Devotional Telugu
3.46K subscribers
106 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
పూజలో ఏ విధమైన విగ్రహాలు పెట్టుకోకూడదు


అనేక రకాల లోహాలతో తయారుచేసిన విగ్రహాలు చూస్తూవుంటాము. వాటిలో వేటిని పూజలో పెట్టుకోవచ్చు, వేటిని పూజించకూడదు అని కొన్ని సందేహాలొస్తూ వుంటాయి. బంగారం, వెండి, ఇత్తడి, కంచు లోహాలతో తయారయిన విగ్రహాలను పూజలో పెట్టవచ్చు. అయితే ఈ విగ్రహాలు చిన్నవిగా వుండాలి. రాగితో తయారు చేసినది కేవలం గణపతి విగ్రహాన్ని మాత్రమే పూజించవచ్చు. స్ఫటిక విగ్రహాలు విశేష ఫలితాన్నిస్తాయికానీ అవి పగలకుండా చాలా జాగ్రత్త వహించాలి.


అందంగా వున్నాయికదాని మార్కెట్ లో దొరికే చెక్క విగ్రహాలు, మట్టి విగ్రహాలు నిత్య పూజకి వినియోగించ కూడదు. చెక్క విగ్రహాలగురించి కిందటి పోస్టులో చెప్పుకున్నాము. మరి మట్టి విగ్రహాలని గణపతి నపరాత్రులలో, దసరాలలో పూజిస్తాంకదా మరి నిత్య పూజలో ఎందుకు పెట్టుకోకూడదు అంటారా మట్టి విగ్రహాలకు కూడా పగుళ్ళు వస్తాయి. మరి అలాంటివాటిని పూజించకూడదుకదా. గణపతి నవరాత్రులలో, దసరాలలో కేవలం ఆ నవరాత్రులలో పూజించి తర్వాత ఉద్వాసన చెప్పి నిమజ్జనం చేస్తారు. ఎక్కువకాలం పూజ చెయ్యరుకదా.


అలాగే ఉగ్ర స్వరూపం వున్న విగ్రహాలను, చాలా తేజస్సుతో, భయంకరంగా వున్న విగ్రహాలను పూజించకూడదు. పూజా సమయంలో మన దృష్టి దానిమీద వున్నప్పుడు మనకు ప్రశాంతత తగ్గే అవకాశం వున్నది. చిన్ముద్రతో, అభయ హస్తంతో ఆశీర్వదిస్తున్నట్లుండే విగ్రహాలను పూజిస్తే మనం నమస్కారం చేసి కళ్ళు తెరవగానే ఆ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నట్లు, మనవంక శాంతంగా, చిరునవ్వుతో చూస్తున్నట్లు వుంటే మనకి ఎనలేని ప్రశాంతత లభిస్తుంది..ఎక్కడలేని ధైర్యం వస్తుంది. అంతకన్నా మన పూజకి పరమార్ధం ఏముంటుంది?

https://t.me/devotional
పూర్వం పంచపాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో..., వారి యోగక్షేమాలు విచారించాలని శ్రీకృష్ణుడు వారి దగ్గరకు వచ్చాడు. శ్రీకృష్ణుని చూడగానే ధర్మరాజు చిరునగవుతో ఎదురేగి స్వాగత మర్యాదలతో సత్కరించి ఉచితాసనం ఇచ్చి గౌరవించాడు. కొంతసేపు కుశలప్రశ్నలు జరిగాక.., ‘కృష్ణా..మేము పడుతున్న కష్టాలు నీకు తెలియనివి కాదు. ఏ వ్రతం చేస్తే మా కస్టాలు తొలగిపోతాయో దయచేసి మాకు ఉపదేశంచు’ అని ప్రార్థించాడు ధర్మరాజు. అప్పుడు శ్రీకృష్ణుడు ‘ధర్మరాజా..మీ కష్టాలు తీరాలంటే ‘అనంత పద్మనాభస్వామి వ్రతం’ ఆచరించండి’ అని సలహా ఇచ్చాడు. అప్పుడు ధర్మరాజు ‘కృష్ణా..అనంతుడంటే ఎవరు? అని ప్రశ్నించాడు. ‘ధర్మరాజా.. అనంత పద్మనాభుడంటే మరెవ్వరో కాదు, నేనే. నేనే కాలస్వరూపుడనై సర్వం వ్యాపించి ఉంటాను. రాక్షస సంహారం కోసం నేనే కృష్ణునిగా అవతరించాను. సృష్టి, స్థితి, లయ కారణభూతుడైన అనంత పద్మనాభస్వామిని కూడా నేనే. మత్స్య కూర్మ వరాహాది అవతారాలు నావే. నాయందు పదునలుగురు ఇంద్రులు, అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, సప్తరుషులు, చతుర్దశ భువనాలు,ఈ చరాచర సృష్టి చైతన్యము ఉన్నాయి. కనుక అనంత పద్మనాభస్వామి వ్రతం ఆచరించు’ అన్నాడు శ్రీకృష్ణుడు. ఈ వ్రతాన్ని ‘ఎలా చెయ్యాలి, ఇంతకు ముందు ఎవరైనా చేసారా’ అని అడిగాడు ధర్మరాజు. కృష్ణుడు చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కృతయుగంలో వేదవేదాంగవిదుడైన సుమంతుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు దీక్షాదేవి. వీరి ఏకైక కుమార్తె పేరు సుగుణవతి. ఈమెకు దైవభక్తి ఎక్కువ. సుగుణవతికి యుక్తవయస్సు వచ్చేసరికి ఆమె తల్లి మరణించడంతో.. సుమంతడు మరొక యువతిని వివాహం చేసుకున్నాడు. ఇతని రెండవ భార్య పరమ గయ్యాళి. అందుచేత సుమంతుడు తన కుమార్తె అయిన సుగుణవతిని, కౌండిన్యమహర్షికి ఇచ్చి వివాహం జరిపించాడు. సుమంతుడు తన అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వాలని అనుకున్నాడు. ఈ విషయం తన భార్యతో చెప్తే..ఆమె అల్లుడని కూడా చూడకుండా అమర్యాదగా ప్రవర్తించింది. సుమంతుడు తన భార్య ప్రవర్తనకు బాధపడి, పెండ్లికోసం వాడగా మిగిలిన సత్తుపిండిని అల్లునికి బహుమానంగా ఇచ్చి పంపాడు. సుగుణవతి తన భర్తతో కలసి వెడుతూ మార్గమద్యంలో ఒక తటాకం దగ్గర ఆగింది. అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు ధరించి, అనంత పద్మనాభస్వామి వ్రతం చేస్తున్నారు. సుగుణవతి ఆ వ్రతం గురించి ఆ స్త్రీలను అడిగింది. వారు ఇలా చెప్పారు. ‘ఓ పుణ్యవతీ...ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి పర్వదినమందు ఆచరించాలి. వ్రతం ఆచరించే స్త్రీ, నదీస్నానం చేసి, ఎర్రని చీర ధరించి, వ్రతంచేసే ప్రదేశాన్ని గోమయంతో అలికి, పంచవర్ణాలతో అష్టదళ పద్మం వేసి, ఆ వేదికకు దక్షిణ భాగంలో ఉదకపూరిత కలశాన్ని ఉంచి, వేదికు మరో భాగంలోకి యమునాదేవిని, మద్య భాగంలో దర్భలతో చేసిన సర్పాకృతిని ఉంచి అందులోకి శ్రీ అనంత పద్మనాభస్వామిని ఆవాహన చేసి, షోడశోపచారాలతో అర్చించాలి. పూజాద్రవ్యాలన్నీ 14 రకాలుండేలా చూసుకోవాలి. పదునాలుగు ముడులుగల కుంకుమతో తడిపిన నూతన తోరాన్ని ఆ అనంత పద్మనాభస్వామి సమీపంలో ఉంచి పూజించి, ఏడున్నర కిలోల గోధుమపిండితో 28 అరిసెలు చేసి, స్వామికి నైవేద్యం పెట్టి, వాటిలో 14 అరిసెలు బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని భక్తిగా భుజించాలి. ఇలా 14 సంవత్సరాలు వ్రతం ఆచరించి ఉద్యపన చేయాలి.’ అని చెప్పారు.
వెంటనే సుగుణవతి అక్కడే శ్రీ అనంత పద్మనాభస్వామి వ్రతం ఆచరించి, తన తండ్రి ఇచ్చిన సత్తుపిండితో అరిసెలు చేసి బ్రాహ్మణునికి వాయనం ఇచ్చింది. ఆ వ్రత ప్రభావం వల్ల సుగుణవతి అఖండ ఐశ్వర్యవంతురాలైంది. కౌండిన్యునకు గర్వం పెరిగింది. ఒకయేడు సుగుణవతి వ్రతంచేసుకుని, తోరం కట్టుకుని భర్త దగ్గరకు వచ్చింది. కౌండిన్యడు ఆ తోరాన్ని చూసి, కోపంగా ‘ ఎవర్ని ఆకర్షించాలని ఇది కట్టావు’ అంటూ ఆ తోరాన్ని నిప్పుల్లో పడేసాడు. అంతే...ఆ క్షణం నుంచే వారికి కష్టకాలం మొదలై, గర్భ దరిద్రులైపోయారు. కౌండిన్యునిలో పశ్చాత్తాపం మొదలై ‘అనంత పద్మనాభస్వామిని’ చూడాలనే కోరిక ఎక్కువైంది. ఆ స్వామిని అన్వేషిస్తూ బయలుదేరాడు. మార్గమధ్యంలో పండ్లతో నిండుగా ఉన్న మామిడిచెట్టు పైన ఏ పక్షి వాలకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. అలాగే...పచ్చగా, నిండుగా ఉన్న పొలంలోకి వెళ్లకుండా దూరంగా ఉన్న ఆబోతుని.., పద్మాలతో నిండుగా ఉన్న సరోవరంలో దిగకుండా నిలబడి ఉన్న జలపక్షులను..మరో ప్రదేశంలో ఒంటరిగా తిరుగుతున్న ఒ గాడిదను, ఏనుగును చూసి.... ఆశ్చర్యపోతూ ‘మీకు అనంత పద్మనాభస్వామి తెలుసా?’ అని అడిగాడు.‘తెలియదు’ అని అవన్నీ జవాబిచ్చాయి. ఆ స్వామిని అన్వేషిస్తూ తిరిగి తిరిగి ఒకచోట సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు అనంత పద్మనాభస్వామికి అతనిపై జాలికలిగి ఓ వృద్ధబ్రాహ్మణుని రూపం ధరించి అతని దగ్గరకొచ్చి, సేదదీర్చి తన నిజరూపం చూపించాడు. కౌండిన్యుడు ఆ స్వామిని పలువిధాల స్తుతించాడు. తన దరిద్రం తొలగించి, అంత్యకాలంలో మోక్షం అనుగ్రహించమని కోరుకున్నాడు. ఆ స్వామి అనుగ్రహించాడు. కౌండిన్యుడు తను మార్గ మధ్యంలో చూసిన వింతలు గురించి ఆ స్వామిని అడిగాడు. ‘విప్రోత్తమా.. తను నేర్చిన విద్యను ఇతరులకు దానం చేయనివాడు అలా ఒంటరి మామిడిచెట్టుగానూ, మహాధనవంతుడై పుట్టినా..అన్నాతురులకు అన్నదానం చేయని వాడు అలా ఒంటరి ఆబోతుగానూ, తాను మహారాజుననే గర్వంతో బ్రాహ్మణులకు బంజరు భూమి దానం చేసేవాడు నీటి ముందు నిలబడిన పక్షుల్లాగానూ, నిష్కారణంగా పరులను దూషించేవాడు గాడిదగానూ, ధర్మం తప్పి నడచేవాడు ఏనుగులాగ జన్మిస్తారు. నాకు కనువిప్పు కలగాలనే వాటిని నీకు కనిపించేలా చేసాను. నీవు ‘అనంత పద్మనాభవ్రతాన్ని’ పదునాలుగు సంవత్సరాలు ఆచరిస్తే నీకు నక్షత్రలోకంలో స్థానమిస్తాను’ అని చెప్పి మాయమయ్యాడు...శ్రీ మహావిష్ణువు. అనంతరం కౌండిన్యుడు తన ఆశ్రమం వచ్చి జరిగినదంతా భార్యకు చెప్పి పదునాలుగు సంవత్సరాలు అనంత పద్మనాభస్వామి వ్రతం ఆచరించి భార్యతో కలిసి నక్షత్రలోకం చేరుకున్నాడు... అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ‘అనంత పద్మనాభస్వామి వ్రతం’ గురించి వివరించి చెప్పాడు.
ఇంతకీ ఈ ఖండోబా ఎవరు!

బాబా సచ్చరిత్ర చదివిన వారందరికీ అందులో ఖండోబా ఆలయం ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. అసలు బాబా షిరిడీలోకి ప్రవేశించే ఘట్టమే ఖండోబా ఆలయంతో మొదలవుతుంది. అందుకే షిరిడీకి వెళ్లినవారంతా పనిలోపనిగా ఖండోబాని దర్శించుకుని వస్తుంటారు. కానీ ఈ ఖండోబా ఎవరు అన్న స్పష్టత చాలా తక్కువమందికే ఉంటుంది. మహారాష్ట్రుల జీవితాల్లో ఖండోబా పాత్రని గుర్తిస్తే ఇదే ఖండోబాకు మరోమారు శిరసు వంచి నమస్కరించాలని అనిపిస్తుంది.

ఖండోబా అంటే!
ఖండోబా అంటే దుష్టులను ఖండించే తండ్రి అన్న అర్థం వస్తుంది. ఆ పేరుని సార్థకం చేసేలా ఒక చరిత్ర కూడా ఉంది. ఒకప్పుడు మల్లా, మణి అనే ఇద్దరు రాక్షసులు బ్రహ్మ ప్రసాదితమైన వరాలతో లోకాలను పట్టిపీడించసాగారట. వారి నుంచి కాపాడమంటూ దేవతలంతా బ్రహ్మ, విష్ణువులకు మొక్కినా లాభం లేకపోవడంతో చివరికి శివుని చెంతకు చేరారట. దేవతల ఆర్తనాదాలను విన్న పరమేశ్వరుడు, మార్తాండ భైరవునిగా రూపుదాల్చి ఆ ఇద్దరు రాక్షసులనీ ఖండించాడట. అలా శివుడు, ఖండోబాగా మారాడు.

వేయేళ్ల దైవం
కర్ణాటక, మహారాష్ట్ర సాహిత్యంలో ఈ ఖండోబా ప్రస్తావన దాదాపు వేయి సంవత్సరాలుగా కనిపిస్తూనే ఉంది. ఇక 15 శతాబ్దికి వచ్చేసరికి ఖండోబా ఆరాధన ఎంత విస్త్రృతంగా ప్రచారం పొందిందంటే... మహారాష్ట్రలో చాలామంది శివుని, ఖండోబా రూపంలోనే పూజిస్తుంటారు. ఇక చాలామందికి ఖండోబా కులదైవం కూడా. శివుని అవతారం, సూర్యుని తేజం కలిసిన దైవం ఖండోబా అని కూడా కొందరి నమ్మకం. ఇక శివుని కుమారుడైన కార్తికేయుడే ఖండోబా అని భావించేవారూ లేకపోలేదు.

ఐదుగురు భార్యలు!
ఖండోబాకు ఒకరు, ఇద్దరు కాదు ఐదుగురు భార్యలు. అయితే వారిలో ఒకొక్కరూ ఒకో జాతికి చెందినవారు. వారిలో ఒక భార్య ముస్లిం అని కూడా నమ్ముతారు. ఖండోబా ఇలా కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నారనే నమ్మిక... ఆయనను అన్ని వర్గాలకూ చేరువ చేసింది. జాతి పట్టింపులేమీ లేకుండా అందరూ ఆయనను తమవానిగా భావించేవారు. కొందరు ముస్లింలు సైతం ఆయనను ఆరాధించేవారు. అయితే ఖండోబా తొలి ఇద్దరు భార్యలు ఆయనతో పాటుగా గుళ్లలో కనిపిస్తూ ఉంటారు. వారే మాల్సా, బనాయి. వీరిరువురూ పార్వతీదేవి, గంగమ్మతల్లికి ప్రతిరూపాలు అని భక్తుల విశ్వాసం. ఖండోబా గురించి ఉన్న జానపద సాహిత్యంలో ఆయన వారిని వివాహం చేసుకోవడం కోసం దారితీసిన ప్రేమాయణాలు, సవతుల మధ్య సాగే జగడాలు ముఖ్య ఘట్టాలుగా కనిపిస్తాయి.

తెలుగునాట!
తెలుగువారు మల్లన్నగా కొలుచుకునే దైవమే ఖండోబా అని భావించేవారు లేకపోలేదు. మల్ల అనే రాక్షసుని సంహరించాడు కాబట్టి మల్లన్న అయ్యాడని ఒక భావన. అందుకే కొమురవెల్లిలో వెలిసిన దైవాన్ని తెలుగువారు మల్లన్నగా కొలుచుకుంటే మహారాష్ట్రీయులు ఖండోబాగా భావిస్తారు. ఎవరు ఎలా కొలుచుకున్నా ఖండోబా, భక్తుల పాలిట భోళా శంకరుడే అనడంలో ఏమాత్రం అనుమానం లేదు. చిటికెడు పసుకుకీ, కాసిని శాకాలకీ, కొన్ని బొబ్బట్లకీ (పూరణ్‌ పోలి) సంతసించి... సంకల్పాలను సిద్ధింపచేస్తాడనటంలో మరోమాట రాదు.

మహారాష్ట్రలో ఊరూరా ఈ ఖండోబా ఆలయాలు ఉన్నప్పటికీ పూణేకు సమీపాన ఉన్న జేజురి అనే ప్రాంతంలో ఉన్న ఖండోబాకు ప్రాచుర్యం ఎక్కువ. జేజురి రాజధానిగా ఆయన ప్రపంచాన్ని పాలించేవాడనీ, అక్కడే ఆయన తన ఇద్దరు భార్యలతో కలిసి ఉండేవాడనీ ఐతిహ్యం. ఇక కర్ణాటకలోనూ ‘మైలారా’ పేరుతోనూ ఖండోబా ఎన్నో దేవాలయాలలో పూజలందుకుంటున్నాడు

https://t.me/devotional
చెక్క విగ్రహాలు ఇంట్లో పూజ లో పెట్ట్టుకోవచ్చ


చాలామంది ఏ యాత్రలకో, బజాలో వెళ్ళినప్పుడు అందమైన చెక్క విగ్రహాలు కనబడితే ఇష్టంగా కొనుక్కొచ్చుకుంటారు. ఆ చెక్క బొమ్మలు దేవుడివయితే కొందరు పూజలో కూడా పెట్టుకుంటారు. కానీ అది సరైన పని కాదు. మరి అర్క గణపతిని పూజిస్తారే..అదీ చెట్టునుంచి వచ్చిందేగా అంటారా? మీ పాయింటూ కరెక్టే. అయితే దుకాణాల్లో అమ్మేవన్నీ అర్క గణపతులు కాదు. అసలు అర్క గణపతి ఎలా వస్తుంతో తెలుసా? తెల్ల జిల్లేడు పెద్దగా అయిన తర్వాత, అంటే కనీసం 10 సంవత్సరాల తర్వాత చెట్టు వేళ్ళకి గణపతి ఆకృతి స్వయంసిధ్ధంగా ఏర్పడుతుంది. ఆ చెట్టు పూర్తిగా ఎండాక జాగ్రత్తగా ఆ గణపతి ఆకారాన్ని తీస్తారు. అర్క గణపతి ఆకృతి సంతరించుకోవటం మామూలు విషయం కాదు.


అలాంటి అర్క గణపతికి కూడా అభిషేకం చెయ్యకూడదు. కేవలం పుష్ప పూజ, సంప్రోక్షణ మాత్రమే చెయ్యాలి. భగవంతుడు ఎన్ని మహిమలు చూపించినా ఏ వస్తువుకుండే సహజసిధ్ధ గుణాలు ఆ వస్తువుకి వుంటాయి. చెట్టుకుండే గుణాలు చెట్టునుండి వచ్చిందికనుక అర్క గణపతికుంటాయి.


అలాగే ఇతర చెక్కలతో తయారుచేసిన విగ్రహాలుకూడా. స్వభావ సిధ్ధంగా చెక్కకి పగుళ్ళు రావచ్చు, విరిగి పోవచ్చు, చెదలు, పురుగులు పట్టచ్చు. అలాంటి విగ్రహాలకు పూజ చెయ్యంకదా. అందుకే చెక్క విగ్రహాలు నిత్య పూజలో పెట్టకూడదు.

https://t.me/devotional
పుష్పార్చన

దేవునికి పుష్పాన్ని అర్పించి ప్రసాదం తీసుకోవటం ద్వారా ఎలాంటి ఫలితం లభిస్తుందని తెలుసుకుందాం….

1. దేవునికి జాజిపూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే – మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి మంచి గుణం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి.
2. దేవునికి సంపెంగ పూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే – మాంత్రిక ప్రయోగాలు మీపై పని చేయవు. శత్రువుల నివారణ సాధ్యమవుతుంది.
3. పారిజాత పూవును అర్పిస్తే – కాలసర్ప దోషం నివారించబడి మనసుకు శాంతి లభిస్తుంది.
4. రుద్రాక్షపూవును అర్పిస్తే – ఎన్ని కష్టాలు వచ్చినా అంతిమ విజయం మీదే అవుతుంది.
5. మొగలిపూలను అర్పిస్తే – అధికారంలో ఉన్నవారి మనస్తాపాలు పరిహరించబడతాయి.
6. లక్కి పూవుతో పూజిస్తే – భార్య, పిల్లలతో కలహాలు లేకుండా సంతోషంగా ఉంటాయి.
7. పద్మం లేదా కమలంతో పూజిస్తే – సమస్త దారిద్ర్య నివారణ, శ్రీమంతులు అవుతారు.
8. మల్లెపూవుతో పూజిస్తే – అన్ని రోగాలు నయం అవుతాయి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.
9. కల్హర పుష్పంతో పూజ చేస్తే – అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి ఆకర్షణ పెరుగుతుంది.
10. గన్నేరు పూలతో పూజిస్తే – కవులకు కల్పనా సాహిత్యం వృద్ధి చెందుతుంది.
11. కలువ పూవుతో పూజ చేస్తే – స్తంభన తదితర మంత్ర సంబంధ బాధలు తొలగిపోతాయి.
12. పాటలీ పుష్పంతో పూజ చేస్తే – వ్యాపార-వ్యవహారాల్లో అధిక లాభం వస్తుంది.
13. కుంద పుష్పంతో పూజ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే ముఖంలో అధికమైన తేజస్సు కాంతి స్తుంది.
14. మల్లెపూవుతో పూజ చేసి ప్రసాదన్ని స్వీకరిస్తే – అన్ని రకాల మానసిక, దైహిక రోగాలు నయం అవుతాయి.
15. కనకాంబరం పూలతో దేవునికి పూజ చేయకూడదు. ఒకవేళ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే – జీవితం పట్ల వైరాగ్యం వస్తుంది.
16. మాధవీ పుష్పంతో – సరస్వతి, గాయత్రి, శ్రీ చక్రం, శ్రీ రాజరాజేశ్వరి దేవికి జ్యోతిష్యం చెప్పేవారు పూజ చేస్తే మంచి వాక్‌శుద్ధి కలిగి పలికినట్లే జరుగుతుంది.
17. తుమ్మపూలతో ఈశ్వరునికి పూజ చేస్తే – దేవునిపై భక్తి అధికమవుతుంది.
18. నందివర్థనం పూలతో శివునికి పూజ చేస్తే – జీవితంలో సుఖం, శాంతి, ప్రశాంతత లభిస్తుంది.
19. కణగలె పుష్పం – దీనితో దేవునికి పూజ చేస్తే మనను పట్టి పీడిస్తున్న భయం, భీతి తొలగిపోతాయి. గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక బాధల తొలగిపోతాయి. విద్యా ప్రాప్తి సిద్ధిస్తుంది. దుర్గాదేవికి ఈ పూలతో పూజ చేస్తే దేవీ అనుగ్రహంతో శత్రువుల నిర్మూలనం అవుతుంది.
20. పొద్దుతిరుగుడు పువ్వుతో పూజ చేస్తే – పూవును హోమం పూర్ణాహుతికి వేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

https://t.me/devotional
Channel name was changed to «Devotional Telugu»
నరసింహావతారము
శ్రీనారసింహుడు, నరసింహావతారము, నృసింహావతారము, నరహరి, నరసింహమూర్తి, నరసింహుడు - ఇవన్నీ శ్రీమహావిష్ణువు నాల్గవ అవతారమును వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు.

స్వామి ప్రార్థనలలోని శ్రీ జగద్గురు ఆదిశంకరాఛచార్యుల వారి శ్లోకం:

విస్తృతంగా పూజింపబడే నరసింహ స్వామి చిత్రాలలో ఒకటి. ఒడిలో లక్ష్మీదేవి. ఎదురుగా ప్రార్థిస్తున్న ప్రహ్లాదుడు. ఇరుప్రక్కలా విష్ణు భక్తులు. పైన ఆదిశేషుడు.
ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ
మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్ఠన్ |
వామేతరేణ వరదాభయ పద్మ చిహ్నం
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్ ||
ప్రార్థన శ్లోకం:

సత్యజ్ఞాన శివస్వరూప మమలమ్ క్షీరాబ్ధి మధ్యస్థితం
యోగారూఢ మతిప్రసన్న వదనమ్ భూషా సహస్రోజ్వలమ్|
త్ర్యక్షం చక్ర పినాక సాభయ వరాన్విభ్రాణమర్కచ్ఛవిమ్
ఛత్రీభూత ఫణీన్ద్ర మిన్దు ధవళమ్ లక్ష్మీనృసింహం భజే||

అవతార విశిష్టత
విష్ణువు ప్రతి అవతారానికీ ఒక ప్రత్యేకత ఉంది. అలాగే నరసింహావతారములో కొన్ని ప్రత్యేకతలను గమనించవచ్చును.

భక్తుని మాటను నిజం చేయడానికి అవతరించిన మూర్తి. అలాగే సేవకుని శాపాన్నించి ముక్తుని చేసిన మూర్తి.
సర్వాంతర్యామిత్వం (అన్ని చోట్లా ఉండటం) అన్న భగవద్విభూతి స్పష్టంగా ఈ అవతారంలో తెలుపబడింది.
హిరణ్యకశిపుని చంపడానికి ఇలా కుదరదు, అలా కుదరదు అని ఎన్నో నియంత్రణలు ఉన్నా, మరొక ఉపాయం సాధ్యమయ్యింది. చివరకు రాక్షస వధ తప్పలేదు.
భగవంతుడు సగం మనిషి, సగం మృగం ఆకారం ఈ అవతారంలో మాత్రమే దాల్చాడు.
ఇంక ఈ అవతారాన్ని స్మరించడంలో తెలుగువారికి మరికొన్ని విశేషమైన వనరులు ఉన్నాయనవచ్చును.

తెలుగునాట నృసింహాలయాలు మిక్కిలిగా ఉన్నాయి. ముఖ్యంగా యాదగిరిగుట్ట, మంగళగిరి, ధర్మపురి (కరీంనగర్ జిల్లా మండలం), సింహాచలం, అహోబిలం వంటి ఆలయాలు ప్రసిద్ధం. వెంకటేశ్వర స్వామి, నరసింహ స్వామి (ఇద్దరూ ఒకరే) తెలుగునాట ఎన్నో ఇండ్లలో కులదైవాలు.
సంస్కృతంలో వేదవ్యాసుడు రచించిన భాగవతాన్ని బమ్మెర పోతన మృదుమధురంగా తెనిగించాడు. అందులో నృసింహావతారానికి సంబంధించిన పద్యాలు తెలుగునాట బహు ప్రాచుర్యాన్ని పొందాయి.

అవతార గాధ
జయ విజయుల శాపవృత్తాంతము
జయ విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు. విష్ణుసేవా తత్పరులు. ఒకమారు సనకసనందనాది మునులు నారాయణ దర్శనార్ధమై వైకుంఠమునకు రాగా అది తగు సమయము కాదని ద్వారపాలకులు వారిని అడ్డగించారు. అందుకు మునులు కోపించి, విష్ణులోకానికి దూరమయ్యెదరని శపించారు. అప్పుడు వారు శ్రీ మహా విష్ణుఫును శరణు వేడగా, మహర్షుల శాపమునకు తిరుగులేదు. కానీ మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచన కలిగిస్తాను. మీరు నా భక్తులుగా 7 జన్మలు గానీ, విరోధులుగా 3 జన్మలుగానీ భూలోకమున జన్మించిన పిమ్మట మరల వైకుంఠానికి వస్తారని ఉపశమనాన్నిచ్చారు. అప్పుడు వారు మీకు దూరంగా 7 జన్మలు ఉండలేమని, విరోధులుగా 3 జన్మలు ఎత్తుతామని పలికెను.

ఆ జయవిజయులే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను, ద్వాపరయుగంలో శిశుపాల దంతవక్తృలుగాను జన్మించారు. ప్రతి జన్మలోను విష్ణువు అవతారంచేత వధులై అనంతరం శాపవిముక్తి పొందారు.

హిరణ్యాక్షుడు
కశ్యప ప్రజాపతి భార్యయైన దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే మహావీరులు జన్మించారు. హిరణ్యాక్షుడు బలగర్వితుడై దేవతలను యద్ధంలో ఓడిస్తూ అందరినీ భయభీతులను చేశాడు. పాతాళాంతర్గతయైన భూదేవిని శ్రీవరాహమూర్తి అవతారంలో ఉద్ధరిస్తున్న శ్రీమహావిష్ణువును యుద్ధానికి కవ్వించాడు. అప్పుడు జరిగిన భీకరమైన యద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు.

హిరణ్యకశిపుడు
సోదరుని మరణానికి చింతిస్తూనే హిరణ్యకశిపుడు తల్లిదండ్రులను, బంధువులను ఓదార్చాడు. అనంతరం రాజ్యపాలనాభారాన్ని మంత్రులకు అప్పగించి తాను మందరగిరికి పోయి ఘోరమైన తపసు ఆచరించాడు. అతని తపస్సు ఉగ్రతకు లోకాలు కంపించాయి. అతని శరీరం కేవలం ఎముకల గూడయ్యింది. బ్రహ్మ ప్రత్యక్షమై తన కమండల జల ప్రోక్షణతో అతని శరీరాన్ని నవయౌవనంగా, వజ్ర సదృశంగా చేశాడు. వరం కోరుకొమ్మన్నాడు. హిరణ్యకశిపుడు విధాతకు మ్రొక్కి, తనకు గాలిలోగాని, ఆకాశంలోగాని, భూమిపైగాని, నీటిలోగాని, అగ్నిలోగాని, రాత్రి గాని, పగలు గాని,దేవదానవమనుష్యులచేగాని, జంతువులచేగాని, ఆయుధములచేగాని, ఇంటగాని, బయటగాని మరణముండరాదని కోరాడు. అలాగే బ్రహ్మ వరాన్ని అనుగ్రహించాడు.
ఇంక వరగర్వంతో హిరణ్య కశిపుడు విజృంభించాడు. దేవతలను జయించాడు. ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించాడు.పంచభూతాలను నిర్బంధించాడు. తపసులను భంగ పరచాడు. సాధులను హింసింపసాగాడు. దేవతలు విష్ణువుతో మొరపెట్టుకొనగా విష్ణువు - "కన్నకొడుకునకు ఆపన్నత తలపెట్టిననాడు హిరణ్యకశిపుని పట్టి వధింతును. మీకు భద్రమగును" - అని వారికి అభయమిచ్చాడు.

ప్రహ్లాదుడు
ముఖ్య వ్యాసము: భక్త ప్రహ్లాదుడు

హిరణ్యకశిపుడు తపసు చేసుకొనే కాలంలో దేవతలు అదనుచూసుకొని అతనిరాజ్యంపై దండెత్తి కౄరంగా కొల్లగొట్టారు. గర్భవతియైన రాక్షసరాజు భార్యను ఇంద్రుడు చెరపట్టగా నారదుడు ఇంద్రుని మందలించి, ఆమెను రక్షించి తన ఆశ్రమానికి కొనిపోయాడు. ఆశ్రమంలో నారదుడొనర్చిన భాగవత తత్వబోధను గర్భస్థుడైన ప్రహ్లాదుడు గ్రహించాడు. రాజ్యానికి తిరిగివచ్చిన హిరణ్యకశిపునకు నారదుడు అతని ధర్మపత్ని నప్పగించాడు.

ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు. లలిత మర్యాదుడు. నిర్వైరుడు. అచ్యుతపద శరణాగతుడు. అడుగడుగున మాధవానుచింతనా సుధా మాధుర్యమున మేను మరచువాడు. సర్వభూతములందు సమభావము గలవాడు. సుగుణములరాశి. అట్టి ప్రహ్లాదునకు విద్య నేర్పమని, తమ రాజప్రవృత్తికి అనుగుణంగా మలచమనీ రాక్షసరాజు తమ కులగురువులైన చండామార్కులకప్పగించాడు.

చదవనివాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గలుగున్
చదువగ వలయును జనులకు
చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ

అని కొడుకునకు బోధించి గురుకులమునకు పంపాడు. ఈ బాలకునకు చదువుచెప్పి నీతికుశలుని గావించి, రక్షించమని గురువులను ప్రార్థించాడు.గురుకులంలో ప్రహ్లాదుడు గురువులపట్ల వినయంతో వారుచెప్పిన విషయాలను చెప్పినట్లు ఆకళించుకొన్నాడు.

చదువులలో మర్మం
ఒకమారు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చేరబిలచి - నీవు ఏమి నేర్చుకున్నావు? నీకు ఏది భద్రము?- అని ప్రశ్నించగా ప్రహ్లాదుడు "సర్వము అతని దివ్యకళామయము అని తలచి విష్ణువు నందు హృదయము లగ్నము చేయట మేలు" అని ఉత్తరమిచ్చాడు. రాక్షసులకు తగని ఈ బుద్ధి నీకెలా పుట్టింది? హరీ, గిరీ అని ఎందుకు ప్రేలుతున్నావు? అని తండ్రి గద్దించాడు. ఆందుకు ప్రహ్లాదుడు

మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే మదనములకు?
నిర్మల మందాకినీ వీచికల దూగు
రాయంచ చనునె తరంగిణులకు?
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు
కోయిల సేరునే కుటజములకు?
అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పాన విశేష మత్త
చిత్తమేరీతి నితరంబు జేరనేర్చు
వినుత గుణశీల మాటలు వేయునేల?
విష్ణు భక్తి నాకు దైవయోగం వల్ల సహజంగా సంభవించింది. అని జవాబిచ్చాడు.

కోపించిన రాక్షస రాజుకు సర్దిచెప్పి, మరల వివిధోపాయాలలో బోధన చేస్తామని ప్రహ్లాదుని గురుకులానికి తీసుకొని వెళ్ళారు గురువులు. అక్కడ మళ్ళీ ప్రహ్లాదునికి తమ విద్యలు నూరిపోసి, రాజువద్దకు తిరిగి తీసికొని వెళ్ళారు. రాజు తన కొడుకును ముద్దుచేసి - "గురువులే సంవిద్యాంశంబులు జెప్పిరో, విద్యా సారమెరుంగకోరెద, భవదీయోత్కర్షమున్ జూపవే ననుగన్న తండ్రీ" -అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు

చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్ధ ముఖ్య శాస్త్రంబులు
నే చదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ! - అని చెప్పెను.
మరి ఆ మర్మమమేమిటి? "తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనంబను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి సజ్జనుడై యుండుట భద్రము. శ్రీహరి భక్తిలేని బ్రతుకు వ్యర్ధము. విష్ణుని సేవించు దేహమే ప్రయోజనకరము. ఆ దేవదేవుని గూర్చి చెప్పేదే సత్యమైన చదువు. మాధవుని గూర్చి చెప్పేవాడే సరైన గురువు. హరిని చేరుమని చెప్పేవాడే ఉత్తముడైన తండ్రి." - అని వివరించాడు.

ఏడీ విష్ణువు?
హిరణ్య కశిపుడు మండి పడ్డాడు. తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని ఆదేశించాడు. కాని శూలాలతో పొడిచినా, ఏనుగులతో తొక్కించినా, మంటల్లో కాల్చినా, కొండలపైనుండి త్రోయించినా ప్రహ్లాదునకు బాధ కలుగలేదు. అతడు హరినామ స్మరణ మానలేదు. అదిచూసి రాజు చింతాక్రాంతుడయ్యాడు. మరొక అవకాశం అడిగి రాక్షసగురువు ప్రహ్లాదుని గురుకులానికి తీసికొనివెళ్ళారు. అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలురకు ఆత్మజ్ఞానాన్ని, హరితత్వాన్ని, మోక్షమార్గాన్ని ఉపదేశించసాగాడు. ఇలా లాభం లేదని గురువు రాజుతో మొరపెట్టుకున్నాడు.

క్రోధంతో హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని పిలిపించి - నేనంటే సకల భూతాలు భయపడతాయి. దిక్పాలకులు నా సేవకులు? ఇక నీకు దిక్కెవరు? బలమెవరు? అని గద్దించాడు. అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో ఆ విభుడే నాకు దిక్కన్నాడు ప్రహ్లాదుడు.

ఆ హరి ఎక్కడుంటాడు? అని దానవేశ్వరుడు ప్రశ్నించగా

కలడంబోధి కలండు గాలి గలడాకాశంబునన్ గుంభినిన్
గలడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
గలడోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులం దంతటన్
గలడీశుండు గలండు తండ్రి! వెదుకంగా నేల యీ యా యెడన్? - అన్నాడు బాలుడు.
ఇంకా "చక్రి సర్వోపగతుడు. ఎందెందు వెదకి జూచిన నందందే గలడు" అని చెప్పాడు.
హరి సర్వాకృతులన్ గలండనుచు ప్రహ్లాదుండు భాషింప స
త్వరుడై ఎందును లేడు లేడని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ
నరసింహాకృతినుండె నచ్యుతుడు నానా జంగమ స్థావరో
త్కర గర్భంబుల నన్ని దేశముల నుద్ధండ ప్రభావంబుతోన్
ఇలా దైత్యరాజు, అతని సుతుడు వాదించుకొటుండగా శ్రీహరి సకల జడ,చేతన పదార్ధములలో శ్రీ నరసింహాకృతిలో నుండెను (సర్వాంతర్యామిత్వం)

అయితే "ఈ స్తంభమునన్ జూపగలవె చక్రిన్ గిక్రిన్?" అని రాజు ప్రశ్నించాడు. "బ్రహ్మ నుండి గడ్డిపోచవరకు అన్నింటిలో విశ్వాత్ముడైయుండేవాడు ఈ స్తంభమునందెందుకుండడు? స్తంభాంతర్గతుడై ఉండును. ఏ సందేహములేదు. నేడు గానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్" అన్నాడా పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు. "సరే. చూద్దాం. ఈ స్తంభంలో విష్ణువును చూపకుంటే నీ తలతీయిస్తాను. అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా?" అని హిరణ్యకశిపుడు చేతితో స్తంభంపై చరిచాడు.

శ్రీ నరసింహావిర్భావం
బ్రహ్మాండ కటాహం బ్రద్దలయ్యే ఛటఛట ఫటఫటారావములు ధ్వనించాయి. పదిదిక్కుల నిప్పులు చెదిరాయి. "

ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును, చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీ గణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర కటిప్రదేశుండును, .......... కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును, వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును, ధగధ్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును, ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయుండును, ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును, మహాప్రభావుండును నైన శ్రీనృసింహదేవుడు" స్తంభమునుండి ఆవిర్భవించాడు.

ఇది నరమూర్తికాదు, కేవల హరిమూర్తియు కాదు. హరిమాయా రచితమై యున్నదను కొన్నాడు హిరణ్య కశిపుడు. అప్పుడు శ్రీ నృసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తనయొడిలో వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో (గోళ్లతో)చీల్చి చెండాడాడు.

ఇలా శ్రీహరి (మనిషీ, జంతువూ కాక)నారసింహుని రూపంలో, (పగలూ, రాత్రీ కాని) సంధ్యాకాలంలో, (ప్రాణం ఉన్నవీ లేనివీ అని చెప్పలేని) గోళ్ళతో, (ఇంటా బయటా కాక) గుమ్మంలో, (భూమిపైనా, ఆకాశంలో కాక) తనతొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు. బ్రహ్మ వరము వ్యర్ధం కాలేదు. ప్రహ్లాదుని మాట పొల్లు పోలేదు.

భక్త పాలన

హిరణ్యాకశిపుని చంపుతున్న నరసింహ అవతారము
స్వామి ముఖం భీకరంగా కనపిస్తోంది. రక్తరంజితమైన వజ్రనఖాలు సంధ్యాకాలపు ఎర్రదనాన్ని సంతరించుకొన్నాయి. ప్రేవులను కంఠమాలికలుగా వేసుకొన్నాడు. జూలునుండి రక్తం కారుతోంది. ఆయన నిట్టూర్పులు పెనుగాలుల్లా ఉన్నాయి. దేవతలు ఆయనపై పుష్పవర్షాన్ని కురిపించారు. సకలదేవతలు స్తుతించి ప్రణతులు అర్పించారు.

మహాభాగవతుడైన ప్రహ్లాదుడు ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చిన స్వామికి అంజలి ఘటించి సాష్టాంగ ప్రమాణం చేశాడు. శ్రీనారసింహస్వామి తన అభయ మంగళ దివ్య హస్తాన్ని ప్రహ్లాదుని తలపైనుంచి దీవించాడు. ప్రహ్లాదుడు పరవశించి పలువిధాల స్తుతించాడు. ప్రసన్నుడైన స్వామి ఏమయినా వరాన్ని కోరుకొమ్మన్నాడు.

"స్వామీ! నా తండ్రి చేసిన భాగవతాపరాధాన్ని మన్నించు" అని కోరాడు ప్రహ్లాదుడు. "నాయనా. నిన్ను కొడుకుగా పొందినపుడే నీ తండ్రితో 21 తరాలు (తల్లివైపు 7 తరాలు, తండ్రివైపు 7 తరాలు, ప్రహ్లాదుని తరువాతి 7 తరాలు)పావనమైనాయి. నా స్పర్శతో నీ తండ్రి పునీతుడైనాడు. నీ తండ్రికి ఉత్తర క్రియలు చేసి రాజువుకా. నా యందు మనసు నిలిపి, విజ్ఞుల ఉపదేశాన్ని పొందుతూ పాలన చేయి" అని ఆశీర్వదించాడు స్వామి.

శంకరుడు, బ్రహ్మాది దేవతలు శ్రీనారసింహుని ప్రస్తుతించారు. "దేవ దేవా! నీ నృసింహావతారాన్ని నిష్ఠతో ధ్యానించేవారికి యమునిగురించిన భయముండదు" అన్నాడు బ్రహ్మ. శ్రీలక్ష్మీ సమేతుడై స్వామి వైకుంఠమునకరిగెను. బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుని పూజలందుకొని తమలోకములకరిగిరి.

ఈ అవతారాన్ని గురించి ధర్మరాజునకు చెబుతూ నారదుడిలా అన్నాడు.

శ్రీ రమణీయమైన నరసింహ విహారము నింద్రశత్రు సం
హారము బుణ్య భాగవతుడైన నిశాచరనాధ పుత్ర సం
చారము నెవ్వడైన సువిచారత విన్న పఠించినన్ శుభా
కారము తోడ నే భయము గల్గని లోకము జెందు భూవరా!
విస్తృతంగా పూజింపబడే నరసింహ స్వామి చిత్రాలలో ఒకటి. ఒడిలో లక్ష్మీదేవి. ఎదురుగా ప్రార్థిస్తున్న ప్రహ్లాదుడు. ఇరుప్రక్కలా విష్ణు భక్తులు. పైన ఆదిశేషుడు.
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ |
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 1 ||

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ |
రావణ దర్ప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 2 ||

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్ |
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 3 ||

కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ |
దక్ష సుయఙ్ఞ నినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 4 ||

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్ |
సంచిత పాప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 5 ||

దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ |
దినకర కోటి ప్రభాకర లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 6 ||

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్ |
అష్టదరిద్ర వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 7 ||

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్ |
పరాత్పరం పరమాత్మక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 8 ||

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||
ఒక మంచి కథ

ఒక పర్యాయం విక్రమాదిత్య మహారాజు తన సైనికులతోను, మంత్రితోను కలిసి వేటకై అడవికి వెళ్ళాడు. వేటాడుతూ వేటాడుతూ అడవిలో ఒకరికొకరు దూరమైనారు.

ఒకచోట చెట్టు క్రింద నీడలో అంధుడు, వృద్ధుడు అయిన ఒక సాధువు కూర్చొని ఉండగా చూచి విక్రమాదిత్యుడు *'సాధు మహరాజ్, ఇటువైపుగా ఎవరైనా ఇంతకుముందు వెళ్ళారా!'* అని అడిగాడు.

ఆ అంధ సాధువు ఇలా అన్నాడు: 'మహారాజా! అందరికంటే ముందు మీ సేవకుడు వెళ్ళాడు. అతని వెనుక మీ సేనా నాయకుడొకడు వెళ్ళాడు. సేనానాయకుని తరువాత మీ మంత్రి కూడా ఇంతకుముందే వెళ్ళాడు'

అంధుడైన ఆ సాధువు చెప్పిన సమాధానం విని విక్రమాదిత్యుడు ఆశ్చర్యంతో, ఆసక్తితో 'మహాత్మా! మీకు నేత్రాలు కనిపించవు కదా! నా సేవకుడు, సేనానాయకుడు, మంత్రి ఇక్కడినుండి ఇప్పుడే వెళ్లినట్లు ఎలా గ్రహించారు? నేను రాజునైనట్లు కూడా ఎలా కనుగొన్నారు?'

అంధుడైన సాధువు ఇలా చెప్పాడు: 'మహారాజా! నేనా ముగ్గురినీ, మిమ్ములను మీ మాటలు విని కనిపెట్టాను. అందరికంటే ముందు సేవకుడు వచ్చి నాతో, "ఏమిరా, గుడ్డివాడా! ఇటు ఎవరైనా వచ్చారా?" అని అడిగాడు. కొంతసేపటికి సేనానాయకుడు వచ్చి, "సూర్ దాస్, ఇటు ఎవరైనా వెళ్ళారా?"అని అడిగాడు.
చివరకు మీ మంత్రి వచ్చి 'సూర్ దాస్ జీ ఇటు ఎవరైనా వెళ్ళారా?'అని అడిగారు
మీరు వచ్చి 'సాధు మహరాజ్! ఇటు ఎవరైనా బాటసారి వచ్చి వెళ్ళాడా? అని అడిగారు.
"మహారాజా! ఒక వ్యక్తి యొక్క వాక్కు ద్వారా అతని పదవి, అతని ప్రతిష్ఠ ఏమిటో గుర్తించవచ్చు"

తల విలువ నోరు చెపుతుంది చెపుతుంది