Devotional Telugu
3.46K subscribers
106 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
      ధనుర్మాసము  విశిష్టత- కర్తవ్యములు

సూర్యుడు వృశ్చికరాశి నుండీ ధనుస్సు రాశికి వచ్చు సమయము నుండీ ధనుర్మాసము మొదలవుతుంది. *ఆగ్నేయ (అగ్ని) పురాణము* ప్రకారము ఈ మాసము శ్రీ మహావిష్ణువు కు అత్యంత ప్రీతిపాత్ర మైనది. ధనుర్మాస వ్రతమును ఆచరించు వారికి ఈ నెల అత్యంత ప్రాముఖ్యమైనది.

శ్రీమహావిష్ణువు పుష్ప, శ్రీగంధమాల్య, మణి మౌక్తిక, పీతాంబర అలంకార ప్రియుడు అని ప్రతీతి. ఈ ధనుర్మాసములో ప్రతి దినమూ సూర్యోదయమునకు ముందే శ్రీమహావిష్ణువును సహస్ర నామార్చనతో పూజింప వలెను అని శాస్త్రములు నిర్దేశిస్తున్నాయి. ఈ మాసములో ఏ దేవాలయములో చూసినా బ్రాహ్మీముహూర్తములోనే పూజలుమొదలవుతాయి. అనేక విష్ణు దేవాలయములలో పెసర పప్పుతో చేసిన పులగమును ఆ పరమాత్మునికి నైవేద్యముగా సమర్పించి ప్రసాదంగా భక్తులకు ఇస్తారు.

             ధనుర్మాస వ్రత కథ


పురాణము ప్రకారము ఒకసారి బ్రహ్మదేవుడు హంస రూపములో లోక సంచారము చేస్తున్నాడు. అప్పుడు సూర్యునికి అకారణముగా గర్వము పొడుచుకు వచ్చి కావాలని, ఆ హంసపైన తన తీక్షణమైన కిరణాలతో తాపమును కలిగించాడు. అందుకు నొచ్చుకుని బ్రహ్మ, సూర్యుడికి తన తప్పు తెలిసిరావలెనని, *నీ తేజో బలము క్షీణించు గాక* యని శపించినాడు. వెంటనే సూర్యుడు తేజోహీనుడై, తన ప్రకాశమునంతటినీ పోగొట్టుకున్నాడు.
  దానితో  మూడులోకాలూ  అల్లకల్లోలమైనవి. సూర్యుడి తేజము చాలినంత లేక, జపములు, తపములు, హోమములు అన్నీ నిలచిపోయినాయి. దేవతలకు, ఋషులకే గాక, సామాన్య జనాలకు కూడా నిత్యకర్మలలో ఇబ్బందులుమొదలైనాయి. పరిస్థితి మరింత క్షీణించడముతో,దేవతలు అనేక సంవత్సరములు బ్రహ్మను గూర్చి తపము చేసినారు. బ్రహ్మ ప్రత్యక్షము కాగానే, సూర్యుని శాపాన్ని తొలగించమని వేడుకున్నారు.

సూర్యుడు తాను ధనూరాశిని ప్రవేశించగనే ఒక మాసము పాటు శ్రీ మహా విష్ణువును పూజిస్తే  అతడి శాప విమోచనము అవుతుంది.అని బ్రహ్మ తెలిపినాడు. బ్రహ్మ చెప్పిన విధముగా సూర్యుడు పదహారు సంవత్సరముల పాటు ధనుర్మాస విష్ణు పూజను చేసి తిరిగి తన తేజస్సును ప్రకాశమునూ పరిపూర్ణముగా పొందినాడు. సూర్యుడి నుండీ మొదలైన ఈ పూజ తదనంతరము మిగిలిన దేవతలూ మరియూ ఋషులలో ప్రాచుర్యము పొంది, తమ కర్మానుష్ఠానములు నిర్విఘ్నముగా విజయ వంతంగా జరుగుటకు వారుకూడా ధనుర్మాస పూజ సూర్యోదయపు మొదటి జాములో ఆచరించుట మొదలు పెట్టినారు.

అగస్త్య మహర్షి, విశ్వామిత్రుడు,గౌతముడు, భృగువు వంటి మహర్షులే కాక, అనేక దేవతలు, ఉపదేవతలు కూడా ఈ ధనుర్మాస వ్రతమునుఆచరించినారని వివిధ పురాణములలో ఉంది.

  ధనుర్మాసము అత్యంత మంగళకరమైన మాసమే అయినా ఇది శుభకార్యములు జరప కూడని శూన్య మాసము. ఈ నెలలో శుభకార్యము లైన వివాహ, గృహ ప్రవేశ, ఉపనయనము మొదలగు కార్యములు చేయు పద్దతి లేదు. ఏమి చేసిననూ ఈ మాసము సంపూర్ణముగా మహావిష్ణువు సంప్రీతి కొరకే కేటాయించవలెను. వైకుంఠ ఏకాదశి కూడా ఈ మాసములోనే వచ్చును.

  ముద్గాన్న నైవేద్యము
ఈ ధనుర్మాసములో మహావిష్ణువుకు ముద్గాన్నమును నైవేద్యముగా సమర్పిస్తారు. [పెసర పప్పుతో చేసిన పులగము] దీని గురించి *ఆగ్నేయ పురాణము* లో ఇలాగుంది,

 ధనూరాశిలో సూర్యుడు ఉండగా పులగమును ఒక్క దినమైనా విష్ణువుకు సమర్పించిన మనుష్యుడు ఒక వేయి సంవత్సరముల పాటు పూజ చేసిన ఫలాన్ని పొందుతాడు అని వివరిస్తుంది

ఈ నైవేద్యమును పాకము చేయు విధమును కూడా పురాణమే తెలుపుతుంది. దాని ప్రకారము,

 బియ్యమునకు సమానముగా పెసర పప్పును చేర్చి వండు పులగము ఉత్తమోత్తమము. బియ్యపు ప్రమాణములో సగము పెసరపప్పు చేర్చితే అది మధ్యమము. బియ్యపు ప్రమాణములో పావు వంతు పెసరపప్పు చేర్చితే అది అధమము. అయితే, బియ్యపు ప్రమాణమునకు రెండింతలు పెసరపప్పు చేర్చితే అది పరమ శ్రేష్టమైనది. భక్తులు తమకు శక్తి ఉన్నంతలో శ్రేష్ట రీతిలో పులగము వండి పరమాత్మునికి నివేదించవలెను. ఎట్టి పరిస్థితిలోనూ పెసర పప్పు ప్రమాణము, బియ్యమునకంటే  సగము కన్నా తక్కువ కాకుండా చూసుకోవలెను.

అంతే కాదు పెసర పప్పు, పెరుగు, అల్లము, బెల్లము, కందమూలములు, ఫలములతో కూడిన పులగమును భగవంతునికి సమర్పిస్తే సంతుష్టుడై భక్త వత్సలుడైన మహావిష్ణువు తన భక్తులకు సకల విధములైన భోగములను మోక్షమును కూడా ప్రసాదిస్తాడు అని పురాణము తెలుపుతుంది.
అందుకే, ధనుర్మాసమనగానే విష్ణు పూజ మరియు పులగము [పొంగల్] తప్పని సరియైనాయి. శ్రద్ధాళువులు తమ తమ శక్తి మేరకు ధనుర్మాసములో శ్రీ మహా విష్ణువును పూజించి కృతార్థులై, ఆయన కృపకు పాత్రులు కాగలరు.


       తిరుప్పావై అంటే ఏమిటి …..?
తిరుప్పావై ఒక అద్భుత వేదాంత గ్రంధం. భగవంతుని సులభంగా అందించగలిగే సాధనా మార్గం. ''తిరు'' అంటే శ్రీ అని, ''పావై'' అంటే పాటలు లేక వ్రతం అని అర్ధం. కలియుగంలో మానవ కన్యగా జన్మించి గోదాదేవిగా ప్రఖ్యాతమైన ఆండాళ్ భగవంతుడినే తన భర్తగా భావించి, ఆయన్ను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం. తిరుప్పావై లో పాశురాలు ఉంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాళ్ అపురూప భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా అందించారు.

తిరుప్పావై వ్రతానికి కొన్ని విధివిధాన
ాలు ఉన్నాయి. వేకువజామునే నిద్ర లేచి స్నానం చేయాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను, తిరుప్పావై పాశురాలను ఆలపించాలి. పేదలకు దానాలు, పండితులకు సన్మానాలు చేయాలి. స్వామికి, ఆండాళ్ కు ఇష్టమైన పుష్ప కైంకర్యం చేయాలి. ప్రతిరోజూ స్వామివారికి పొంగలి నివేదించాలి.

సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మానవులందరూ స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అటువంటి విష్ణుమూర్తిని భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతాన్ని నేటికీ మనం ఆచరిస్తున్నాం. ధనుర్మాసం మొదటిరోజున ఈ వ్రతాన్ని ఆరంభించి, భోగి రోజున ఆండాళ్, శ్రీరంగనాథుల కల్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది.

శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం భక్తిసాగరంలో మునిగి తేలినవారిని ''ఆళ్వారులు'' అంటారు. పన్నెండుమంది ఆళ్వారుల్లో విష్ణుచిత్తుడు మొదటివాడు. ఆయన గోదాదేవికి భక్తిసంపదలను వారసత్వంగా ఇచ్చారు. నిజానికి భూదేవియే ఆండాళ్ అని చెప్తారు. జనకమహారాజు భూమిని దున్నే సమయంలో సీతామాత దొరికింది. అలాగే శ్రీరంగనాథునికి పుష్ప కైంకర్యం కోసం విష్ణుచిత్తులవారు తులసితోట సాగుచేస్తుండగా ఆండాళ్ దొరికింది.

భగవంతుని తప్ప ఇతరులను సేవించడానికి వినియోగం కాని తులసివనంలో ఆండాళ్ దొరకదాన్ని గమనిస్తే సీతాదేవి ఆండాళ్ భూదేవి అంశయే అన్న సంగతి అర్ధమౌతుంది. ఆండాళ్ అసలు పేరు కోదై. ''కోదై'' అంటే మాలిక. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. ఆ గోదాదేవి రచించిన 30 పాశురాలలో ఏయే అంశాలు ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. 30 పాశురాలలోని అంశాలు స్థూలంగా మంచిని ప్రబోధిస్తాయి. మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సాయపడమని, భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని ఈ ప్రబోధాలు సూచిస్తాయి. ప్రతి పాశురంలోనూ ఇలాంటి సదాచరణే ఉంటుంది.


తిరుప్పావై మొదటిరోజు పాశురం

తిరుప్పావై

1.    పాశురము :

   *మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్
   నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
   శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్
   కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
   ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్
   కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్
   నారాయణనే నమక్కే పఱై దరువాన్
   పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !

భావము : సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా~ మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరిమును, చంద్రునివలె ఆహ్లాదకరుడును, సూర్యునివలె తేజోమయుడును యైన నారాయణునే తప్పు, యితరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ యీ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగ దాని కంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల వారందరును ఆలసింపక శ్రీఘ్రముగ రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను ఆహ్వానించుచున్నది.

       తిరుప్పావైగీతమాలిక

   అవతారిక:

వ్రతము చేయుటకు అనువైన సమయము, మాసము - మార్గశీర్షమాసము. కనుక భాగత్సంశ్లేషము కోరే భక్తులందరను వ్రతము చేయగా మార్గళి స్నానం చేదురు, రండీ! అని గోదాదేవి ఆహ్వానిస్తున్నది.

   1వ మాలిక

       (రేగుప్తి రాగము -ఆదితాళము)

ప..    శ్రీ గోకుల వాసులారా! - సిరికన్నియలార!
   భావతాపము దీర్చుకొనగ - వ్రతము చేయరండి!

అ.ప..    మార్గశీర్ష మాసమెంతో - మంచిది కద! రండి!
   మనసు పడిన వారెల్లరు -మార్గళి నీరాడ రండి!

1. చ..    ఆపద శంకించి కాచు - ఆనందుని తనయుని
   యశోదమ్మ యొడి యాడెడు - ఆ  బాల సింహుని
   నీలమేఘశ్యాముని - ఇన శశి సమవదమని
   నారాయణు గొలువనిపుడు - నరుల బొగడ రండి

2. ఛ.    ఈ నోమును నోచు మనము - ఇతరములను కోరము
   పర సాధన మొసగెడి మన - పరమాత్ముడే, సర్వము
   లోకమంత పొగడగ నీ - నోము మనము నోచెదము
   మనసు పడిన వారెల్లరు - మార్గళి నీ రాడరండి.

    
ఉజ్జీవించి బ్రతుకుదాం

ఎదో మంచిగానే బ్రతుకుతున్నాం కదా, మరి ఉజ్జీవించి బ్రతకటం అంటే ఏమిటి. మనిషిగా జన్మించాం మనతోపాటు మరికొన్ని జంతువులు ఇలా అన్నింటితో కలిసి సహ జీవనం సాగిస్తున్నాం. పుట్టడం, పెరగడం, తరగడం ఇలా ఒక ప్రవాహంలా సాగుతోంది జీవన విధానం. మరి ఆనందంగా బ్రతక గల్గుతున్నారా అందరూ? ఎమో మరి ఈ ప్రశ్న ఎవరికివారే వేసుకోవాలి. ఎంత సంపన్నుడైనా ఆనందం అనేది పొందుతున్నాడనటం ప్రశ్నాత్మకమే! చూడటానికి పైపైకి అందరూ బాగానే కనిపిస్తారు, ఒక్కసారి దగ్గరికి వెళ్ళి అడుగుతేగానీ తెలియదు వారివారి భాదలు. ఒక మురికి కాలువను పైనుండి చూస్తే బాగానే ప్రవహిస్తున్నట్లు ఉంటుంది, కొంత కదిపి చూస్తే ఎంతో మురికి అడుగున పేర్కొని ఉంటుంది కదా, మనుష్యుల జీవితాలు అలాగే తయారయ్యాయి. జంతువులు వాటి మానాన అవి బ్రతుకుతున్నాయి అవి ఏమి సాదించలేవు ఆయా జన్మలతో. జ్ఞానం కల్గి ఉన్నది మానవ జన్మ, ఇది ఒక అవకాశం కదా. దాన్ని సద్వినియోగం చేసుకోవడం ఒక ఉత్తముడి లక్షణం. ఏదో లక్ష్యానికి దూరంగా బ్రతుకుతున్నాం అనేది అందరం గమనించాలి. ఏమిటా లక్ష్యం ? ప్రతి జీవికి లక్ష్యం అంటూ ఉంటుందికదా, అది బ్రహ్మమే అని వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి.


మరి లక్ష్యమేమిటో తెలిసింది, దాన్ని ఎలా సాదించటం ఏదో ఒక మార్గం కావాలి కదా. మన మంచి కోసం ఎన్నెన్నో మార్గాలు మన పూర్వులు సాధించి పెట్టారు. మనం ఇప్పటికిప్పుడు మనంతట మనం మార్గాలను కనిపెట్టడం అంత సులభం కాదు. అంత సమయం కూడా మన వద్ద లేదు. హిమాలయాల్లో ఉన్న బద్రికాశ్రమానికి వెల్లటానికి ఒకప్పుడు ఇప్పటిలా రోడ్డు మార్గం లేదు. కొంత వరకు రోడ్డు మార్గం, చాలా వరకు నడక మార్గం ఉండేది, క్రమేపి నడక మార్గం తగ్గి, ఇప్పుడు మనం సులువుగా ప్రయాణించటానికి పూర్తిగా రోడ్డు మార్గం తయారయ్యింది. మరి అక్కడికి చేరడానికి మనం అదే మార్గాన్ని వాడుతాం కానీ మనంతట మనం కొత్త మార్గం ఏర్పాటు చేసుకోం కదా! అలాగే మనం మన పూర్వులు నడిచిన దారినే నడవటం సబబు. వారంతా మనకు తత్వాన్ని దర్షించి మనకు మార్గాన్నీ చూపారు. అందుకే తత్వనిర్ణయం అనేది చాలా ప్రధానమైనది, దాని మీదే తదుపరి జీవన విధానం ఆధారపడి ఉంటుంది.


దైవం అనేవాడు మనల్ని ఎన్ని రకాలుగా రక్షించటానికి మన వద్దకు వచ్చినా , దైవం అంటూ ఏం లేదు, అంతా మిథ్య అంటూ వివిద పోకడలు పొదలయిన సమయంలో ఆదిశాంకరులు ద్వయిత సిద్దాంతాన్ని వెలుగులోకి తెచ్చి, భగవంతుడనే వాడు ఒకడు ఉన్నాడనేది అందరిచే అంగీకరించేట్టు చేసారు. కేవలం భగవంతుడిపై మాత్రమే దృష్టి కేంద్రీకరించటంచే కాస్త కర్మ మార్గానికి దూరం అయ్యింది ఈ సిద్దాంతం. లేదు మనిషి కర్మ జీవి కదా, కర్మ తప్పనిసరి కాబట్టి కర్మపై మాత్రమే దృష్టిపెట్టాలంటూ ఒక మీమాంష సిద్దాంతం మొదలయ్యింది. దీన్ని కేశు మీమాంష అంటారు. మొదటిదాన్ని రాహు మీమాంష అంటారు. రెంటిలో ఏదో ఒక దానియందు మాత్రమే దృష్టి పెట్టగలం, అందుకే రెంటిలోనూ లోపంకలదు. అలాంటి సమయంలో దైవం కర్మ ఈ రెంటినీ కల్పుతూ రామానుజుల వారిచే విశిష్టాద్వయిత సిద్దాంతం వెలుగులోకి వచ్చింది. ఈ సిద్దాంతాన్ని వీరు కనిపెట్టినవారు కాదు, ఇవి అనాదిగా వస్తున్నవి, లోకుల పోకడల వల్ల వాటికి పట్టిన దుమ్మును దులిపి మల్లీ వెలుగులోకి తెచ్చినవారు అని మనం గమనించాలి. ఏ కర్మ చేసినా భగవంతుడి సంభందంగా చేయటమే ఈ సిద్దాంత గొప్పతనం. స్నానం చేసినా సరే- ఈ శరీరం భగవంతుడు ఉండే రథం దాన్ని పరిశుబ్రం చేస్తున్నామనే భావన, అలంకరించుకున్నా - ఆ రథాన్ని అలంకరించుకున్న భావనే, ఆహారం తీసుకున్నా- అది లోపల ఉన్న వాడికోసమే అనే భావన, ఇలా ఏ కర్మ చేసినా భగవంతుడి సంభందంతో చేయటమే, ఇక్కడ మనం కర్మా వదలటం లేదు, దైవానికి దూరం అవటం లేదు. అదే మార్గంలో మనం కూడా పయణిద్దాం.


మార్గం ఏమిటో తెలిసింది,మార్గ నిర్దేషం చేసేవారొకరు కావాలికదా. భగవంతుని కోసం ఎంతో మంది తపించారు కానీ అందరికీ ఆయన ప్రసన్నం కాలేదు కదా. ఆయన ఇష్టంతో కొందరిని కోరాడు, వారినే ఆళ్వారులని అంటారు. అందులో గోదాదేవి-ఆండాళ్ ఒక ఆళ్వారు. ఆమెను తాను స్వయంగా స్వీకరించాడు. మరి ఆమెనే మన మార్గ నిర్దేషం చేసే ఆచార్యునిగా తీసుకుందాం.


మనకున్న కొద్ది సమయంలో రామాయణభాగవతాదులను చదవాలంటే చాలా కష్టం. ఒక అతి సులభమైనది ఏదైనా ఉంటే బాగుంటుంది కదా. ఆ కోవలోకే గోదాదేవి పాడిన "తిరుప్పావై" వస్తుంది. మనం తిరుప్పావైని ఒక వాహనంగా భావిస్తూ పయనిద్దాం. అతి సులువైనది కేవలం ముప్పై పాటలు మాత్రమే ఉంటాయి.

ఏమిటా తిరుప్పావై? ఏముంది అందులో ? కేవలం ముప్పై పాటలే కదా అని అనుకోకూడదు. చూడటానికి పైపైకి ఒక కృష్ణ-గోపికల కథగా కనిపిస్తుంది. ఒక దూది పువ్వుని విప్పుతూ పోతే ఎలా విస్తరించగలదో తిరుప్పావై ఒక్కో పాటలో విప్పి చూస్తే అందులో గంభీరమైన రహస్యాలు కనిపిస్తాయి. ఇందులో రామాయణ భాగవత సన్నివేశాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇకపై వేదాలు ఉపనిషత్తులు చూపిన మార్గం ఇమిడి ఉంది. అందుకే తిరుప్పావైని ఐదో వేదం అంటారు.


తిరుప్పావై ఏమిటో తెలిసింది, మరి అందరూ చెయ్యవచ్చా? శ్రీకృష్ణుడి కోసం చేసేది "నీవే తల్లివి తండ్రివి ....." అని అందరం చిన్నపుడు చదివిందేకదా, అందరూ చెయ్యవచ్
చు ఈ వ్రతం.

మరి ఎప్పుడు ఆచరించాలి? ఒక రైతు పంట పండించేందుకు నారు పోయటానికి ఒక సమయం అంటూ చూసుకుంటాడు కదా, అంతెందుకు పరీక్షలో మంచి మార్కులు రావడానికి తెలతెలవారే సమయంలో లేచి చదివుతాడు ఒక విధ్యార్థి. మరి జీవిత లక్ష్యమైన శ్రీకృష్ణుని కోసం చేసే వ్రతానికి ఒక మంచి సమయమే ధనుర్మాసం. సూర్యుడు ధనుః రాశిలో ప్రవేశించి ఉంటాడు. ఆంగ్ల మానం ప్రకారం డిసెంబరు 16 నుండి మొదలై సంక్రాంతి వరకు. ఈ మాసం మనకు జ్ఞానం ఇచ్చే మాసం.

వ్రతం చేసే సమయం తెలిసింది, వ్రతం చేయటం కష్టం కాదా? కాదు, ఇది అతి సులభమైనది. తెలతెల వారే సమయంలో స్నానం చేయ్యటం, ఆరోజు పాశురం చదివి, ఆపై శ్రీకృష్ణుడికి పొంగలి ఆరగింపు చేయటం. ఇక ఆయా పాశురాల అర్థం వినడం అంతే. శరీరాన్ని కష్టపెట్టే వ్రతం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకృష్ణుని కళ్యాణ గుణాలతో స్నానం చేయటమే ఈ వ్రతం.


వ్రతం చేద్దాం కానీ ఫలితం లభిస్తుందా? అంటే ఏమీ సంశయం అవసరం లేదు అని ఆండాళ్ తల్లి చెబుతుంది. ఒక చిన్న పిల్లవాడు తప్పుచేస్తే తప్పును కప్పి తండ్రి దరిని చేర్చే అమ్మలా మనకోసం ఆండాళ్ తల్లి వేచి ఉంది.

గోదాదేవి నడిచిన మార్గాన్ని చూపించిన శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామివారి బంగారు మాటలనే అక్షరాలుగా చూద్దాం. మురికి కాలువలా ఉన్న జీవితాలకు శ్రీకృష్ణుడనే అడ్డుపెట్టి మురికిని ఇంతటితోనే ఆపుదాం. కేవలం స్వచ్చమైన నీటినే ముందుకు పంపి, మనల్ని పరిశుద్దులుగా చేసుకుందాం.
రామాయణం -1 వ భాగం
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

రామాయణం 24 వేల శ్లోకాలు. మొత్తం 6 కాండలు, అవి, బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ కాండలు, 6 కాండల మీద ఒక కాండ, ఉత్తర కాండ. రామాయణాన్ని ఆదికావ్యం అని అంటారు.

కేవలం రాక్షససంహారం కోసమే రామావతారము వస్తే, రావణుడిని చంపిన తరువాత ఆయన అవతార సమాప్తం చెయ్యాలి, కాని ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశారు, అదేంటంటే, "దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ ", నేను పదకొండువేల సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి, ఈ భూమండలాన్నంతటిని పరిపాలిస్తాను అని.

రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలలో గడిపాడు, భగవంతుడు కనుక, రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు, భగవంతుడు కనుక, రాముడు నిరంతరం ధర్మాన్ని పాటించాడు, భగవంతుడు కనుక, రాముడు తన జీవితంలో ఒక భార్యతోనే ఉన్నాడు, భగవంతుడు కనుక, ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమి ఉండదు. రామాయణంలో రాముడు ఒక భగవానుడిలాగ బతికి చూపించలేదు, ఒక మనిషిలాగ బతికి చూపించాడు. మనం ఎలా బతకాలో చూపించాడు.

అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం చెప్పుకుంటామో, ఎంతకాలం చదువుతామో, ఎంతకాలం రామాయణం మీద విశ్వాసం ఉంటుందొ, అంత కాలం మానవత్వం ఉంటుంది.
మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ప్రయోజనం లేదు. తల్లితండ్రుల దెగ్గర, సోదరుల దెగ్గర, గురువుల దెగ్గర, భార్య దెగ్గర ఎలా ఉండాలొ, ఒక మాటకి కట్టుబడి ఎలా ఉండాలొ రాముడిని చూసి నేర్చుకోవాలి.

యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్,తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ 
బాష్పవారి పరిపూర్ణలోచనమ్,మారుతిం నమత రాక్షసాంతకమ్.

ఎక్కడన్నా రామాయణం గూర్చి మాట్లాడుతుంటె స్వామి హనుమ తప్పకుండా వచ్చి వింటారు.

రామ అంటె లోకులందరినీ రమింపచేసే నామం. రావణాసురుడు బ్రహ్మ దేవుడి గురించి తపస్సు చేసి నరవానరములు తప్ప అన్ని జీవరాశులతో చావు రాకూడదని వరం కోరుకున్నాడు. నరవానరాలని ఎందుకు విడిచిపెట్టావు అని బ్రహ్మ అడగలేదు, రావణుడే చెప్పాడు, ఇంతమందిని అడిగాను నాకు నరవానరాలు ఒక లెక్క అన్నాడు. రావణుడి దృష్టిలో మనుషులకి ఉన్న స్థానం అది.

నరుడంటె అంత చులకనగా చూసే రోజుల్లో నరుడిగా పుట్టి, ఒక మనిషి తలుచుకుంటె ఏదన్నా సాధించగలడు అని నిరూపించినవాడు శ్రీరామచంద్రుడు. అందుకే మనిషిగా పుట్టిన ప్రతిఒక్కరు రామనామం చెప్పాలి.

కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్

రాముడి యొక్క ఆయనం(నడక) కనుక దీనికి రామాయణం అని వాల్మీకి మహర్షి పేరు పెట్టారు. అలాగే ఆయన రామాయణానికి సీతాయాశ్చచరితమ్ మహత్:, పౌలస్త్య వధ అనే పేర్లు కూడా పెట్టుకున్నారు.
రామాయణం -2 వ భాగం
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

బాలకాండ :

వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలొ సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు. సుమతి - కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకి చదువు, అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు. ఆ రాజ్యంలో క్షామం వచ్చి, ఎవరూ ఎవరికీ దానధర్మాలు చెయ్యడం లేదు.

కాబట్టి అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్లి, అక్కడ దొరికే కందమూలాలు, తేనె లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు. చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చెయ్యడం ప్రారంభించాడు.

ఒకసారి అటుగా వెళుతున్న కొంతమంది మహర్షులను ఆపి మీదెగ్గర ఉన్నది ఇవ్వండి, లేకపోతె చంపుతాను అన్నాడు. ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి "నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు" అని అగ్నిశర్మని అడిగారు.

నన్ను నమ్ముకున్న నా భార్యని, నా తల్లిదండ్రులని పోషించుకోవడానికి అని చెప్పాడు శర్మ. అలా అయితే, నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని, నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు.

మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం, కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావు, మేము అనుభవిస్తాము. కాని, ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చె ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని అన్నారు శర్మ కుటుంబసభ్యులు. చాలా బాధ కలిగి, మళ్ళి ఆ ఋషుల దెగ్గరికి వచ్చి, నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు. ధ్యానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు. 13 సంవత్సరాల తరువాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగొస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనబడింది. ధ్యానమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి. తన మీద పుట్టలు(వల్మీకం) కట్టినా తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఆయనని వాల్మీకి అని పిలిచి, బయటకి రమ్మన్నారు. ఇది ఆయనకి పౌరుష నామమయ్యింది. అప్పుడు ఆ మహర్షులు ఆయనని ఉత్తర దిక్కుకి వెళ్లి భగవంతుడిని ధ్యానం చెయ్యమన్నారు.

వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్లి, పరమశివుడిని ఆరాధన చేశారు. అప్పుడాయనకి విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. అంటె, ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట.

తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం |
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం ||

వాల్మీకి మహర్షి రామాయణంలొ రాసిన మొదటి శ్లోకం. దీని అర్ధం ఏంటంటె, తపస్వి, ముని, గొప్ప వాగ్విదాంవరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వియైన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు అని. వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగారంటె................

కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః ||
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః ||
ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః |
కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే ||

ఈ లోకంలొ ఇప్పుడే, ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, ధృడమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్ధుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలొ మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుగోగలిగినవాడు ఉంటె నాకు చెప్పండి అని అడిగాడు.
నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలొ ఉండడం కష్టమే, కాని ఒకడు ఉన్నాడు, నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు........

ఇక్ష్వాకువంశములొ రాముడని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు.
చెప్పిన తరవాత నారదుడు వెళ్ళిపోయాడు. విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది.

ఆ రోజు మధ్యాన సమయంలొ సంధ్యావందనం చెయ్యడానికి తమసా నది తీరానికి భారద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్లారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు క్రౌంచ పక్షులని చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిధున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు.

కిందపడిన ఆ మగ పక్షి చుట్టూ ఆడ పక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి, బాధ కలిగి ఆయన నోటివెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది...........

మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|
యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్||

ఓ దుర్మార్గుడైన బోయవాడా! మిధున లక్షణంతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలొ ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడ, నీవు చేసిన పాపమువలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక, అని శపించాడు.


ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు, కాని ఆయన నోట్లో ఈ మాటల
ు తిరుగుతూనే ఉన్నాయి, మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు, అలా అది శ్లోక రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కుర్చోపెట్టారు.

అప్పుడు బ్రహ్మగారు అన్నారు "ఓ బ్రాహ్మణుడా! నీ నోటివెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ." అన్నారు. ఆ శ్లోకానికి అర్ధం చూడండి......

"నిషాద" అంటె బోయవాడు అని ఒక అర్ధం, అలాగే సమస్త లోకములు తనయందున్న నారాయణుడు అని ఒక అర్ధం. "మా" అంటె లక్ష్మి దేవి.

"మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః", అంటె లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. " యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్", కామము చేత పీడింపబడి, బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది, కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ-మండోదరులలో, రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామ, నీకు మంగళం జెరుగుగాక, అని ఆ శ్లోక అర్ధం మారింది.
బ్రహ్మగారు అన్నారు, "నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈ రోజు రామాయణాన్ని పలికావు.

నాయనా, నేను నీకు వరం ఇస్తున్నాను " నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలెడితే, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు, వాళ్ల మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంత కాలం ఉంటాయో అంత కాలం రామాయణం ఉంటుంది.

ఇందులో ఒక్క మాట అబద్ధం కాని, కల్పితం కాని ఉండదు.

నువ్వు ఇంక రామాయణం రాయడం మొదలపెట్టు" అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు. వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగ ఆయనకి బ్రహ్మ గారి వరం వల్ల జెరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడసాగింది.

ఆయన రామాయణం రచించడం ప్రారంబించారు. మొత్తం 24,000 శ్లోకాలు, 6 కాండలు, 6 కాండల మీద ఒక కాండ, 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంబించారు.
రామాయణం -3 వ భాగం
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు.............
పూర్వకాలంలొ కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనముల పొడువు, 3 యోజనముల వెడల్పు ఉండేది( యోజనం అంటె = 9 మైళ్ళు ). ఆ నగరం మధ్యలొ రాజ ప్రాసాదంలొ దశరథ మహారాజు నివాసముండేవారు. ఆ నగరంలొ రహదారులన్నీ విశాలంగా, ఎప్పుడూ సుగంధ ధూపాలతొ ఉండేవి. ధాన్యం, చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి ఆ రాజ్యంలొ. ఏ ఇంట్లోనుకుడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరంలొ అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు, అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే, ఎవడికి ఉన్నదానితొ వాడు తృప్తిగా ఉండేవాళ్ళు, అందరూ దానం చేసేవాళ్ళు, సత్యమే పలికేవాళ్ళు, అందరూ ఐశ్వర్యవంతులే, ఆవులు, గుర్రాలు, ఏనుగులతొ ఆ నగరం శోభిల్లేది. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలొ పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైనవాడు ఆ అయోధ్య నగరంలొ లేడు.

దశరథ మహారాజుకి 8 ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు, వాళ్ళు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు. వశిష్ఠుడు, వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చె ఋత్విక్కులు. ఇతరమైన బ్రాహ్మణులూ, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు, పని చెయ్యడం తెలిసినవాళ్లు, ఇంద్రియములను నిగ్రహించినవాళ్లు, శ్రీమంతులు, శాస్త్రము తెలిసిన వాళ్ళు, సావధాన చిత్తం కలిగినవాళ్ళు. ఆ కోసల దేశంలొ పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు.
ఇన్ని ఉన్నా ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్దారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకి అప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేథ యాగం చెయ్యాలనే ఆలోచన వచ్చి, వెంటనే సుమంత్రుడిని పిలిచి, ఋత్విక్కులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితులని పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేథ యాగానికి కావాల్సిన సంభారములన్నీ తెప్పించి, సరయు నదికి ఉత్తర తీరంలొ యాగమంటపం నిర్మించారు.
దశరథ మహారాజు దక్షిణ నాయకుడు, ఆయనకి 300 కి పైగా భార్యలున్నారు. కాని పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి. తను యాగం మొదలపెడుతున్నాడు కాబట్టి, తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు. అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతొ సుమంత్రుడు ఇలా అన్నాడు...........

సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం |
ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి ||

పూర్వకాలంలొ ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు............ఇక్ష్వాకువంశములొ జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేథ యాగం చేస్తాడు. ఆ యాగం వల్ల ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు. కాని అశ్వమేథ యాగంతొ పాటు పుత్రకామేష్టి యాగం కూడా చెయ్యాలి. ఈ రెండు యాగాలని చెయ్యగలిగినవాడు రుష్యశృంగుడు. ఆయన ఆ యాగాలని చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతొ అన్నాడు.ఆ రుష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలొ ఉన్నాడు, కాబట్టి మీరు వెళ్లి ఆయనని తీసుకొని రండి అన్నాడు.

అప్పుడు దశరథ మహారాజు, నాకు ఆ రుష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అంటె, సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు.............పూర్వకాలంలొ విభణ్డక మహర్షి చాలాకాలం తపస్సు చేసి స్నానం చెయ్యడానికి ఒక సరస్సు దెగ్గరికి వెళ్ళగా, అక్కడ అలా వెళుతున్న ఊర్వశిని చేసేసరికి ఆయన రేతస్థానము నుంచి కదిలిన వీర్యం సరోవరంలొ పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి, గర్భం దాల్చి, శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి రుష్యశృంగుడు అని పేరు పెట్టారు. ఆ విభణ్డక మహర్షి, రుష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్నీ చెప్పాడు. కాని ఆ రుష్యశృంగుడికి లోకం తెలీకుండా పెంచాడు, ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ-పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలీకుండా పెంచాడు. అంటె విషయసుఖాల వైపు వెళ్ళకుండా పెంచాడు. ఎప్పుడూ ఆ ఆశ్రమంలోనే, తండ్రి పక్కనే ఉండేవాడు. ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలొ వర్షాలు పడడం మానేశాయి. దేశంలొ క్షామం వచ్చింది. రుష్యశృంగుడు కాని మన దేశంలొ అడుగుపెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు.

వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే, రుష్యశృంగుడిని తీసుకురావడం మావల్ల కాదు, ఏమి కోరికలు లేని వాడు, మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు. ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు..... ఇంద్రియార్థైః అభిమతైః నరచిత్త ప్రమాథిభి |. రుష్యశృంగుడికి కుడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక, విషయసుఖాల వైపుకి రాలేదు. కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యలని పంపిస్తే, విభణ్డకుడు లేని సమయంలో వీళ్ళు ఆ రుష్యశృంగుడి మనస్సుని ఆకర్షించి, ప్రలోభపెడతారు. అప్పుడు ఆయనే వాళ్ళ
Cont'd......
వెంట వస్తాడు, అని మంత్రులు సలహా ఇచ్చారు.

ఆ వేశ్యలకి విభణ్డకుడి మీద ఉన్న భయం వలన, వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం, నాట్యం చెయ్యడం మొదలుపెట్టారు. ఒకరోజు విభణ్డకుడు లేని సమయంలో గానం విన్న రుష్యశృంగుడు, ఆ గానం వస్తున్న వైపు వెళ్ళాడు. అక్కడున్న ఆ వేశ్యలని చూసి, వాళ్ళు పురుషులే అనుకొని, మహాపురుషులార! మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు. అందరూ విభణ్డకుడి ఆశ్రమానికి వెళ్లారు. తరువాత ఆ వేశ్యలు ఆశ్రమంనుంచి వెళ్ళిపోతూ ఆ రుష్యశృంగుడిని గట్టిగ కౌగలించుకుని వెళ్ళిపోయారు. మరునాడు ఆ రుష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి, ఆ వేశ్యలని చూడాలనిపించి, వాళ్ళ దెగ్గరికి వెళ్ళాడు. ఈసారి వాళ్ళు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు. సరే అని అందరూ బయలుదేరారు. ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే..........

తత్ర చ ఆనీయమానే తు విప్రే తస్మిన్ మహాత్మని |
వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయన్ తదా ||

ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు రుష్యశృంగుడికి నమస్కారం చేసి, ప్రార్ధించి, అంతఃపురానికి తీసుకెళ్ళి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జెరిపించారు.
కాబట్టి దశరథ మహారాజు ఆ రుష్యశృంగుడిని పిలవడానికి, అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు. అక్కడ 8 రోజులున్నాక, వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితొ ఇలా అన్నాడు...మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది, కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపిస్తావా, అని అడిగాడు. రోమపాదుడు ఆనందంగా పంపించాడు. దశరథుడు చాలా సంతోషించి, వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు.
తిధుల ప్రాధాన్యత ఏమిటి ?
ఏ తిధి రోజున
ఏ దేవతను పూజ చేయాలి ?
తిధి వ్రతములు
చేయటం వలన లభించే ఫలితాలు ఏమిటి ?

ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతిగా వుండటం జరుగుతుంది.
అదే విధంగా, పాడ్యమ్యాది తిధుల యందు వాటికి సంబంధించిన వ్రతాన్ని
పన్నెండు మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితములు లభిస్తాయి.
తిథి అధిపతి మరియు వ్రత ఫలము గురుంచి క్లుప్తముగా క్రింద చెప్పబడినది.

పాడ్యమి :
అధిదేవత - అగ్ని.
వ్రత ఫలం - సత్ఫల ప్రాప్తి.

విదియ :
అధిదేవత - అశ్విని దేవతలు.
వ్రత ఫలం - ఆరోగ్య వృద్ది.

తదియ :
అధిదేవత - గౌరీ దేవి.
వ్రత ఫలం - సుమంగళీ అనుగ్రహం.

చవితి:
అధిదేవత - వినాయకుడు.
వ్రత ఫలం - కష్టములు తొలగిపోవుట

పంచమి:
అధిదేవత - నాగ దేవత.
వ్రత ఫలం - వివాహము, వంశ వృద్ది.

షష్టి :
అధిదేవత - సుబ్రహ్మణ్య స్వామి.
వ్రత ఫలం - పుత్ర ప్రాప్తి.

సప్తమి:
అధిదేవత - సూర్య భగవానుడు.
వ్రత ఫలం - ఆయురారోగ్య వృద్ది.

అష్టమి:
అధిదేవత - అష్టమాత్రుకలు.
వ్రత ఫలం - దుర్గతి నాశనము.

నవమి:
అధిదేవత - దుర్గాదేవి.
వ్రత ఫలం - సంపద ప్రాప్తిస్తుంది.

దశమి:
అధిదేవత - ఇంద్రాది దశ దిక్పాలకులు.
వ్రత ఫలం - పాపాలు నశిస్తాయి.

ఏకాదశి:
అధిదేవత - కుబేరుడు.
వ్రత ఫలం - ఐశ్వర్యము ప్రాప్తించును.

ద్వాదశి:
అధిదేవత - విష్ణువు.
వ్రత ఫలం - పుణ్య ఫల ప్రాప్తించును.

త్రయోదశి:
అధిదేవత - ధర్ముడు.
వ్రత ఫలం - మనస్సులో అనుకున్న కార్యం ఫలిస్తుంది.

చతుర్దశి:
అధిదేవత - రుద్ర.
వ్రత ఫలం - మ్రుత్యున్జయము, శుభప్రదం.

అమావాస్య:
అధిదేవతలు - పితృదేవతలు.
వ్రత ఫలం - సంతాన సౌఖ్యం.

పౌర్ణమి:
అధిదేవత - చంద్రుడు.
వ్రత ఫలం - ధనధాన్య, ఆయురారోగ్య, భోగభాగ్య ప్రాప్తి.🌹🌹🌹🌹
నిత్య పూజ ఎవరు చేయాలి
సాధారణంగా నిత్య పూజ చేయడం అనేది పురుషుడు చేస్తాడు. ఎవరు చేయాలి అంటే యజమాని నిత్యపూజా చేయాలి. సంకల్పంలోనే ఉంది ‘ధర్మపత్నీ సమేతస్య’ అని ఉంది. కానీ ‘పతీసమేతస్య’ అని లేదు. అంటే దాని అర్థం ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలి. ఇల్లు అబివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి. పురుషుడు ప్రతిరోజూ పూజ చేస్తాడు. నైమిక్తిక తిథులలో పూజ చేసేటప్పుడు భార్య కూడా ప్రక్కన కూర్చుంటుంది. వినాయక వ్రతంలాంటిది చేసినప్పుడు. వస్త్రధారణా నియమం అన్నప్పుడు ప్రధానంగా ఆడపిల్ల అయితే లంగా వోణీ వేసుకుంటుంది, వివాహిత అయితే చీర కట్టుకుంటుంది. అమ్మవారికి అవే కదా ప్రధానం. కాబట్టి మనం కూడా అవే కట్టుకుంటాం. ఇక పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది – ‘వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ’ – గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టడం దిగంబరుడే అవుతుంది. బట్ట గోచీ పోయాలి. వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచీ వెనక్కి దోపుకోవాలి. దానిని ‘కచ్ఛము’ అంటారు. ‘వికచ్ఛః’- గోచీ పెట్టుకోలేదు; అనుత్తరీయశ్చ – పైన ఉత్తరీయం లేదు; అంటే ఉత్తరీయం ఒక్కటే ఉండాలి పురుషుడికి. చొక్కా కానీ, బనీను కానీ ఏదీ ఉండకూడదు పూజ చేసేటప్పుడు. దేవాలయంలోనైనా అంతే. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు. నీ గుండెలలో ఏ పరమాత్మ ఉన్నాడో వాడే ఎదురుగుండా ఉన్నాడు. వాడు వీడికి, వీడు వాడికి కనపడాలి. ఉత్తరీయం ఒక్కటే వేసుకుంటారు. గోచీపోసి పంచె కట్టుకోవాలి. ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్యా సహితుడు, మంగళప్రదుడు అని గుర్తు. కుడి భుజంమీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది అమంగళకరుడు. యజ్ఞయాగాది క్రతువులకు పనికి రాడు అని గుర్తు. అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు. కాబట్టి ఉత్తరీయం లేకుండా ఉండకూడదు. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తున్నారు అనుకోండి నీయందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అనడానికి గుర్తు స్వాగతం చెప్పడానికి ఇంటి బయటికి వచ్చిన ఇంటి యజమాని ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి. నేను ఎవరి ఇంటికైనా వెళ్ళాను అనుకోండి, ఆయన ఎడమ భుజం మీద ఉత్తరీయం వేసుకుని ఎదురు వచ్చి స్వాగతం పలికాడు అనుకోండి ఆయన అభ్యున్నతి కొరకు మంచిమాటలు చెప్పవచ్చు. ఆయన అలా రాలేదు అనుకోండి నాపని చూసుకుని వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే నాకు అయన పెద్దరికం అనడానికి గుర్తు ఏమిటంటే భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలకాలి. మీరు గమనించండి కావ్యాలలో, పురాణాలలో భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలికాడు అని ఉంటుంది. అప్పుడే పెద్దలు మాట్లాడతారు. కాబట్టి ఉత్తరీయం ఉండాలి. నువ్వు భగవంతుడితో సమన్వయము అవుతున్నావు. ఆయన చేయి చాపాలి, కాళ్ళు చాపాలి, ఆయన తింటే కదూ నువ్వు పెట్టింది అందింది. ఆయన అనుగ్రహించాలంటే నువ్వు మంగళప్రదుడివై అయి ఉండాలి. ఉత్తరీయం వేసుకుని ఉండాలి. ‘అనుత్తరీయశ్చ, నగ్నశ్చ – వాడు బట్టలు లేకుండా పూజ చేశాడు అని గుర్తు. ‘అవస్త్రఏవచ’ – మళ్ళీ నొక్కి చెప్పింది వేదం. వాడు నగ్నంగా ఉన్నాడు. నగ్నము అన్నమాటకు అర్థం అంటే దిక్కులు కప్పని వాడై ఉన్నాడు. ఒక చుట్టు చుట్టి కట్టాను అనుకోండి పూజకు పనికిరాను. గోచీపోసి కట్టే కూర్చోవాలి. అందుకే వేదం చదువుకున్న పెద్దలు, వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు చిన్న గుడ్డ అయినా సరే గోచీ పోసుకుని కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్ఛంగా భోజనం చేయరు. వికచ్ఛంగా పూజ దగ్గరికి వెళ్ళరు. దేవాలయంలో అంతరాలయ ప్రవేశం చేయరు. అలా పంచె కట్టుకునేటప్పుడు ఆ పంచెకి కానీ, ఉత్తరీయానికి కానీ అంచు ఉండాలి. అంచు లేని బట్ట కట్టాడు అంటే అమంగళప్రదుడు అని గుర్తు. అవతలి వాడు పదికాలాలు బ్రతకాలి అని కోరుకుంటే అంచు ఉన్న బట్టలు తీసుకువచ్చి పెడతారు. ఒక ప్యాంటు గుడ్డ నేను పెట్టాను అనుకోండి, దానికి అంచు ఉండదు. అందుకే పీటలమీద అల్లుడికి పెట్టాలి అంటే నీకు కోటు కుట్టించాలి అని మోజు ఉంటే బయట కుట్టించు. పీటల మీద కూర్చున్నాడు భగవత్ కార్యంలో. ఆయుఃకారకం నువ్వు ఇచ్చేది. నువ్వు ఉత్తరీయం వేసుకోవాలి. ఉత్తరీయం లేకుండా బట్టలు పెట్టకూడదు. ఉత్తరీయం లేకుండా బట్టలు పుచ్చుకోకూడదు. అంచు ఉన్న బట్టలు పెట్టాలి. అందుకే ఇప్పటికీ మనవాళ్ళు పంచెల చాపు పెడతారు. పరమమంగళప్రదుడు అనడానికి గుర్తు అంచు ఉన్న బట్ట గోచీ పోసుకుని కట్టుకుని ఉత్తరీయం వేసుకుని ఉంటే పరమ మంగళప్రదుడు. శౌచంతో ఉన్నాడు అని గుర్తు. పూజ దగ్గరికి వెళితే లాల్చీ, బనియను కూడా పనికిరావు. తీసేసి ఉత్తరీయం కప్పుకుని గోచీ పోసి పంచె కట్టుకుని కూర్చుని పూజ చేయాలి. గోచీ ఎంత బాగా పోయాలి. అంచు ఎంత బాగా మడత పెట్టాలి సంబంధం లేదు. ఒక అంచు తీసి నీకు వచ్చినట్లు దోపుకుంటే చాలు కచ్ఛ ఉన్నట్లే. కాబట్టి పురుషుడికి పూజ చేసేటప్పుడు వస్త్రధారణయందు అటువంటి నియమము ఉన్నది. పూజయందు ఎప్పుడూ గోచీపోసి పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని పురుషుడు పూజ చేయవలసి ఉంటుంది.
రామాయణం -4 వ భాగం
అలా కొంత కాలం గడిచాక, ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దెగ్గరికి వచ్చి ఇలా అన్నాడు.......అయ్యా! నేను సంతానహీనుడిని, నాకు చాలా దిగులుగా ఉంది, నాకు సంతానం కలగకుండ ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడుతోందొ, ఆ పాపాన్ని పరిహరించుకోడానికి వేదము చేత నిర్ణయింపబడిన అశ్వమేథ యాగాన్ని మీరు నాతొ చేయించాలి అని కాళ్ళు పట్టి ప్రార్ధించాడు. అప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నాడు......యాగం చెయ్యాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందొ ఆనాడే నీకు మంచి జెరగడం మొదలయ్యింది. కావున నీకు శూరులు, లోకముచేత కీర్తింపబడే నలుగురు కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు.
చైత్ర మాసంలొ చిత్రా నక్షత్రంతొ వచ్చే పౌర్ణమి నాడు యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టి, దానికి ప్రోక్షణ, స్నాపన, విమోచన చేశారు. ఇంకా కొన్ని ఇతరమైన క్రతువులు చేశాక ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టారు. అది అలా ఒక 12 నెలలు తిరుగుతుంది, దాని వెనకాల మహా శూరులైన వాళ్ళు వెళతారు. ఆ అశ్వం తిరిగొచ్చేలోపు అంటె ఫాల్గుణ మాసంలొ వచ్చె అమావాస్యకి రాజు యాగశాల ప్రవేశం చెయ్యాలి. కాబట్టి దశరథ మహారాజు ఋష్యశృంగుడిని, వశిష్ఠుడిని పిలిచి యాగం ప్రారంభించాల్సిందిగా కోరాడు. ఆ యాగానికి ఇతర దేశాల నుండి రాజులను, ప్రజలను, జానపదులను, వేద బ్రాహ్మణులను, విద్వాంసులను ఆహ్వానించాడు. వచ్చిన వాళ్ళందరికి భోజనాలు పెట్టారు. పల్లెటూర్లనుంచి వచ్చిన వాళ్ళని అశ్రద్ధగా చూడకండి, భోజనం పెట్టేటప్పుడు అందరికీ శ్రద్ధగా వడ్డించండి అని వశిష్ఠుడు చెప్పాడు.
పది మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది కామక్రోధాలకిలోనై అనరాని మాటలు మాట్లాడితే, మీరు నవ్వి వచ్చెయ్యండి, పట్టించుకోమాకండి. భోజనం చెయ్యడానికి పంక్తిలొ కూర్చున్నవాడు అతిధి రూపంలొ ఉన్న సాక్షాత్తు భగవంతుడు, కాబట్టి మర్యాదలకి ఎటువంటి లోటు రాకూడదు అని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు. అలాగే జనక మహారాజు, కాశి రాజు, రోమపాద రాజు, కైకేయ రాజుని పిలవడానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రులనే వెళ్ళమని చెప్పి, అందరికి విడిది ఏర్పాటుచెయ్యండి అని ఆదేశించాడు. అలా వచ్చిన వాళ్ళందరికి భోజనాలు పెడుతున్నారు....
అక్కడికి వచ్చినవాళ్ళల్లో వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, స్త్రీలు, చిన్ని చిన్ని పిల్లలు ఉన్నారు. భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళంతా, ఆహ! భోజనాలు ఏమి రుచిగా ఉన్నాయి అని అంటున్నారు. ఇంత రుచికరమైన భోజనాలు మళ్ళి ఎప్పుడు తింటామో అని అనుకుంటున్నారు. దశరథ మహారాజు వాళ్ళందరిని చూసి, ఇంకా తినండి, ఇంకా తినండి అంటున్నాడు. వచ్చిన వాళ్ళందరికి ధనము, వస్త్రములు దానం చేశాడు దశరథుడు. వచ్చినవాళ్ళందరూ "ఆహ! ఎంతచక్కని భోజనం పెట్టావు రాజ, ఎంత గొప్ప వస్త్రాలు ఇచ్చావయ్య, నీ కోరిక తీరి, నీకు సుపుత్రులు కలిగి, నీ వంశము ఆచంద్ర తారార్కంగా వర్ధిల్లుతుందని ఆశీర్వదించి వెళ్లారు.

ఆ యాగశాలని చాలా అద్భుతంగా నిర్మించారు, ఆ యాగశాలలొ 21 యూప స్తంభాలని పాతారు, మారేడు కర్రలతొ చేసినవి 6, మోదుగు కర్రలతొ చేసినవి 6, ఛండ్ర కర్రలతొ చేసినవి 6, దేవదారు కర్రలతొ చేసినవి 2 మరియు శ్లేష్మాతక కర్రతొ చేసినది ఒకటి ఉంటుంది. దశరథుడు శుక్ల యజుర్వేదానికి చెందిన వాడు కనుక, దానికి అనుగుణంగా ఆ యాగశాలని నిర్మించారు. ఎంతో శాస్త్రయుక్తంగా ఆ యాగం జెరుగుతుంది. చివర్లో ఆ యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఆ యూప స్తంభానికి కట్టారు. పట్టమహిషి అయిన కౌసల్య మూడు కత్తులతొ ఆ యాగాశ్వాన్ని వధించింది. ఆ రోజు రాత్రి ఓ శాలలొ కౌసల్య ఆ గుర్రం పక్కన పడుకొని ఉండాలి.
మరుసటి రోజున ఈ యాగం చేయించిన ఋత్విక్కులకి, రాజు 4 భార్యలని దానం చెయ్యాల్సి ఉంటుంది. మొదట పట్టమహిషిని, ఉపేక్షిత భార్యని, ఉంపుడుగత్తెని, చివరిగా ఫాలాకలిని దానం చేస్తాడు. ఆ ఋత్విక్కులు ఆ నలుగురు భార్యలని తిరిగి రాజుకి ఇచ్చేస్తారు. అప్పుడు ఆ రాజు తన భార్యలను తీసుకొని ఆ ఋత్విక్కులకి ద్రవ్యాన్ని(ధనం) దానం ఇస్తాడు. ఇప్పుడు ఆ గుర్రం శరీరంలోనుంచి వప(జంతువుల కడుపులొ బొడ్డు కింద వుండే ఉల్లిపొర వంటి కొవ్వు) ని తీసి ఆ అగ్నిలొ వేశారు. ఆ వప అగ్నిలొ కాలుతున్నప్పుడు వచ్చే ధూమాన్ని రాజు పీల్చాలి, దీనినె అశ్వమేథయాగం అంటారు. అలా పీలిస్తే, తనకి సంతానం కలగకుండా ఏ పాపం అడ్డుపడుతుందొ, ఆ పాపం పోతుంది. చివరగా ఆ గుర్రం శరీరంలోని మిగతా భాగాలని ఆ హోమంలొ హవిస్సుగా సమర్పిస్తారు.
దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేథయాగం చేయించిన ఋత్విక్కులకి దానం చేశాడు, అప్పుడు వాళ్ళు మేము ఈ భూభారాన్ని వహించాలేము, నువ్వు రాజువి, నువ్వే పరిపాలించాలి అని ఆ రాజ్యాన్ని తిరిగి రాజుకే ఇస్తారు. దక్షిణలేని యాగం జెరగకూడదు కనుక, దశరథ మహారాజు ఆ ఋత్విక్కులకి 10 లక్షల గోవుల్ని, 100 కోట్ల బంగారు నాణాలని, 400 కోట్ల వెండి నాణాలని దానం చేశాడు. అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ ఒక కోటి బంగారు నాణాలని దానం చేశాడు. ఋష్యశృంగ మహర్షి
లేచి....ఓ రాజా! నీకు సంతానం కలగడం కోసం, నేను అధర్వ వేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన యిష్టిని చేయిస్తాను. అదే పుత్రకామేష్టి యాగం అని చెప్పి ఆ యిష్టి చెయ్యడం ప్రారంభించారు..contd