నేర్చుకున్నావు? నీకు ఏది భద్రము?- అని ప్రశ్నించగా ప్రహ్లాదుడు "సర్వము అతని దివ్యకళామయము అని తలచి విష్ణువు నందు హృదయము లగ్నము చేయట మేలు" అని ఉత్తరమిచ్చాడు. రాక్షసులకు తగని ఈ బుద్ధి నీకెలా పుట్టింది? హరీ, గిరీ అని ఎందుకు ప్రేలుతున్నావు? అని తండ్రి గద్దించాడు. ఆందుకు ప్రహ్లాదుడు

మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే మదనములకు?
నిర్మల మందాకినీ వీచికల దూగు
రాయంచ చనునె తరంగిణులకు?
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు
కోయిల సేరునే కుటజములకు?
అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పాన విశేష మత్త
చిత్తమేరీతి నితరంబు జేరనేర్చు
వినుత గుణశీల మాటలు వేయునేల?
విష్ణు భక్తి నాకు దైవయోగం వల్ల సహజంగా సంభవించింది. అని జవాబిచ్చాడు.

కోపించిన రాక్షస రాజుకు సర్దిచెప్పి, మరల వివిధోపాయాలలో బోధన చేస్తామని ప్రహ్లాదుని గురుకులానికి తీసుకొని వెళ్ళారు గురువులు. అక్కడ మళ్ళీ ప్రహ్లాదునికి తమ విద్యలు నూరిపోసి, రాజువద్దకు తిరిగి తీసికొని వెళ్ళారు. రాజు తన కొడుకును ముద్దుచేసి - "గురువులే సంవిద్యాంశంబులు జెప్పిరో, విద్యా సారమెరుంగకోరెద, భవదీయోత్కర్షమున్ జూపవే ననుగన్న తండ్రీ" -అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు

చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్ధ ముఖ్య శాస్త్రంబులు
నే చదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ! - అని చెప్పెను.
మరి ఆ మర్మమమేమిటి? "తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనంబను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి సజ్జనుడై యుండుట భద్రము. శ్రీహరి భక్తిలేని బ్రతుకు వ్యర్ధము. విష్ణుని సేవించు దేహమే ప్రయోజనకరము. ఆ దేవదేవుని గూర్చి చెప్పేదే సత్యమైన చదువు. మాధవుని గూర్చి చెప్పేవాడే సరైన గురువు. హరిని చేరుమని చెప్పేవాడే ఉత్తముడైన తండ్రి." - అని వివరించాడు.

ఏడీ విష్ణువు?
హిరణ్య కశిపుడు మండి పడ్డాడు. తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని ఆదేశించాడు. కాని శూలాలతో పొడిచినా, ఏనుగులతో తొక్కించినా, మంటల్లో కాల్చినా, కొండలపైనుండి త్రోయించినా ప్రహ్లాదునకు బాధ కలుగలేదు. అతడు హరినామ స్మరణ మానలేదు. అదిచూసి రాజు చింతాక్రాంతుడయ్యాడు. మరొక అవకాశం అడిగి రాక్షసగురువు ప్రహ్లాదుని గురుకులానికి తీసికొనివెళ్ళారు. అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలురకు ఆత్మజ్ఞానాన్ని, హరితత్వాన్ని, మోక్షమార్గాన్ని ఉపదేశించసాగాడు. ఇలా లాభం లేదని గురువు రాజుతో మొరపెట్టుకున్నాడు.

క్రోధంతో హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని పిలిపించి - నేనంటే సకల భూతాలు భయపడతాయి. దిక్పాలకులు నా సేవకులు? ఇక నీకు దిక్కెవరు? బలమెవరు? అని గద్దించాడు. అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో ఆ విభుడే నాకు దిక్కన్నాడు ప్రహ్లాదుడు.

ఆ హరి ఎక్కడుంటాడు? అని దానవేశ్వరుడు ప్రశ్నించగా

కలడంబోధి కలండు గాలి గలడాకాశంబునన్ గుంభినిన్
గలడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
గలడోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులం దంతటన్
గలడీశుండు గలండు తండ్రి! వెదుకంగా నేల యీ యా యెడన్? - అన్నాడు బాలుడు.
ఇంకా "చక్రి సర్వోపగతుడు. ఎందెందు వెదకి జూచిన నందందే గలడు" అని చెప్పాడు.
హరి సర్వాకృతులన్ గలండనుచు ప్రహ్లాదుండు భాషింప స
త్వరుడై ఎందును లేడు లేడని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ
నరసింహాకృతినుండె నచ్యుతుడు నానా జంగమ స్థావరో
త్కర గర్భంబుల నన్ని దేశముల నుద్ధండ ప్రభావంబుతోన్
ఇలా దైత్యరాజు, అతని సుతుడు వాదించుకొటుండగా శ్రీహరి సకల జడ,చేతన పదార్ధములలో శ్రీ నరసింహాకృతిలో నుండెను (సర్వాంతర్యామిత్వం)

అయితే "ఈ స్తంభమునన్ జూపగలవె చక్రిన్ గిక్రిన్?" అని రాజు ప్రశ్నించాడు. "బ్రహ్మ నుండి గడ్డిపోచవరకు అన్నింటిలో విశ్వాత్ముడైయుండేవాడు ఈ స్తంభమునందెందుకుండడు? స్తంభాంతర్గతుడై ఉండును. ఏ సందేహములేదు. నేడు గానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్" అన్నాడా పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు. "సరే. చూద్దాం. ఈ స్తంభంలో విష్ణువును చూపకుంటే నీ తలతీయిస్తాను. అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా?" అని హిరణ్యకశిపుడు చేతితో స్తంభంపై చరిచాడు.

శ్రీ నరసింహావిర్భావం
బ్రహ్మాండ కటాహం బ్రద్దలయ్యే ఛటఛట ఫటఫటారావములు ధ్వనించాయి. పదిదిక్కుల నిప్పులు చెదిరాయి. "

ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును, చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీ గణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర కటిప్రదేశుండును, .......... కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును, వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును, ధగధ్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును, ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయుండును, ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును, మహాప్రభావుండును నైన శ్రీనృసింహదేవుడు" స్తంభమునుండి ఆవిర్భవించాడు.

ఇది నరమూర్తికాదు, కేవల హరిమూర్తియు కాదు. హరిమాయా రచితమై యున్నదను కొన్నాడు హిరణ్య కశిపుడు. అప్పుడు శ్రీ నృసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తనయొడిలో వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో (గోళ్లతో)చీల్చి చెండాడాడు.

ఇలా శ్రీహరి (మనిషీ, జంతువూ కాక)నారసింహుని రూపంలో, (పగలూ, రాత్రీ కాని) సంధ్యాకాలంలో, (ప్రాణం ఉన్నవీ లేనివీ అని చెప్పలేని) గోళ్ళతో, (ఇంటా బయటా కాక) గుమ్మంలో, (భూమిపైనా, ఆకాశంలో కాక) తనతొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు. బ్రహ్మ వరము వ్యర్ధం కాలేదు. ప్రహ్లాదుని మాట పొల్లు పోలేదు.

భక్త పాలన

హిరణ్యాకశిపుని చంపుతున్న నరసింహ అవతారము
స్వామి ముఖం భీకరంగా కనపిస్తోంది. రక్తరంజితమైన వజ్రనఖాలు సంధ్యాకాలపు ఎర్రదనాన్ని సంతరించుకొన్నాయి. ప్రేవులను కంఠమాలికలుగా వేసుకొన్నాడు. జూలునుండి రక్తం కారుతోంది. ఆయన నిట్టూర్పులు పెనుగాలుల్లా ఉన్నాయి. దేవతలు ఆయనపై పుష్పవర్షాన్ని కురిపించారు. సకలదేవతలు స్తుతించి ప్రణతులు అర్పించారు.

మహాభాగవతుడైన ప్రహ్లాదుడు ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చిన స్వామికి అంజలి ఘటించి సాష్టాంగ ప్రమాణం చేశాడు. శ్రీనారసింహస్వామి తన అభయ మంగళ దివ్య హస్తాన్ని ప్రహ్లాదుని తలపైనుంచి దీవించాడు. ప్రహ్లాదుడు పరవశించి పలువిధాల స్తుతించాడు. ప్రసన్నుడైన స్వామి ఏమయినా వరాన్ని కోరుకొమ్మన్నాడు.

"స్వామీ! నా తండ్రి చేసిన భాగవతాపరాధాన్ని మన్నించు" అని కోరాడు ప్రహ్లాదుడు. "నాయనా. నిన్ను కొడుకుగా పొందినపుడే నీ తండ్రితో 21 తరాలు (తల్లివైపు 7 తరాలు, తండ్రివైపు 7 తరాలు, ప్రహ్లాదుని తరువాతి 7 తరాలు)పావనమైనాయి. నా స్పర్శతో నీ తండ్రి పునీతుడైనాడు. నీ తండ్రికి ఉత్తర క్రియలు చేసి రాజువుకా. నా యందు మనసు నిలిపి, విజ్ఞుల ఉపదేశాన్ని పొందుతూ పాలన చేయి" అని ఆశీర్వదించాడు స్వామి.

శంకరుడు, బ్రహ్మాది దేవతలు శ్రీనారసింహుని ప్రస్తుతించారు. "దేవ దేవా! నీ నృసింహావతారాన్ని నిష్ఠతో ధ్యానించేవారికి యమునిగురించిన భయముండదు" అన్నాడు బ్రహ్మ. శ్రీలక్ష్మీ సమేతుడై స్వామి వైకుంఠమునకరిగెను. బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుని పూజలందుకొని తమలోకములకరిగిరి.

ఈ అవతారాన్ని గురించి ధర్మరాజునకు చెబుతూ నారదుడిలా అన్నాడు.

శ్రీ రమణీయమైన నరసింహ విహారము నింద్రశత్రు సం
హారము బుణ్య భాగవతుడైన నిశాచరనాధ పుత్ర సం
చారము నెవ్వడైన సువిచారత విన్న పఠించినన్ శుభా
కారము తోడ నే భయము గల్గని లోకము జెందు భూవరా!
విస్తృతంగా పూజింపబడే నరసింహ స్వామి చిత్రాలలో ఒకటి. ఒడిలో లక్ష్మీదేవి. ఎదురుగా ప్రార్థిస్తున్న ప్రహ్లాదుడు. ఇరుప్రక్కలా విష్ణు భక్తులు. పైన ఆదిశేషుడు.
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ |
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 1 ||

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ |
రావణ దర్ప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 2 ||

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్ |
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 3 ||

కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ |
దక్ష సుయఙ్ఞ నినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 4 ||

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్ |
సంచిత పాప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 5 ||

దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ |
దినకర కోటి ప్రభాకర లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 6 ||

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్ |
అష్టదరిద్ర వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 7 ||

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్ |
పరాత్పరం పరమాత్మక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 8 ||

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||
ఒక మంచి కథ

ఒక పర్యాయం విక్రమాదిత్య మహారాజు తన సైనికులతోను, మంత్రితోను కలిసి వేటకై అడవికి వెళ్ళాడు. వేటాడుతూ వేటాడుతూ అడవిలో ఒకరికొకరు దూరమైనారు.

ఒకచోట చెట్టు క్రింద నీడలో అంధుడు, వృద్ధుడు అయిన ఒక సాధువు కూర్చొని ఉండగా చూచి విక్రమాదిత్యుడు *'సాధు మహరాజ్, ఇటువైపుగా ఎవరైనా ఇంతకుముందు వెళ్ళారా!'* అని అడిగాడు.

ఆ అంధ సాధువు ఇలా అన్నాడు: 'మహారాజా! అందరికంటే ముందు మీ సేవకుడు వెళ్ళాడు. అతని వెనుక మీ సేనా నాయకుడొకడు వెళ్ళాడు. సేనానాయకుని తరువాత మీ మంత్రి కూడా ఇంతకుముందే వెళ్ళాడు'

అంధుడైన ఆ సాధువు చెప్పిన సమాధానం విని విక్రమాదిత్యుడు ఆశ్చర్యంతో, ఆసక్తితో 'మహాత్మా! మీకు నేత్రాలు కనిపించవు కదా! నా సేవకుడు, సేనానాయకుడు, మంత్రి ఇక్కడినుండి ఇప్పుడే వెళ్లినట్లు ఎలా గ్రహించారు? నేను రాజునైనట్లు కూడా ఎలా కనుగొన్నారు?'

అంధుడైన సాధువు ఇలా చెప్పాడు: 'మహారాజా! నేనా ముగ్గురినీ, మిమ్ములను మీ మాటలు విని కనిపెట్టాను. అందరికంటే ముందు సేవకుడు వచ్చి నాతో, "ఏమిరా, గుడ్డివాడా! ఇటు ఎవరైనా వచ్చారా?" అని అడిగాడు. కొంతసేపటికి సేనానాయకుడు వచ్చి, "సూర్ దాస్, ఇటు ఎవరైనా వెళ్ళారా?"అని అడిగాడు.
చివరకు మీ మంత్రి వచ్చి 'సూర్ దాస్ జీ ఇటు ఎవరైనా వెళ్ళారా?'అని అడిగారు
మీరు వచ్చి 'సాధు మహరాజ్! ఇటు ఎవరైనా బాటసారి వచ్చి వెళ్ళాడా? అని అడిగారు.
"మహారాజా! ఒక వ్యక్తి యొక్క వాక్కు ద్వారా అతని పదవి, అతని ప్రతిష్ఠ ఏమిటో గుర్తించవచ్చు"

తల విలువ నోరు చెపుతుంది చెపుతుంది
Forwarded from utubebot
Vedic Mantras to Gain WillPower and Conf.mp3
22.4 MB
Vedic Mantras to Gain WillPower and Confidence | Must Listen.mp3 (22.36MB)
Forwarded from utubebot
Audio
Vinayaka Nee Murthike Ma Modhati Pranamam.mp3 (11.63MB)
Forwarded from utubebot
Hanuman Chalisa by MS Rama Rao in Telugu.mp3
20.3 MB
Hanuman Chalisa by MS Rama Rao in Telugu.mp3 (20.27MB)
Forwarded from utubebot
Audio
MS Rama Rao Telugu Hanuman Chalisa
కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. యుద్ధంలో పాండవులదే పైచేయిగా నిలిచింది. కానీ శత్రుసమూహంలోని ఎందరినో తన స్వహస్తాలతో చంపానన్న బాధ మాత్రం ధర్మరాజులో ఉండిపోయింది. ఎవరు ఎంతగా చెప్పినా కూడా ఆయన మనసులోని ఆ దుగ్ధ తీరలేదు. దాంతో స్వయంగా వేదవ్యాసుడే ధర్మరాజుని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ‘దర్మరాజా ఎవరి ధర్మాన్ని వారు పాటించినప్పుడే ఈ లోకం సుభిక్షంగా ఉంటుంది. అందుకు ఉదాహరణగా సుద్యుమ్నుడు అనే ఒక రాజు పాలనలో జరిగిన కథ చెబుతాను విను,’ అంటూ ఇలా చెప్పసాగాడు...

 

పూర్వం శంఖుడు, లిఖితుడు అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. వాళ్లు ఇద్దరూ కూడా గొప్ప తపస్సంపన్నులే! త్రికరణ శుద్ధిగా ధర్మానికి కట్టుబడినవారే! వారిద్దరూ కూడా బహుదానదీ తీరంలో ఆశ్రమాలను నిర్మించుకుని జీవిస్తున్నారు. ఒకరోజు లిఖితుడు తన అన్నగారి ఆశ్రమంలోకి అడుగుపెట్టాడు. ఆ సమయంలో శంఖుడు ఆశ్రమంలో లేడు. అన్నగారి కోసం వేచిచూస్తూ లిఖితుడు అక్కడక్కడే పచార్లు చేయసాగాడు. ఇంతలో అతని దృష్టి ఆశ్రమంలో విరగకాసిన పండ్లచెట్టు మీదకు పోయింది. నిగనిగలాడిపోతున్న ఆ పళ్లని చూడగానే అతనికి నోరూరింది. వెంటనే కాసిన పళ్లని కోసుకున తినసాగాడు.

 

ఇంతలో శంఖుడు ఆశ్రమంలోకి రానేవచ్చాడు. తమ్ముడి చేతిలో ఉన్న పళ్లని చూసి ‘అవెక్కడివని’ అడిగాడు. ‘నీ ఆశ్రమంలోనివే!’ అంటూ లిఖితుడు బదులు చెప్పాడు. ‘సోదరా! మునివర్యులకు పరధనం మీద ఆశ ఉండకూడదు కదా! పైగా నా అనుమతి లేకుండా ఆశ్రమంలోని పండ్లను కోయడం దొంగతనంతో సమానం కదా! కాబట్టి నువ్వు వెంటనే రాజుగారి దగ్గరకు వెళ్లి తగిన దండన స్వీకరించు,’ అని సూచించాడు.

 

లిఖితునికి అన్నగారి మాటలు సబబుగానే తోచాయి. ఎంత సోదరులమైనా... తాము ఇరువురమూ సన్యాస ఆశ్రమంలో ఉన్నవారమే కదా! కాబట్టి ఆశ్రమధర్మాలను పాటించి తీరవలసిందే కదా! అనిపించింది. వెంటనే ఆ దేశ రాజుగారైనా సుద్యుమ్నుని చెంతకు వెళ్లాడు. తన రాజప్రాసాదం వద్ద లిఖితుని చూసిన సుద్యుమ్నుడు అతనికి సాదరంగా ఆహ్వానం పలికాడు. ‘ప్రభూ నేను నా అన్నగారి అశ్రమంలో పండుని దొంగిలించాను. ఆ తప్పుకు ప్రతిఫలంగా మీ నుంచి దండన కోరుతున్నాను. ఒక దొంగకి ఎలాంటి శిక్షను విధిస్తారో, నాకు కూడా అదే శిక్షను విధించండి,’ అంటూ సుద్యుమ్నుని కోరాడు.
లిఖితుని మాటలకు సుద్యుమ్నుడు ఆశ్చర్యపోయాడు- ‘లోకకళ్యాణం కోసం తపస్సు ఆచరించే మీ వంటి మునులని ఎలా దండించగలను,’ అంటూ లిఖితుని మనసు మార్చే ప్రయత్నం చేశాడు. కానీ లిఖితుడు తన మాట నుంచి తప్పుకోకపోవడంతో, రాజదండన చట్టం ప్రకారం దొంగతనానికి శిక్షగా అతని రెండు చేతులనూ నరికివేయవలసిందిగా శిక్షను అమలు చేశాడు.

 

ఖండితమైన శరీరంతో లిఖితుడు తన అన్నగారి వద్దకు చేరుకున్నాడు. ఆ స్థితిలో ఉన్న సోదరుని చూసిన శంఖుడు- ‘సోదరా! చేసిన తప్పుకి శిక్షను అనుభవించడంతో నీ పాపం తీరిపోయింది. నిష్కల్మషమైన తత్వంతో నువ్వు మన వంశం పేరుని నిలబెట్టారు. వెళ్లు వెళ్లి ఆ బహుదానదిలో నీ పితృదేవతలను తలచుకొని స్నానం చేసి రా!’ అంటూ పంపాడు శంఖుడు.

 

ఆశ్చర్యం! లిఖితుడు బహుదా నదిలో మునిగిన వెంటనే అతని రెండు చేతులూ తిరిగివచ్చాయి. ఇదంతా తన అన్నగారి మహిమే అని అతనికి అర్థమైంది. తనకి మంచిచెడులను బోధించేందుకు ఆయన నేర్పిన పాఠమని గ్రహించాడు. కానీ ఒక సందేహం మాత్రం అతనిలో ఉండిపోయింది. వెంటనే తన అన్నగారి చెంతకు వెళ్లి ‘అన్నగారు! ఖండితమైన నా చేతులని కూడా తిరిగి తెచ్చేంత మహిమ ఉంది కదా! మరి మీరే నాకు శిక్ష విధించి ఉండవచ్చు కదా! ఆ రాజుగారి దగ్గరకు వెళ్లమని ఎందుకు సూచించినట్లు,’ అని అడిగాడు. తమ్ముడి ప్రశ్నకు శంఖుడు చిరునవ్వు చిందిస్తూ- ‘సోదరా! ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించాలి. తపస్సు చేసుకోవడం మన ధర్మం. పాలన చేయడం, పాపులను శిక్షించడం రాజుగారి ధర్మం. పైగా దొంగతనం, గురుపత్నిని మోహించడం, సాధువులను హత్య చేయడం, సురాపానం, చెడుసావాసం చేయడం వంటి పాతకాలకి రాజదండన అనుభవించాల్సిందే! అందుకనే నిన్ను రాజుగారి వద్దకు పంపాను,’ అంటూ చెప్పుకొచ్చాడు.

 

‘కాబట్టి ఓ ధర్మరాజా! ఒక రాజుగా ధర్మస్థాపన కోసం యుద్ధం చేయడం, ఆ యుద్ధంలో శత్రువులని సంహరించడం నీ కర్తవ్యం. ఆ కర్తవ్యంలో భాగంగానే నువ్వు శత్రువులని వధించావు కాబట్టి నీకు ఎలాంటి పాపమూ అంటదు. ఇక నీ బాధ్యతని నిర్వర్తించినందుకు క్షోభపడటంలో ఔచిత్యం ఏముంది?’ అంటూ వ్యాసుడు ధర్మరాజుని ఓదార్చాడు. పై కథ చదివాక... చిన్నపాటి దొంగతనం కోసం చేతులను ఖండించేంత శిక్షా! అన్నగారు మళ్లీ తల్చుకోగానే చేతులు తిరిగివస్తాయా! లాంటి ప్రశ్నలకు రావడం సహజం. కానీ ఈ కథ చెప్పే నీతి అది కాదు. ఎలాంటివారికైనా పరధనం మీద ఆశ ఉండకూడదని ఈ కథ చెబుతోంది. అది సొంత సోదరుని సొత్తయినా కానీ, అతని అభీష్టానికి వ్యతిరేకంగా దాన్ని సొంతం చేసుకోకూడదన్న సూచన వినిపిస్తుంది. రాజు అనేవాడు దేశంలోని రాజ్యాంగాన్ని అనుసరించి ధర్మాన్ని పాటించాలన్న హితవూ ఉంది. అన్నింటికీ మించి... ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తిస్తే సమాజం స్థిరంగా ఉంటుందన్న బోధ కనిపిస్తుంది.
దీపావళి తర్వాతి రోజు నుంచి.....కార్తీక మాసం.

దీపావళి తర్వాతి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసానికి చాలా ప్రత్యేకతలున్నాయి. స్కంద పురాణంలో కార్తీకమాసం గురించి స కార్తీక నమో మాసః.. నదేవం కేశవాత్పరమ్.. నబవేద సమం శాస్త్రం.. నతీర్థం గంగయాస్సమమ్.. అని పేర్కొన్నారు. అంటే కార్తీక మాసానికి సమానమైన నెల, కేశవునికి సమానమైన దేవుడు, వేదంతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేదు అని దీనర్థం. దీనిని బట్టి కార్తీక మాస విశిష్టత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

దీపారాధన..

శివనామస్మరణ చేస్తూ వత్తులను తయారుచేసి ఈ మాసంలో ఐదు రోజుల్లో ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి నాడు తులసీ వివాహం, వైకుంఠ చతుర్దశినాడు ఉసిరి చెట్టుకింద దీపారాధన చేస్తారు. విష్ణుమూర్తికి ఇష్టమైనదిగా చెప్పుకునే పౌర్ణమిన భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తారు.

ఉసిరిక వన భోజనం..

కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి చెట్లున్న వనంలో సమారాధన చేసి బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తే మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.

ఉపవాసం..

కార్తీకమాసంలో చాలా మంది ఉపవాసం ఉంటారు. దీని వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుందని భావిస్తారు. ఊబకాయం నుంచి కాస్త ఊరట లభిస్తుందని చెబుతారు. శరీరంలో అన్ని అవయవాలూ చైతన్యవంతంగా పనిచేస్తాయంటారు. అన్నానికి బదులు పండ్లు తినడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, విటమిన్లు అందుతాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

మాల ధారణలు

కార్తీకమాసంలో శివుడు, అయ్యప్ప, ఆంజనేయ, వేంకటేశ్వర, భవానీ మాల ధరిస్తుంటారు. నియమనిష్టలతో గడుపుతారు. మంచి ఆహార నియమాలు పాటిస్తూ అర్చనలు, భజనలు చేస్తారు.

తీర్థం ఎంతో శ్రేష్ఠం

భక్తులు ఉదయాన్నే ఆలయానికి వెళ్లి అర్చకులు ఇచ్చే తీర్థం సేవిస్తుంటారు. పచ్చకర్పూరం, స్పటిక, తులసి, కొబ్బరినీళ్లు, సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిని ఈ తీర్థం తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది.

రుగ్మతలు దూరం

కార్తీకమాసంలో మహిళలు రోజూ అలుకు జల్లి, స్నానం చేసి, తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అలుకు కోసం వాడే పేడ యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రిస్తుంది. ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్య మున్న తులసిమొక్క చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు పీల్చేగాలి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, గొంతు వ్యాధులు దరి చేరకుండా చూస్తుంది. సూర్యోదయంలోగా స్నానం చేస్తే రక్తప్రసరణ మెరుగై, మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

బద్దకం దూరం..

చలికాలంలో సాధారణంగా మనిషిలో బద్దకం పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదై శరీరం మొద్దుబారుతుంటుంది. ఇలాంటి పరిస్థితులను తట్టుకునేందుకు, రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు కార్తీకమాసంలో పాటించే అలవాట్లు దోహదపడుతాయి. మహిళలు తెల్లవారుజామునే లేచి, పసుపు రాసుకుని, చన్నీటి స్నానం చేసి, తులసిమొక్కకు పూజలు చేయడం ఓ రకంగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అల్పాహారం, మధ్యాహ్నం మితభోజనం, రాత్రికి పండ్లు, పాలు తీసుకోవడం కూడా ఆరోగ్యదాయక నియమాలేనని పండితులు పేర్కొంటున్నారు.
కార్తిక మాసం ఆధ్యాత్మికంగా దివ్యమైనది. ఈ మాసం స్నానానికి విశిష్టమైనది. ఇది దామోదర మాసం. కనుక 'కార్తిక దామోదర' అనే నామంతో స్మరణ చేయాలి. సూర్యోదయానికి ముందుగా 'ఆకాశదీపం' పెట్టే సంప్రదాయం ఉంది. హృదయాకాశంలో వెలిగే జ్యోతికి ప్రతీకగా ఈ ఆకాశదీపం ద్యోతకమవుతుంది. దీనిని దేవాలయంలోనే కాక ఇంటిలోనూ వెలిగించవచ్చు. ఈ మాసం దీపారాధనకి విశిష్టమైనది.
ఏక భక్తం (ఒంటిపూట భోజనం) ఈ మాసంలో చేయాలి. ప్రతిరోజూ ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్లి శివదర్శనం చేయడం శ్రేష్ఠం. శివాలయంలో, విష్ణ్వాలయంలో దీపాన్ని వెలిగించడం మంచిది. ఇంట్లో కూకా ప్రతిరోజూ సంధ్యాదీపం వెలిగించాలి. కార్తికమాసమంతా కార్తిక పురాణం రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభకరం.
శివుడు 'ఆశుతోషుడు' - వెంటనే సంతోషించే స్వామి.

అభిషేక ప్రియః శివః - అన్నారు కనుక ఈ మాసంలో శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి, సకల శుభాలను ప్రసాదిస్తుంది. కార్తికమాసం బృందావన యాత్ర, బృందావన పూజ విశిష్టం. బృందావనంలో శ్రీకృష్ణుని ఈ కార్తిక మాసాన ఆరాధించితే బహుశ్రేష్ఠం. దానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లో తులసి కోటను ఆరాధించే విధానాన్ని ఏర్పరచారు. నెలరోజులూ తులసి సన్నిధిలో దీపాన్ని వెలిగించి, విష్ణు పూజ చేయడం మంచిది.

పాడ్యమి నాడు - గోవర్ధన పూజ చేయాలి. బృందావనం వెళ్లి గోవర్ధన పూజ చేయలేని వారు - ఇంట్లో ఆవుపేడను ముద్దగా పెట్టి గోవర్ధన గిరిగా భావించి పూజించాలి. కార్తిక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యమును సంపాదించుకుంటారు.

కార్తిక బహుళ త్రయోదశి మొదలు అమావాస్య వరకు గల మూడు రోజులు గోపూజ చేస్తే ఇహమందు ఐశ్వర్యమును అనుభవించి అంత్యమున విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తిక శుద్ధ అష్టమి నాడు గోపూజ చేసిన వారు సమస్త వ్రతములు చేసిన ఫలమును పొందుతారు.
కార్తీక స్నాన మంత్రము :-

కార్తీకేహం కరిష్యామి ప్రాతః స్నానం జనార్దన!
ప్రీత్యర్ధం తన దేవేశ దామోదర మయా సహ!!
#భగినీ_హస్తబోజనం

‘భగిని’ అంటే...చెల్లెలైనా కావచ్చు., అక్క అయినా కావచ్చు. ‘హస్తభోజనం’ అంటే... చేతి భోజనము అని అర్ధం. అంటే.. సోదరి చేతి వంట సోదరుడు తినడం అన్నమాట.కార్తీక శుక్ల విదియ తిథి రోజున ’భగినీ హస్త భోజనం’ అన్న
పండుగను జరుపుకుంటారు. దీన్నే భాయ్ దూజ్ అనీ, భాత్రు ద్వితీయ అనీ, భాయ్ టీక అని అంటారు. అంటే సోదరి చేతి వంటతో సోదరి ఇంట్లో భోజనం చేయడం.
సూర్యుని బిడ్డలైన యమునానది మరియు యమధర్మరాజు అన్నాచెల్లెళ్ళు. యమునమ్మకి ఎప్పట్నించో అన్నని ఇంటికి పిలచి సత్కారం చేయాలని కోరిక, యమధర్మరాజుగారు వేళతప్పక ధర్మం తప్పక పని చేసే వ్యక్తి కాబట్టి తీరిక దొరకక ఆమె కోరిక చాలానాళ్ళు తీరకుండా ఉంటుంది. అలా యమునమ్మ ఎదురుచూసి ఎదురుచూసి ఉండగా యమధర్మరాజు, చెల్లెలు యమున ఇంటికి ఒకరోజు సకల పరివార సమేతంగా వచ్చారు ఆరోజుకార్తీక శుక్ల విదియ. సపరివారంగా వచ్చిన సోదరుని ఆతల్లి చక్కగా ఆదరించి పూజించి, చిత్రగుప్తాదులతో సహా అందరినీ ఆదరించి ఆమె తన చేత్తో చక్కని వంట చేసి వడ్డన చేసింది. అందుకు సంతృప్తిని పొందిన యమధర్మరాజు ఆనందంతో చెల్లెలిని ఏదైనా వరం కోరుకోమనగా... యమునమ్మ ఆనాటి నుండి కార్తీక శుక్ల విదియ నాడు చెల్లెలి ఇంటికి వెళ్ళి చెల్లెలి చేతి వంట తినే సోదరునికి నరకలోక ప్రాప్తి, అపమృత్యుదోషం అనేవి లేకుండా ఉండేటట్టు వరమియ్యమని కోరగా, యమధర్మరాజుగారు ఆమె కోర్కెని విని ఆనందించి సోదరులు సోదరియొక్క సౌమాంగళ్యానికి ఎప్పుడూ క్షేమం కోరుకోవాలి కాబట్టి ఈనాడు ఏ సోదరి తన ఇంట సోదరునికి తన చేతివంటకాల్ని వడ్డించి తినిపిస్తుందో ఆమె వైధవ్యాన్ని పొందకుండా పుణ్యవతిగా, అఖండ దీర్ఘ సౌమాంగళ్యంతో వృద్ధినొందుతుందని వరమిచ్చారు. అందువలనే ఈ తిథికి *యమ ద్వితీయ* అని పేరు వచ్చింది. తరవాత యమునమ్మనుపరివార సమేతంగా తన పురానికి మరునాడు ఆహ్వానించి కానుకాదులిచ్చి, చక్కని షడ్రసోపేతమైన విందు, ఘనంగా సారె పెట్టి చెల్లెలిని పంపించాడు.

ఒకప్పుడు సమష్టి కుటుంబాల్లో సభ్యులందరూ ఒకరినొకరు ప్రేమతో, ఆప్యాయతతో పలకరించుకుంటూ పండగల్లో కలిసి భోంచేస్తూ, కబుర్లతో సత్కాలక్షేపం చేస్తూ పరస్పర సంబంధాలను, అనుబంధాలను శక్తిమంతం చేసుకునేవారు. అటువంటి హార్దిక బంధాలు అన్నీ ఇవాళ ఆర్థిక సంబంధాలుగా మారి యాంత్రిక, కృత్రిమ జీవన విధానానికి దోహదపడుతున్నాయి. అందువల్లనే కుటుంబసభ్యుల మధ్య పరస్పర అవగాహన, మంచి- మర్యాద, అనురాగమూ ఆప్యాయతా సన్నగిల్లిపోతున్నాయి. కనీసం సంవత్సరానికోనాడైనా తోబుట్టువులు కలిసి భోజనం చేసి, ప్రేమతో పలకరించుకుని, సద్భావనలను పెంపొందించుకోవలన్నది ఈ * భగినీ హస్త భోజన * విశిష్టత.
ఇటువంటి పవిత్రమయిన ఆచారాన్ని పాటించటము వలన ఆధ్యాత్మిక లాభాలే కాక , సామాజిక బంధాలుకూడా మరింత దృఢపడి. సమాజములో శాంతిసౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి.

కార్తీకశుద్దపక్ష విదియనాడు సోదరి ఇంట భోజనం చేస్తే సంపూర్ణ ఆయుష్షు కలుగుతుందని పురాణాలు చెపుతున్నాయి. దీనినే ‘భగినీహస్త భోజనం’గా శాస్త్రం నిర్వచిస్తోంది. ఒకనాడు యమధర్మరాజు తన సోదరి అయిన యమున ఇంట భోజనం చేసి ఆమె ఆతిథ్యానికి మెచ్చుకొని అమ్మా! ఏదైనా వరం కోరుకొమ్మనగా అన్నా! ఈరోజున ఎవ్వరు సోదరి చేతి భోజనం చేసినా వారికి సంపూర్ణ ఆయుష్షు ప్రాప్తించేలా వరం ఇమ్మని కోరింది.. ఆమె కోరికను మన్నించిన యముడు ‘తథాస్తు’ అన్నాడు. యముడు యమునకు ఇచ్చిన వరం కారణంగా విదియనాడు సోదరి చేతి భోజనం చేసిన సోదరునికి సంపూర్ణ ఆయుష్షు కలుగుతుందని శాస్ర్తాలు నిర్వచిస్తాయ

ఒకప్పుడు యముడు తన భటుల్ని కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా మనసుకి బాధ కలిగిందా? అని అడిగితె ఒక భటుడు భర్త ప్రాణాలు హరించినప్పుడు నవవధువు పడిన వేదన హృదయ విదారకంగా ఉండి తన మనసు పాడైందని చెపుతాడు. యముడు కూడా బాధపడినా చేయగలిగిందేమీ లేదని చెపుతూ ... "ఎవరైనా కార్తీక శుద్ధ విదియ నాడు సోదరికి బహుమానాలిచ్చి, ఆమె చేతితో తిలకం పెట్టించుకుంటే అపమృత్యువును నివారించవచ్చు'' అంటాడు. దీనికి కారణం ఉంది.

యముడు యమున సూర్యుని పిల్లలు. సోదరిపైన ఉన్న ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రులౌతారో వారికి దూరంగా ఉంటానని వరం ఇచ్చాడట. అందువల్లనే యమునలో స్నానం చేసిన వారికి అపమృత్యు బాధ ఉండదట. అందరూ యమునా స్నానం చేయలేరు కదా! సోదరసోదరీ పరమకు నిదర్శనంగా నిలిచినా యమున, యముల బంధాల్ని గుర్తు చేసుకుంటూ కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ (సోదరి) హస్త భోజనం చేసినట్లయితే అదే ఫలితాన్ని పొందవచ్చు. ఉత్తర భారతంలో ఇది చాలా ప్రాంతాలలో జరుపుకునే పండుగ.ఈ మధ్య ప్రాంతీయ భేదాలు సమసిపోవటం కారణంగా ఇవి మన దాకా కూడా వచ్చాయి.
"భగవధ్గీత" లోని 5 ముఖ్యమైన శ్లోకములు

తప్పక చదవండి
అందరికీ చేరవేయండి
జై శ్రీకృష్ణ

వాసంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోపరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణాని
అన్యాని సంయాతి నవాని దేహీ ||

------------"చిరిగిపోయిన బట్టలను పడేసి, మనం కొత్తబట్టలు ఎలా కట్టుకుంటామో, జీర్ణమైన శరీరాన్ని వదిలిన ఆత్మ కూడా- మరోకొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది"

2. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః |
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్దినాశాత్‌ప్రణశ్యతి ||

-------------"కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల మతిమరుపు, మరుపుతో బుద్ధినాశనం, బుద్ధినాశనంతో మనిషే నాశనం"

3. తస్మాదసక్త స్సతతం కార్యం కర్మ సమాచార |
ఆసక్తో హ్యాచరన్ కర్మ పర మాప్నోతి పూరుష: ||

--------------"చేసే పని, దాని ఫలితము మీద అదే పనిగా ఆసక్తి ఉండొద్దు. కర్మ ప్రకారం చేసుకుంటూ పోవాలంతే"

4. ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ|
యథోల్యేనావఈతో గర్భస్తథా తేనేదమావృతమూ ||

----------------"పొగ చేత నిప్పు, ధూళి చేత అద్దం, మావి చేత గర్భస్త పిండం కప్పబడినట్లే, కోరికల చేత జ్ఞానం కూడా కప్పబడి వుంటుంది"

5. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మ ఫలహేతుర్భూ: మాతే సంగోఅస్త్వకర్మణి ||

------------"నువ్వు కర్మలు చేయడానికి మాత్రమే. ఆ కర్మఫలాలకు అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో ఎట్టిపరిస్థితుల్లో కర్మలు చేయకు. అలాగని చేయడం మానకు"